Mount Everest
-
ఎవరెస్ట్ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే
ఖాట్మాండు: అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని పర్వతారోహకులు కలలుగంటుంటారు. అలాంటి వారికి నేపాల్ ప్రభుత్వం ఒక చేదువార్త వినిపించింది. ఇకపై ఎవరెస్ట్ శిఖర అధిరోహణ అత్యంత ఖరీదైనదిగా మారబోతోంది.ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి విదేశీయులు ఇకపై దాదాపు 21 లక్షల రూపాయలు, అంటే ఐదు లక్షల నేపాలీ రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో విదేశీయులు ఇందుకోసం రూ. 15,17,780 రుసుము చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు దానిని రూ. 20,69,676కి పెంచారు.నేపాల్ ప్రభుత్వం పర్వతారోహణ మాన్యువల్‌ను ఆరోసారి సవరించింది. ఇటీవల జరిగిన నేపాలీ క్యాబినెట్ సమావేశంలో పర్వతారోహణ నియమాలను సవరిస్తూ, అధిరోహణ రుసుమును పెంచింది. ఈ కొత్త నియమం 2025, సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ నారాయణ్ రెగ్మి మీడియాకు తెలిపారు. ఎవరెస్ట్ శిఖరంపై పర్యాటకుల కారణంగా చెత్త పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కొత్త సవరణల ప్రకారం ఎవరెస్ట్ అధిరోహకులకు బీమా, ఇతర నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం పర్వతారోహణ గైడ్లు, ఎత్తయిన ప్రదేశాలలో పనిచేసే కార్మికులు, సామాను క్యారియర్లకు రోజువారీ భత్యం, బీమా రేట్లు పెంచారు. నూతన రికార్డులు సృష్టించే లక్ష్యంతో ఎవరెస్ట్ ఎక్కే అధిరోహకులు తమ పూర్తి వివరాలను సంబంధిత ప్రభుత్వశాఖకు సమర్పించాలి.ఇది కూడా చదవండి: ట్రంప్ తొలి వారం రివ్యూ.. అమెరికాలో ఏం మారింది? -
ఎవరెస్ట్ అధిరోహకులకు షాక్
కాఠ్మండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్టు అధిరోహించాలనుకునే వారికి నేపాల్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. హిమాలయ శిఖరాన్ని దక్షిణం దిశ నుంచి మార్చి– మే మధ్య వసంత రుతువులో అధిరోహించాలనుకునే విదేశీయులు ఒక్కొక్కరి నుంచి వసూలు చేస్తున్న ఫీజు మొత్తాన్ని రూ.9.50 లక్షల నుంచి ఏకంగా రూ.13 లక్షలకు పెంచేసింది. సెప్టెంబర్–నవంబర్ మధ్యన ఫీజును రూ.4.75 లక్షల నుంచి రూ.6.48 లక్షలకు పెంచింది. శీతాకాలంలో డిసెంబర్–ఫిబ్రవరి మధ్య, వర్షాకాలం జూన్–ఆగస్టు సీజన్లలో ఒక్కో వ్యక్తి చెల్లించే ఫీజును రూ.2.37 లక్షల నుంచి రూ.3.24 లక్షలకు పెంచామని గురువారం ప్రకటించింది. నేపాలీ వ్యక్తులైతే వసంత రుతువులో చెల్లిస్తున్న రూ.75 వేల ఫీజును రూ.1.50 లక్షలకు పెంచినట్లు తెలిపింది. నూతన షరతులు ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. పర్వతారోహణ పూర్తయిన వారు తమ వెంట తీసుకెళ్లిన మల విసర్జన బ్యాగ్‌ను తిరిగి బేస్ క్యాంపునకు వచ్చి, సక్రమంగా వదిలివేయాల్సి ఉంటుంది. 8 వేల మీటర్లకు పైగా శిఖరాలను అధిరోహించే వారు వ్యర్థాలను సేకరించేందుకు బయో డీగ్రేడబుల్ బ్యాగ్‌లను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని తెలిపింది. అంతేకాదు, పర్యాటక శాఖ అనుమతించిన వస్తువులనే వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
శిఖరాలు ఆశీర్వదించాయి..!
నిరాశ అనేది పరాజయాలకు ‘సుస్వాగతం’ బోర్డ్లాంటిది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది అన్వీష్ వర్మ కల. అయితే వివిధ కారణాల వల్ల రెండు సార్లు తన కలను నెరవేర్చుకోవడంలో విఫలం అయ్యాడు. అయినా సరే...పట్టువదలని అన్వీష్ వర్మ మూడో ప్రయత్నంలో తన కల నెరవేర్చుకున్నాడు. ఆ తరువాత ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాడు....తాజాగా ప్రపంచంలో కొందరికి మాత్రమే సాధ్యం అయ్యే ప్రపంచంలో ఎత్తైన పర్వతాల అథిరోహణలో సత్తా చాటుతున్నాడు మధురవాడకు చెందిన అన్వీష్వర్మ(Anmish Varma). ట్రెక్కింగ్ తన జీవితాశయంగా గత పదేళ్ల నుంచి దేశ, విదేశాల్లో ప్రయాణం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుంచే పర్వతారోహణ, సాహస క్రీడలు అంటే అన్వీష్కు ఇష్టం. స్నేహితులతో కలిసి సింహాచలం కొండ ఎక్కేవాడు. ఆ సమయంలోనే భూమి మీద ఎత్తైన శిఖరాలను ఎక్కాలనే లక్ష్యానికి బీజం పడింది.మార్షల్ ఆర్ట్స్ టు మౌంట్ ఎవరెస్ట్మార్షల్ ఆర్టిస్ట్ అయిన అన్వీష్ వరల్డ్ బాక్సింగ్, కరాటే అసోసియేషన్ గ్రీస్, ఆస్ట్రేలియాలో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచాడు. మార్షల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూనే పర్వతారోహణపై దృష్టి సారించాడు. ఎవరెస్ట్ ఎంత ఎత్తు, ఎలా ఎక్కాలి, ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. అయితే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది ఎంతో కష్టం, ఖర్చుతో కూడుకున్నదనే విషయం అర్థమైంది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకునే వారి కోసం వెలువడిన నోటిఫికేషన్ పర్వతారోహణ వైపు తొలి అడుగు వేసేలా చేసింది. విజయవాడ బీఆర్ ఆకాడమీలో సెలక్షన్స్ జరగగా నలభై మంది ఎంపికయ్యారు. అందులో అన్వీష్ ఒకరు. డార్జిలింగ్‌లో ఉన్న హిమాలయ మౌంటెనరీ ఇనిస్టిట్యూట్‌లో బేసిక్ మౌంటెనరీ ట్రైనింగ్ తీసుకున్నాడు.మూడో ప్రయత్నంలో కల నిజమైంది!2018లో అయిదు మంది ఎవరెస్ట్ అధిరోహించే క్రమంలో రాంబాబు అనే వ్యక్తికి తలలో బ్లడ్ క్లాట్ అవడంతో కుప్ప కూలిపోయాడు. అతడిని రక్షించడం కోసం వెనక్కి వచ్చేశారు. 2021లో రెండోసారి 8,500 మీటర్లు డెత్ జోన్‌కి చేరుకునేసరికి తనకి సహాయంగా వచ్చిన షెర్ప్ అనారోగ్యానికి గురికావడంతో రెండో సారి కూడా వెనక్కి రావాల్సి వచ్చింది. రెండు సార్లు విఫలం కావడంతో నిరాశకు గురవుతారు. అయితే వివిధ కారణాల వల్ల ఎవరెస్ట్‌ను అధిరోహించకపోయినా నిరాశను దరి చేరనివ్వకుండా మూడో ప్రయత్నంలో తన కల నెరవేర్చుకున్నాడు. ఈ విజయంతో తన మీద తనకు నమ్మకం రెట్టింపు అయ్యింది. అలా తన జైత్రయాత్ర మొదలైంది. నాకు ఏమీ తెలియదు...నేనేం చేయగలను అనుకుంటే ఉన్నచోటే ఉండిపోతాం. తెలుసుకోవాలనే తపన ఉంటే ఎన్ని విజయాలు అయినా సాధించవచ్చు. ఎవరెస్ట్‌కు ముందు పర్వతారోహణ గురించి నాకు పెద్దగా తెలియదు. అయితే ముందుకు వెళుతున్న కొద్దీ ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నా కలను నిజం చేసుకున్నాను.– అన్వీష్ వర్మ ఆఫ్రికాలోని కిలిమంజారో నుంచి యూరప్‌లోని మౌంట్ ఎల్బ్రస్ వరకు మొదటి ప్రయత్నంలోనే ఏడు ఖండాల్లో ఎత్తైన శిఖరాల అధిరోహణను మూడేళ్లలోనే ఆ పని పూర్తి చేశాడు. తాజాగా ప్రపంచంలో ఎత్తైన అగ్నిపర్వతం మౌంట్ ఓజోస్ డెల్స్ సలెడో(చిలీ) అధిరోహించాడు. అన్వీష్ వర్మ మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – రామునాయుడు, సాక్షి, మధురవాడ, విశాఖపట్నం(చదవండి: సక్సెస్‌ని ఒడిసిపట్టడం అంటే ఇదే..!) -
వందేళ్ల క్రితం ఎవరెస్ట్‌పై గల్లంతు
లండన్: ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో జాడ తెలియకుండా పోయిన బ్రిటిష్ పర్వతారోహకుడి ఆనవాళ్లు తాజాగా వందేళ్లకు బయటపడ్డాయి. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందంలోని పర్వతారోహకులకు 1924లో కనిపించకుండా పోయిన ఇద్దరిలో ఎ.సి.ఇర్విన్(22) పాదం, బూటు, ఆయన పేరున్న ఎంబ్రాయిడరీ సాక్స్ దొరికాయి. ఇది తెలిసి ఇర్విన్ సోదరుని కుమార్తె ఆనందం వ్యక్తం చేశారు. దీంతోపాటు, ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే కంటే 29 ఏళ్ల ముందే ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళ్లిన ఈ ఇద్దరూ తమ ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అన్న అనుమానాలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందం ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనా ఆదీనంలోని ఎవరెస్ట్ ఉత్తర ప్రాంతంలో రొంగ్బుక్ గ్లేసియర్ వద్ద చిత్రీకరణ చేపట్టింది. ఈ బృందానికి ఆస్కార్ విజేత కూడా ప్రముఖ జిమ్మీ చిన్ నాయకత్వం వహిస్తున్నారు. అక్కడ వారికి 1933 నాటి ఆక్సిజన్ సిలిండర్ ఒకటి లభ్యమైంది. ఇర్విన్‌కు సంబంధించిన వస్తువు కూడా ఒకటి దొరికింది. దీంతో, చాలా రోజులు అక్కడే అన్వేషణ జరిపారు. ఫలితంగా వారికి ఓ కాలున్న బూట్ దొరికింది. అందులోని సాక్ ఎంబ్రాయిడరీపై ‘ఎ.సి.ఇర్విన్’అనే పేరుంది. ఈ బూటును 1924 జూన్‌లో జార్జి మల్లోరీతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించేందుకు వచ్చి అదృశ్యమైన బ్రిటిష్ దేశస్తుడు ఏసీ శాండీ ఇర్విన్దేనని తేల్చారు. 1999లో మల్లోరీ మృతదేహం పర్వతారోహకుల కంటబడగా, ఇర్విన్ ఆనవాళ్లు ఇప్పటికీ దొరకలేదు. అయితే, ఈయన వెంట తెచ్చుకున్న కెమెరా కోసం పలువురు గతంలో తీవ్రంగా గాలించారు. అందులోని ఫొటోల ఆధారంగా ఈ ఇద్దరు సాహసికుల ప్రయత్నం ఏమేరకు ఫలించిందన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని వారి ఆశ. తాజాగా దొరికిన ఆధారంతో ఇర్విన్ మృతదేహం వంటి ఆనవాళ్లు అదే ప్రాంతంలో దొరకవచ్చన్న అంచనాలు పెరిగిపోయాయి. -
మౌంట్ ఎవరెస్ట్‌పై భారీగా ట్రాఫిక్‌జామ్!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరంపై పర్యాటకుల తాకిడి పెరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది ఈ ఉన్నత పర్వతాన్ని అధిరోహించడానికి సిద్ధమయ్యారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే వారి సంఖ్య ప్రతి ఏటా వేగంగా పెరుగుతోంది. బేస్ క్యాంప్‌లో పర్యాటకులు క్యూ కడుతున్నారు. బీబీసీ నివేదిక ప్రకారం ఇటీవల ఇద్దరు పర్వతారోహకులు మృతి చెందారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వందలాది మంది పర్వతారోహకుల క్యూ కనిపిస్తుంది. వీరిని చూస్తుంటే నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారేమోనని అనిపిస్తుంది.ఈ ఫొటోను చూసిన ది నార్తర్నర్ అనే యూజర్ ఇలా రాశాడు. ‘ఎవరెస్ట్ అతి ఎత్తయిన శిఖరం. అయిత ఇప్పుడది మురికిగా మారింది. ఇక్కడ మనుషుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. మంచులో కూరుకుపోతున్నవారికి సహాయం అందించేందుకు ఇక్కడ ఎవరూ లేరు. కాలుష్యం మరింతగా పెరుగుతోంది. చుట్టూ దుమ్ము, ధూళి కనిపిస్తోంది. ఇది ఎప్పటికి అదుపులోకి వస్తుంది?’ అని ప్రశ్నించాడు.భారత పర్వతారోహకుడు రాజన్ ద్వివేది మే 19 ఉదయం 6 గంటలకు ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించారు. ఆయన అక్కడి పరిస్థితి చూసి విచారం వ్యక్తం చేశారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ‘ఎవరెస్ట్ పర్వతారోహణ అంత సులభం కాదు. 1953 మేలో తొలిసారిగా ఎవరెస్ట్ అధిరోహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం ఏడు వేల మంది ఎవరెస్ట్‌ను అధిరోహించారు. అయితే ఇక్కడి చలి వాతావరణం, గాయాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా మృతి చెందిన వారికి సంబంధించిన డేటా ఎక్కడా లేదు. దానిని ఎవరూ లెక్కించడం లేదు. గంటకు 100 నుండి 240 మైళ్ల వేగంతో వీచే బలమైన గాలులను ఎదుర్కోవడం పర్వతారోహకులకు పెద్ద సవాలు’ అని ఆయన పేర్కొన్నారు. రాజన్ ద్వివేది ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో మంచు శిఖరాలపై లెక్కకు మించిన పర్వతారోహకులు కనిపిస్తారు. Everest; the highest, the dirtiest and the most controversial place on Earth. Humans bypassing corpses, leaving people dying, ignoring help cries, making it dirtiest place with pollution & human wastes ; all for the glory of summit. When will it stop?! #StopCommercialAlpinism pic.twitter.com/Yahobk9c5F— The Northerner (@northerner_the) May 25, 2024 -
అంత ఎత్తు ఎలా అయ్యాయి?
హిమాలయాలు ప్రపంచంలోనే ఎత్తైన కొండలని అందరికీ తెలుసు. అందులోని ఎవరెస్టు శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనదని అందరూ అనుకుంటారు. అది నిజమా, కాదా అన్న చర్చ ఇప్పుడు మనకు అప్రస్తుతం. ఇంతకు హిమాలయాలు అంత ఎత్తుకు ఏ రకంగా ఎదిగాయి అన్న ప్రశ్నకు కూడా చాలా రోజులుగా ఒక జవాబు ఉంది. అదీ నిజమా, కాదా అన్న సంగతి మామూలు మనుషులకే కాదు పరిశోధకులకు కూడా తెలియదు. అయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంగతి ఏమిటంటే ఇప్పటివరకు హిమాలయాలు అంత ఎత్తుకు చేరడానికి గల కారణం గురించి తెలిసిన సంగతులు అంతగా నిజం కాదని! భూమి ఉపరితలం టెక్టానిక్ ప్లేట్స్ అనే విడిభాగాల రూపంలో ఉంది. ఆ భాగాలు కదులుతూ ఉంటాయి. అలా కదిలే ఒక భాగం వచ్చి తగిలినందుకు హిమాలయాలు అంత ఎత్తుకు ఎగిశాయని అందరూ అనుకుంటున్నారు. హిమాలయాలలో అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ప్రస్తుతం 8,849 మీటర్ల ఎత్తు ఉన్నది. కొత్తగా జరిగిన పరిశోధనల ప్రకారం, హిమాలయాలు కానీ, అందులోని ఎవరెస్టు కానీ అంత ఎత్తుకు చేరడానికి టెక్టానిక్ ప్లేట్లు ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం కారణం కానే కాదనీ, అంతకుముందే అవి దాదాపు అంత ఎత్తుగా ఉన్నాయనీ తెలిసింది. ప్లేట్లు గుద్దుకున్నందుకు హిమాలయాల ఎత్తు పెరగడం నిజమే, కానీ అప్పటికే అవి ఎంతో ఎత్తుగా ఉన్నాయి, అందుకు కారణం ఏమిటి అన్నది ఎవరికీ తెలియదంటున్నారు పరిశోధకులు. ఒక ఖండం ముక్క వచ్చి ఇంకొక ఖండం ముక్కకు తగిలితేనే ఇటువంటి మార్పులు కలుగుతాయని చాలాకాలం వరకు పరిశోధకులు అనుకున్నారు. అప్పుడు మాత్రమే రెండు ముక్కలు తగిలిన ప్రాంతం మరీ ఎత్తుకు చేరుకుంటుందని కూడా అనుకున్నారు. యూఎస్‌లోని ‘బ్రౌన్ విశ్వవిద్యాలయం’లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్న డేనియల్ ఇబారా బృందం వారు ఈ మధ్యన ఈ అంశాన్ని గురించి ఒక వైజ్ఞానిక పత్రాన్ని వెలువరించారు. ‘నేచర్ జియోసైన్సెస్’ అనే ప్రఖ్యాత వైజ్ఞానిక పత్రికలో ఆ పత్రం ప్రచురించబడింది. ఈ పత్రం కారణంగా ఆ రంగంలోనే కొత్త మలుపులు వచ్చాయనీ, పరిశోధన మరొక మార్గంలో సాగుతుందనీ ప్రపంచమంతటా నిపుణులు అంటున్నారు. అమెరికా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందానికి చైనాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్సెస్’ వారు కూడా ఈ పరిశోధనలో సహకరించారు. ‘సెడిమెంటరీ శిలల’ నిర్మాణాల ఎత్తు గతంలో ఉండిన తీరు గురించి పరీక్షించడానికి వీరంతా కలిసి ఒక కొత్త పద్ధతిని రూపొందించారు. అంగారక శిలలను పరిశీలించడంలో వాడుతున్న ఒక పద్ధతిని ఈ పరిశోధకులు ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టారు. హిమాలయాలలోని శిలల్లో ఉన్న ఐసోటోపుల కొలతలు తీసి వాటి ప్రకారం శిలల కాలం ఎప్పటిది అని వారు నిర్ణయించారు. ఐసోటోపులు అంటే ఒకే రసాయనం తాలూకు వేరువేరు రకాలు. ఈ పద్ధతి గురించి మరింత చెబితే అది చాలా సాంకేతికంగా ఉండవచ్చు. కొండకు వెచ్చని గాలి తగిలి అది పైకి లేచి కొండకు ఆవలి భాగంలోకి ప్రవేశించి చల్లబడుతుంది. అప్పుడది వర్షం గానూ, మంచు గానూ కిందకు రాలుతుంది. గాలి పైకి వెళ్ళిన కొద్దీ అందులోని రసాయనాల తీరు మారుతుంది. ఎక్కువ న్యూట్రాన్లు గల ఆక్సిజన్ వంటి రసాయనాలు, అంటే ఐసోటోపులు బరువుగా ఉండి, మేఘాల నుంచి ముందే కిందకు జారుతాయి. ఇక తేలిక ఐసోటోపులు కొండపై కొమ్ము మీద ఆ తరువాత వచ్చి రాలుతాయి. మూడు సంవత్సరాల పాటు ఈ ఐసోటోపులను పరిశీలించిన తరువాత టెక్టానిక్ ప్లేట్ అంచులో ఉన్న హిమాలయ పర్వతాలు అప్పటికే 3,500 మీటర్ల కన్నా ఎత్తు లేదా ఇంచుమించు అంత ఎత్తులో ఉన్నాయని గమనించారు. అంటే ప్రస్తుతం ఉన్న ఎత్తులో ఇది 60 శాతం కన్నా ఎక్కువన్నమాట. ఈ రకంగా చూస్తే హిమాలయాల చుట్టుపక్కల గల పాతకాలపు వాతావరణ వివరాలు మరొకసారి పరిశీలించవలసిన అవసరం ఉన్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. దక్షిణ టిబెట్‌లోని ప్రాచీన కాలపు శీతోష్ణస్థితి గురించి కొత్త సిద్ధాంతాలు ఈ రకంగా అందుబాటులోకి రానున్నాయి. ఇదే పద్ధతిలో ఆండీస్, సియెరా నెవాడా పర్వతశ్రేణులనూ, అక్కడి ప్రాచీన వాతావరణ పరిస్థితులనూ మరొకసారి విశ్లేషించే అవకాశం కూడా ఉంది. గతంలోని శీతోష్ణస్థితులను గురించి ఉన్న సిద్ధాంతాల తీరు మారనుందనీ, ఆయా ప్రాంతాలలోని గత కాలపు శీతోష్ణస్థితులను గురించిన సిద్ధాంతాలూ, ఆలోచనలూ కొత్తదారి పట్టే పద్ధతి కనబడుతున్నదనీ, అక్కడి జీవవైవిధ్యం గురించి కూడా అవగాహనలు మారుతాయనీ అంటారు ఇబారా. కొన్ని విషయాలు తెలుసుకున్నందుకు తక్షణం ఏ ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ ప్రపంచం, దాని గురించి అవగాహన కలిగించే సైన్సు క్రమంగా మారుతున్నాయని అర్థం కావడం మాత్రం అసలైన నిజం! కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత -
ఆయన టార్గెట్.. ఎవరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ కొత్త కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఓ పర్వతారోహకుడు. ఆదిలాబాద్ ఎస్పీగా పని చేస్తున్న సమయంలోనే పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఇప్పటి వరకు 6 పర్వతాలను అధిరోహించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యంగా అనునిత్యం సాధన చేస్తున్నారు డాక్టర్. తరుణ్ జోషి బుధవారం రాచకొండ సీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ♦పంజాబ్‌కు చెందిన తరుణ్ జోషి పాటియాలాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేసి దంత వైద్యుడిగా మారారు. 2004లో సివిల్ సరీ్వసెస్ ఉత్తీర్ణులైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. ♦ ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే కొత్త అంశాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఉద్యోగంలో తర్వాతే పదేళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోలీస్ మేనేజ్మెంట్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆపై ఎల్ఎల్బీలో చేరి 2019 జూలైలో ఉత్తీర్ణులు కావడమే కాదు... వర్సిటీ టాపర్‌గా నిలిచారు. ♦ తరుణ్ జోషి 2014 నుంచి 2016 వరక ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం ఏపీ పోలీసు విభాగంలో ఉన్న ఎస్పీ జి.రాధిక అప్పట్లో అదే జిల్లాలో అదనపు ఎస్పీగా పని చేశారు. పర్వతారోహణపై పట్టున్న ఆమె పలు పర్వతాలను అధిరోహించారు. విధి నిర్వహణలో భాగంగా అనునిత్యం తరుణ్ జోషిని కలిసే ఆమె తన పర్వతారోహణ అనుభవాలను పంచుకునే వారు. ♦ ఇలా అనుకోకుండా ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన తాను పర్వతారోహకుడు కావాలని భావించారు. సంతృప్తితో పాటు మానసిక, శారీరక దారుఢ్యానికి ఇది ఉపకరిస్తుందనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని రాధికతో చెప్పగా... తొలుత డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకోవాలని, ఆపై తుది నిర్ణయానికి రావాలని ఆమె సూచించారు. ♦ ఆదిలాబాద్ ఎస్పీగా పని చేసినన్నాళ్లు పని ఒత్తిడి నేపథ్యంలో డార్జిలింగ్ వెళ్లడం ఆయనకు సాధ్యం కాలేదు. అక్కడ నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు తొలి సంయుక్త పోలీసు కమిషనర్‌గా వచి్చన తరుణ్ తనలో ఉన్న పర్వతారోహణ ఆసక్తికి పదును పెట్టారు. ♦ 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న ఆయన అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోనే ఉన్న మౌంట్ రీనాక్‌కు ఎక్కారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా పర్వతారోహణ చేస్తున్న ఆయన ఇప్పటి వరకు ఆరింటిపై తన కాలు మోపారు. ఎవరెస్ట్‌పై కాలు పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. తరుణ్ జోషి అధిరోహించిన పర్వతాలు... ► 2018 మేలో సదరన్ రష్యాలోని భారీ అగి్నపర్వతమైన మౌంట్ ఎల్బ్రస్ను ఎక్కారు. సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం యూరప్‌లోనే పెద్దది. ► 2019 జనవరిలో అర్జెంటీనాలో ఉన్న మౌంట్ ఎకనగ్వాపై అడుగుపెట్టారు. మెండౌజా ప్రావెన్సీలో ఉన్న దీని ఎత్తు 6962 మీటర్లు. దక్షిణ అమెరికాలోనే ఎత్తైనది. ► అదే ఏడాది ఆగస్టులో ఇండోనేయాలో ఉన్న మౌంట్ కార్‌స్టెంజ్స్ అధిరోహించారు. ఇది ప్రపంచంలోని మైదాన ప్రాంతంలో ఉన్న శిఖరాల్లో అతి పెద్దది. దీని ఎత్తు 4,884 మీటర్లు. ► 2020 జనవరి 21న అంటార్కిటికాలోనే అత్యంత ఎత్తైన మౌంట్ విన్సన్‌ను అధిరోహించారు. దీని ఎత్తు 4,897 మీటర్లే అయినప్పటికీ.. మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో తీవ్ర ప్రతికూల వాతావరణం ఉంటుంది. ► విన్సన్ అధిరోహించిన మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తయిన మౌండ్ కోస్యూస్కోపై కాలు పెట్టారు. ఇది సముద్ర మట్టానికి 2,280 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ► 2021 జనవరి 21న టాంజానియాలో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఇది సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉంది. -
ఎవరెస్ట్ వైపు తొలి అడుగు..
