
ఖాట్మాండు: అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని పర్వతారోహకులు కలలుగంటుంటారు. అలాంటి వారికి నేపాల్ ప్రభుత్వం ఒక చేదువార్త వినిపించింది. ఇకపై ఎవరెస్ట్ శిఖర అధిరోహణ అత్యంత ఖరీదైనదిగా మారబోతోంది.
ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి విదేశీయులు ఇకపై దాదాపు 21 లక్షల రూపాయలు, అంటే ఐదు లక్షల నేపాలీ రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో విదేశీయులు ఇందుకోసం రూ. 15,17,780 రుసుము చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు దానిని రూ. 20,69,676కి పెంచారు.
నేపాల్ ప్రభుత్వం పర్వతారోహణ మాన్యువల్‌ను ఆరోసారి సవరించింది. ఇటీవల జరిగిన నేపాలీ క్యాబినెట్ సమావేశంలో పర్వతారోహణ నియమాలను సవరిస్తూ, అధిరోహణ రుసుమును పెంచింది. ఈ కొత్త నియమం 2025, సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ నారాయణ్ రెగ్మి మీడియాకు తెలిపారు. ఎవరెస్ట్ శిఖరంపై పర్యాటకుల కారణంగా చెత్త పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కొత్త సవరణల ప్రకారం ఎవరెస్ట్ అధిరోహకులకు బీమా, ఇతర నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం పర్వతారోహణ గైడ్‌లు, ఎత్తయిన ప్రదేశాలలో పనిచేసే కార్మికులు, సామాను క్యారియర్‌లకు రోజువారీ భత్యం, బీమా రేట్లు పెంచారు. నూతన రికార్డులు సృష్టించే లక్ష్యంతో ఎవరెస్ట్ ఎక్కే అధిరోహకులు తమ పూర్తి వివరాలను సంబంధిత ప్రభుత్వశాఖకు సమర్పించాలి.
ఇది కూడా చదవండి: ట్రంప్ తొలి వారం రివ్యూ.. అమెరికాలో ఏం మారింది?