కెరమెరి(ఆసిఫాబాద్): ఆశయ సాధనకు పేదరికం అడ్డుకాదని నిరుపిస్తున్నాడు.. కుమురంభీం జిల్లా కెరమెరి మండలం కెలి కె గ్రామానికి చెందిన గిత్తే కార్తీక్. సాహస కృత్యాల్లో రాణిస్తూనే, మరోవైపు కళల్లోనూ తన ప్రతిభను చూపుతున్నాడు. తన గమ్యం ఎవరెస్ట్ అధిరోహించడమే అని చెబుతున్న కార్తీక్.. తాజాగా సిక్కిం రాష్ట్రంలో నిర్వహించే పర్వతారోహణ శిక్షణకు ఎంపికయ్యాడు. తెలంగాణ నుంచి ఐదుగురు.. కెలి కె గ్రామానికి చెందిన గిత్తే రుక్మాజీ, ఇటాబాయి ల కుమారుడు కార్తీక్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. సిక్కింలోని నామ్చా జి ల్లాలో ఈనెల 18 నుంచి అక్టోబర్ 16 వరకు విద్యార్థులకు పర్వతారోహణ శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణకు తెలంగాణ నుంచి ఐదుగురు ఎంపిక కా గా.. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కార్తీక్ ఒక్కరే ఉ న్నారు. నెల రోజులపాటు కొనసాగే ఈ కఠినమైన శిక్షణ పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప ర్వతం ఎవరెస్ట్తోపాటు కిలిమంజారో వంటి శిఖ రాలు అధిరోహించేందుకు అనుమతి లభిస్తుంది. ఈ నెల 15న సిక్కింకు బయలుదేరనున్నాడు. కాగా కార్తీక్ ఇప్పటికే బోనగిరిలోని రాక్‌లైన్ స్కూల్ ఆధ్వర్యంలో జూన్ 19న బోనగిరి గుట్టపై 150 ఫీట్ల రా ఫెల్లింగ్, 150 ఫీట్ల కై ్లంబింగ్‌తోపాటు 650 ఫీట్ల ఎ త్తు వరకు ట్రెక్కింగ్ పూర్తి చేశారు. 30 ఫీట్ల బౌల్ట్రెంగ్, 10 మీటర్ల జిప్లైన్లోనూ ప్రతిభ చూపాడు. దీంతో బోనగిరి రాక్‌లైన్ స్కూల్ ఆధ్వర్యంలో సి క్కింల్లో అందించే శిక్షణకు ఎంపికయ్యాడు. కు టుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కలెక్టర్ హేమంత్ బోర్కడే రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. మాలావత్ పూర్ణ స్ఫూర్తి 13 ఏటనే ఏడు పర్వతాలు అధిరోహించిన నిజామాబా ద్ జిల్లాకు చెందిన మాలా వత్ పూర్ణను స్ఫూర్తిగా తీసుకుని సాహస కృత్యాల్లో పా ల్గొంటున్నా. ట్రెక్కింగ్, కై ్లంబింగ్‌తోపాటు కవితలు రాయడం, చెస్ ఆడటం అంటే ఇష్టం. పేదరికంతో ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్థికంగా అండగా ఉంటే రాష్ట్రం పేరు నిలబెడతా.. – గిత్తే కార్తీక్ ఇతర కళల్లోనూ నేర్పరి సాహస కృత్యాలతోపాటు కార్తీక్ ఇతర కళల్లోనూ నేర్పరి. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. వజ్రోత్సవం సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కవి సమ్మేళనంలో మొదటిస్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోటీల్లో పతకం సాధించాడు. ఇచ్చోడలో జరిగిన వాటర్‌ఫాల్ పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటాడు. గతంలో నేపాల్‌లో జరిగిన చెస్ పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాగా ప్రజాప్రతినిధులు, అప్పటి కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆర్థికసాయం అందించి ఆదుకున్నారు. -
ఎవరెస్టు సమీపంలో కూలిన హెలికాఫ్టర్.. ఆరుగురు టూరిస్టులు మృతి..
ఖాట్మండ్: నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఎవరెస్టు పర్వత ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలి ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మెక్సికోకు చెందినవారు కాగా.. మరోకరు స్థానిక వ్యక్తిగా గుర్తించారు. ఎవరెస్ట్‌తో సహా పలు ఎత్తైన పర్వత ప్రాంతాలకు నిలయమైన సోలుఖున్వు జిల్లాలోని సుర్కే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల్లో ఒకరైన క్యాప్టెన్ చెట్ బహదూర్ గురుంగ్ మృతదేహాన్ని ఖాట్మండ్ పోస్టుకు సమీపంలో గుర్తించారు. కాగా.. ఆయన 1998 నుంచి మనాంగ్ ఏయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్‌ను మనాంగ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందినదిగా గుర్తించారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్టుతో సహా పలు ఉన్నత శిఖరాలను చూడటానికి పర్యటకుల కోసం మనాంగ్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ సేవలను అందిస్తోంది. అయితే.. ఖాట్మండ్‌కు తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 9N-AMV నంబర్ కలిగిన ఈ హెలికాఫ్టర్ ఉదయం 10 గంటల సమయంలో రాడార్ నుంచి తప్పిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత శిథిలాలను సోలుఖున్వు జిల్లాలో లమ్జురా గ్రామంలో స్థానికులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం దర్యాప్తు చేపట్టనుంది. ఇదీ చదవండి: Why Pirates Wear Eye Patches: సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..! -
హిమాలయ సాహసం
-
ఎవరెస్ట్ యమ డేంజర్.. పది వేల అడుగులు దాటితే..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా వెండి కొండలా ధగధగలాడిపోతూ మంచుతో నిండిపోయిన ఈ పర్వత శిఖరం చేరుకోవడమంటే ప్రపంచాన్ని తమ పాదాక్రాంతం చేసుకోవడమే. అందుకే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నా, ప్రాణాలతో తిరిగి వస్తామన్న భరోసా లేకపోయినా ప్రతీ ఏడాది ఎందరో సాహసికులు ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవాలని తమ దేశ జెండాని పాతాలని ఆరాటపడుతుంటారు. మౌంట్ ఎవరెస్ట్‌ను తొలిసారి ఎక్కడం ప్రారంభించి 70 ఏళ్లయింది. 1953 సంవత్సరం మే 29న న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ భారత్‌కు చెందిన టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్ శిఖరాగ్రం చేరుకున్నారు. ఈ 70 ఏళ్లలో కనీవినీ ఎరుగని మార్పులు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఆధునిక సదుపాయాలు చోటు చేసుకోవడంతో ఎవరెస్ట్ అధిరోహించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్ పర్వతారోహకులకు ఈ ఏడాది నేపాల్ ప్రభుత్వం విచ్చలవిడిగా అనుమతులు మంజూరు జారీ చేయడంతో ఎవరెస్ట్ అధిరోహణ మరింత ప్రమాదకరంగా మారింది. అసాధారణ రీతిలో 900 మంది పర్వతారోహకులకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో కొండపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు కనిపించాయి. శిఖరాగ్రం చేరుకోవాలంటే 26 వేల అడుగులు పైకి వెళ్లాలి. పది వేల అడుగులు దాటితే ఇంక మృత్యువు ముఖంలోకి అడుగు పెట్టినట్టే. అంత ఎత్తులో ఆక్సిజన్ సరిగా అందదు. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారుతుంది. రక్తం గడ్డ కట్టేలా వాతావరణం మైనస్ 20 డిగ్రీలకు పడిపోతుంది. శారీరకంగా ఎంత ఫిట్నెస్ ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి ప్రాణాలు పోతాయి. సముద్ర మట్టానికి అంత ఎత్తుకు చేరుకుంటే ఒక్కోసారి మెదడు, ఊపిరితిత్తులకు వాపు వచ్చి శరీరంపై స్వాధీనం కోల్పోతారు. ఈ సారి ఏకంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు మంచులో గల్లంతయ్యారు. ఇటీవల ఈ స్థాయిలో మరణాలు ఎప్పుడూ సంభవించలేదు. ‘‘ఒకేసారి పర్వతారోహకులు కొండ ఎక్కుతూ ఉంటే వారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆక్సిజన్ ఏర్పాటు చేయడం అత్యంత ముఖ్యం. మా ద్వారా ఎవరెస్ట్ అధిరోహించే పర్వతారోహకులెవరూ ఇప్పటివరకు ఏ సమస్య ఎదుర్కోలేదు’’అని ఆస్ట్రియాకు చెందిన లుకాస్ ఫర్టెన్‌బాచ్ అనే కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది తమ సంస్థ తరఫున 100 మంది దిగ్విజయంగా ఎవరెస్ట్ ఎక్కి వచ్చారని చెప్పారు. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ముప్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు ఎవరెస్ట్ అధిరోహకులకు అతి పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. 1979 నుంచి చూస్తే గత 40 ఏళ్లలో ఎవరెస్ట్‌పై ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. దీంతో హిమానీ నదాలు కరిగి మంచు చరియలు విరిగి పడటం వంటిæ ప్రమాదాలు ముంచుకొస్తాయి. కొన్నేళ్లుగా ఎవరెస్ట్ అధిరోహించే వారు ఈ మార్పుల ప్రభావం విపరీతంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో పదేళ్లలో ఎవరెస్ట్ ఎక్కే మార్గం ఎలా మారుతుందో ఊహకి కూడా అందడం లేదని నేపాల్ మౌంటనీరింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఆంగ్ షెరింగ్ పేర్కొన్నారు. ఆదాయానికి ఆశపడి..? నేపాల్‌కు పర్యాటకమే ప్రధాన ఆధారం. ఎవరెస్ట్ అధిరోహణ నుంచే అధికంగా ఆదాయం సమకూరుతుంది. పశ్చిమ దేశాల నుంచి వచ్చే పర్వతారోహకుల నుంచి11 వేల డాలర్లు (రూ.9 లక్షలు) చొప్పున వసూలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అదే కాకుండా వెంట తీసుకు వెళ్లే ఆక్సిజన్, ఆహారం, గైడ్ల కోసం మొత్తంగా ఒక్కొక్కరికి 27 వేల డాలర్లు (దాదాపుగా రూ.22 లక్షలు) ఖర్చు అవుతుంది. అయితే నేపాల్ ప్రభుత్వం ఆదాయానికి ఆశపడే అనుమతులు ఎక్కువగా ఇస్తున్నామన్న ఆరోపణల్ని తోసిపుచ్చింది. ప్రతీ పర్వతారోహకుడి ప్రాణ రక్షణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, బేస్ క్యాంప్‌లో వైద్యులు, అధికారుల బృందం ఈ సాహస యాత్రను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ఏదైనా సాధ్యమే ప్రపంచంలో ఎవరెస్ట్ మ్యాన్‌గా పేరు పొందిన నేపాల్‌కు చెందిన షెర్పా కామి రిటా 28 సార్లు ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా నిలిచి తన రికార్డు తానే బద్దలు కొట్టాడు. ఈ ఏడాది వారం రోజుల తేడాలో రెండు సార్లు శిఖరాగ్రానికి చేరుకున్నాడు. తన రికార్డుని పసాంగ్ దావా అనే షెర్పా సమం చేయడంతో ఆ మరుసటి రోజే మళ్లీ ఎక్కి అత్యధికసార్లు ఎవరెస్ట్‌ని ఎక్కిన వ్యక్తిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక బ్రిటన్‌కు చెందిన మాజీ సైనికుడు హరి బుధా మాగర్ కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు. ఒక మలేసియన్ పర్వతారోహకుడు అనారోగ్యం బారిన పడితే నేపాలీ గైడ్ గెల్జీ అతనిని మోసుకుంటూ కొండ దిగడం మరో అరుదైన ఫీట్‌గా నమోదైంది. ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరితే ప్రపంచాన్నే జయించినంత ఆనందం వస్తుంది కాబట్టే ప్రాణాలకు తెగించి మరీ ఎవరెస్ట్ ఎక్కే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జయహో ఎవరెస్ట్
మే 29, 2023 నాటికి ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గెలు ఎవరెస్ట్ అధిరోహించి 70 ఏళ్లు. ఆ సందర్భంగా నేపాల్‌లోని లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో వాళ్లిద్దరి బంగారు విగ్రహాలు ప్రతిష్టించారు. అంతేనా? షెర్పాల ఘన ఆరోహణ సంప్రదాయాన్ని నిలబెడుతూ ‘ఎవరెస్ట్ మేన్’గా ఖ్యాతినెక్కిన ‘కమిరత్న షెర్పా’ మే 23న 28వసారి ఎవరెస్ట్ ఎక్కి ఆ మహా పర్వతం ఒడికి తాను ముద్దుబిడ్డని నిరూపించుకున్నాడు. ఎవరెస్ట్– ఒక ధవళ దేవత. ఈ ఆరాధన ఎప్పటికీ వైరలే. ఎంత బాగుందో ఆ సన్నివేశం మే 26న, నేపాల్‌లోని లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో (దీని పేరు టెన్సింగ్–హిల్లరీ ఎయిర్పోర్ట్) ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గె బంగారు విగ్రహాలు ప్రతిష్టిస్తే ఆ కార్యక్రమంలో హిల్లరీ కుమారుడు పీటర్ హిల్లరీ, టెన్జింగ్ కుమారుడు జామ్లింగ్ నార్గె పాల్గొన్నారు. డెబ్బయి ఏళ్ల క్రితం తమ తండ్రులు సృష్టించిన ఘన చరిత్రను వాళ్లు గుర్తు చేసుకోవడం, పొంగిపోవడం అందరినీ ఉద్వేగభరితం చేసింది. ఎవరెస్ట్‌ను నేపాల్‌వైపు ఎక్కాలనుకునేవారు మొదట లుక్లా ఎయిర్‌పోర్ట్‌లోనే దిగుతారు కాబట్టి వారికి స్ఫూర్తినివ్వడానికి, 70 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా ఈ విగ్రహాలు ఆవిష్కరించారు. ఇప్పటికి 6 వేల మంది డెబ్బయి ఏళ్ల క్రితం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ హిల్లరీ, నార్గెల జంట ఎవరెస్ట్‌ను అధిరోహించాక అప్పటి నుంచి ఇప్పటి వరకూ హిమాలయన్ డేటాబేస్ ప్రకారం ఆరు వేల మంది ఎవరెస్ట్ అధిరోహించారు. దానికి రెట్టింపు మంది ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ వెళ్లి వచ్చారు. పర్వతారోహకుల తొలి ఆరోహణ కలగా ఇప్పటికీ ఎవరెస్ట్ నిలిచి ఉంది. ఇప్పుడు నేపాల్‌వైపు నుంచి ఎవరెస్ట్ అధిరోహించాలంటే 9 లక్షలు పర్మిట్ ఫీజు కట్టాలి. ఈ సీజన్లో 478 మందికి పర్మిట్ ఇచ్చారు. వీరిలో చాలామంది గైడ్‌ను తీసుకెళతారు కాబట్టి రికార్డు స్థాయిలో 900 మంది ఈ సీజన్లో ఎవరెస్ట్‌ను అధిరోహిస్తారని భావిస్తున్నారు. మంచుపులి హిల్లరీకి దారి చూపేందుకు వచ్చి చరిత్రలో నిలిచిన షెర్పా టెన్జింగ్ నార్గెను ‘మంచు పులి’ అని పిలుస్తారు. ఆ షెర్పాల జాతికే చెందిన కమిరత్న షెర్పాను ‘ఎవరెస్ట్ మేన్’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇతను ఎవరెస్ట్ గైడ్‌గా పని చేస్తూ ఇప్పటికి 27సార్లు ఆ శిఖరాగ్రాన్ని ఎక్కి దిగాడు. అందుకని అత్యధికసార్లు ఎవరెస్ట్ ఎక్కిన ఘనత ఇతని పేరు మీద ఉంది. అయితే మొన్నటి మే 22న పసాంగ్ దవ రత్న అనే మరో షెర్పా 27వసారి ఎవరెస్ట్ అధిరోహించి కమిరత్న రికార్డును సమం చేశాడు. ఇది ఏమాత్రం రుచించని కమిరత్న ఆ మరుసటి రోజు ఉదయానికి ఎవరెస్ట్ ఎక్కి 28వసార్లు ఎక్కిన ఏకైక వ్యక్తిగా రికార్డు తన పేరు మీదే నిలుపుకున్నాడు. ఈ మే నెలలో కమిరత్న రెండుసార్లు ఎవరెస్ట్ ఎక్కాడు. హైదరాబాద్ బెజవాడల మధ్య తిరిగినంత సులభంగా ఎవరెస్ట్ అధిరోహిస్తున్న ఇతణ్ణి మరో మంచుపులి అనక ఇంకేం అనగలం. -
ఎవరెస్ట్ పైకి 27 సార్లు..!
కఠ్మాండు: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని పసంగ్ దవా షెర్పా(46) పర్వతారోహకుడు 27సార్లు అధిరోహించారు. 8,848.86 మీటర్ల ఎత్తైన ఈ హిమాలయ శిఖరాన్ని సోమవారం ఉదయం 8.25 గంటలకు ఆయన చేరుకున్నట్టు పర్వతారోహక యాత్ర నిర్వహిస్తున్న ‘ఇమాజిన్ నేపాల్ ట్రెక్స్’ తెలిపింది. తద్వారా కమి రిటా షెర్పా రికార్డును ఆయన సమం చేశారు. ఎవరెస్ట్ రీజియన్‌లో జన్మించిన పసంగ్ తొలిసారి 1998లో ఎవరెస్ట్‌ను అధిరోహించారు. మరోవైపు 53 ఏళ్ల కమి రిటా షెర్పా ఈ సీజన్లోనే ఎవరెస్ట్‌ను 28వ సారి ఎక్కి పసంగ్ను అధిగమించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. -
Toolika Rani: సాహస రాణి.. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ, కానీ!
సాహసగాథలు వింటే సాహసాలు చేయాలనిపిస్తుంది. సాహసం చేస్తే మరిన్ని సాహసాలు చేయాలనిపిస్తుంది. సాహసం ఏం ఇస్తుంది? ‘అంతులేని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాదు మనమేమిటో మనకు తెలియజేస్తుంది’ అంటుంది తులికారాణి. ఎన్నో ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించిన ఈ సాహసి సామాజిక స్పృహకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుంచి మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన తొలి మహిళగా, ఇరాన్‌లోని మౌంట్ డమవండ్ను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది తులికారాణి. మీరట్‌లో చదువుకున్న రాణికి చిన్నప్పటి నుంచి సాహసగాథలు అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌పై ఆసక్తి కలిగేలా చేసింది. 2005లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన రాణి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలింగ్ విభాగంలో, ఔట్‌డోర్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పదిసంవత్సరాల పాటు పనిచేసింది. ఎయిర్‌ఫోర్స్ టీమ్‌లో భాగంగా పర్వతారోహణకు శ్రీకారం చుట్టింది. అప్పుడు మొదలైన ఆసక్తి ఆమెతో ఎన్నో సాహసాలు చేయించింది. భారతదేశం, నేపాల్. భూటాన్, ఇరాన్, రష్యా... మొదలైన దేశాల్లో ఇరవైనాలుగు ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించింది. ఝాన్సీ లక్షీభాయి పురస్కారంతో పాటు పదిహేడు అవార్డ్లు అందుకుంది. వాటిలో ‘గ్లోబల్ ఉమెన్’ అవార్డ్ కూడా ఒకటి. ‘సవాలును స్వీకరించడానికి ధైర్యం మాత్రమే కాదు అంకితభావం, కష్టపడే తత్వం ఉండాలి. ప్రయాణంలో అవహేళనలు ఎదురు కావచ్చు. అయితే ఒక్క విజయం చాలు వాటికి సమాధానం చెప్పడానికి’ అంటుంది రాణి. తొలిసారిగా పర్వతారోహణకు ఉపక్రమించినప్పుడు ప్రోత్సహించే వారి కంటే ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ. కొందరైతే ‘అమ్మాయిలు పర్వతారోహణ చేయడం కష్టం’ అన్నారు. విమర్శలకు, అనుమానాలకు, అవహేళనలకు తన విజయాలతోనే గట్టి సమాధానం చెప్పింది రాణి. పుస్తకాలు చదవడం, తన సాహనయాత్రల గురించి ఆర్టికల్స్ రాయడం, ప్రకృతిని చూస్తూ పరవశిస్తూ భావుకతతో కవిత్వం రాయడం రాణికి ఇష్టం. వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ సాంస్కృతిక నేపథ్యాలు ఉన్న వ్యక్తులతో మాట్లాడడం అంటే ఇష్టం. తాజా విషయానికి వస్తే... తులికారాణిని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం జీ–20 బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. వారణాసిలో ఆరు, ఆగ్రాలో మూడు, లక్నోలో ఒకటి, గ్రేటర్ నోడియాలో ఒకటి...జీ–20కి సంబంధించిన రకరకాల సమావేశాలు జరుగుతాయి. వీటిలో నలభై దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. కాలేజీ, యూనివర్శిటీలలో జరిగే కార్యక్రమాల్లో అంబాసిడర్ హోదాలో ΄ాల్గొననుంది రాణి. ‘జీ–20 బ్రాండ్ అంబాసిడర్‌గా నన్ను నియమించడం గర్వంగా ఉంది. నా బాధ్యతను మరింత పెంచింది. నిర్మాణాత్మక విషయాల గురించి యువతలో ఆసక్తి, అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది రాణి. రాణిలో మంచి వక్త, లోతైన విశ్లేషకురాలు కూడా ఉన్నారు. అడ్వెంచర్ స్టోర్ట్స్‌లో జెండర్ గ్యాప్, ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఎందుకు ఉంది? ఔట్‌డోర్ అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో స్త్రీలు అడుగు పెట్టడానికి ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయి? వాటికి పరిష్కారం ఏమిటి? పర్వతారోహణకు ఆర్థికబలం అనేది ఎంత ముఖ్యం... మొదలైన విషయాల గురించి రాణి అద్భుతంగా విశ్లేషిస్తుంది. ‘సాహసాలే కాదు సమాజసేవ కూడా’ అంటున్న తులికారాణికి అభినందనలు తెలియజేద్దాం. వృత్తం దాటి బయటికి రావాలి ఎప్పుడూ గిరిగీసుకొని ఉండకూడదు. ఈ విశాల ప్రపంచంలో మనం చేయడానికి ఎంతో ఉంది. చుట్టూ గీసుకున్న వృతాన్ని దాటి బయటి వస్తే అద్భుతప్రపంచం మనకు కనిపిస్తుంది. మనం ఇప్పటి వరకు ఏం చేయలేదు? ఇకముందు ఏం చేయాలి? అనేది అవగాహనకు వస్తుంది. కొత్త శక్తి మనకు చేరువ అవుతుంది. – తులికారాణి -
పర్వతారోహణలోనే పరలోకాలకు.. నల్లగొండ యువకుడు మృతి..
చిట్యాల: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే చిన్ననాటి కోరికను నెరవేర్చుకునే క్రమంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన అద్దెల ఉపేందర్, ఉమ దంపతులు 30ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని సాయినగర్‌కు వలస వెళ్లి స్థిరపడ్డారు. వీరికి ఓ కూతురుతో పాటు కుమారుడు రాజశేఖర్‌రెడ్డి(32) ఉన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఇంజనీరింగ్ పూర్తిచేసి స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువతితో వివాహం జరిగింది. 2నెలలు శిక్షణ పొంది.. రాజశేఖర్‌రెడ్డి ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంపు వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అసోంలో రెండు నెలల పాటు పర్వతారోహణపై శిక్షణ పొందాడు. ఈ నెల 3వ తేదీన మరికొంత మంది పర్యాతారోహకులతో కలిసి నేపాల్‌కు వెళ్లాడు. ఖాట్మండు నుంచి వాహనంలో సముద్ర మట్టానికి 2,600 మీటర్ల ఎత్తులోని సల్లేరుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి పది రోజుల పాటు ప్రయాణించి 4,910 మీటర్ల ఎత్తులో ఉండే లోబూచే పర్వతాన్ని ఈ నెల 21న చేరుకున్నాడు. అక్కడ సీప్ర లాడ్జిలో బసచేశాడు. ఇక్కడి నుంచి మరో 600 మీటర్లు ట్రెక్కింగ్(పర్వతారోహణ) చేస్తే రాజశేఖర్‌రెడ్డి ఎవరెస్ట్ బేస్ క్యాంపు(5,500 మీటర్ల దూరం) చేరుకునేవాడు. అయితే, ఈ సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వాతావరణం అనుకూలించక రాజశేఖర్‌రెడ్డి లాడ్జిలోనే ఉండిపోయాడు. దీంతో ఆయన అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతిచెందాడు. లాడ్జి సిబ్బంది ఈ నెల 22న రాజశేఖర్‌రెడ్డి మృతిచెందిన విషయాన్ని గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు నేపాల్‌కు బయలుదేరి వెళ్లారు. కాగా, మృతదేహాన్ని అక్కడి అధికారులు నేపాల్‌లోని ఖాట్మండు వరకు తీసుకువచ్చారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. సోమవారం వరకు రాజశేఖర్‌రెడ్డి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకోనుందని, సాయినగర్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. చదవండి: యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? -
ఆ అద్భుతం వెనకాల కష్టం మామూలుది కాదు!
అదో అరుదైన జీవి. మనిషి కంటపడకుండా తిరగడం దాని నైజం. అలాంటి జీవిని.. అంతే అద్భుతంగా కెమెరాలో బంధించింది ఓ ఫీమేల్ ఫొటోగ్రాఫర్. అదీ ఎముకలు కొరికే చలిలో.. ఎంతో కష్టపడి మరీ!. అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్ కిట్టియా పాలోస్కి.. మంచు పర్వత శిఖరాన ఠీవిగా కూర్చున్న మంచు చిరుతను కెమెరాలో బంధించింది. నేపాల్ ఖుంబు గ్లేసియర్‌లో ఫాంటోమ్ అల్లేగా పిలువబడే చోట ఆమెకు ఈ దృశ్యం తారసపడింది. కాలినడకన దాదాపు.. 165 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆమె ఈ అద్భుతాన్ని బంధించారట!. View this post on Instagram A post shared by Kittiya Pawlowski (@girlcreature) ఈ ఫొటో మాత్రమే కాదు.. ఎవరెస్ట్ పర్వతం, పుమోరి పర్వతాల నీడన మంచు చిరుత పయనిస్తున్న ఫొటోలను ఎంతో సుందరంగా తీశారు పాలోస్కి. ఎప్పుడైతే అవి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయో.. అప్పటి నుంచి అవి వైరల్ కావడం ప్రారంభించింది. యానిమల్ప్లానెట్తో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థలు సైతం ఆమె ఫొటోల్ని వాడేస్తున్నాయి. పాంథెరా జాతికి చెందిన మంచు చిరుతకు.. ఘోస్ట్ ఆఫ్ మౌంటెయిన్స్గా పేరుంది. సిగ్గుపడే స్వభావం కారణంగా అది మనుషుల కంట పడదు.. పడినా దాడి చేసిన సందర్భాలు లేవు!. అయితే వేట, అక్రమ రవాణా కారణంగా వీటి జనాభా బాగా తగ్గిపోతూ వస్తోంది. 2040 నాటికి ఇవి అంతరించుకునే పరిస్థితికి చేరుకుంటాయనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్తే ఇలాగే ఉంటది! వీడియో వైరల్ -
Mount Everest: ఎవరెస్ట్ నేర్పే పాఠం ఎలాంటిదంటే..
ఎవరెస్ట్.. ఒక ప్రత్యేకం. అది ఎక్కడమంటే ఒక మినీ యుద్ధం చేసినట్లే!. అధిరోహించిన ప్రతిసారీ ఓ కొత్త అనుభవం పంచుతుంది. ఆ అనుభవం ఓ కొత్త పాఠం నేర్పిస్తుంటుంది. అదే సమయంలో కొత్త సవాళ్లనూ ముందుంచుతుంది. ఆకాశమే హద్దుగా.. పర్వత శిఖరాన్ని అధిరోహించే వాళ్లే కాదు, అక్కడి ప్రతికూల పరిస్థితులకు ఏమాత్రం తీసిపోని సవాళ్లను లైఫ్‌లో దాటుకుంటూ ముందుకెళ్లాలనుకునే వాళ్లు కూడా ‘ఎవరెస్ట్’ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు మరి!. మౌంట్ ఎవరెస్ట్.. ఆకాశానికి సమీప భూభాగం. వెండి కొండలా ధగ ధగా మెరిసే అద్భుత పర్వతం. ఆ శిఖరాగ్రాన్ని చేరి నిలబడి చూస్తే ఎలా ఉంటుంది?.. మొత్తం ప్రపంచమే మనిషి పాదాల కింద ఉన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటి మహోన్నత శిఖరాన్ని ఎక్కడమంటే ఆషామాషీ కాదు. కఠోర శిక్షణ తీసుకోవాలి. అంతకు మించి గుండెల నిండా ధైర్యం ఉండాలి. లక్ష్యాన్ని చేరుకోవాలన్న కసి.. గెలిచి తీరాలన్న పంతంతో ముందుకెళ్లాలి. మానవతీతులకు సాధ్యమేనా? అనుకున్న సమయంలో.. ఈ పర్వతాన్ని అధిరోహించి ‘మనిషి తల్చుకుంటే ఏదైనా సాధ్యమే’ అని ప్రపంచానికి చాటి చెప్పిన హీరోలిద్దరున్నారు. వాళ్లెవరో కాదు. న్యూజిలాండ్ కు చెందిన ఎడ్మండ్ హిల్లరీ- భారత్ కు చెందిన టెన్జింగ్ నార్గే. ఇప్పటి సాంకేతికత, ఆధునిక పరికరాలు, పనిముట్లు, సౌకర్యాలు లేనిరోజుల్లో ఈ ఇద్దరూ ఎవరెస్ట్ మీద తమ జెండాలు పాతారు. అది.. 1953 మే 29 తేదీ సరిగ్గా ఉదయం 11:30 గంటల ప్రాంతంలో.. చరిత్రలో లిఖించదగ్గ క్షణాలను నమోదు చేశారు హిల్లరీ-నార్గేలు. ఈ ఇద్దరిలోనూ శిఖరం పై మొదట కాలు మోపింది మాత్రం హిల్లరీనే. పేరెలా వచ్చిందంటే.. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం.. మౌంట్ ఎవరెస్ట్. సముద్ర మట్టానికి 29 వేల అడుగుల ఎత్తులో.. నేపాల్ -టిబెట్ సరిహద్దులో ఉంది. టిబెటన్లు దీన్ని కోమో లాంగ్మా అని పిలుస్తారు. దానర్థం మాతృ దేవత అని. చైనా వాళ్లు జుము లాంగ్మా అంటారు. హోలీ మదర్ అని చైనీయుల ఉద్దేశం. నేపాలీలేమో సాగర మాత అని పిలుస్తుంటారు. అప్పటివరకు కాంచన్ జంగా ప్రపంచంలోకెల్లా.. అత్యంత ఎత్తైన శిఖరమని అంతా పొరబడ్డారు. ఆ సమయంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా అయిన జార్జి ఎవరెస్ట్.. అంతకు మించి ఎత్తైన ఓ శిఖరం ఎత్తు తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1850లో నికొల్సన్ అనే ఉద్యోగికి ఆ బాధ్యతలు అప్పజెప్పాడు. ఆరేళ్లపాటు శ్రమించి.. నికొల్సన్ తన ఆపరేషన్ తన బాధ్యతలు పూర్తి చేశారు. అలా జార్జి ఎవరెస్ట్ పేరు మీద.. ప్రపంచానికి మౌంట్ ఎవరెస్ట్‌గా పరిచయమైంది. అయితే.. ఎవరు ఎలా పిలిస్తేనేం ఈ పర్వతమైతే పలుకుతుందా?. గంభీరంగా అలా ఉండిపోతుంది అంతే!. ఎవరెస్ట్‌ను అధిరోహిస్తే.. పేరు వస్తుందన్న మాట వాస్తవమే. కానీ, ఆ పని అంత సులువు కాదు. కాకలు తీరిన పర్వతారోహకులకు సైతం ఇదొక టఫ్ ఛాలెంజ్. ఎత్తుకు వెళ్లే కొద్దీ.. అన్నీ సమస్యలే స్వాగతం పలుకుతుంటాయి. పైగా ప్రతికూల వాతావరణం సవాళ్లు విసురుతుంటుంది. పచ్చిగా చెప్పాలంటే.. ప్రాణాలతో చెలగాటం. ఏమాత్రం తేడా జరిగినా అంతే!. ఎవరెస్ట్ అధిరోహించే క్రమంలో.. ఎనిమిది వేల అడుగుల ఎత్తు దాటితే దాన్ని డెత్ జోన్ అంటారు. అదో మృత్యు శిఖరం. అక్కడ గాలిలో ఆక్సిజన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఎంత తక్కువగా ఉంటుందంటే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమే. ఆక్సిజన్ బాటిల్స్‌లో తేడాలు జరిగినా అంతే!. ఈ పరిస్థితుల్లో ఇంకా పైకి వెళ్లడం.. ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. అక్కడి నుంచి కిందకు తిరిగి వస్తే అదో గొప్ప. అంత ప్రమాదమని తెలిసినా.. క్లైంబర్స్కు ఎవరెస్ట్ మీద మోజు తగ్గదు. సాహసానికి లభించే అరుదైన విజయానందం మరొకటి ఉంటుందా? అంటారు. అయితే.. ఆ మోజే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. ఆకాశానికి నిచ్చెన.. ఎవరెస్ట్ ఎక్కడమంటే ఆకాశానికి నిచ్చెన వేయడమే. నిచ్చెన ఎక్కేటప్పుడు తప్పటడుగు ఒక్కటి పడినా ఖతం. వాతావరణం ఎదురు తిరిగినా డేంజరే. ఎవరెస్ట్ ఎక్కడంలో బోలెడు రికార్డులు ఉన్నాయి. అన్నే విషాదాలూ ఉన్నాయి. గుండెల నిండా సాహసాన్ని నింపుకుని వేల అడుగుల ఎత్తు ఎక్కిన క్లైంబర్స్ ఎవరెస్ట్ మీదనే చివరి ఊపిరి పీల్చిన విషాద ఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఓ దుర్ఘటన మాత్రం ఎవరెస్ట్ చరిత్రలోనే అత్యంత ట్రాజిక్ ఇన్సిడెంట్ గా మిగిలిపోయింది. ఎ‘వరెస్ట్’ 1996.. 1996, మే 11. మన పర్వతారోహణ చరిత్రలో ఓ బ్లాక్ డే. ఒకేరోజు ఎనిమిది మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ పై ఊపిరి వదిలారు. మరణించిన వాళ్లలో మనవాళ్లు ముగ్గురు, అమెరికా-న్యూజిలాండ్-జపాన్ దేశాల వాళ్లు ఐదుగురు ఉన్నారు. ఈ ప్రమాదం మాత్రమే కాదు.. 1996 సీజన్లో ఎవరెస్ట్ అధిరోహణలో మొత్తం పదిహేను మంది కన్నుమూశారు. ఎవరెస్ట్ చరిత్రలో ఓ సీజన్లో ఇంతమంది చనిపోవడం అదే మొదటిసారి!. ఏం జరిగిందంటే..! అడ్వెంచర్ కన్సల్టెంట్స్- మౌంట్ మ్యాడ్నెస్ అనే రెండు ఏజెన్సీలతో పాటు జపాన్-టిబెట్‌లకు చెందిన పర్వతారోహకులు ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధపడ్డారు. మే 10వ తేదీన అంతా పర్వతం పైకి బయలుదేరారు. ఆ రాత్రికి క్యాంప్ ఫోర్ చేరారు. ఆ ఎత్తు 7,900 మీటర్లు. మధ్యాహ్నం తర్వాత ప్రమాదం అన్నివైపుల నుంచి ముంచుకొచ్చింది. ఎనిమిది మందిని బలిగొంది. ఈ ఘటనలో న్యూజిలాండ్‌కు చెందిన రాబ్ హాల్-ఆండ్రూ హారిస్, అమెరికాకు చెందిన హాన్సెన్ -స్కాట్ ఫిషర్ , జపాన్ యాసుకో నంబా, భారత్ కు చెందిన సుబేదార్ సెవాంగ్ -లాన్స్ నాయక్ -పల్జోర్ లు మృతి చెందారు. మరణాలు ఎడ్మండ్ హిల్లరీ-టెన్జింగ్ నార్గేలు ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఏడాది 1953 నుంచి.. ఇప్పటిదాకా 250 మందికి పైనే చనిపోయారు. మరో విషయం ఏమిటంటే.. 70 శాతం మంది దేహాలు గల్లంతు అయ్యాయి. లెక్కల ప్రకారం.. 150 మంది పర్వతారోహకుల మృతదేహాలు ఏమయ్యాయో కూడా తెలియదు. ఆరంభంలో ఆహ్లాదం, కానీ.. ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఎదురయ్యే సవాళ్లు చాలా కఠినంగా ఉంటుంది. అదీ దశలవారీగా. ఎవరెస్ట్ అధిరోహణలో.. ముందుగా పర్వత పాదాన్ని చేరాలి. దీన్నే బేస్ క్యాంప్ అంటారు. ఎవరెస్ట్ ఎక్కేముందు క్లైంబర్స్ ఇక్కడే రెండు వారాల పాటు ఉండాలి. ఈ టైంలో ఎవరెస్ట్ వాతావరణానికి అలవాటు పడతారు. ఈ రెండు వారాలు టెంటుల్లో కాలక్షేపం చేస్తారు. ఈలోగా అధిరోహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. నెక్ట్స్ లెవల్లో.. బేస్ క్యాంప్ నుంచి క్యాంప్ వన్ చేరాలి. ఆ ఎత్తు 6,065 మీటర్లు. అక్కడి నుంచి క్యాంప్ టూ చేరాలి. దీన్నే ‘అడ్వాన్స్ డ్ బేస్ క్యాంప్’ అంటారు. మరో వెయ్యి మీటర్లు ఎత్తు పైకి వెళ్తే.. క్యాంప్ త్రీ వస్తుంది. ఆ తర్వాత మరో 500 మీటర్లకు క్యాంప్ ఫోర్. ఇది దాటితే కష్టాలు మొదలైనట్లే. క్యాంప్ ఫోర్ తర్వాత వచ్చేది బాల్కనీ. దీని ఎత్తు 8,400 మీటర్ల ఎత్తు. ఇక్కడి నుంచి శిఖరాన్ని చేరాలంటే మధ్యలో ప్రాణాలతో చెలగాటమే. నడుం లోతు మంచు లోంచి పై కెక్కాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కొన్ని వేల మీటర్ల కింద లోయలో పడిపోవడమే. సున్నంలోకి ఎముకలు కూడా మిగలవు!. ఎవరెస్ట్ ఎక్కడంలో అసలు సమస్యంతా ఎక్కడంటే.. వాతావరణంతోనే!. ఎత్తు పెరిగే కొద్దీ వాతావరణంలో వచ్చే మార్పులు.. అధిరోహకులకు నరకం చూపిస్తాయి. ఒక్కసారిగా గాలులు విజృంభిస్తాయి. ఎడతెరపి లేకుండా మంచు కురుస్తూనే ఉంటుంది. పైకి వెళ్లడానికీ ఉండదు. కిందకు దిగడానికీ ఉండదు. ఈ గాలుల వల్ల ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. వీటితో వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. ఉదాహరణకు.. సెరిబ్రల్ ఎడిమా అనే వ్యాధి సోకితే గనుక పర్వతారోహకులు వింతగా ప్రవర్తిస్తారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ల మెదడు చురుకుగా ఉండదు. అంత ఎత్తులో ఉన్నవాళ్లు.. తాము కిందకు జంప్ చేయగలమనే భావనలోకి కూరుకుపోతారు. అంతిమంగా అది వాళ్ల ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తోంది. రిస్క్‌లేని లైఫ్ ఎందుకు? ఇన్ని అవరోధాలు, ఆటంకాలు అధిగమిస్తూ ఆకాశమే హద్దుగా ఉన్న ఎవరెస్ట్‌ను పర్వతారోహకులు అధిరోహించి అక్కడ జెండా పాతేస్తారు. ప్రపంచ విజేతగా తమను తాము ప్రకటించుకుని పొంగిపోతారు. అసలు ఆనందంకోసం ఒక్కోసారి ప్రాణాలు కూడా పణంగా పెట్టేస్తారు. ప్రాణాలను పణంగా పెట్టి.. ఇదంతా అవసరమా? అనే ప్రశ్నకు.. ఎవరెస్ట్ ప్రియుల నుంచి వినిపించే సమాధానం ఒక్కటే. రిస్క్ లేకపోతే లైఫ్ వ్యర్థం అని. ప్రమాదాలు జరుగుతున్నాయని.. ప్రయాణాలు మానేసి ఇంట్లో కూర్చుని ఉంటామా? అలాగే ఇది కూడా అంటారు. పర్వతారోహణ అణువణువునా జీర్ణించుకుపోయిన ఒక ప్యాషన్.. వాళ్లతో అంతేసి సాహసం చేయిస్తోంది మరి!. ఎవరెస్ట్ అనే మహోతన్నత శిఖరం.. మనిషి ఓపికకు పరీక్ష పెడుతుంది. కష్టం విలువను తెలియజేస్తుంది. ఆహారాన్ని ఎలా దాచుకోవాలి అనే పొదుపు పాఠం నేర్పుతుంది. అన్నింటికి మించి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఎలా పోరాడాలి.. ముందుకు ఎలా సాగాలి అనే జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. -
కిలిమంజారో పర్వతంపై వైఫై
డొడోమా: అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటి కిలిమంజారో. ఆఫ్రికన్ సంప్రదాయానికి ఈ పర్వతాన్ని ఒక ప్రతీకగా భావిస్తుంటారు. సుమారు 19వేల ఫీట్లకు పైగా ఎత్తులో ఉండే ఈ పర్వతాన్ని అధిరోహించడాన్ని ఒక ఘనతగా భావిస్తుంటారు అధిరోహకులు. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కిలిమంజారో ఆఫ్రికాలో అతిపెద్ద పర్వతం మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ స్టాండింగ్ పర్వతం కూడా. అలాంటి పర్వతంపై వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు టాంజానియా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 12,200 అడుగుల ఎత్తుల ఈ వైఫైను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరికల్లా.. పర్వతంలో మూడింట రెండో వంతు భాగానికి ఇంటర్నెట్ సౌకర్యం అందనుంది. అయితే వైఫై సౌకర్యం ఉన్న పర్వతం ఇదొక్కటే కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌పై 2010 నుంచే ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తూ వస్తున్నారు. అయితే ఇలాంటి చోట్లలో టెక్నాలజీపై ఆధారపడడం కూడా విపరీతాలకు దారి తీయొచ్చని అంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: కరువు తప్పించుకునేందుకు చైనా ఏం చేస్తోందంటే.. -
Padamati Anvitha Reddy: ఎవరెస్టంత సంతోషం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న ఎవరెస్టును అధిరోహించి హైదరాబాద్‌కు చేరుకున్న పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డిని బుధవారం ఘనంగా సన్మానించారు. ఎర్రమంజిల్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె స్పాన్సర్, అన్వితా గ్రూప్ అధినేత అచ్యుతరావు, కోచ్ శేఖర్ బాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్వితారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భువనగిరిలో తాను చూసిన కోటనే తనకు ప్రేరణ అయిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవ్వరూ ఎక్కని నేపాల్‌లోని ఎవరెస్టు పర్వతం దక్షిణం వైపు నుండి శిఖరాన్ని అధిరోహించినట్లు తెలిపారు. మే 16న ఉదయం 9:30కి ఎవరెస్టు శిఖరం (8848.86 మీటర్లు) చేరుకోవడం ద్వారా తన కలను సాకారం చేసుకున్నట్లు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన అన్వితారెడ్డి.. స్థానికంగా ఉన్న రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. (క్లిక్: ఎవరెస్ట్‌పై నుంచి చూస్తే ప్రపంచం చిన్నగా కనిపించింది) -
ఎవరెస్ట్‌పై అన్వితారెడ్డి
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి సోమవారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరో హించారు. స్థానికంగా ఉన్న రాక్ క్లైంబింగ్ స్కూల్లో శిక్షకురాలిగా పనిచేస్తున్న 25 ఏళ్ల పడమటి అన్వితారెడ్డి నేపాల్‌లోని లుక్లా నుంచి మే 9న ఎవరెస్ట్ అధిరోహణ మొదలు పెట్టారు. మే 12న బేస్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభించి, మే 16న ఉదయం 9.30కు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అన్వితా రెడ్డి విజయం పట్ల కోచ్ శేఖర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మద్దతు ఇచ్చిన ఆమె తల్లిదండ్రులు, స్పాన్సర్లు, సహోద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, అన్వితారెడ్డి ఇప్పటికే ఫిబ్రవరి 2021లో ఖాడే పర్వతాన్ని (భారతీయ హిమాలయాలు–సో–మోరిరి, లదాఖ్), జనవరి 2021లో ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన శిఖరం కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. డిసెంబర్ 2021లో యూరప్‌లోని ఎత్తయిన శిఖరం ఎల్బ్రస్ పర్వతాన్ని ఎక్కిన తొలిమహిళగా రికార్డు సృష్టించారు. అన్వితారెడ్డి తండ్రి మధుసూదన్‌రెడ్డి రైతు కాగా, తల్లి చంద్రకళ భువనగిరిలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. -
ఎవరెస్ట్ శిఖరాన.. ఎమ్మెల్యే కుమారుడు
భువనేశ్వర్: రాష్ట్రానికి చెందిన యువకుడు సిద్ధార్థ్ రౌత్రాయ్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. అతను ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్‌కుమార్ రౌత్రాయ్ కుమారుడు సిద్ధార్థ్ రౌత్రాయ్ కావడం విశేషం. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 4.15 గంటలకు ఎవరెస్ట్ లక్ష్యాన్ని చేరి, కీర్తి ఆర్జించాడని ఎమ్మెల్యే పుత్రోత్సాహం ప్రదర్శించారు. ఇప్పటి వరకు 45మంది భారతీయ పర్వతారోహకులు ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. వీరి సరసన తన కుమారుడు చోటు చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అరుదైన ఎవరెస్ట్ శిఖరాగ్ర పర్వతారోహకుని జాబితాలో స్థానం చేజిక్కించుకుని, భారత పతాకం ఎగురు వేశారన్నారు. అలాగే శ్రీమందిరం పతితపావన పతాకం రెపరెపలాడించి, జగన్నాథుని ప్రతిమ స్థాపించామరని వివరించారు. ఐరన్ మ్యాన్‌గా గుర్తింపు.. సిద్ధార్థ్ రౌత్రాయ్ 3 ఖండాల్లో ఎత్తయిన శిఖరాలను గతంలోనే అవలీలగా అధిరోహించారు. మౌంట్ డెనాలీ(ఉత్తర అమెరికా), మౌంట్ అకాంకోగువా(దక్షిణ అమెరికా), మౌంట్ కిలిమంజారో(ఆఫ్రికా) పర్వత శిఖరాలను చేరుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 7 ఖండాల్లోని పర్వతాలను చేరడం అభిలాషగా తెలిపారు. సిద్ధార్ కాలిఫోర్నియా ఫాల్సమ్ ప్రాంతంలో భార్యా, బిడ్డలతో కలిసి ఉంటున్నారు. 2016లో ఫ్లోరిడాలో నిర్వహించిన ట్రయథ్లాన్(4 కిలోమీటర్ల ఈత, 180 కిలోమీటర్ల సైక్లింగ్, 42 కిలోమీటర్ల పరుగు పందెం)లో విజయం సాధించి, ఒడియా ఐరన్ మ్యాన్‌గా గుర్తింపు సాధించారు. చదవండి: వివాహేతర సంబంధం: తెల్లవారుజామున తలుపులు తెరవగానే.. -
ఒక్కసారి కాదు.. ఏకంగా 26 సార్లు ఎవరెస్టు ఎక్కేశాడు
కఠ్మాండూ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని జీవితంలో కనీసం ఒక్కసారైన అధిరోహించాలన్నది ఎందరో పర్వతారోహకుల కల. అలాంటిది, నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీతా ఎవరెస్టును ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా 26 సార్లు అధిరోహించాడు! ఆ క్రమంలో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 52 ఏళ్ల కామి 10 మందితో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తూ శనివారం 26వ సారి ఎవరెస్టును ఎక్కినట్టు సెవన్ సమ్మిట్ ట్రెక్స్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజర్ దావా షెర్పా వెల్లడించారు. 1953లో సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే తొలిసారి వెళ్లిన ఏ మార్గంలోనే కామి బృందం కూడా శిఖరానికి చేరింది. రీతా తొలిసారి 1994లో ఎవరెస్టును అధిరోహించాడు. ప్రపంచంలో రెండో ఎత్తైన మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ (కే2)తో పాటు హోత్సే, మనాస్లూ, చో ఓయూ శిఖరాలను కూడా ఆయన ఎక్కాడు. 8 వేల మీటర్ల కంటే ఎత్తైన ఎక్కువ శిఖరాలను అధిరోహించిన రికార్డు కూడా రీతాదే! 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్టును ఎక్కడానికి నేపాల్ పర్యాటక శాఖ ఈ ఏడాది 316 మందికి అనుమతినిచ్చింది. -
ఫస్ట్ టైమ్ పర్వతాలు పరవశించి... ఆశీర్వదించాయి!
‘మనుషులు పర్వతాలతో కలిసి కరచాలనం చేసినప్పుడు గొప్ప అద్భుతాలు సంభవిస్తాయి’ అలాంటి అద్భుతాలను అయిదుసార్లు చవిచూసి మాటలకు అందని మహా అనుభూతిని సొంతం చేసుకుంది ప్రియాంక మోహితే. తాజాగా ప్రపంచంలోనే మూడో ఎల్తైన శిఖరం కాంచన్‌జంగా(8,586 మీటర్లు)ను అధిరోహించి జేజేలు అందుకుంటోంది మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే. ఈ విజయం ద్వారా ప్రపంచంలోని ఎనిమిదివేల మీటర్లకు పైగా ఎత్తు ఉన్న అయిదు పర్వతశిఖరాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది. చిన్నప్పటి నుంచి పర్వతారోహణ గురించిన విషయాలు తెలుసుకోవడం, పర్వతారోహకులతో మాట్లాడడం అంటే ప్రియాంకకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను ప్రపంచం మెచ్చిన పర్వతారోహకురాలిగా మలిచింది. టీనేజ్‌లో తొలిసారిగా ఉత్తరాఖండ్‌లోని బందర్‌పంచ్ పర్వతశ్రేణిని అధిరోహించింది ప్రియాంక. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2013లో మౌంట్ ఎవరెస్ట్(8,849 మీ), 2016లో మౌంట్ మకలు(8,485 మీ), మౌంట్ కిలిమంజారో(5,895 మీ), 2018లో మౌంట్ లోట్సే (8,516 మీ), గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ (8,091 మీ) పర్వతాలను అధిరోహించింది. గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ అధిరోహించడానికి బయలుదేరేముందు కోవిడ్ భయాలు సద్దుమణగలేదు. రకరకాల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకతప్పలేదు. కొత్త విజయాన్ని నా ఖాతాలో వేసుకోబోతున్నాను...అంటూ ఒక వైపు అంతులేని ఆత్మవిశ్వాసం, మరోవైపు అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి విన్న భయంగొలిపే విషయాలు తన మనసులో కాసేపు సుడులు తిరిగాయి. అయితే చివరికి మాత్రం ప్రతికూల ఆలోచనలపై ఆత్మవిశ్వాసమే అద్భుత విజయాన్ని సాధించింది. స్ట్రెంత్ ట్రైనింగ్ నుంచి క్రాస్ ఫిట్ వరకు ప్రత్యేక దృష్టి పెట్టింది. సాహసయాత్రకు బయలుదేరేముందు– ‘ప్రతి విజయం తరువాత సోషల్ మీడియాలో నా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతున్నారు. ఈసారి కూడా అలాగే జరగాలని ఆశిస్తున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది ప్రియాంక. మౌంట్ అన్నపూర్ణను విజయవంతంగా అధిరోహించిన తరువాత సోషల్‌మీడియాలో ఆమె ఫాలోవర్స్ ఇబ్బడిముబ్బడిగా పెరిగారు. నాట్యం చేసిన పాదాలు పర్వతాలను ముద్డాడాయి (ప్రియాంకకు భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది)...అని కవిత్వం చెప్పినవారు కొందరైతే– ‘మీ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచిందో మాటల్లో చెప్పలేను’ అన్నవారు కొందరు. ప్రతి విజయ యాత్రకు ముందు– ‘నా కల నెరవేర్చుకోవడానికి బయలుదేరుతున్నాను’ అని పోస్ట్ పెడుతుంది ప్రియాంక. ఆ వాక్యానికి ఎన్నెన్ని ఆశీర్వాద బలాలు తోడవుతాయోగానీ ఆమె అద్భుత విజయాలను సాధిస్తుంటుంది. ముంబై యూనివర్శిటీలో బయోటెక్నాలజీలో పీజీ చేసిన ప్రియాంకకు పర్వతారోహణ అంటే టీనేజ్‌లో ఎంత ఉత్సాహంగా ఉండేదో, ఇప్పుడూ అంతే ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహమే 30 సంవత్సరాల ప్రియాంక బలం, మహా బలం! -
వేల అడుగుల ఎత్తున్న.. దిగమింగుకోలేని విషాదం
మంచు పర్వతాల్లో ఎవరెస్ట్ పర్వత శిఖరం అంచున.. విషాద ఘటన చోటుచేసుకుంది. ఎవరెస్ట్‌ను అవలీలగా అధిరోహిస్తూ వచ్చిన ఓ నేపాలీ పర్వతారోహకుడు అనూహ్యరీతిలో గురువారం కన్నుమూశాడు. కూర్చున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. అది చూసి తోటి పర్వతారోహకులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎంజిమి టెన్జీ షెర్పా(38) జీవితం వేల అడుగుల ఎత్తులో విషాదంగా ముగిసింది. ఎవరెస్ట్ పై కాస్తంత విశాలంగా ఉండే ఓ ప్రదేశాన్ని ఫుట్ బాల్ ఫీల్డ్ అని పిలుస్తారు. ఎవరెస్ట్ మొత్తమ్మీద పర్వాతారోహకులకు సురక్షితమైన ప్రదేశం అదే. అక్కడే అతను కూర్చున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. ఇది ఇతర పర్వతారోహకుల గుండెల్ని కరిగించి వేసింది. అతడు ఎలాంటి ప్రమాదానికి గురికాలేదని, ఎత్తయిన ప్రదేశానికి చేరిన సమయంలో తీవ్ర అస్వస్థత కలగడంతోనే ప్రాణాలు విడిచాడని ఇంటర్నేషనల్ మౌంటైన్ గైడ్స్ భాగస్వామ్య సంస్థ బేయుల్ అడ్వెంచర్స్ కు చెందిన త్సెరింగ్ షేర్పా వెల్లడించారు. బహుశా ఎంజిమి షెర్పా ఎవరెస్ట్ పై క్యాంప్-2కు వివిధ రకాల సామగ్రి తీసుకెళుతుండగా, ఈ విషాదం చోటుచేసుకుని ఉంటుందని త్సెరింగ్ అంటున్నారు. అతడిని తాము చనిపోయిన స్థితిలో ఉండగా గుర్తించామని, ఆ సమయంలో అతడి వీపునకు బ్యాక్ ప్యాక్ అలాగే ఉందని తెలిపారు. నేపాల్‌కు చెందిన షెర్పాలు ఎవరెస్ట్ పర్వతారోహణలో రాటుదేలినవారిగా గుర్తింపు పొందారు. అందుకే, ఇక్కడికి వచ్చే ఇతరదేశాల పర్వతారోహకులు ఎవరెస్ట్ ను అధిరోహించే క్రమంలో ఇక్కడి షెర్పాల సాయం తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో ఇది మూడో మరణంగా అధికారులు చెప్తున్నారు. -
శిఖరాలపై శిఖామణి
సాక్షి, అమరావతి: గట్టి సంకల్పం ఉంటే వయసు అడ్డంకి కాదు.. దానికి శరీర దారుఢ్యం తోడైతే.. రాజా శిఖామణి అవుతారు. ఆరు పదుల వయసు దాటినా పర్వతాలను అవలీలగా ఎక్కేస్తారు. 63 ఏళ్ల వయసున్న ఈ పెద్దాయన అందరికీ ఆశ్చర్యం కలిగించే పనులు చేస్తుంటారు. 58 ఏళ్ల వయసులో విజయనగరం నుంచి విశాఖపట్నం వరకూ 50 కిలోమీటర్లు అలవోకగా పరిగెత్తారు. తాజాగా 63 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి శభాష్ అనిపించుకున్నారు రాజా శిఖామణి. విశ్రాంత పోలీస్ అధికారి అయిన ఆయన ఎవరెస్ట్ ప్రయాణం విజయవంతంగా ముగించుకుని విజయవాడ వచ్చారు. యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న రాజా శిఖామణి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన జీవన ప్రస్థానం, ఎన్నో ఆపదలతో నిండిన పర్వతారోహణ విశేషాలు ఆయన మాటల్లోనే.. గుంటూరు నుంచి కాలిఫోర్నియా వరకు.. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమళ్లపాడు మా స్వగ్రామం. నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. ఒంగోలులో స్థిరపడ్డారు. అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ (ఏబీఎం) హైస్కూల్లో చదువుకున్నాను. డిగ్రీ వరకూ ఫుట్‌బాల్, ఆ తర్వాత అథ్లెటిక్స్ వైపు వెళ్లాను. తొలి ప్రయత్నంలోనే 1977లో ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించి యూనివర్సిటీ చాంపియన్‌గా నిలిచాను. తర్వాత ఎస్ఐగా ఎంపికయ్యాను. అనంతపురంలో పోలీస్ శిక్షణ పూర్తిచేసి హైదరాబాద్‌లో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్గా తొలిపోస్టింగ్ తీసుకున్నా. ఇంటెలిజెన్స్, సివిల్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేసి 2016లో విజయనగరం పోలీస్ శిక్షణ కేంద్రానికి ప్రిన్సిపాల్ అయ్యాను. తరువాత ఆరు నెలలు అనంతపురం పీటీసీలో ప్రత్యేకాధికారిగా సేవలందించాను. 5 వేల మంది ఎస్ఐలు, 150 మంది డీఎస్పీలు, 55 మంది ఐపీఎస్‌లకు శిక్షణనిచ్చాను. ఇండియన్ పోలీస్ మెడల్‌తో పాటు అనేక అవార్డులు లభించాయి. కాలిఫోర్నియాలోని రెక్లెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకం, రాష్ట్ర పోలీస్ చిహ్నంతో శిఖామణి మావోయిస్టులకు రెవెన్యూ అధికారినని చెప్పా స్టాండర్డ్ ట్రైనింగ్ కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండో శిక్షణ తీసుకోవడంతో అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి, హోం మంత్రి మైసూరారెడ్డిలకు భద్రతాధికారిగా పని చేశాను. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఎప్పుడు మన రాష్ట్రానికి వచ్చినా ఆయన రక్షణ బాధ్యత నాకే అప్పగించేవారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో సహా ఏడుగురు ఐఏఎస్‌లను దారగడ్డలో మావోయిస్టులు కిడ్నాప్ చేసినప్పుడు రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకుని వారితో చర్చలు జరిపాను. మూడు దేశాలు..మూడు పర్వతాలు పర్వాతారోహణం నా జీవితంలో భాగంగా మారిపోయింది. హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ నేతృత్వంలో నాతో కలిపి ఆరుగురు సభ్యుల బృందం గత నెల విజయవాడ నుంచి బయలుదేరి వివిధ మార్గాల ద్వారా లుక్లాకు చేరుకున్నాం. అక్కడి నుంచి అందరిలా హెలికాప్టర్లో వెళ్లకుండా 70 కిలోమీటర్లు అదనంగా నడిచి మొత్తం 6 వేల మీటర్ల ఎవరెస్ట్ పర్వతాన్ని (బేస్ క్యాంప్ వరకూ) ఏడు రోజుల్లో అధిరోహించాను. నా వయసున్న భారతీయులెవరూ పర్వతారోహణ చేయలేదు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన, ప్రమాదకరమైన టాంజానియా దేశంలోని కిలిమంజారోను ఎక్కినపుడు నా వయసు 62 ఏళ్లు. దీనికి ఏడాది ముందు యూరప్‌లోనే ఎత్తయిన రష్యాలోని మౌంట్ ఎల్బ్రోస్ పర్వతాన్ని అధిరోహించాను. దృఢ సంకల్పం వస్తుంది అత్యంత కష్టమైన పర్వతారోహణను అలవోకగా చేయడానికి కారణం చిన్నప్పటి నుంచీ శరీర దృఢత్వంపై పెట్టిన శ్రద్ధ, కఠోర శ్రమ, ఆహార అలవాట్లు. మానసికంగానూ బలంగా ఉండాలి. పర్వతారోహణలో ఎక్కడా సరైన ఆహారం దొరకదు. పైకెళుతున్నకొద్దీ ఒంట్లో శక్తి క్షీణిస్తుంది. మైనస్ 27 డిగ్రీల వద్ద అడుగు ముందుకు పడదు. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఏమాత్రం పట్టు జారినా లోయల్లో పడిపోతాం. శవం కూడా దొరకదు. చాలా మంది యువకులే మధ్యలో వెనక్కి వచ్చేస్తుంటారు. ముందుకెళ్లడమే తప్ప వెనక్కి వెళ్లాలన్న ఆలోచనే నాకు రాదు. పర్వతారోహణ వల్ల విశాల దృక్పథం పెరుగుతుంది. ఓర్పు, సహనం వంటి లక్షణాలు అలవడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో జీవితంలో ఏదైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. -
స్విస్ ఆల్ఫ్స్ సాహస యాత్రకు సైఅంటున్న ట్విన్ సిస్టర్స్..
స్విట్జర్లాండ్ టూరిజం బోర్డ్ ‘హండ్రెడ్ పర్సంట్ ఉమెన్ పీక్ ఛాలెంజ్’ కార్యక్రమాన్ని చేపట్టింది. సాహసిక బాటలో ‘ఉమెన్–వోన్లీ’ బృందాలను నడిపించడానికి ఈ సవాలుకు శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా 250 మంది మహిళలు ఈ ఛాలెంజ్‌లో భాగం అయ్యారు. ఈ బృందంలో కాలు తిరిగిన పర్వతారోహకులతో పాటు, ఇప్పుడిప్పుడే సాహసానికి సై అంటున్న ఉత్సాహవంతులూ ఉన్నారు. స్విస్ ఆల్ఫ్స్లో 48కి పైగా ఉన్న నాలుగువేల మీటర్ల ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడం వీరి లక్ష్యం. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి సౌదీ అరేబియా మహిళ రహ మెహ్రక్ కూడా ఈ బృందంలో ఉంది. ‘ఆల్ఫ్స్ పర్వతశ్రేణులు అంటే భౌగోళిక ప్రాంతాలు కాదు. నిజంగా మనం జీవించే ప్రదేశాలు’ అంటుంది మెహ్రక్. ఇక మనదేశం విషయానికి వస్తే తషి, నుంగ్షీ మాలిక్‌లు ఈ బృందంలో ఉన్నారు. వీరి పేరు కనిపించగానే వినిపించే మాట... ఎవరెస్ట్ ట్విన్స్! మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి ట్విన్ సిస్టర్స్‌గా వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘ఈ సంవత్సరం మాకు చిరకాలం గుర్తు ఉంటుంది. దీనికి కారణం హండ్రెడ్ పర్సంట్ ఉమెన్ పీక్ ఛాలెంజ్. ఎంతో ఉత్సాహంతో ఇందులో భాగం అయ్యాం’ అంటుంది తషి మాలిక్. ‘కన్న కల త్వరగా సాకారం అయితే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పడానికి మాటలు చాలవు. నిజానికి పర్వతారోహణ విషయంలో మా ప్రాధాన్యతల జాబితాలో స్విస్ ముందు వరసలో ఉంది. ఈ గ్లోబల్ ఛాలెంజ్‌లో భాగం కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం’ అంటుంది నుంగ్షీ మాలిక్. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)కు చెందిన మాలిక్ సిస్టర్స్ పద్ధెనిమిది సంవత్సరాల వయసులో సరదాగా పర్వతారోహణ మొదలుపెట్టారు. అయితే మౌంట్ రుదుగైరను తొలిసారి అధిరోహించిన తరువాత వారి దృక్పథంలో మార్పు వచ్చింది. ‘సరదా’ స్థానంలో ‘అంకితాభావం’ వచ్చి చేరింది. ‘ఈ ఛాలెంజ్‌లో భాగం కావడం వల్ల, మాలాంటి భావాలు ఉన్న ఎంతోమందితో పరిచయం ఏర్పడింది. కొత్త విషయాలు తెలుసుకున్నాం. కొత్త ఉత్సాహం వచ్చింది’ అంటుంది తషి. పర్వతారోహణ... అనగానే అదేదో పురుషులకు మాత్రమే సంబంధించిన అంశంగా చూసేవారు. ఈ ధోరణిని చెరిపేసి మహిళలు రికార్డ్‌లు సృష్టించారు. తమ సత్తా చాటారు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులలో పురుషులతో పోలిస్తే స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారు. ‘హండ్రెడ్ పర్సంట్ ఉమెన్ పీక్ ఛాలెంజ్’లాంటివి విరివిగా చేపడితే రానున్న పదిసంవత్సరాల కాలంలో పర్వతారోహణలో స్త్రీల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందనేది ఒక అంచనా. ఇప్పటివరకు మాలిక్ సిస్టర్స్ మూడు శిఖరాలను విజయవంతంగా అధిరోహించారు. వారి కోసం మరిన్ని విజయాలు ఎదురుచూస్తున్నాయి -
ఎవరెస్ట్‌పై ‘నవరత్నాల’ రెపరెపలు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై ‘నవరత్నాలు’ పతాకం రెపరెపలాడింది. పేదల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న నవరత్న పథకాల జెండాతో విశాఖపట్నంలోని పోతిన మల్లయ్యపాలెం కార్ షెడ్ ప్రాంతానికి చెందిన భూపతిరాజు అన్మిష్ (28) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. జూన్ 1వ తేదీన పర్వతారోహణలో విజయాన్ని నమోదు చేసుకుని ఇటీవల నగరానికి తిరిగి వచ్చాడు. విద్యార్థి దశలోనే మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చాటిన అన్మిష్ పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యంతో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సహకారంతో శిక్షణ పొంది తన కల నెరవేర్చుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న నవరత్నాలు కాన్సెప్ట్‌ను ప్రపంచ శిఖరంపై ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సైతం నెరవేర్చాడు. కిలిమంజారోపై.. అన్విష్ ఇప్పటికే కిలిమంజారో, అకంకాగోవా పర్వతాలను అధిరోహించాడు. ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతంపై ‘నో బ్యాగ్స్ డే’, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని కోరుతూ జెండాను ఎగుర వేశాడు. మరిన్ని పర్వతాలు అధిరోహిస్తా.. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. మొక్కలు నాటి భూమిని కాపాడుకుందాం. ఈ దిశగా ప్రజలంతా కృషి చేయాలనేది నా ఆకాంక్ష. భవిష్యత్‌లో ప్రపంచంలో ఎత్తైన మరిన్ని పర్వతాలను అధిరోహించేందుకు ప్రయత్నిస్తాను. – భూపతిరాజు అన్మిష్ -
ఎవరెస్ట్ ఎక్కిన విశాఖ యువకుడు
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ (28) ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రపంచ చాంపియన్ అయిన అన్మిష్ ఈ నెల 1న ఈ ఘనత సాధించాడు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన ప్రపంచ కిక్ బాక్సింగ్, కరాటే యూనియన్ చాంపియన్ షిప్స్‌లో 2018 గ్రీస్‌లోను, 2019 ఆ్రస్టియాలోను గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. 2017లో పర్వతారోహణ చేయాలని నిర్ణయించుకున్న అన్మిష్ ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా పొందారు. అనంతరం వింటర్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద –40 డిగ్రీలు ఉన్న సమయంలో లద్దాక్‌లో మంచు పర్వతాన్ని ఎక్కారు. 2020లో లాక్‌డౌన్‌కు ముందు ఆఫ్రికాలోని కిలిమంజారో, దక్షిణ అమెరికాలో అకాన్కాగువా పర్వతాలను అధిరోహించి.. అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ(గండికోట) సహకారంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన కల నెరవేర్చుకున్నాడు. చదవండి: వంద శాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో జోష్ -
25 సార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన నేపాలీ దేశస్థుడు..!
ఖాట్మాండు: మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించడం పర్వతారోహకుల చిరకాల స్వప్నం. ఎవరెస్ట్ శిఖరాన్ని కచ్చితంగా తమ జీవితంలో ఒక్కసారైనా అధిరోహించాలని ప్రతి పర్వతారోహకుడు కోరుకుంటాడు. కాగా నేపాల్‌కు చెందిన 52 ఏళ్ల పర్వతారోహకుడు కామి రీటా షెర్పా 25 సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి కొత్త రికార్డును సృష్టించాడు . 25 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గతంలో తన పేరు మీద ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. 2019లో కామి రిటా 24వ సారి అధిరోహించాడు. తొలిసారిగా 1994 మే నెలలో ఎవరెస్ట్‌ను శిఖరాన్ని చేరుకున్నాడు. ఖాట్మండు ఆధారిత సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ప్రకారం, కామి రీటా సాయంత్రం 6 గంటలకు మౌంట్ ఎవరస్ట్‌ను చేరుకున్నాడు. ప్రస్తుతం కామి రిటా తాడు తయారీ బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలైన కే2, అన్నపూర్ణను కూడా అధిరోహించాడు. చదవండి: గూగుల్ అసిస్టెంట్ పాడే కరోనా వ్యాక్సిన్ పాట విన్నారా...! -
భర్తకు చెప్పి ఎక్కడం మొదలుపెట్టాను
ఎవరికైనా ఒక్కసారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహిస్తే చాలు అనే కల ఉంటుంది. కానీ, 41 ఏళ్ల అన్షు జమ్సేన్పా మాత్రం ఒకే సీజన్లో రెండుసార్లు పర్వతారోహణ పూర్తి చేసిన తొలి మహిళగా వార్తల్లో నిలిచింది. ఆమె సాధించిన ఘనతకు మొన్న రిపబ్లిక్ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఈ పోటీ ప్రపంచంలో ‘వేగం’ అత్యవసరం అని నిరూపిస్తుంది అన్షు జమ్సేన్పా. ఆ వేగం వల్లే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. భర్త, అత్తమామ, పిల్లలు ఇంట్లో అన్ని బాధ్యతలనూ ఓ చేత్తో మోస్తూనే తన కలల జెండాను ఎవరెస్ట్ శిఖరం అంచున రెపరెపలాడించింది. ఐదు సార్లు అధిరోహణ.. జీవితంలో ఒక్కసారయినా ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని కలలు కనేవారు ప్రపంచం లో చాలా మంది ఉన్నారు. కానీ, అందరి కలలు నెరవేరవు. వారి శ్రమ, పట్టుదల కూడా అంతే వెనకంజలో ఉంటాయి. కానీ, అన్షు జమ్సేన్పా ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక్కసారి కాదు ఐదుసార్లు అధిరోహించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని దిరాంగ్ ఆమె జన్మస్థలం. ఇద్దరు పిల్లల తల్లి అయిన అన్షు 2009లో పర్వతారోహణ ప్రారంభించింది. తాను సాధించిన విజయం గురించి అన్షు మాట్లాడుతూ– ‘నేను అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో రాణించేదాన్ని. రాక్ క్లైంబింగ్ చేసేదాన్ని. ఆ సమయంలో అరుణాచల్ పర్వతారోహణ, అడ్వెంచర్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్లు నా ప్రతిభ గుర్తించి నా భర్తకు చెప్పి, ఒప్పించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించమని నన్ను ప్రోత్సహించారు. ఒకసారి నేను ఎవరెస్ట్ ఎక్కడం మొదలుపెట్టాను, మరలా వెనక్కి తిరిగి చూడలేదు’ అని వివరించింది అన్షు. అధిరోహణ కష్టమే.. అయినా ఇష్టం.. శిక్షణా సమయంలో పర్వతాలను అధిరోహించడం తనకు చాలా ఇష్టమని గ్రహించిన అన్షు ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి జయించిన రోజు ఇప్పటికీ గుర్తుంది అని సంతోషం వ్యక్తం చేస్తుంది. అన్షుకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె ఈ విషయం గురించి మరింతగా మాట్లాడుతూ ‘నేను దేవుని దగ్గరికి చేరుకున్నట్టే అనిపించింది. నా కలలో నేను చూసిన సన్నివేశం నా కళ్ల ముందు నిలిచింది. ఆ సమయంలో నేను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు’ అని సంబరంగా చెబుతుంది అన్షు. ఆమె తండ్రి ఇండోటిబెట్ సరిహద్దులో ఒక పోలీసు అధికారి, తల్లి నర్సు. ఎవరెస్టును జయించటానికి అన్షు రన్నింగ్, జిమ్, యోగా, ఏరోబిక్స్ వంటివి నేర్చుకుంది. మొదట చిన్న చిన్న పర్వతాలను అధిరోహించడం ద్వారా తన లక్ష్యాన్ని చేరుకుంది. -
ఎవరెస్ట్‌పై సూపర్ డూపర్ ‘చెత్త' ఐడియా!
మౌంట్ ఎవరెస్ట్‌పై టన్నుల కొద్దీ చెత్త పేరుకు పోయింది. ఈ నేపథ్యంలో ‘ఎవరెస్ట్‌ను డంపింగ్ సైట్‌గా మార్చవద్దు’ ‘ప్రసిద్ధమైన పర్వతాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో నేపాల్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. దీనిలో భాగంగా ఎవరెస్ట్‌పై పేరుకుపోయిన చెత్తను సేకరించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. చిరిగిన టెంట్లు, ఖాళీ వాటర్ బాటిల్స్, విరిగిపోయిన నిచ్చెనలు, తాళ్లు...ఇలా రకరకాల చెత్తను సేకరించారు. వీటిని విదేశీకళాకారులు, స్వదేశీ కళాకారులు కళాత్మక వస్తువులుగా తయారుచేస్తారు. పర్యావరణ స్పృహను కలిగించడానికి వీటితో ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. దీనితో పాటు చెత్తతో కళాత్మక వస్తువులను తయారుచేయడంలో స్థానికులకు శిక్షణ ఇస్తారు. ‘చెత్తతో అపురూపమైన కళారూపాలు తయారుచేయడమే కాదు ఉపాధి కూడా కలిగించాలనేది మా ప్రయత్నం’ అంటున్నాడు ప్రాజెక్ట్ డైరెక్టర్ టామీ గస్టఫ్సాన్. -
హైదరాబాద్ యువకుడి ప్రపంచ రికార్డు!
సాక్షి, హైదరాబాద్: దేశంకాని దేశాలకు అతడు సందేశాలను తీసుకెళ్తున్నాడు. వాటిని పర్వతమంత ఎత్తున సమున్నతంగా నిలుపుతున్నాడు. ఈ ఫీట్ సాధించడానికి పర్వతారోహణపర్వం కొనసాగిస్తున్నాడు తుకారాం. అత్యంత పిన్నవయసులోనే అత్యున్నత రికార్డులు సృష్టిస్తున్నాడు. 7 ఖండాల్లోని 7 ఎత్తయిన పర్వతాల్లో నాలుగింటిని 10 నెలల్లో అధిరోహించి వరల్డ్ రికార్డు స్థాపించాడు. మరిన్ని శిఖర సమాన విజయాలను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ నగర యువకుడు. దక్షిణాది నుంచి మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించినవారిలో పిన్నవయస్కుడు తుకారాం. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కళాశాలలో పొలిటికల్ సైన్స్‌లో పోస్టుగాడ్యుయేట్ చేస్తున్న తుకారాంది వ్యవసాయ కుటుంబం. తాజాగా కేంద్రమంత్రిని కలసి అభినందనలు అందుకున్న తుకారాం ‘సాక్షి’తో తన మనోభావాలు పంచుకున్నాడిలా... ఆయన మాటల్లోనే.. ధైర్యే సాహసే విజయం... రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కెళ్లపల్లి తండా స్వస్థలం. ట్రైబల్ వెల్ఫే ర్ రెసిడెన్షియల్ స్కూల్లో 10 వతరగతి వరకూ చదువుకున్నా. చిన్నప్పటి నుంచి సాహసోపేతమైన ఆటలంటే నాకు ఇష్టం. ఏదో సాధించాలి, ఏదో చేయాలనే కోరిక ఉండేది. కష్టం గురించి ఆలోచించేవాడిని కాదు. ఒంటికాలు మీద కబడ్డీ ఆడే లంగ్డీ ఆటలో జాతీయస్థాయి ప్లేయర్‌ని. కర్రతో జిమ్నాస్టిక్స్ మల్లకంబ్ కూడా జాతీయ స్థాయిలో ఆడాను. ఇవన్నీ స్కూల్ స్థాయిలోనే చేశా. కాలేజీలో చదువుతుండగా ఎన్సీసీ శిక్షణలో భాగంగా ఉత్తర కాశీలో మౌంట్ ఇంజనీరింగ్ చేస్తూ 3 బంగారు పతకాలు సాధించాను. అప్పటి నుంచి పర్వతారోహణ మీదే దృష్టి పెట్టాను. సామాజిక ప్రయోజనం ఉండాలని... ప్రతి సాహసం నాకు లక్ష్యసిద్ధిగా మిగిలిపోకూడదని, దానికి సామాజిక ప్రయోజనం కూడా ఉండాలనే ఆలోచనతో విభిన్న సందేశాలను, సందర్భాలను జో డిస్తూ పర్వతారోహణను మరింత అర్థవంతంగా మార్చాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ హిమాచల్‌ప్రదేశ్‌లోని నర్బు అనే పర్వతం అధిరోహించాక, తెలంగాణ రాష్ట్ర పతాకాన్ని అక్కడ ఎగరవేశాను. బతుకమ్మలను ప్రతిష్టించి ఇక్కడి సంప్రదాయాలను తెలియజెప్పాను. రోజువారీగా ఖాదీ వాడాలని పిలిపిస్తూ గంగోత్రిలోని మౌంట్ రుడుగారియా పర్వతారోహణను పూర్తి చేశాను. దేశభక్తిని చాటి చెబుతూ లడ్డాఖ్‌లోని మౌంట్ స్టాకన్గిరిపైకి 19 అడుగుల జాతీయ పతాకాన్ని తీసుకెళ్లి ఎగరవేశాను. పంచభూతాలను కాపాడుకోవాలంటూ సందేశమిస్తూ అత్యంత క్లిష్టమైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాను. మరికొన్ని సందేశాలివీ... ► ‘హెల్మెట్ మన కోసం కాదు.. మన కుటుంబం కోసం’అనే సందేశంతో ఆఫ్రికాలోని కిలిమంజారో ఎక్కాను. ► డ్రగ్స్ నిషేధించాలంటూ రష్యాలోని ఎల్బ్రస్ పర్వతారోహణ పూర్తి చేశాను. ► దేశ సర్వసత్తాక సార్వభౌమత్వానికి సూచికగా జనవరి 26న సౌత్ అమెరికాలోని మౌంట్ అకాంజాగువా అధిరోహించాను. ► ఆస్ట్రేలియా దేశంలో కార్చిచ్చు కారణంగా ఏర్పడుతున్న బుష్ ఫైర్స్ తదనంతర సమస్యలు, బాధితుల కోసం ఆస్ట్రేలియాలోని కొజియాస్కో పర్వతాన్ని ఎక్కాను. దీనిని ఆస్ట్రేలియా మంత్రి అభినందించారు. ప్రోత్సాహకాలూ.. పురస్కారాలూ... కేవలం 10 నెలల్లో 4 విభిన్న ఖండాలలో శిఖరాలను అధిరోహించిన పిన్న వయస్కుడిగా ప్రపంచరికార్డు స్థాపించాను. రాష్ట్రపతి చేతుల మీదుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణలో బెస్ట్ స్పోర్ట్స్‌మెన్‌షిప్ అవార్డు 2 సార్లు అందుకున్నా. జమ్మూ, కశ్మీర్ ప్రభుత్వం నుంచి తొలి దక్షిణాది బెస్ట్ ఇన్ టెక్నిక్ అవార్డ్ అందుకున్నా. పర్వతారోహణ అనేది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసేది మాత్రమే కాదు అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది కూడా. నాకు పురస్కారాలు మాత్రమే కాకుండా ఆర్థికంగా పలువురు స్పాన్సరర్లు లభించారు. ప్రస్తుతం చినజీయర్స్వామిసహా మరికొందరు నన్ను స్పాన్సర్ చేస్తున్నారు. ఇక నార్త్ అమెరికాలోని మౌంట్ డెనాలీ, అంటార్కిటికాలోని మౌంట్ విమ్సన్లు అధిరోహించాలనే లక్ష్యాలు మిగిలాయి. పర్వతారోహణవైపు యువతను బాగా ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. అందుకు ప్రభుత్వ సహకారం కూడా కావాలి. -
సాహసమే శ్వాసగా సాగిపోతున్నారు
సాక్షి, గుంటూరు: దేనినైనా సాధించగలమనే ఆత్మ విశ్వాసం.. సాహస కృత్యాలపై మక్కువ.. కలగలిపిన వారి సంకల్ప బలం ముందు ఎత్తయిన పర్వతాలు చిన్నబోయాయి. జిల్లాకు చెందిన కొందరు యువతీ, యువకులు అవరోధాలను అధిగమిస్తూ.. శిఖరాలను ముద్దాడుతూ రికార్డులు కైవసం చేసుకుని తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఏడు పర్వతాలు అధిరోహించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు గుంటూరుకు చెందిన ఆశ దళవాయి. గుంటూరులో నివాసం ఆశకు చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి. నగరంలోని టీజేపీఎస్ కళశాలలో 2007లో బీఎస్సీ పూర్తి చేశారు. డిగ్రీ చదివే రోజుల్లో ఎన్సీసీలో హిల్ మౌంటెనీరింగ్ కోర్సుకు సెలక్ట్ అయి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (పర్వతారోహణ)లో శిక్షణ తీసుకున్నారు. డిగ్రీ అనంతరం డార్జిలింగ్‌లోని హిమాలయా మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో బేసిక్ అడ్వెంచర్స్, వివిధ రకాల పర్వతారోహణ కోర్సుల్లో తర్ఫీదు పొందారు. అక్కడి నుంచి వచ్చి తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో ఔట్రైవల్ అడ్వెంచర్స్ అనే సంస్థను ప్రారంభించి వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు అడ్వెంఛర్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా 5 వేల మందికి పర్వతారోహణపై అవగాహన కల్పించారు. పర్వతారోహణ ఇలా.... 2019 జులై 16 నుంచి 20 వరకూ ఐదు రోజులు ప్రయాణం చేసి ఆఫ్రికా ఖండంలోని 5,895 మీటర్ల ఎత్తయిన కిలిమంజారో అధిరోహించారు. అనంతరం అదే సంవత్సరంలో యూరప్‌లోని 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్‌బ్రూ శిఖరాన్ని, అర్జెంటినాలోని 6,962 మీటర్ల ఎత్తయిన అకోంకగువా పర్వతారోహణ చేశారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహణకు సిద్ధమైన తరుణంలో గత ఏడాది కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ ఆంక్షలు ఉండటంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రస్తుతం ఎవరెస్ట్ అధిరోహణకు సన్నద్ధం అవుతున్నానని ఈ ఏడాది అధిరోహణ పూర్తి చేస్తానని ఆమె చెబుతున్నారు. కిలిమంజారో శిఖరంపై సాయికిరణ్ (ఫైల్) యువకిరణం చిలకలూరిపేట పట్టణం ఎంవీఆర్ కాలనీకి చెందిన సాయికిరణ్‌కు పర్వతారోహణంపై మక్కువ. ఈ నేపథ్యంలో పాఠశాల దశలోనే అడ్వెంచర్ సంస్థలను సంప్రదించి పర్వతారోహణకు ప్రయత్నించాడు. అయితే వయసు సరిపోదని అందరూ చెప్పడంతో, 2019లో ఇంటర్మీడియట్ చదివేప్పుడు 18 ఏళ్లు నిండిన వెంటనే తెలంగాణ రాష్ట్రం భువనగిరి గుట్టలోని రాక్ క్లైంబింగ్లో జనవరి మాసంలో చేరి శిక్షణ పొందాడు. అనంతరం ఫిబ్రవరి నెలలో దాతల సహకారం లభించడంతో కిలిమాంజారో శిఖరాన్ని అధిరోహించాడు. అదే ఏడాది ఆగస్టు నెలలో సిక్కింలోని వెస్ట్‌టెంజింగ్‌కాన్‌లో శిక్షణ పొంది ఏ గ్రేడ్ సాధించాడు. అనంతరం ఉత్తర భారతదేశంలోని లీలాధన్‌లో 6,158 మీటర్ల ఎత్తయిన స్టోక్ కాంగ్రీ పర్వతాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరితో కలిసి ఎక్కి 365 అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తుగల జాతీయ పతాకాన్ని పర్వతంపై రెపరెపలాడించారు. ఇందుకు గాను హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సాయి కిరణ్ 2019 డిసెంబర్లో ప్రసంశ పత్రం అందుకున్నాడు. ప్రస్తుతం ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు సహకరించక దాతల సహకారం కోసం ఎదురుచూస్తున్నాడు. ఘనతకు ప్రభుత్వ గుర్తింపు... వెల్దుర్తి మండలం చిన్నపర్లపాటి తండాకు చెందిన వడితె సంధ్యబాయి 2017 మే నెలలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. 2017లో నాగార్జున సాగర్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో సంధ్య ఇంటర్ చదువుతున్న సమయంలో ఎవరెస్ట్ అధిరోహణకు దరఖాస్తులు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 170 మంది వరకూ దరఖాస్తు చేసుకోగా విజయవాడలో జరిగిన ప్రైమరీ సెలక్షన్స్‌లో 30 మంది ఎంపికయ్యారు. అనంతరం వీరిని జమ్మూ కశ్మీర్‌కు తరలించి అక్కడ ఫైనల్ సెలక్షన్స్ ముగిసే సమయానికి 13 మంది మిగిలారు. 13 మందిలో అబ్బాయిలు 11 మంది కాగా ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు సంధ్య, మరో అమ్మాయి పశ్చిమ గోదావరి వాస్తవ్యురాలు. ప్రత్యేక శిక్షణ అనంతరం దిగ్విజయంగా ఎవరెస్ట్ పర్వతారోహణ సంధ్య పూర్తి చేసింది. ఈమె సాధించిన ఘనతకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది. రూ.10 లక్షల రివార్డును అందించడంతో పాటు, ప్రస్తుతం ఆమె చదువుకు అయ్యే ఖర్చులను సర్కార్ భరిస్తోంది. -
ఎవరెస్ట్ ఎత్తు పెరిగింది, ఎంతంటే..
ఖాట్మండ్ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎత్తును నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. తాజా లెక్కల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 8,848.86 మీటర్లు ఉందని తెలిపింది. 2015 భూకంపం తర్వాత ఎత్తు మారి ఉంటుందన్న సందేహాల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం 2017లో ఎవరెస్టు ఎత్తును కొలిచే ప్రక్రియ ప్రారంభించింది. దీని కోసం నేపాల్ సర్కారు చైనా సాయం తీసుకుంది. (చదవండి : చైనా సంచలనం; సూర్యుడి ప్రతిసృష్టి!) చైనా సహకారంతో నిర్మించిన సర్వేల ద్వారా ఎవరెస్ట్ ఎత్తులో ఎలాంటి తరుగుదల చోటుచేసుకోలేదని వెల్లడైంది. ఎవరెస్ట్ శిఖరం తాజా ఎత్తు 8,848.86 మీటర్లు అని నేపాల్ ప్రభుత్వం తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ పర్వతం ఎత్తును భారత ప్రభుత్వం 1954లో కొలిచినపుడు 8,848 మీటర్లు అని నిర్థరణ అయింది. ప్రపంచవ్యాప్తంగా దీనినే విస్తృతంగా ఆమోదిస్తున్నారు. తాజాగా నేపాల్ సర్వేలో ఎవరెస్ట్ ఎత్తు 0.86 మీటర్లు పెరిగిందని, ప్రస్తుతం దాని ఎత్తు 8,848.86 మీటర్లకు చేరిందని ప్రకటించాయి. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్, చైనా మంత్రి వాంగ్ యి వర్చువల్ కార్యక్రమంలో ఈ వివరాలను ప్రకటించారు. -
ఎవరెస్ట్ ఎత్తుపై చైనా అభ్యంతరం
బీజింగ్: ప్రంపచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ హైట్‌పై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ ఎత్తును ఎక్కువ చెప్తుందని చైనా ఆరోపించింది. ఈ క్రమంలో పర్వతం హైట్‌ను ఖచ్చితంగా కొలవడం కోసం చైనా ఒక సర్వే బృందాన్ని బుధవారం ఎవరెస్ట్ మీదకు పంపింది. ఆరు దశలుగా పర్వతం హైట్‌ను కొలిచిన చైనా బృందం.. నేపాల్ ప్రభుత్వం చెబుతున్న దాని కంటే పర్వతం ఎత్తు 4 మీటర్లు తక్కువ ఉందని తేల్చింది. ప్రస్తుతం ఎవరెస్ట్ హైట్ 8844. 43 మీటర్లు అని చైనా సర్వే బృందం తెలిపింది. ఇప్పటి వరకు నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ ఎత్తును 8,848 మీటర్లుగా చెప్తున్న సంగతి తెలిసిందే. టిబెటన్ భాషలో ఎవరెస్ట్ పర్వతాన్ని చోమో లుంగ్మా పర్వతం అంటారు. ‘ఈ పర్వతం మీద సంభవించే మార్పులు ప్రపంచ భూగర్భ శాస్త్రం, జీవావరణ శాస్త్రం అధ్యయనాలకు కీలకమైనవి. ఇది ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది’ అని చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ఇంజనీర్ చెన్ గ్యాంగ్ అన్నారు. చొమోలుంగ్మా పర్వతం ఎత్తును ఖచ్చితంగా కొలవడం వల్ల హిమాలయాలు, కింగ్హై-టిబెట్ పీఠభూమిలో సంభవించే మార్పులను అధ్యయనం చేయడానికి సహాయపడుతుంది అని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాతావరణ భౌతిక శాస్త్రవేత్త గావో డెంగి చెప్పారు.(మ్యాపుల వివాదం.. నేపాల్ ప్రధానికి షరతులు!) అంతేకాక చైనా టెక్ సంస్థ హువావే, చైనా మొబైల్‌తో కలిసి ఎవరెస్ట్ శిఖరంపై రెండు 5 జీ స్టేషన్లను నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. ఇదే గనక సాధ్యమైతే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన 5 జీ బేస్ స్టేషన్లుగా ఇవి నిలుస్తాయని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఈ సందర్భంగా హువావే ప్రాజెక్ట్ మేనేజర్ జాంగ్ బో మాటట్లాడుతూ.. ‘ఎవరెస్ట్‌పై 6,500 మీటర్ల ఎత్తు.. అత్యంత ఎత్తైన ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడే హువావే 5 జీ స్టేషన్‌ను నిర్మించాలని భావిస్తుంది. అయితే సిగ్నల్ 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరం వరకు విస్తరించగలదా, లేదా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నం సఫలం అయయ్యేందుకు మేం కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. -
ఎవరెస్ట్ పర్వతంపైనా 5జీ సిగ్నల్
బీజింగ్: ప్రపంచంలోకెల్లా ఎత్తైన హిమాలయ పర్వతాలపై 5జీ సిగ్నల్ లభించనుంది. టిబెట్ చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వతం వైపు ఈ సిగ్నల్ అందుబాటులో ఉంటుందని చైనా తెలిపింది. ప్రస్తుతం 5,800 మీటర్ల వరకు బేస్ క్యాంప్ లు ఉన్నాయి. 6,500 మీటర్ల వద్ద ఇటీవల నిర్మించిన బేస్ స్టేషన్లో పనులు ప్రారంభం కావడంతో శిఖరంపై వరకు 5జీ అందుబాటులోకి వచ్చింది. ఎవరెస్ట్‌పై 5జీ స్టేషన్లను నిర్మించడం చాలా శ్రమతో కూడుకున్నదని, వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు 10 మిలియన్ యువాన్ల(1.42 మిలియన్ డాలర్లు)కు చేరుకుంటుందని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు చెప్పినట్టు గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులకు సమాచారం అందించడానికి 5జీ స్టేషన్లు సహాయపడతాయి. కార్మికులను, పరిశోధకులను రక్షించడానికి 5జీ నెట్వర్క్ దోహపడుతుందని నిపుణులు అంటున్నారు. 5జీ అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలలో ఐదవ తరంగా పేర్కొంటున్నారు. వేగవంతమై డేటాతో పాటు ఎక్కువ బ్యాండ్‌విడ్త్, నెట్వర్క్ సామర్థ్యాన్ని 5జీ కలిగివుంటుంది. ఎక్కువ పరికరాలు కనెక్ట్ చేయడానికి, అత్యంత నాణ్యతతో వర్చువల్ సమావేశాలు నిర్వహించుకోవడానికి, టెలిమెడిసిన్‌కు 5జీ మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. (అమెరికాలో అమెజాన్ బాస్‌కు చిక్కులు) -
సెల్ఫీ విత్ 'సక్సెస్'
సక్సెస్... అంటే ఏంటి? ప్రారంభించిన పనిని విజయవంతంగా పూర్తి చేయటం అంటారెవరైనా. మరి వ్యాపారాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోగలిగినంత విజయం చవిచూసిన ‘కాఫీ సిద్ధార్థ’ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు? నిజానికి సక్సెస్‌ని నిర్వచించటం కష్టం... మారుమూల పల్లె మొదలు అగ్రరాజ్యం అమెరికా వరకు... సక్సెస్ కోసం ఒకటే ఉరుకులు, పరుగులు. ఆటలో గెలుపు, అంకెలు సాధించటంతో సరి. కానీ జీవితంలో గెలుపు సంగతేంటి? ప్రపంచ మానవ సమూహం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఈ గెలుపు పరుగే కారణం. ఒక వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి మరింతగా విస్తరించడం గెలుపే అయితే, ఆ తర్వాత పతనం కావటం ఓటమిగా భావించాలా.. అసలు గెలుపు సూత్రమేంటి, గెలుపు పరుగు ముగిసేదెక్కడ, సాధించిన ఏ విజయాన్ని ‘సక్సెస్’గా భావించవచ్చు? డబ్బు సంపాదించటమే విజయానికి నిదర్శనమైతే, పూరి గుడిసెలో ఉంటూ సంతోషంగా రోజులు వెళ్లదీసే వ్యక్తి ‘సక్సెస్’ చెందినట్టు కాదా.. ప్రశ్నల పరంపర.. సవాలక్ష సందేహాలకు సమాధానాలు విడమరిచి చెప్పేదెవరు? ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ కొద్దిరోజుల క్రితం అమెజాన్ ఆన్లైన్ అంగట్లో హల్చల్ చేసిన పుస్తకం. 166 పేజీలతో ఉన్న ఈ పుస్తకం పేరే కాస్త గమ్మత్తుగా అనిపిస్తోంది కదూ. సెల్ఫీకి లోకం ఫిదా అయిన తరుణంలో విజయమే తన సెల్ఫీని మన ముంగిటకు తెచ్చినట్టు అనిపించేలా విడుదలైన ఆ పుస్తకం తక్కువ సమయంలో ఎక్కువ అమ్మకాలతో ఆకట్టుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం రాసిన ఆ పుస్తకం విడుదలైన 35 రోజుల్లో దాదాపు 20 వేల ప్రతులు అమ్ముడైనట్టు పబ్లిషర్స్ చెప్తున్నారు. కొత్త పుస్తకాల విభాగంలో ఇంత తక్కువ సమయంలో అధిక రేటింగ్ పొందిన తొలి పుస్తకం ఇదేనంటూ అమెజాన్ గుర్తించిందనేది వారి మాట. మరి ఇంత తక్కువ పేజీలున్న ఈ పుస్తకం అంత క్రేజ్ సంపాదించు కోవటానికి కారణం కూడా అంతుచిక్కని ‘విజయ రహస్యమే’. ప్రపంచవ్యాప్తంగా వారివారి రంగాల్లో విజయం సాధించిన వారు అనుసరించిన పద్ధతుల సారాంశాన్ని ఇందులో కళ్లకు కట్టినట్టు వివరించారు. దీంతో పాఠకులు కూడా విజయం అంటే ఇలా వ్యవహరించాలా అన్న తరహాలో ఆలోచించుకునేలా చేసిందా పుస్తకం. విజయం అంటే డబ్బు సంపాదనే కాదు, విజయాన్ని ఆనందించే తత్వం, తోటి వారిని సంతోషపెట్టేలా చేయటం అన్న విషయాన్నీ ఆ విజేతల జీవితాలను చూసి తెలుసుకునేలా చేసింది. గెలుపుపై అవగాహన, గెలుపు ప్రయాణం, గెలుపు అర్థం, గెలుపు తెచ్చే అనర్థ్ధం, గెలుపు పరమార్థం... ఇలా 5 అంకాలుగా ఈ పుస్తకంతో సారాంశం సాగిన తీరు ఆకట్టుకుంది. పుస్తకం అనతికాలంలోనే పాఠకుల ఆదరణ దక్కించుకోవటంతో బుర్రా మరికొన్ని పుస్తకాలను వెలువ రించేందుకు సిద్ధపడ్డారు. సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, హిందీ భాషల్లోకి అనువదించబోతున్నారు. అది విశ్వజనీనమైన సబ్జెక్టు కావటంతో కొరియా, జపాన్, చైనా, పోర్చుగల్, పర్షియా, ఇండోనేషియా తదితర దేశాల్లో కూడా వారి భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఓ వైపు ఈ తర్జుమా తంతు జరుగుతుండగానే, ఈ సక్సెస్‌ను సమాజంతో జోడించేలా మరికొన్ని పుస్తకాలను వెలువరించే కసరత్తు మొదలుపెట్టారు బుర్రా వెంకటేశం. 3 నెలల్లో.. 2వ పుస్తకం.. విజయంపై ఓ అవగాహన తెచ్చేలా చేసిన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ తర్వాత ఉత్తేజం కలిగించే విజయగాథలతో కూడిన రెండో పుస్తకాన్ని తేనున్నట్టు బుర్రా వెంకటేశం చెప్పారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఆరాధ్యులుగా మారిన వారి జీవిత గాథల సారాంశాలతో కూడిన పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ‘నో వేర్ నవ్ అండ్ హియర్’శీర్షికతో ఉండే ఈ పుస్తకం మరో మూడు నెలల్లో పాఠకుల ముందుకు తేనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రతికూలతలను కూడా అనుకూలంగా మలుచుకుని విజయాన్ని ఎలా సాధించారన్న విషయాన్ని ఆ పుస్తకం వివరిస్తుందంటున్నారు ఆయన. ఆ తర్వాత.. అసలు జీవితంలో సక్సెస్ ఎంత అవసరం అన్న విషయాన్ని చర్చించే ‘హౌమచ్ సక్సెస్ యూ నీడ్ ఇన్ లైఫ్’పేరుతో సిద్ధాంత గ్రం«థాన్ని వెలువరించనున్నట్టు వెల్లడించారు. అనూహ్య విజయాలు సాధించిన తక్కువ మంది.. ఎక్కువ మందిని ప్రభావితం చేయటం, భారీ విజయాలు సాధించి ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన వారు, అనంతర వ్యవహారంలో ఎలాంటి ప్రభావానికి లోనయ్యారు... లాంటి విషయాలు ఇందులో వివరించనున్నట్టు పేర్కొన్నారు. ఇక ‘థాంక్యూ ఎనిమీ’ పేరుతో మరో పుస్తకం వస్తుందని, మానవ పరిణామ వికాస క్రమంలో విజయాల పరంపరను ఇందులో వివరించనున్నట్టు వెల్లడించారు. ఇది 30 వేల ఏళ్ల నుంచి ఇప్పటి వరకు మనిషి పట్టుదలగా ఎలాంటి విజయాలు సాధించాడో వివరిస్తుందని పేర్కొన్నారు. ఆ విజయాలకు పురిగొల్పిన సవాళ్లను, అధిగమించిన తీరు ఇది వివరిస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత సంతోషాన్ని నిర్వచించే మరో పుస్తకం ‘షీ’ పేరుతో వస్తుందన్నారు. స్టోరీ ఆఫ్ హ్యాపీనెస్ బై ఎవరెస్ట్ పేరుతో ఉండే పుస్తకం ఆ ఆంగ్ల పదాల తొలి అక్షరాల పొడి రూపమే షీ (ఎస్హెచ్ఈ)గా ఉంటుందన్నారు. ఎవరెస్టే వివరించినట్టుగా... ఎత్తయిన పర్వతంగా ఉన్న ఎవరెస్టు ప్రపంచాన్ని గంభీరంగా గమనిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. అది అలా విశ్వాన్ని గమనిస్తూ విజయాల గాథను వివరిస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో కొత్త పుస్తకాలు వస్తాయన్నారు. తొలి పుస్తకంలో విజయమే పాఠకులతో మాట్లాడుతున్నట్టు ఉండగా, తదుపరి పుస్తకాల్లో ఎవరెస్టు పర్వతం మాట్లాడుతున్నట్టు ఉంటుందని పేర్కొన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా పోటీ తత్వం నెలకొని విజయం కోసం పరుగులు పెట్టే క్రమంలో మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయి. విజయం వైపు పయనంలో సంతోషమే పరమార్థం కావాలి. విజయ కాంక్షలో సంతృప్తి ఎలా అవసరం, దాన్ని స్థిరీకరించుకునే తీరు, ఆ విజయం తనకే కాకుండా, తోటివారికి కూడా ఎలా ఆనందాన్ని పంచాలి అన్న విషయంలో ప్రజలకు కొంత అవగాహన అవసరం. ఆ ఆలోచనలోంచే పుస్తక రచన ప్రారంభించా. ఈ పుస్తకాల అమ్మకంతో వచ్చే లాభాలను నిస్సహాయ వృద్ధుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తా. విజయం తెచ్చే అనర్థాలు కోణం నా తొలి పుస్తకంలో కొత్త విషయం. ఇప్పటివరకు ఎవరూ ఆ కోణంలో రచించలేదు. ఇక రూ.50 వేల కోట్లు ఆర్జించి పెట్టిన హ్యారీపోటర్ పుస్తకాలు కూడా బ్రెయిలీ లిపిలో విడుదల కాలేదు. కానీ నా తొలిపుస్తకాన్ని అంధులు కూడా చదివేలా బ్రెయిలీలో అందుబాటులోకి తెచ్చా’అని వెంకటేశం పేర్కొన్నారు. – సాక్షి, హైదరాబాద్ -
ఊరు దాటి బయటకు వెళ్లగలనా అనుకున్నా
సాక్షి, విశాఖపట్నం : ‘నాకు చిన్నతనంలో మాట్లాడడమే భయంగా ఉండేది. ఈ రోజు గొప్ప వ్యక్తుల మధ్య కూర్చున్నా. నా చిన్నప్పుడు మా ఊరు దాటి వెళ్లగలనా అనుకునేదాన్ని. కానీ దృఢ సంకల్పంతో అడుగులు వేశా. అనుకున్నది సాధించా. నేడు విమానాలపై ప్రయాణించే స్థాయికి ఎదిగా. చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పారు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన చిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించిన మలావత్ పూర్ణ. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలసి శనివారం ఆమె నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా వుడా చిల్డ్రన్ థియేటర్లో శ్రీప్రకాష్ విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఆమెకు ఘన సత్కారం జరిగింది. మధ్యాహ్నం చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన నాటి జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. నాకు ఎంతో మంది సలహాలు, శిక్షణ ఇచ్చారు అని తన గతాన్ని పిల్లలకు వివరించారు. కష్టపడి పనిచేస్తే లక్ష్యం చేరుకోగలమని, విద్యార్థి దశ నుంచే మంచి లక్ష్యాన్ని ఏర్పచుకోవాలని సూచించారు. విద్యార్థినులు బాల్య వివాహాలకు దూరంగా ఉండాలని చెప్పారు. చిటపట చినుకులు పడుతున్నా గాని విద్యార్థులంతా పూర్ణ సందేశాన్ని శ్రద్ధగా విన్నారు. చంద్రపాలెం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ పోలీసు అధికారి టీఎస్ఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నవోదయ విద్యాలయాల జాయింట్ కమిషనర్ ఏఎన్ రామచంద్ర, శ్రీ ప్రకాశ్ విద్యా సంస్థల చైర్మన్ చిట్టూరి వాసు ప్రకాష్, ప్రిజమ్ బుక్స్ పబ్లిషర్స్ రవీంద్ర, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి రామయ్య, హెచ్ఎంలు ఎం.రాజబాబు, జయప్రద ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వుడా చిల్ట్రన్ థియేటర్లో జరిగిన కార్యక్రమంలో శ్రీప్రకాష్ విద్యానికేతన్ డైరెక్టర్ వాసు ప్రకాష్ మాట్లాడుతూ 13 ఏళ్ల వయసులో పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకోవడం..సాధించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. పిల్లలంతా మలావత్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఏదైనా సాధించాలనే తపనతో ముందుకు సాగాలని చెప్పారు. అవరోధాలు దాటితేనే విజయం : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడకు వెతుక్కుంటూ వెళ్లి వాటిని అందిపుచ్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. చంద్రంపాలెం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఈ పాఠశాల కార్పొరేట్ బడులకంటే కంటే బాగుందని..అన్ని సదుపాయాలతో ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు అదృష్టవంతులని పేర్కొన్నారు. పిల్లలంతా మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుని చదవాలని చెప్పారు. -
ఎవరెస్ట్.. ఇక అందరూ ఎక్కలేరు!
కాఠ్మండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇకపై ఎవరు పడితే వారు అధిరోహించే అవకాశం లేదు. ఎవరెస్ట్ శిఖరంపై పర్వతారోహకుల మరణాలు, ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో ఎవరెస్ట్ అధిరోహణపై కొన్ని నిబంధనలు విధించాలని నేపాల్ పర్యాటక శాఖ ఆలోచిస్తుంది. అధిరోహకులకు కనీస అర్హతలు ఉండేలా చూడనుంది. ఎక్కువ తాళ్ల ఏర్పాటు, ఆక్సిజన్, ఎక్కువ షెర్పాలను తీసుకెళ్లడం వంటి నిబంధనలు తీసుకురానున్నట్లు నేపాల్ పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. టిబెట్ ప్రభుత్వం కేవలం 300 మందికి ఎవరెస్ట్‌ను అధిరోహించే అవకాశం కల్పిస్తుండగా నేపాల్ అపరిమితంగా పర్వతారోహకులకు అనుమతి మంజూరు చేస్తోంది. 11 వేల కిలోల చెత్త: ఎవరెస్ట్‌ను శుద్ధి చేసేందుకు నేపాల్ ప్రభుత్వం రెండు నెలల పాటు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా మొత్తం 11 వేల కిలోల చెత్తతో పాటు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. -
శిఖరం అంచున విషాద యాత్ర..
ఎడ్ డ్రోహింగ్.. అమెరికాలోని అరిజోనాకు చెందిన వైద్యుడు.. అతడి జీవిత కాల స్వప్నం ఒక్కటే.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టును అధిరోహించాలని.. సరిగ్గా రెండ్రోజుల క్రితం.. ఎడ్ డ్రోహింగ్ ఎవరెస్టు శిఖరాగ్రానికి చాలా దగ్గరగా వచ్చేశాడు.. యాహూ అందామనుకున్నాడు. కానీ అక్కడి పరిస్థితిని చూసి షాక్ తిన్నాడు.. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.. కూరగాయల మార్కెట్లా కిటకిటలాడుతోంది.. శిఖరాగ్రంపై పర్వతారోహకులు సెల్ఫీలు తీసుకోవడానికి ఒకరినొకరు తోసుకుంటున్నారు... గట్టిగా చూస్తే.. రెండు టేబుల్ టెన్నిస్ టేబుల్స్ పట్టేంత జాగా ఉంటుందేమో అక్కడ.. ఓ 20 మంది పర్వతారోహకులు.. వారి గైడ్లు.. షెర్పాలు కిక్కిరిసిపోయారు.. దీంతో అందరిలాగే తానూ లైనులో వెయిట్ చేయాల్సి వచ్చింది.. చాలా నెమ్మదిగా కదులుతోంది లైను.. దారిలో ఓ మహిళ శవం.. ఎవరెస్టును అధిరోహించి.. తిరిగి వస్తూ.. చనిపోయిందట.. తొక్కేయాల్సిందే.. జస్ట్‌లో మిస్సయ్యాడు.. అక్కడి పరిస్థితి చాలా దారుణంగా కనిపించింది..అదొక జూలాగ అనిపించింది. తోటి వారి శవాలు పక్కనే పడి ఉన్నా..పట్టనట్లుగా.. ఎవరికివారు పోతున్నారు.. మానవత్వం అక్కడే గొంతు కోసుకుని మరణించినట్లు అనిపించింది. – ఎడ్ డ్రోహింగ్.. ఎవరెస్టుపై గత వారం రోజుల్లో 11 మంది చనిపోయారు.. కొందరు తమ కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో.. కొందరు విజయగర్వంతో తిరిగివస్తూ.. అశువులు బాసారు.. ఇందులో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. 1922 నుంచి ఇప్పటివరకూ ఇక్కడ 200 మందికిపైగా చనిపోయి ఉంటారని అంచనా. కానీ ఇక్కడ వారంలోనే ఇంతమంది చనిపోయారు. అలాగని ఈ మరణాలకు కారణం.. మంచు తుపాన్లు కాదు.. అతి వేగంగా వీచే శీతల గాలులు కానే కాదు.. మరేంటి? ఎన్నడూ లేనంత రద్దీనా.. ప్రభుత్వ నిర్లక్ష్యమా? ఇంకేంటి? గతంలో పలుమార్లు ఈ శిఖరాన్ని అధిరోహించినవారు ఏం చెబుతున్నారు? ఓసారి చూద్దామా.. 26 వేల అడుగులు దాటితే.. ఈసారి ఎవరెస్టుపై ఎన్నడూ లేనంత రద్దీ కనిపించిందని చెబుతున్నారు. దీనికితోడు పర్వతారోహణ విషయంలో సరైన అనుభవం లేని వారు ఎక్కువగా ఉండటం కూడా మరణాలకు ప్రధాన కారణమని అనుభవజ్ఞులైన పర్వతారోహకులు చెబుతున్నారు. ‘ఈ మధ్య థ్రిల్ కోరుకునేవారు ఎక్కువైపోయారు. దీన్ని క్యాష్ చేసుకునే కంపెనీలు కూడా ఎక్కువయ్యాయి. ఈ అడ్వెంచర్ కంపెనీలకు డబ్బే ప్రధానమైపోయింది. అర్హత లేని గైడ్లు, షెర్పాలను పనిలో పెట్టుకున్నారు. అటు పర్వతారోహణ చేయాలనుకుంటున్నవాళ్లకు సరైన అనుభవం ఉందా వారు ఎవరెస్టు వంటి శిఖరాన్ని అధిరోహించగలరా వంటివేమీ చూసుకోవడం లేదు’ అని ఎవరెస్టును పలుమార్లు అధిరోహించిన అలెన్ చెప్పారు. నువ్వు పోలీసు అవ్వాలంటేనే పలు టెస్టులు పాసవ్వాలి.. అలాంటిది ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం అధిరోహించడానికి నీకు తగిన అర్హత ఉండాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. నిజానికి 25–26 వేల అడుగులు దాటామంటే.. పర్వతారోహకులకు అది డెత్ జోన్ కిందే లెక్క. మైండ్, బాడీ సరిగా పనిచేయవు. ప్రతి నిమిషం విలువైనదే. ఎవరెస్టు ఎత్తు 29,029 అడుగులు.. అంత పైకి వెళ్తున్నప్పుడు చివరి దశలో వారు తమ వద్ద ఉన్న బ్యాగేజీనంతటినీ వదిలేస్తారు.. వెళ్లి, తిరిగిరావడానికి వీలుగా కంప్రెస్డ్ ఆక్సిజన్ క్యాన్లను మాత్రమే తీసుకెళ్తారు. వారు నిర్ణీత సమయంలో శిఖరాగ్రానికి వెళ్లి తిరిగి వచ్చేయాలి. లేదంటే.. ఆక్సిజన్ అయిపోయి చనిపోతారు. అనుభవం లేని పర్వతారోహకులు వేగంగా తిరిగి రాలేకపోవడం వంటివి జరిగాయని షెర్పాలు చెబుతున్నారు. అదే సమయంలో అనుభవజ్ఞులైన వారు కూడా చనిపోయారు. దీనికి కారణం.. ఎప్పుడూ లేనంత ట్రాఫిక్ జామే.. లైనులో గంటల తరబడి వేచి ఉండటం వల్ల ఆక్సిజన్ అయిపోయి ఉంటుంది.. లేదా శరీరంలో విపరీతమైన మార్పులు ఏర్పడటం వంటివి జరిగి ఉంటాయని పేర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బంది ఉంటుందని తెలిసినా.. చివరి దశకు వచ్చేసరికి కొందరు మొండిగా ముందుకు పోతారని.. దాని వల్ల కూడా మరణాలు సంభవిస్తాయని చెబుతున్నారు. ‘మే నెల ఎవరెస్టు అధిరోహణకు సరైన సమయం.. ఆ నెలలోనూ కొన్ని రోజుల్లోనే అక్కడంతా క్లియర్‌గా.. గాలులు తక్కువగా ఉంటాయి.. ఆ సమయంలో శిఖరాగ్రం చేరుకోవడం సులభం.. దాంతో.. ఒకే సమయంలో ఎక్కువ మంది అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించారు. దీంతో చాలామంది చనిపోయారు’ అని అలెన్ చెప్పారు. నేపాల్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. ‘ఎవరెస్టును రెండువైపుల నుంచి ఎక్కవచ్చు. ఒకటి నేపాల్.. మరొకటి చైనా వైపు నుంచి.. నేపాల్ ఓ పేద దేశం.. దీనిపై వచ్చే డాలర్ల కొద్దీ ఆదాయాన్ని మాత్రమే చూస్తోంది తప్ప.. నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 400 మందికి పర్మిట్లు జారీ చేసింది. అదే చైనా చూస్తే 150 మందికే అనుమతి ఇచ్చింది. జామ్‌కు ఇదీ ఒక కారణం. ఇలా నిబంధనలను ఉల్లంఘిస్తూ పోతే.. మరణాలు పెరుగుతూనే ఉంటాయి’ అని మరో పర్వతారోహకుడు ఆడ్రియన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య అర్హత లేని కొన్ని కంపెనీలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.. అందులో నేపాల్‌కు చెందినవి అత్యధికంగా ఉన్నాయి. మరణాలు కూడా ఇటు వైపు నుంచి అధిరోహించినవారివే ఉండటం ఇక్కడ గమనార్హం. అయితే.. నేపాల్ ఉన్నతాధికారులు దీన్ని కొట్టిపడేస్తున్నారు. మరణాలకు కారణం.. ఓవర్‌క్రౌడింగ్ కాదని.. శిఖరాగ్రాన్ని అధిరోహించేందుకు వాతావరణపరంగా అనుకూలించే రోజులు పరిమితంగా ఉండటం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. పర్వతారోహకుల సంఖ్యను నియంత్రించడం ఎందుకు.. పూర్తిగా ఆపేస్తే పోలా అంటూ తేలికగా తీసిపారేస్తున్నారు. కళ్లముందే కూలిపోయినా సాయం చేయలేని పరిస్థితి..నీ దగ్గర ఉన్న ఆక్సిజన్ ఇస్తే..తర్వాత ఆక్సిజన్ అయిపోయి..చనిపోయేది నువ్వే.. ఏది ముఖ్యం.. మానవత్వమా? లేక మనం బతికుండటమా అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. మానవత్వాన్ని మంచులో సమాధి చేసి ముందుకు సాగాల్సిందే. ఫాతిమా, పర్వతారోహకురాలు, లెబనాన్ - సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఎవరెస్ట్‌పైకి 24వ సారి..!
ఖట్మాండు: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పైకి 24వ సారి అధిరోహించిన కమి రిట షేర్పా(50) తన రికార్డును తానే బద్దలు కొట్టారు. మే 15వ తేదీన భారత బృందానికి గైడ్‌గా వ్యవహరించి 23వ పర్యాయం ఎవరెస్ట్‌పైకి ఎక్కారు. తాజాగా తాజాగా భారత పోలీసు బృందానికి గైడ్‌గా వ్యవహరిస్తున్న ఈ నేపాలీయుడు.. మంగళవారం ఉదయం 6.38 గంటలకు ఎవరెస్ట్ పైకి చేరుకోగలిగారని ‘సెవెన్ సమ్మిట్ ట్రెక్స్’ సంస్థ చైర్మన్ మింగ్మా షేర్పా వెల్లడించారు. దీంతో 8,848 మీటర్ల అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే ఏకైక వ్యక్తిగా కమి రిట రికార్డుల్లోకెక్కారు. 1994 నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహిస్తున్న కమి రిట 25 పర్యాయాలు అక్కడికి వెళ్లాలని ధ్యేయంగా పెట్టుకున్నారని మింగ్మా తెలిపారు. -
ఎవరెస్ట్ ఎక్కనున్న ‘అడవి’ బిడ్డలు
కెరమెరి(ఆసిఫాబాద్): సాహసకృత్యాలంటే వారికి మహాఇష్టం.. పరుగుపందెం, గుట్టలు ఎక్కడం, దిగడం, నీటి సాహసం.. ఇలా ఎన్నో రకాల సాహసకృత్యాలు చే సి ప్రజల మన్ననలు పొందిన ఈ అడవిబిడ్డలు మరో సాహాసం చేయబోతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఇచ్చో డ అడవుల్లో గాయత్రీగుండం సాహసకృత్యం.. హైదరా బాద్‌లోని సైక్లింగ్ పరుగుపందెం.. అరకు లోయలో కటక వాటర్‌వాల్ రాఫ్లింగ్ పోటీల్లో పాల్గొని వేగంగా వ స్తున్న నీటిలో 425 ఫీట్ల లోతులో దిగడం ఇలాంటి ఎన్నో సాహకృత్యాలు చేసిన.. వీరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు రేపు బయలుదేరుతున్నారు. కెరమెరి మండలంలోని భీమన్‌గొంది గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి, కొలాం కొఠారి గ్రామానికి చెందిన మడావి కల్పన సాహసకృత్యాలు చేయడంలో దిట్ట.. చిన్నతనం నుంచే సాహసం చేయడం అటవాటుగా ఉన్న వీరు ఇప్పటి వరకు ఎన్నో సహాసోపేత కృత్యాల్లో పాల్గొన్నారు. గతంలో ఇచ్చోడ మండలంలోని గాయత్రీదేవి గుండంలో అత్యంత లోతైన లోయలో దిగి ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే గతేడాది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లా అరకు లోయలో ఉన్న కటక వాటర్‌పాల్ రాఫ్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అత్యంత వేగంగా పైనుంచి పడుతున్న జలధార తట్టుకుంటూ సుమారు 425 ఫీట్ల లోతులో 2.35 సెకండ్లలో చేరి ప్రథమ బహమతి సాధించారు. అనంతరం ఇటీవల మహబూబ్‌నగర్‌లో మయూరి పార్క్‌లో నిర్వహించిన సైక్లింగ్‌లో పాల్గొని భేష్ అనిపించారు. తమతోపాటు మరో ఆరుగురిని ఈ సైక్లింగ్‌లో పాల్గొనేలా చేశారు. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం సోమవారం సాయంత్రం వీరు అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కెందుకు బయలుదేరుతున్నారు. హైదరాబాద్‌లోని అడ్వంచర్ క్లబ్ ఆధ్వర్యంలో వీరు ఎంపికయ్యారు. దేశం నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మందిని ఈ క్లబ్ ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గిరిపుత్రికలు కన్నీబాయి, కల్పన ఎంపియ్యారు. గతంలో వీరు ఎన్నో సాహసకృత్యాలు చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వీరికి అవకాశం కల్పించినట్లు వారు తెలుపుతున్నారు. వీరికి ఐటీడీఏ పీవో కృష్ణఆదిత్య ప్రోత్సాహం, సహకారమందిస్తున్నారు. వారికి కావల్సిన దుస్తులు, షూలు సమకూరుస్తున్నారు. వీరికి సుమారు 10 రోజులు శిక్షణ ఇస్తారు. ఎలా నడవాలి అనే దానిపై శిక్షణ ఉంటుంది. ఒక్కొక్కరికి ఎవరెస్ట్ ఎక్కేందుకు రూ.1.50 లక్షల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఐటీడీఏ పీవో రూ.1.80 లక్షలు చెల్లించారని కన్నీబాయి తెలిపారు. ఆర్థికసాయం కోసం వేడుకోలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే రుసుము చెల్లించాలి. అలాగే సుమారు పక్షం రోజులకు కావల్సిన ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అందుకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. దాతలు, మనసున్న మహారాజులు ఆరిక్థ సహాయం అందించాలని కన్నీబాయి, కల్పనలు కోరుతున్నారు. మరో మూడు లక్షలు తక్షణం అవసరముందని చెబుతున్నారు. దాతలు స్పందించాలని వేడుకుంటున్నారు. -
ఎవరెస్ట్‌పై బయటపడుతున్న మృతదేహాలు
టిబెట్: ఎవరెస్ట్ పర్వతం గురించి తెలియని వారుండరు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ పర్వతాన్ని అధిరోహించడానికి ఏటా ఎంతో మంది ఔత్సాహికులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ ప్రయత్నంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు కూడా. గెలుపునే ఈ ప్రపంచం గుర్తిస్తుందన్నట్లు... మంచు పొరల్లో చిక్కుకుపోయిన వారి గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే తాజాగా హిమానీనదాలు వేగంగా కరిగిపోతుండటంతో, ఇన్నాళ్లూ మంచు కిందే ఉండి పోయిన మృతదేహాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పర్వతంపై చైనా వైపున్న (ఉత్తర) ప్రాంతంలో కనిపించిన మృతదేహాలను చైనా యంత్రాంగం తొలగిస్తోంది. ఎవరెస్ట్ అధిరోహణ సీజన్ మొదలవుతున్న తరుణంలో ఈ కార్యక్రమం చేపట్టింది. ‘భూగోళం వేడెక్కుతుండటం(గ్లోబల్ వార్మింగ్) వల్ల ఎవరెస్టుపై ఉన్న హిమనీనదాలు, మంచు ఫలకాలు వేగంగా కరగిపోతున్నాయి. ఇంతకాలం మంచు కింద ఉండిపోయిన మృతదేహాలు ఇప్పుడు బయటకు కనిపిస్తున్నాయ’ని నేపాల్ పర్వతారోహణ సంఘం(ఎన్ఎంఏ) మాజీ అధ్యక్షుడు ఆంగ్ షెరింగ్ షెర్పా చెబుతున్నారు. ఎవరెస్ట్‌పై సుమారు 200 మృతదేహాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఆ ఫీల్‌తోపాటు.. ఫైర్ కూడా నీలిమలో ఉంది!
నాలుగు అడుగులు వేయాలంటే ఓపికుండాలి. పది అడుగులు వేయాలంటే ఏదైనా పనిపడాలి. ఊరు దాటాలంటే పెద్ద ప్రయాణమే చేయాలి. రాష్ట్రాలు, దేశాలు దాటాలంటే.. సముద్రాలపై సాగిపోవాలంటే..శిఖరాలపై విహరించి రావాలంటే... ‘నింగీ నాదే.. నేలా నాదే’ అనే ఫీల్ ఉండాలి. ఆ ఫీల్ నీలిమ పూదోటలో ఉంది. ఫీల్‌తో పాటు.. నిలువనివ్వని ఫైర్ కూడా ఆమెలో ఉంది! గుజరాత్, మహారాష్ట్రలను చుట్టి... కోటల బురుజులనెక్కి చరిత్ర ఆనవాళ్లను వీక్షించింది. సహ్యాద్రి శ్రేణుల ఆరాలు తీసింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పశ్చిమ కనుమల పాయలను శోధించింది. తమిళనాడు నుంచి హంపి వరకు గొప్ప నిర్మాణాలను దుర్భిణీ వేసి వెతికింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకృతి పులకింతలను చూసి మైమరిచిపోయింది. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, మోనాస్ట్రీలు, మ్యూజియాలనూ చూసింది. మంచుపర్వతాల ముందు మోకరిల్లి... స్టాక్ కాంగ్రీ, మెరా, ఎవరెస్టు శిఖరాలనధిరోహించింది. ఖండం దాటి అమెరికాలో స్మోకీ మౌంటెయిన్ పీక్‌లను తాకింది. ఆఫ్రికాకెళ్లి కిలిమంజరో పర్వతశ్రేణుల్లో మారే రంగుల్ని ఆస్వాదించింది. అండమాన్ దీవులను చూసి సముద్రగర్భంలోనూ ప్రకృతి సౌందర్యం తక్కువేం కాదనుకుంది. ప్రపంచంలోని వైవిధ్యతతో అవగాహన స్థాయుల్ని విస్తరింపజేసుకున్నాను... అంటోంది నీలిమ పూదోట! శిఖరాన్ని తాకాలనుకుంది! నీలిమ హైదరాబాద్ అమ్మాయి. ఆమె తల్లి కొండవీటి పాప రూరల్ డెవలప్మెంట్లో ఉన్నతోద్యోగి. తండ్రి శౌరయ్య ఆర్మీలో పనిచేశారు. తల్లిదండ్రులతో నీలిమ చిన్నప్పటి నుంచి పర్యటిస్తూనే ఉంది. ఏడేళ్ల వయసులో తమిళనాడుతో మొదలైన నీలిమ పర్యాటక ప్రస్థానం ఖండాంతరాలకు విస్తరించింది. చిన్నప్పుడు అందమైన ప్రదేశాలను చూడడంలో సంతోషం ఉండేది. తండ్రితోపాటు ట్రెక్కింగ్ చేసేది. సిక్కింలో కాంచన్జంగను చూసి, శిఖరాన్ని తాకాలని ముచ్చటపడింది. ‘ఇది పర్వత శిఖరం. దీన్ని అధిరోహించడం అంటే మామూలు ట్రెక్కింగ్ చేసినట్లు కాదు’ అన్నారు వాళ్ల నాన్న. పర్వతారోహణ చేయాలనే కోరిక అప్పుడు పుట్టిందంటోంది నీలిమ. సోలో ట్రావెలింగ్‌తో సమాజాన్ని అర్థం చేసుకునే కోణం విస్తరించిందంటోందామె. ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకమే ‘‘ప్రతి ప్రదేశం, ప్రతి దేశం వాటికవే గొప్పవి. దేనినీ మరో దానితో పోల్చడానికి వీల్లేదు. ప్రతి ఒక్క ప్రాంతానికీ ఆ ప్రాంతానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అక్కడి భౌగోళికత, నాగరకత, ఆహారం, జీవనశైలి అన్నింటిలోనూ భిన్నత్వం కనిపిస్తుంది. ఆ వైవిధ్యతను ఆస్వాదించడం పర్యటనలతో సాధ్యమవుతుంది. ఒక కొత్త ప్రదేశానికి వెళ్లి వచ్చాక ఆ వివరాలను ఇంట్లో వాళ్లతో కానీ, స్నేహితులతో కానీ చెప్పేటప్పుడు ‘అక్కడ మనలాగ కాదు, కాఫీలో పాలే ఉండవు, బ్లాక్ కాఫీ తాగుతారు, లేదా కొద్దిపాలతో నీళ్లలా తాగుతారు...’ అని మొదలుపెడుతుంటారు. ప్రతి ఒక్కరి జీవనశైలిని యథాతథంగా స్వీకరించాలి తప్ప మన జీవనశైలితో అన్వయించి లోపాలు పట్టకూడదు. మన కల్చర్ గ్రేటే, అయితే మన కల్చరే గ్రేట్... అని తీర్పు ఇచ్చేయకూడదు. అలాగే నమ్మకాలు, విశ్వాసాలు కూడా. సిల్లీగా అనిపించినా సరే... ఎదుటి వారి విశ్వాసాన్ని గౌరవించగలగాలి. పట్టపగలు చుక్కల కోసం గత ఏడాది ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడడానికే అమెరికాకు వెళ్లాను. 99 ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం అది. అప్పట్లో ఐన్‌స్టీన్ థీరీ ఆఫ్ రిలేటివిటీని నిర్ధారించుకోవడానికి చేసిన ప్రయత్నాలు గుర్తొచ్చి అలాంటి సూర్యగ్రహణం మళ్లీ వస్తుంటే వెళ్లాను. టెనాన్సీలో రెండు నిమిషాల నలభై సెకన్ల పాటు పూర్తి సూర్యగ్రహణం ఉండింది. పట్టపగలే చిమ్మచీకట్లు ముసురుకున్నాయి, ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. ఒక ప్రదేశానికి వెళ్లే ముందు దాని గురించి తెలుసుకుంటే చూడడంలో థ్రిల్ ఉంటుంది. నక్షత్రాల కోసం తలదించాలి భూమి అంచులను చూడడం అంటే కవితాత్మకమైన వ్యక్తీకరణగానే చూస్తాం. కానీ ఎవరెస్టును అధిరోహించేటప్పుడు భూమి వంపు కనిపిస్తుంది. మరో విచిత్రం ఏమిటంటే... నక్షత్రాల కోసం తల పైకెత్తి చూడడమే మనకు అలవాటు. అదే అలవాటుతో ఎవరెస్టు ఆరోహణలో ఉన్నప్పుడు తల పైకెత్తి చూస్తే ఒక దశలో పైన ఏమీ కనిపించదు. మనం దిగ్ఞ్మండలం కంటే ఎత్తులో ఉంటాం. మన ఎదురుగా, కిందగా కనిపిస్తాయి నక్షత్రాలు. ఎవరెస్టును అధిరోహించడం వల్ల జీవితం విలువ తెలిసింది. మొదటి సారి 2015లో నేపాల్ వైపు నుంచి మొదలుపెట్టాను. బేస్ క్యాంపు చేరే సరికే భూకంపం ఎవరెస్ట్‌ను కుదిపేసింది. ఆ తర్వాత ఏడాది చైనా నుంచి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నాను. రోజూ అమ్మకు ఉత్తరం ఫొటో వాస్తవాలకు దర్పణమే, కానీ ఎమోషన్స్‌ను వ్యక్తం చేసేది అక్షరమే. ఎన్ని ఫొటోలు తీసుకున్నా సరే, అప్పటి నా అనుభూతిని రాయకుంటే తృప్తి ఉండదు. ఎవరెస్టు ఎక్కినన్ని రోజులూ ప్రతిరోజూ ఆ రోజు అనుభవాలను, అనుభూతులను స్క్రాప్ బుక్‌లో అమ్మకు ఉత్తరాలుగా రాసేదాన్ని. ఎవరెస్టు పర్వతారోహణలో నాకేదైనా జరిగితే ఈ బుక్‌ని తప్పకుండా అమ్మకు చేర్చాలని మా షెర్పాలకు చెప్పేదాన్ని. ఆ అనుభవాలనే ‘ఫ్రమ్ ఎవరెస్ట్ విత్ లవ్’ పేరుతో పుస్తకంగా తెచ్చాను. ఎత్తులో ఉన్న పోస్టాఫీస్ నుంచి ప్రతి పర్యటననూ ఒక తీపి గుర్తుగా మలుచుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. వెళ్లిన చోటు నుంచి ఉత్తరం రాస్తాను. ఆ ఊరి పోస్టల్ స్టాంప్‌తో అది ఆ పర్యటనకు గుర్తుగా ఉండిపోతుంది. సబర్మతి ఆశ్రమానికి పోస్టల్ చార్జెస్ మినహాయింపు ఉంది. అక్కడ ఉత్తరాన్ని పోస్ట్ చేస్తే చరఖా గుర్తు స్టాంపు వేస్తారు. నేపాల్‌లోని నామ్ చే బజార్ నుంచి కూడా ఉత్తరం రాశాను. ఎల్తైన హిమాలయాలకు అది గేట్ వే. నామ్ చే బజార్ పోస్టాఫీస్ పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఉత్తరాలు రాసే అలవాటుతోనే నా పుస్తకంలో కూడా ఒక పోస్ట్ కార్డు జత చేశాను. నా అడ్రస్‌తోపాటు మా షెర్పా క్యాంప్ అడ్రస్ కూడా ఉంటుంది. పుస్తకం చదివిన తర్వాత పాఠకులు తమ అనుభవాలను రాసి పోస్ట్ చేయాలనేది నా కోరిక. దొరికింది తినాలి నేను శాకాహారినే కానీ, మౌంటనియరింగ్ ఫిట్నెస్ కోసం వెళ్లినప్పుడు నేను అవి తినను, ఇవి తినను అంటే ఆ క్షణంలోనే వెనక్కి పంపేస్తారు. ట్రిప్‌లో ఉన్నప్పుడు రెడ్‌మీట్ తినాలి, హిమాలయాల్లో ఉండే యాక్ (జడల బర్రె) మాంసం కూడా తిన్నాను. ఎవరెస్టును అధిరోహించాలనే పిచ్చికోరిక ఇతర అడ్డంకులన్నింటినీ అధిగమించేలా చేసింది. మెకట్రానిక్స్‌లో ఇంజనీరింగ్ చేసి... విప్రో, కాగ్నిజెంట్లలో ఉద్యోగం చేసిన నేను మౌంటనియరింగ్ కోసమే ఉద్యోగం మానేశాను. కాశ్మీర్‌లోని స్టాక్‌కాంగ్రీ, నేపాల్‌లోని మెరా శిఖరాలను అధిరోహించడం కూడా నన్ను నేను ఎవరెస్టు అధిరోహణకు సిద్ధం చేసుకోవడానికే. ఎవరెస్టు స్వచ్ఛదనం ఒకరకమైన ఆనందాన్నిస్తే... గంటగంటకీ రంగులు మార్చుకునే కిలిమంజరో పర్వతం వైవిధ్యమైన అనుభూతిని మిగిల్చింది’’. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : శివ మల్లాల చెట్టుకి మొక్కిన తర్వాతే ‘‘కిలిమంజరో పర్వతారోహణ కోసం ఆఫ్రికాలోని టాంజానియాకు వెళ్లాను. అక్కడి మహిళల్లో ఆత్మవిశ్వాసం చాలా మెండు. మనకు అందం విషయంలో కొన్ని అభిప్రాయాలు స్థిరపడిపోయాయి. ఆఫ్రికాదేశాల్లో మహిళలు వాళ్ల దేహాకృతి పట్ల కానీ మేనిఛాయ గురించి కానీ ఏ మాత్రం బిడియపడరు. రంగు, ఫిజిక్‌ని బట్టి దుస్తుల ఎంపిక ఉండాలనే నియమాలు పాటించడం వంటి పరిధులు విధించుకోకుండా తమకు ఇష్టమైన రంగులను ధరిస్తారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు కూడా. వాళ్ల జుత్తు సాఫీగా ఉండదు. సాఫీగా లేదని బెంగపడుతూ, సాఫీగా మారడానికి ప్రయత్నాలేవీ చేయరు. బిరుసుగా ఉన్న జుట్టునే రకరకాలుగా దువ్వి చాలా క్రియేటివ్‌గా జడలు వేస్తారు. వాటిని కార్న్ బ్రైడ్స్ అంటారు. ఒకరు వేసిన స్టైల్‌ని మరొకరు అనుసరించరు. ఆ జడల మీద ఒక అధ్యయనమే చేయవచ్చు. వాళ్లు నేచర్‌ను గౌరవిస్తారు. నేచర్‌తో కలిసి జీవిస్తారు. సంగీతం వాళ్ల జీవితంలో ఒక భాగం. రోజూ సాయంత్రానికి వీధి మలుపులో ఒక సంగీత కచేరీ ఉంటుంది. కచేరీ అంటే అక్కడ శాస్త్రబద్ధంగా ఇలాగే ఉండాలనే నియమాలుండవు. ఎన్ని జాతులున్నాయో అన్ని రకాల సంగీత బాణీలుంటాయి. సంగీత సాధనాల తయారీకి కలప కోసం చెట్టును నరికే ముందు ప్రార్థిస్తారు. ‘సంగీత సాధనాల పేర్లు చెప్పి, వాటి కోసమే నిన్ను బాధపెడుతున్నాం. అనుమతించు’ అని చెట్టును ప్రార్థిస్తారు. ప్రకృతికి హాని కలిగించరు. వాళ్లకు సారవంతమైన నేలలున్నాయి. బయటి ప్రపంచంతో ఎక్స్పోజర్ తక్కువ, కానీ హాయిగా జీవించడం ఎలాగో వాళ్ల దగ్గర నేర్చుకోవచ్చు’’. ఉదయం ఐదింటికి నిద్రలేస్తాను, కొంతసేపు మెడిటేషన్, పుస్తకాలు చదువుతాను. కేబీఆర్ పార్కులో ఒకటిన్నర – రెండు గంటల సేపు ఫిట్నెస్ వర్కవుట్స్ చేస్తాను. ఆ తర్వాత పది గంటల వరకు యోగా క్లాస్‌లు తీసుకుంటాను. అప్పుడు కొంత రెస్ట్. సాయంత్రం నాలుగున్నర నుంచి మళ్లీ యోగా క్లాస్‌లుంటాయి. భగవద్గీత, శంకరాచార్య బోధనలు, యోగా పుస్తకాలు ఎక్కువగా చదువుతాను.పర్వతారోహకులకు గైడెన్స్ ఇవ్వడంతోపాటు అడ్వెంచరస్ టూర్లను ఇష్టపడే వాళ్ల కోసం టూర్లు నిర్వహిస్తున్నాను. ఇటీవల రష్యాలోని ఎల్బ్రస్ పర్వతారోహణను సమన్వయం చేశాను. రెండునెలలకొక ట్రిప్ ఉంటుంది. రాబోయే చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ కోసం నవంబర్‌లో షిల్లాంగ్‌కి వెళ్తున్నాను. – నీలిమ పూదోట, మౌంటనీయర్ -
సూర్య ది గ్రేట్
బుచ్చిరెడ్డిపాళెం : మల్లి మస్తాన్‌బాబు స్ఫూర్తితో పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రెనాక్ పర్వతారోహణతో ముందుకు సాగాడు. సెట్నల్ ఆధ్వర్యంలో మిషన్ ఎవరెస్ట్‌కు జిల్లా నుంచి ఎంపికయ్యాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని దిగ్విజయంగా అధిరోహించడం ద్వారా జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు. అతడే బుచ్చిరెడ్డిపాళెం మండల పెనుబల్లికి చెందిన కోరికల వెంకట సూర్యప్రకాష్. నేడు స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లికి చెందిన కోరికల శ్రీనివాసులు, ఆదిశేషమ్మ దంపతుల రెండో సంతానం కోరికల వెంకట సూర్యప్రకాష్. శ్రీనివాసులు కోవూరు సహకార చక్కెర కర్మాగారంలో కూలీ కాగా, ఆదిశేషమ్మ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. కృష్ణచైతన్య కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతున్న సూర్యప్రకాష్ చిన్నపట్నుంచి ఆటల్లో ముందుండేవాడు. కబడ్డీ, క్రికెట్లో జిల్లాస్థాయిల్లో సత్తా చాటాడు. మల్లి మస్తాన్‌బాబు స్ఫూర్తితో.. సంగం మండలం గాంధీజనసంఘం గ్రామానికి చెందిన దివంగత పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు స్ఫూర్తితో సూర్యప్రకాష్ పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. మల్లి మస్తాన్బాబులా దేశానికి మంచి పేరు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మల్లి మస్తాన్‌బాబు మృతితో కలత చెందిన సూర్యప్రకాష్ ఎలాగైనా పర్వతారోహణ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా పట్టుదల వదలకుండా నరసింహకొండపై 2015లో తరచూ ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ చేసేవాడు. జిల్లా యువజనుల శాఖ ఆధ్వర్యంలో 2016లో మిషన్ ఎవరెస్ట్‌కు ఎంపికయ్యాడు. అయితే తల్లిదండ్రులు వద్దనడంతో వచ్చేశాడు. అంతటితో ఆగక విజయవాడలోని సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీలో ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్లో శిక్షణ పొందాడు. 2017లో నిమాస్లో బేసిక్ మౌంట్‌నీరింగ్ నేర్చుకున్నాడు. 2017 సెట్నల్ ఆధ్వర్యంలో మిషన్ ఎవరెస్ట్‌కు ఎంపికయ్యాడు. నేడు స్వగ్రామానికి రాక ఎవరెస్ట్ పర్వతారోహణ చేసిన సూర్యప్రకాష్ విజయవాడలోని శిక్షణ కేంద్రం నుంచి బయల్దేరి మంగళవారం ఉదయం నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరులో సూర్యప్రకాష్‌ను కలెక్టర్ రేవు ముత్యాలరాజు సన్మానించనున్నారు. అనంతరం బుచ్చిరెడ్డిపాళేనికి బయల్దేరి వస్తారు. బుచ్చిస్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద విద్యార్థుల సాదర స్వాగతం పలకనున్నారు. అనంతరం ర్యాలీగా డీఎల్ఎన్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటాడు. అధిరోహించిన పర్వతాలు ♦ 2017 మార్చి–ఏప్రిల్‌లో ఇండియా–చైనా బోర్డర్లోని మేరాతాంగ్ పర్వతాన్ని అధిరోహించాడు. ♦ 2017 ఆగస్టు 15న ఆఫ్రికా ఖండంలోని అతి పెద్దదైన కిలీమంజారో పర్వతాన్ని 5,895 మీటర్ల ఎత్తు ఎక్కి తన సత్తా చాటాడు. ♦ 2017 డిసెంబర్లో సిక్కిం హిమాలయాల్లోని రెనాక్ పర్వతారోహణ చేశాడు. ♦ 2018 జనవరిలో కాశ్మీర్ పెహల్లాం వద్ద ఉన్న తులియాన్ పర్వతాన్ని, ఫిబ్రవరిలో లడక్ ప్రాంతంలోని ఆర్ఆర్ పర్వతాన్ని అధిరోహించాడు. -
ఎవరెస్ట్.. అత్యంత ఎత్తయిన చెత్త కుప్ప
-
ఎవరెస్ట్.. ఎ ‘వరెస్ట్’...
ఏటికేడూ హిమాలయాల్లోని మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అదే స్థాయిలో వారు వదిలేస్తున్న వ్యర్థాల పరిమాణమూ పెరిగింది. వెరసి 8,848 మీటర్ల ఎవరెస్ట్ శిఖరం.. నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చెత్త కుప్పగా మారిపోయింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎవరెస్ట్‌పై పరిస్థితిని వివరిస్తూ విడుదల చేసిన ఓ నివేదిక విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి ఎవరెస్ట్‌పై చెత్త పేరుపోతుండటం ఇప్పటిదేం కాదు. ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తోంది. ఒకానోక దశలో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ పై పోగయ్యే వర్థాలను తగ్గించేందుకు ఐదేళ్ల కిందట నేపాల్ ప్రభుత్వం సరికొత్త నిబంధన విధించింది. పర్వతారోహకుల బృందం పైకి ఎక్కేప్పుడు కొంత సొమ్మును డిపాజిట్ చేయాలి. ఒక్కో సభ్యుడు తిరిగి వచ్చేటప్పుడు ఎనిమిది కిలోల చొప్పున వ్యర్థాలను తెవాలి. అప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. టిబెట్ వైపు నుంచి ఎక్కేవారు కచ్చితంగా ఎనిమిది కిలోల వ్యర్థాలను తేవాలి. గత ఏడాది నేపాల్ నుంచి వెళ్లిన పర్వతారోహకులు 25 టన్నుల చెత్తను - 15 టన్నుల మానవ విసర్జితాలను తెచ్చారని సాగర్ మాత పొల్యూషన్ కంట్రోల్ కమిటీ తెలిపింది. కానీ ఏటా ఎవరెస్ట్ పై పేరుకుపోతున్న వ్యర్థాలతో పోలిస్తే ఇది చాలా తక్కువన్నది తేలింది. అవినీతి దందా... ‘ఒక్కో బృందం ఎవరెస్ట్ పర్యటనకు రూ.14 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. అంత మొత్తం చెల్లించినప్పుడు తిరిగి చెత్తను వెంటపెట్టుకుని రావటం ఏంటన్న భావనతో చాలా మంది అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి తమ డిపాజిట్ సొమ్మును వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా రెండు దశాబ్దాలుగా ఎవరెస్ట్ అధిరోహకుల సంఖ్య పెరిగి వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు పడేస్తుండటంతో టన్నుల మేర చెత్త పేరుకుపోయింది’ అని నేపాల్ పర్వతారోహకుల సంఘం మాజీ అధ్యక్షుడు నేపాలీ షెర్పా పెంబా డోర్జే ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో 30 మంది సభ్యుల బృందం 8.5 టన్నుల చెత్తను అతికష్టం మీద తీసుకొచ్చినట్లు ఆయన చెబుతున్నారు. అవగాహన సదస్సులు ఎన్ని నిర్వహిస్తున్నా.. అవినీతి దందాతో లాభం లేకుండా పోతోందని పెంబా డోర్జే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై పర్యావరణ వేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘ఎవరెస్ట్ పై పెద్ద ఎత్తున పెరిగిపోతున్న చెత్త సుందర హిహాలయాలను కలుషితం చేస్తోంది. ఎవరెస్ట్ పై పేరుకున్న వ్యర్థాలు మంచులో కలుస్తున్నాయి. మంచు కరిగినప్పుడు కలుషిత నీరు ఉత్పత్తి అవుతోంది. అది మహా ప్రమాదం’ అని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. -
ఎవరెస్టుపై మన్యం వీరులు
చింతూరు (రంపచోడవరం): మన్యంవీరులు మరోమారు దేశవ్యాప్తంగా తమ సత్తా చాటి రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చి పెట్టారు. చింతూరు మండలానికి చెందిన దూబి భద్రయ్య శిక్షణలో జిల్లా నుంచి ఎవరెస్టు అధిరోహణకు వెళ్లిన నలుగురు గురుకుల కళాశాల విద్యార్థుల్లో అడ్డతీగలకు చెందిన ప్రసన్నకుమార్ గురువారం ఎవరెస్టు శిఖరాన్ని అధిరో హించినట్లు భద్రయ్య తెలిపారు. ప్రసన్నకుమార్‌తో పాటు నెల్లూరుకు చెందిన వెంకటేష్ అనే వి ద్యార్థి కూడా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడని ఆయన తెలిపారు. 87 వేల మీటర్ల ఎత్తుగల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు మన రాష్ట్రానికి చెందిన పది మంది గురుకుల విద్యార్థులు గత నెల 18న బయలుదేరి వెళ్లారు. నేపాల్, చైనా, టిబెట్ మీదుగా ఎవరెస్టు శిఖరం వద్దకు చేరుకున్న వారు మైనస్ 40 డిగ్రీల చలిలో ఈ నెల 8న ఎవరెస్టు అధిరోహణ యాత్ర ప్రారంభించగా పది మందిలో ఇద్దరు విద్యార్థులు గురువారం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. కూతవేటు దూరంలో మరో ముగ్గురు జిల్లాకు చెందిన మరో ముగ్గురు గురుకుల విద్యార్థులు ఎవరెస్టు అధిరోహణలో కూతవేటు దూరంలో ఉన్నారు. చింతూరుకు చెందిన వీరబాబు, అడ్డతీగలకు చెందిన సత్యనారాయణ, మారేడుమిల్లికి చెందిన రమణారెడ్డి ఇప్పటి వరకూ 7,100 మీట ర్లు ఎక్కారని, మరో 1,600 మీటర్లు ఎక్కితే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తారని, రెండు రోజుల్లో వారు ఈ ఘనత చాటుతారని కోచ్ భద్ర య్య తెలిపారు. వీరితోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెం దిన రమణమూర్తి, రేణుక, విశాఖపట్నం జిల్లాకు చెందిన రాంబాబు, వాసుదేవ, సింహాచలంకూడా ఎవరెస్టు అధిరోహణలో నిమగ్నమై ఉన్నారన్నారు. -
ఎవరెస్ట్‌పై కాస్ట్లీ డిన్నర్ !
ఆ విందు తినాలంటే మీరు భోజన ప్రియులైతే మాత్రమే సరిపోదు. గుండెల్లో కాస్త ధైర్యం ఉండాలి. శారీరక పుష్టి, ఆర్థిక పరిపుష్టి కూడా మీ సొంతమై ఉండాలి.. అప్పుడే ఆ డిన్నర్ ఎంజాయ్ చేయగలరు. ఎందుకంటే అదేమీ అల్లాటప్పా భోజనం కాదు. సముద్ర మట్టానికి ఏకంగా 11,600 అడుగుల ఎత్తులో వండి వార్చబోతున్నారు. ఎవరెస్ట్‌పై ఒక అరుదైన ప్రపంచ రికార్డు కోసం కొంత మంది చెఫ్‌లు భారీగా కసరత్తు చేస్తున్నారు. నేపాల్ బేస్ క్యాంప్‌లో ఓ రెస్టారెంట్ గిన్నీస్ రికార్డులకెక్కడానికి సన్నాహాలు చేస్తోంది. దీని వెనుక మొత్తం నలుగురు చెఫ్‌లు ఉన్నారు. ట్రియాంగ్యోని పేరుతో ఎవరెస్ట్‌పై డిన్నర్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు. అంత ఎత్తులో అసలు ఆక్సిజన్ అందక ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది, అలాంటిది భోజనం చేయడం అంటే మాటలా ? అందుకే ఆ వాతావరణానికి తగ్గట్టుగా మెనూ రూపొందిస్తున్నారు. ఈ మెనూలో మసాలా పదార్థాలకే పెద్ద పీట వేస్తామని రెస్టారెంట్లో భాగస్వామి అయిన మన ఇండియన్ చెఫ్ సంజయ్ థాకూర్ వెల్లడించారు. వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల్ని కూడా తట్టుకుంటూ ఈ నెలఖారు నుంచి రోజుకి ఆరుగంటల సేపు ట్రెక్కింగ్ చేస్తూ నలుగురు చెఫ్‌లు, పదిమంది అతిథులు ఎవరెస్ట్‌కు చేరుకోనున్నారు. అతిథులెవరైనా ట్రెక్కింగ్ చేయలేకపోతే వారంతా హెలికాప్టర్లలో ఎవరెస్ట్‌కు చేరుకునే సదుపాయం కూడా ఉంది. ఎవరెస్ట్‌పై డిన్నర్ తినాలనుకునే ప్రతి ఒక్కరూ 3 లక్షల 64 వేల రూపాయలు చెల్లించాలి. కేవలం భోజనం మాత్రమే కాదు, ప్రయాణానికయ్యే ఖర్చు, వసతి అన్నింటికి కలిపి ఆ మొత్తాన్ని తీసుకుంటున్నారు. ఎవరెస్ట్ లాంటి ప్రాంతానికి వెళ్లాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు మరి. అలా వచ్చిన మొత్తాన్ని చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే హార్ట్ ఫర్ ఇండియా ఫౌండేషన్‌కు ఇవ్వనున్నారు. అన్నట్టు ఇలా ఎవరెస్ట్‌పై డిన్నర్ ఐడియా ఇది మొదటిసారి కాదు. 2016లో ప్రఖ్యాత చెఫ్ జేమ్స్ షెర్మన్ ఇలా రకరకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. కానీ అది వరల్డ్ రికార్డులకు ఎక్కలేదు. ఈసారి ఎలాగైనా ప్రపంచ రికార్డులకెక్కాలని చెఫ్‌లు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎవరెస్ట్‌పై భోజనం చేయాలన్న ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరైనా ఫైన్‌డైనింగ్ వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. -
సాహో..‘సమన్యు’
కర్నూలు (గాయత్రీ ఎస్టేట్): ఈ బుడతని పేరు సమన్యు యాదవ్. వయసు ఏడేళ్లు. చదివేది మూడో తరగతి. ఇందులో ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా? ఉంది మరి..ఈ బాలుడు అతి చిన్నవయసులోనే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. అంతేకాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. కర్నూలు నగరం బాలాజీనగర్‌కు చెందిన లావణ్య, కృష్ణకాంత్ దంపతులు. కృష్ణకాంత్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగి కాగా లావణ్య గృహిణి. వీరికి హసిత, సమన్యుయాదవ్ సంతానం. సమన్యు సికింద్రాబాద్‌లోని బోల్టన్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. హసిత మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు వెళ్లేందుకు ఫిట్నెస్ పరీక్షలో ఎంపికైంది. హసిత శిక్షణకు వెళుతుంటే ఆమెతో పాటు అక్కడికి వెళ్లిన క్రమంలో సమన్యు ట్రెక్కింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. తాను కూడా ఎవరెస్టు ఎక్కడానికి వెళతానని మారాం చేయడంతో నిపుణులు సమన్యు ఫిట్నెస్ను పరీక్షించారు. మిగతావారి కన్నా సమన్యు అతివేగంగా వ్యాయామాలు చేస్తుండటాన్ని గమనించిన ఫిట్నెస్ నిపుణులు ఈ బుడతడి ఉత్సాహాన్ని చూసి ఎవరెస్ట్ బేస్ క్యాంపు వెళ్లడానికి అనుమతినిచ్చారు. 45 రోజుల శిక్షణ అనంతరం సమన్యు సాహసయాత్రకు బయలుదేరి మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించాడు. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన స్ఫూర్తితోనే సమన్యు కిలిమంజారో పర్వతారోహణకు గత నెల 17న హైదరాబాద్ నుంచి బయలుదేరి 29న కిలిమంజారోను అధిరోహించడం ఆరంభించాడు. ఈనెల 2న ఉదయం 11:52 గంటలకు (5,380 మీటర్ల) లక్ష్యాన్ని పూర్తి చేసి గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పాడు. కిలిమంజారో అధిరోహించిన అతి పిన్న వయసు వారిలో గతంలో 2,824 రోజుల వయసున్న క్యాష్ అనే బాలుడు (అమెరికా) ఉండగా, ఈ పర్వతం అధిరోహించేనాటికి సమన్యు వయసు 2,821 రోజులు. మూడు రోజుల వయసు తక్కువగా ఉండటంతో గత రికార్డును సమన్యు అధిగ మించి సరికొత్త రికార్డు నెలకొల్పి చరిత్రపుటల్లోకెక్కాడు. -
ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: మిషన్ మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణకు ఔత్సాహికులైన అభ్యర్థులకు శుక్రవారం ఎంపికలు నిర్వహించారు. సెట్ శ్రీ ఆధ్వర్యంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సహకారంతో కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపికలకు 47 మంది హాజరయ్యారు. ఇందులో ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరికి పలు పరీక్షల అనంతరం.. 100 మీటర్ల పరుగు, 2.4 కిలోమీటర్ల పరుగు, లాంగ్‌జంప్ ఈవెంట్స్ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలు నమోదు చేసుకున్నారు. డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్ ఎంపికలను నిర్వహించారు. సెట్ శ్రీ సీఈవో బి.వి.ప్రసాదరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన 10 మందిని ఎంపిక చేస్తామన్నారు. త్వరలో విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారి నారాయణరావు, డీఎం అండ్ హెచ్‌వో మెడికల్ స్టాఫ్, పాల్గొన్నారు. -
సైక్లిస్ట్‌కు ఆర్థిక చేయూత
కల్లూరు: పర్యావరణ పరిరక్షణ కోసం మౌంట్ ఎవరెస్టుకు సైకిల్ యాత్ర చేపట్టిన పాణ్యంకు చెందిన బీటెక్ విద్యార్థి శ్రీకాంత్‌కు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆర్థిక చేయూతనిచ్చారు. సైక్లిస్ట్ శ్రీకాంత్ శుక్రవారం కర్నూలు నగరంలోని గౌరు దంపతులను వారి స్వగృహంలో కలిశారు. ఈ మేరకు వారు శ్రీకాంత్‌ను అభినందించి రూ 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ 21 రోజులపాటు జరిగే సైకిల్ యాత్రను ఈ నెల 31వ తేదీన ప్రారంభించి జూన్ 20వ తేదీన మౌంట్ ఎవరెస్టు బేస్ క్యాంపు వద్ద ముగించనున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరు శారీరకంగా మానసికంగా ఫిట్నెస్ ఉండేందుకు యోగా, ఫిట్నెస్ వ్యాయామం చేయాలన్నారు. సైకిల్ వాడకాన్ని పెంచి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. -
ఎవరెస్ట్ ఎక్కాలని వెళ్లి.. ప్రాణాలు కోల్పోయాడు!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని జయించాలని బయల్దేరిన మరో భారతీయుడు.. ఆ కొండల్లోనే తుది శ్వాస విడిచాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రవికుమార్ మృతదేహాన్ని షేర్పాలు గుర్తించారు. కానీ, మృతదేహాన్ని వెలికితీయడం అసాధ్యంగా ఉందని తుప్‌డెన్ షేర్పా చెప్పారు. మామూలుగా వెళ్లే మార్గం కంటే దాదాపు 650 అడుగుల లోతుకు మృతదేహం పడిపోయి కనిపించిందన్నారు. గడిచిన వారం రోజుల్లో అమెరికా, స్లొవేకియా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పర్వతారోహకులు కూడా ఎవరెస్ట్ మీద మరణించారు. శనివారం నాడు ఎవరెస్ట్ ఎక్కుతుండగా కుమార్ అనారోగ్యం పాలయ్యారు. దాంతో సమీపంలో ఉన్న క్యాంపు వరకు కూడా చేరుకోలేకపోయారు. అయితే అతడితో పాటు ఉన్న నేపాలీ షేర్పా గైడ్ మాత్రం క్యాంపు వరకు వెళ్లారు. గైడ్‌కు కూడా అనారోగ్యంగానే ఉన్నా, ఎలాగోఆలా 8వేల మీటర్ల ఎత్తున ఉన్న సౌత్‌కోల్ వద్ద క్యాంపు వరకు వెళ్లగలిగాడు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రవికుమార్, ఆయన గైడ్ కలిసి దాదాపు 8850 మీటర్ల ఎత్తు వరకు వెళ్లారు. అప్పటికే చాలా ఆలస్యం అయినట్లు లెక్క. వాళ్లు తిరిగి వచ్చేటపుడు వాళ్లతో ఎక్కువమంది పర్వతారోహకులు లేరు. రవికుమార్‌తో పాటు అమెరికాకు చెందిన పర్వతారోహకుడు రోలండ్ ఇయర్‌వుడ్ (50) కూడా మరణించినట్లు పర్యాటక శాఖ అధికారి కమల్ ప్రసాద్ అధికారి నిర్ధారించారు. అయితే, వాళ్ల మృతదేహాలను కిందకు తీసుకురాగలమా లేదా అన్న విషయాన్ని మాత్రం ఇంకా చెప్పలేకపోతున్నారు. స్లొవేకియాకు చంఎదిన వ్లాదిమిర్ స్ట్రాబా (50) కూడా ఆదివారం మరణించారు. ఆయన మృతదేహాన్ని మాత్రం సౌత్ కోల్ క్యాంపు వద్దకు తీసుకురాగలిగారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రాన్సెకో ఎన్రికో మార్చెటి (54) చైనా వైపు ఉన్న ఎవరెస్ట్‌పై మరణించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎవరెస్ట్ మీద మరణించినవారి సంఖ్య ఆరుకు చేరింది. -
ఎవరెస్టు పర్వతారోహణ బృందం ఎంపిక
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ కోసం ఆరుగురు సభ్యల బృందాన్ని ఎంపిక చేసినట్లు రాష్ట్ర యువజన సర్వీసులశాఖమంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది ఔత్సాహికులకు వివిధ పరీక్షలు నిర్వహించి, ప్రతిభ కనపరిచిన ఆరుగురిని ఎంపిక చేశామని తెలిపారు. ఈ బృందం ఈ నెల 12వ తేదీన మౌంట్ ఎవరెస్టు బేస్ క్యాంప్ నుంచి తమ ప్రయాణం మొదలు పెడుతుందని అన్నారు. మే 15 నుంచి 25వ తేదీల మధ్య ఈ బృందం ఎవరెస్ట్ కు చేరుతుందని అంచనా చేస్తున్నట్లు తెలిపారు. ఎవరెస్ట్ పై భారత పతాకాన్ని ఎగురవేస్తారని తెలిపారు. మొత్తం రూ. రెండు కోట్ల నలభై లక్షల రూపాయలను ఈ మిషన్ కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి పటిష్టమైన శిక్షణ తీసుకున్న అభ్యర్థులను ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం లు అభినందించారు. -
కొండంత కష్టం..!
- ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు సిద్ధమైన అంగోతు తుకారాం - 29 నుంచి షెడ్యూల్–సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీబ్లాక్ వద్ద పడిగాపులు సాక్షి, హైదరాబాద్: ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడాన్ని ఏమంత కష్టంగా భావించని ఆ యువకునికి సచివాలయంలో తనకు సంబంధించిన ఫైలు ఎక్కడుందో తెలుసుకోవడం అత్యంత క్లిష్టతరమైన సమస్యగా మారింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదించిన ఫైలు కదా.. చకచ కా పరిగెడుతుందిలే అనుకుంటే, తీరా గడువు సమీపించే సమయానికి తన ఫైలు ఎక్కడుందో అధికారులకూ అంతుబట్టడం లేదంటూ సచివాలయంలోని సి–బ్లాక్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కెళ్లపల్లి తండాకు చెందిన గిరిజన పుత్రుడు ఆంగోతు తుకారాం పర్వతారోహకుడు. నేషనల్ క్యాడెట్ కోర్సులో ప్రతిభ కనబరిచిన తుకారాం జమ్మూ కశ్మీర్‌లోని జవహర్లాల్ నెహ్రూ మౌంటెనీరింగ్ సంస్థలో మౌంటెనీరింగ్, ఎడ్వంచర్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేశాడు. 2015 జూన్ 2న రాష్ట్రా వతరణ దినోత్సవం నాడు ఉత్తమ స్పోర్ట్స్‌మెన్‌షిప్ అవార్డు అందుకున్నాడు. జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లలో బంగారు, రజత పత కాలను సాధించాడు. నాలుగేళ్లుగా మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోíహించాలని కలలుకంటున్న తుకారాంకు నాలుగు నెలల కిత్రం ఆ అవకాశం వచ్చింది. నేపాల్ లోని ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం తో, పర్వతా రోహణ నిమిత్తం తనకు రూ.28 లక్షలు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. పలువురు ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు తుకారాం దరఖాస్తును క్రీడాశాఖ మంత్రి పద్మారావు సీఎంఆర్ఎఫ్ విభాగానికి పంపారు. ఈనెల 20న సీఎం కార్యాలయం నుంచి తుకారాంకు ఫోన్ చేసిన అధికారులు మీ దరఖాస్తుకు సీఎం ఆమోదం తెలిపారని, రూ.25 లక్షలు ఇచ్చేందు కు అంగీకారం తెలిపారని చెప్పారు. ఈనెల 29నే పర్వతారోహణ షెడ్యూల్ ఉన్నందున ఈలోగానే చెక్కు వస్తుందని తుకారాం ఆశించాడు. అయితే వారం రోజులు గడచినా చెక్కు అందకపోయే సరికి ఆందోళనతో మంగళవారం సచివాలయానికి వచ్చా డు. సీఎం పేషీలో విచారిస్తే, స్పోర్ట్స్ విభాగానికి వెళ్లమన్నారు. అక్కడకు వెళితే రెవెన్యూ విభాగానికి, అక్కడ్నుంచి ముఖ్యమంత్రి పేషీకే పంపామని జవాబు వచ్చింది. సదరు ఫైలు తమవద్ద లేదంటూ ముఖ్యమంత్రి పేషీ అధికారులు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక, అక్కడే ఉన్న విలేకరులతో తనగోడు వెల్లబోసుకున్నాడు. ఎవరెస్ట్‌పై బతుకమ్మను ప్రతిష్టిద్దామనుకున్నా ఎవరెస్ట్ పర్వతంపై తెలంగాణ ప్రతీక అయిన బతుకమ్మను ప్రతిష్టిద్దా మని అనుకున్నా. ఈ నెల 29న నేపాల్ రాజధాని ఖాట్మండూ నుంచి షెడ్యూల్ ఖరారైంది. పర్వతారోహణ నిమిత్తం సీఎం రూ.25లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు ఫోన్ చేసి చెప్పారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా. తీరా విచారిస్తే తన ఫైలు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదంటున్నారు. ‘దేవుడు వరమిచ్చినా పూజారులు కనికరించలేదు’ అన్నట్లుగా తయారైంది నా పరిస్థితి. – అంగోతు తుకారాం -
‘ఎవరెస్టు ఎత్తు తగ్గిందట.. మళ్లీ కొలుస్తాం’
హైదరాబాద్: ఎవరెస్టు ఎత్తు మళ్లీ కొలవబోతున్నారా? ఇటీవల కాలంలో ఏర్పడిన భూకంపాలు, అగ్ని పర్వతాల బద్ధలు కారణంగా ఎవరెస్టు ఎత్తు తగ్గి ఉంటుందనే అనుమానాలను నివృత్తి చేయనున్నారా? అంటే అవునని స్పష్టమైంది. త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక టీంను మౌంట్ ఎవరెస్టు ఎత్తు కొలిచేందుకు పంపిస్తోంది. రెండేళ్ల కిందట నేపాల్‌లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పెద్ద మొత్తంలో మంచుపర్వాతాలు కదిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఎవరెస్టు ఎత్తు తగ్గి ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సర్వే ఆఫ్ ఇండియా మరోసారి ఎవరెస్టు ఎత్తు కొలిచే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించి అందుకు కావాల్సిన అనుమతులు కూడా పొందినట్లు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు చెప్పారు. ఇది పూర్తయితే భవిష్యత్తులో సైంటిఫిక్ స్టడీస్ ఉపయోగపడుతుందని అన్నారు. ‘మౌంట్ ఎవరెస్టు వద్దకు మేం ఓ అన్వేషణ బృందాన్ని పంపిస్తున్నాము. ఎవరెస్టు ఎత్తును 1855లో ప్రకటించారు. ఎంతోమంది దాన్ని కొలిచారు కూడా. ఇప్పటి వరకు భారత సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారం ఎవరెస్టు సరైన ఎత్తు 29,028 అడుగులు’ అని ఆయన తెలిపారు. భూమిలోపలి భాగంలో పలకల కదలిక, భూకంపాలకారణంగా ఎత్తుతగ్గిందని వచ్చిన అనుమానం, సైంటిఫిక్ స్టడీస్‌కు ఉపయోగపడుతుందనే మూడు కారణాల వల్ల తాము మరోసారి ఎవరెస్టును కొలవబోతున్నామని స్పష్టం చేశారు. -
రాజీలేని హైదరాబాద్ సాహసి..!!
హైదరాబాద్: ‘ఎవరెస్టంత’ ఆత్మవిశ్వాసమే పునాదిగా... వనితా లోకానికే వన్నె తెచ్చేలా సాహసయాత్రకు సిద్ధమవుతోంది సిటీకి చెందిన ఓ మహిళ. ఆరంతస్తుల మేడ ఎక్కేందుకు ఆపసోపాలు పడే ఈ రోజుల్లో.. ప్రపంచంలోని ఎత్తైన సప్త శిఖరాలపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సంకల్పానికి పూనుకుంది. ఇప్పటికే సౌతాఫ్రికా టాంజానియాలోని కిలిమంజారో (19,341 అడుగులు)ను అధిరోహించి మువ్వన్నెల పతాకను రెపరెపలాడించింది. అదే స్ఫూర్తితో ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ (29,029 అడుగులు) అధిరోహణకు అంతులేని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోంది. భార్యగా.. మాతృమూర్తిగా... సామాజిక కార్యకర్తగా ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తూనే చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్నే ఊపిరిగా చేసుకుని మౌంట్ ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని ముద్దాడేందుకు ముందుడుగు వేస్తోంది రాజీ తమ్మినేని. ఇదీ నేపథ్యం... కర్నూలుకు చెందిన నాగరాజు, సుశీల దంపతులకు కుమార్తె రాజీ తమ్మినేని. 2006లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. నగరంలోని ఎంఎన్సీ కంపెనీలో సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేశారు. ఆమెకు సీహెచ్.వెంకటకృష్ణతో వివాహం జరగ్గా తమ ఐదేళ్ళ కుమారుడితో కలిసి నాగారంలో నివాసం ఉంటున్నారు. చిన్నతనంలో చెట్లు, పుట్టలు, కొండలు ఎక్కడం అంటే రాజీకి ఎంతో సరదా. అదే ఇప్పుడు ఆమె జీవితాశయంగా మారింది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరి, కుటుంబ బాధ్యతలను స్వీకరించినప్పటికీ చిన్నప్పటి నుంచి తనలో దాగిఉన్న పర్వతారోహణ ఆశయాన్ని చంపుకోలేకపోయింది. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ..లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో అటు ఉద్యోగం, ఇటు కుటుంబం చూస్తూనే తరుచూ పర్వతారోహణ టూర్లకు వెళ్తుండేది. పూర్తిస్థాయిలో మౌంటెనింగ్‌కు సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టింది. ఈ నేపథ్యంలో డార్జిలింగ్‌లోని హిమాలయ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఎన్నో విజయాలు... ⇒ 2015 ఆగస్టు 23న సౌతాఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారోను రాజీ అధిరోహించారు. ⇒2015 మే 25న వెస్ట్ సిక్కింలోని రినోక్ శిఖరాగ్రానికి చేరుకుని తెలుగువారి కీర్తిని చాటారు. ⇒తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులకు పర్వతారోహణలో మెలకువలు నేర్పించి 2016 ఆగస్టు 15న వారితో కలిసి మరోసారి కిలిమంజారో శిఖరానికి చేరుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ⇒హిమాలయ ప్రాంతంతో పాటు వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతాల్లోని మరెన్నో పర్వతాలను అధిరోహించి తనలోని అభిలాషను చాటడమే కాకుండా సాహసానికి మరోపేరుగా నిలిచారు. సప్త శిఖరాగ్రాలకు చేరడమే లక్ష్యంగా... ప్రపంచంలో ఏడు ఖండాల్లో విస్తరించిన ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనే దృఢమైన కోరికను మది నిండా నింపుకుంది రాజీ. ఇప్పటికే కిలిమంజారో శిఖర లక్ష్యాన్ని పూర్తి చేయగా...ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని అందుకునేందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటోంది. పర్వతారోహణ నిపుణుడు శేఖర్‌బాబు వద్ద మెళకువలను నేర్చుకుంటూ ఫిట్నెస్పరంగా చక్రిపురంలోని సాయీస్ ఫిట్నెస్ సెంటర్లో తర్ఫీదు పొందుతున్నారు. ఏడు శిఖరాలను చేరుకునే వరకు తన లక్ష్యాన్ని వీడబోనని ఈ సందర్భంగా రాజీ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఆమెలోని పట్టుదల, తపన,విజయ ‘శిఖరా’లకు చేరుస్తోందని మెంటర్ గా వ్యవహరిస్తోన్న బాలచంద్ర పేర్కొన్నారు. అభయ ఫౌండేషన్ సహకారం... మౌంటెనీరింగ్‌లో రాజీ అభిరుచిని గమనించి అభయ ఫౌండేషన్ ఆమెకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అభయ ఫౌండేషన్లోనే వాలంటీర్‌గా పనిచేస్తోన్న రాజీకి... శిక్షణ ఇప్పించడంతో పాటు కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించేందుకు ఇప్పటివరకు అవసరమైన సహాయ సహకారాలను అందించారు. అయితే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి రావాలంటే దాదాపు 25 లక్షల పైగా ఖర్చువుతోంది. అభయ ఫౌండేషన్ తరుపున ఐదు లక్షల మేర సమకూరుస్తుండగా మిగిలిన మొత్తం సమకూర్చుకునే విషయంపై రాజీ తర్జనభర్జన పడుతున్నారు. దాతలు ఎవరైనా ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందిస్తారేమోనని ఎదురుచూస్తోంది. ప్రభుత్వమైనా స్పందించి తనకు ఆర్థిక సహాయం చేస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తానని రాజీ పేర్కొంటోంది. అభయ ఫౌండేషన్ తరుపున రూ.5 లక్షలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయగా, మరో పది లక్షల వరకు సమకూర్చుకున్నా...మిగిలిన మొత్తాన్ని శిక్షకుడు శేఖర్‌బాబు చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు రాజీ చెప్పారు. దాతలు ఎవరైనా స్పందించాలనుకుంటే 9963002727, 9032818284 నెంబర్లలో సంప్రదించవచ్చు. కాగా ఏప్రిల్‌లో జరిగే మిషన్ ఎవరెస్ట్–17కు ఈ నెలాఖరు లోగానే డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. -
ఆ పోలీసు దంపతులకు ఝలక్!
పుణె: అత్యున్నత శిఖరం ఎవరెస్ట్ అధిరోహించామని అందర్నీ నమ్మించిన పోలీసు జంటకు డిపార్ట్ మెంట్ ఝలక్ ఇచ్చింది. ఆరు నెలల తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో వారిద్దరిని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పోలీస్ కమిషనర్ రష్మీ శుక్లా కథనం ప్రకారం... తారకేశ్వరీ, దినేష్ రాథోడ్ దంపతులు పుణెలో కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత మే నెలలో వీరిద్దరూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికని సెలవుపై వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత మే23న ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని అధిరోహించినట్లు జూన్ 5న డిపార్ట్ మెంట్‌కు ఫోన్ చేసి చెప్పారు. భారత్ నుంచి ఎవరెస్ట్ అధిరోహించిన తొలి దంపతులు తామేనని నమ్మబలికారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అందించారు. ఆ ఫోటోలను చూసిన ఓ వ్యక్తి తాను 21న ఎవరెస్ట్ పై దిగిన ఫొటోలను పోలీసు జంట మార్ఫింగ్ చేసిందని ఆరోపించాడు. మరికొందరు వీరి తీరుపై అనుమానం వ్యక్తంచేస్తూ నిజనిజాలను కనుగొనాలని పోలీసులను కోరారు. శ్రీహరి తాప్కిర్ అనే వ్యక్తి మాత్రమే తమ గ్రూప్ నుంచి ఎవరెస్ట్ చివరివరకూ చేరుకున్నారని పోలీసులకు తెలిపారు. శివాజీనగర్ స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు తారకేశ్వరీ, దినేష్ రాథోడ్ లను విచారించగా అసలు విషయం బయటపడింది. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పాటు, హిమాలయాల నుంచి తిరిగొచ్చిన తర్వాత డిపార్ట్మెంట్కు రిపోర్ట్ కూడా చేయలేదని చెప్పారు. బెంగళూరుకు చెందిన సత్యరూప్ సిద్ధాంత ఫొటోలను వీరు ఫొటోషాప్ చేసి తాము ఎవరెస్టు ఎక్కినట్లు అందర్నీ నమ్మించారని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో పోలీసుశాఖ వీరిని సస్పెండ్ చేసింది. మరో పదేళ్లపాటు వీరు ఎవరెస్ట్ అధిరోహించడానికి వీలులేదని నేపాల్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ విషయంపై వారిని మీడియా సంప్రదించగా.. తమకు ఎలాంటి నోటీసులు రాలేదని దినేష్ రాథోడ్, తారకేశ్వరీ చెప్పారు. -
మృత్యుశిఖరంగా మారుతున్న ఎవరెస్ట్
ఎలాగైనా ఎవరెస్ట్ శిఖరాన్ని జయించాలన్న పట్టుదల చివరకు ఆయన ప్రాణాలనే బలిగొంది. 58 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లి వారం క్రితం కనపడకుండా పోయిన పరేష్ చంద్రనాథ్ మరణించారు. ఆయన మృతదేహం శుక్రవారం కనిపించింది. ఆయనలాగే అదృశ్యమైన మరో భారతీయ పర్వతారోహకుడి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆరుగురు షేర్పాల బృందం ఒకటి పరేష్ చంద్రనాథ్ మృతదేహాన్ని కనుగొన్నట్లు ట్రెక్కింగ్ క్యాంప్ నేపాల్ డైరెక్టర్ వాంగ్చూ షేర్పా తెలిపారు. గౌతమ్ ఘోష్ అనే మరో పర్వతారోహకుడి ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదని బహుశా ఆయన మృదేహం 8వేల మీటర్ల ఎత్తున ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. గాలులు చాలా వేగంగా వీస్తుండటంతో పరేష్ నాథ్ మృతదేహాన్ని కనుగొన్న తర్వాత నాలుగో క్యాంపు నుంచే రెస్క్యూ టీమ్ వెనుదిరగాల్సి వచ్చింది. ఘోష్ మృతదేహాన్ని వేరే కొంతమంది పర్వతారోహకులు చూసినట్లు చెబుతున్నారు. గత శనివారం పరేష్ నాథ్, ఘోష్ ఇద్దరూ 8848 మీటర్ల ఎత్తయిన శిఖరం వద్ద ఉన్నారు. ఆ తర్వాత బృందంలోని మిగిలిన నలుగురు సభ్యులకు, వీరికి కమ్యూనికేషన్ తెగిపోయింది. ఈసారి ఎవరెస్ట్ పర్వతారోహణ సీజన్లో ఐదుగురు మరణించారు. గత శుక్ర, శనివారాల్లో డచ్, ఆస్ట్రేలియన్ మహిళలిద్దరు ఎత్తైన ప్రాంతాల్లో వచ్చే అనారోగ్యంతో మరణించారు. ఒక నేపాలీ గైడ్ 2వేల మీటర్ల ఎత్తు నుంచి జారి పడిపోయి మరణించారు. కొన్ని రోజుల క్రితం మరో భారతీయుడు కూడా ఎవరెస్ట్ మీద మరణించారు. -
ఎవరెస్ట్‌పై అదనపు నిచ్చెనలు, తాళ్లు
కఠ్మాండు: గతేడాది సంభవించిన భూకంపంతో దెబ్బతిన్న ఎవరెస్ట్ శిఖరంపై అవసరమైన చోట్ల నిచ్చెనలు, తాళ్లను బిగిస్తున్నట్లు నేపాల్ పర్వతారోహణ అసోసియేషన్ తెలిపింది. పర్వతంపై వాలులో పగుళ్లు, రంధ్రాలు ఏర్పడడంతో పర్వతారోహణకు ఎక్కువ సమయం పడుతోందని అసోషియేషన్ ఛైర్మన్ అంగ్ షేరింగ్ షేర్పా చెప్పారు. పగుళ్ల వల్ల ఈ సారి మరిన్ని నిచ్చెనల అవసరముందని అడ్డంకుల్ని తొలగించే బృందాలు చెప్పాయన్నారు. ప్రతి ఏటా అల్యూమినియం నిచ్చెనలు, తాళ్ల ఏర్పాటుకు ఆరుగురి బృందం పనిచేసేదని, ఈ సారి పదిమంది అవసరమయ్యారన్నారు. పర్వతారోహకుల కోసం ప్రతి ఏడాది మరమ్మతుల బృందం బేస్ క్యాంప్ నుంచి మార్గాన్ని సిద్ధం చేస్తుంది. అవసరమైన చోట్ల నిచ్చెనలు, తాళ్లు అమరుస్తుంది. -
ఎవరెస్ట్ వేడెక్కుతోంది!
పర్వత ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు బీజింగ్: ఎవరెస్ట్ పర్వతం వద్ద ఉష్ణోగ్రతలు గత 50 సంవత్సరాలుగా పెరుగుతున్నాయని తాజాగా చైనా చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది. ఎవరెస్ట్ చుట్టూతా వ్యాపించి ఉన్న హిమనీనదాలు వేడిమి కారణంగా కుచించుకుపోతున్నాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్, హునాన్ వర్సిటీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, మౌంట్ కోమోలాంగ్మా స్నో లెపర్డ్ కన్జర్వేషన్ సెంటర్లు సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అయితే, ఎవరెస్ట్ సమీపంలోని అటవీ విస్తీర్ణం కాస్తంత పెరగడంతో జీవావరణ పరిస్థితులు మెరుగుపడ్డాయని నివేదిక తేల్చింది. ఈ నివేదికను ఇటీవల టిబెట్ పీఠభూమి పరిశోధనా సంస్థ విడుదలచేసింది. ఎవరెస్ట్ దగ్గరి హిమనీనదాలు వేడెక్కితే అక్కడ ప్రవాహం పెరిగి నదులు ఉప్పొంగుతాయని నివేదిక పేర్కొంది. టిబెట్ పీఠభూమిలో హిమనీనదాలు 20వ శతాబ్దంలో కుచించుకుపోయాయని, 1990ల నుంచి మరింత పెరిగిందని తెలిపింది. పర్వత ప్రాంతాల్లో మానవుని కార్యకలాపాలు, ఉష్ణోగ్రతలు హెచ్చడం ఇందుకు ప్రధాన కారణాలని వెల్లడించింది. -
నీలిమకు ఏపీ సీఎం ఆర్థికసాయం
హైదరాబాద్: ఎవరెస్ట్ అధిరోహణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థినికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ వివరాలను ఏపీ ప్రభుత్వ సమాచార, ప్రజా సంబంధాలశాఖ ఓ లేఖలో పేర్కొంది. శనివారం నాడు విద్యార్థినికి చెక్ ఇచ్చి ఆమెను అభినందించారు. ఎవరెస్ట్ అధిరోహించనున్న ఇంజినీరింగ్ విద్యార్థి నీలిమ స్వస్థలం గుంటూరు జిల్లా తురకాపాలెం. నేపాల్ భూకంపం నేపథ్యంలో గతంలో ఆమె చేపట్టిన యాత్ర మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. రెస్క్యూ టీమ్స్ ఆమెను కాపాడటంతో నేపాల్ దుర్ఘటన నుంచి బయటపడింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నీలిమ తన యాత్రను ప్రారంభించనుంది. తన ఎవరెస్ట్ యాత్రకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని నీలిమ హర్షం వ్యక్తం చేసింది. -
ఆ భూకంపం ఎవరెస్టును జరిపేసింది
బీజింగ్: నేపాల్ వచ్చిన భూకంపం మాములు భూకంపం కాదని ఇప్పటికే అర్థమైనా అది ఎంత శక్తిమంతమైనదో ఈ విషయం తెలిస్తే ఇట్టే బోధపడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్టును నేపాల్ భూకంపం ఏకంగా 1.2 సెంటీమీటర్లు జరిపినట్లు చైనాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. గత ఏప్రిల్ 28న నేపాల్ 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని కారణంగా దాదాపు పదివేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ భూకంపం సంభవించిన తర్వాత మౌంట్ ఎవరెస్టులో వచ్చిన మార్పులపై చైనాలోని జియోలాజికల్ సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ఎవరెస్టు.. నైరుతి దిక్కుకు 1.2 సెంటీ మీటర్లు జరిగినట్లు తెలిసిందని పేర్కొంది. -
ఎవరెస్ట్‌పై శవాల గుట్టలు
-
ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఇద్దరు గల్లంతు
ఏలూరు(పశ్చిమగోదావరి): పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నుంచి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించేందుకు ఈ నెల 13న వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. గల్లంతైన వారు టోనీ బ్రెయిన్ శుక్లా (అమెరికా), పదో తరగతి విద్యార్థి జయమంగళ జనార్థన్లుగా గుర్తించారు. 8 ఏళ్ల క్రితం టోనీ బ్రెయిన్ యలమంచిలి మండలం కాంభొట్ల గ్రామంలో ఏఓవైఎమ్ సొసైటీని స్థాపించారు. ఈ సొసైటీ నుంచే ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళ్లారు. ఈ నెల 26 వరకు వాళ్ల ఫోన్లు పనిచేశాయి. ఆ తరువాత ఎలాంటి సమాచారం అందకుండా పోయింది. అయితే నేపాల్ భూకంపం తర్వాత ప్రమాదం జరిగి ఉండొచ్చనే సొసైటీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
మౌంట్ ఎవరెస్ట్‌పై మరణ మృదంగం
-
ఎవరెస్టుపై మంచు కొండలు విరిగిపడి 18 మంది మృతి
-
ఎవరెస్ట్‌పై మంచు బీభత్సం..
కఠ్మాండు: భూకంపం తీవ్రతకు ఎవరెస్ట్ పర్వతంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై మంచు కొండలు విరిగిపడడంతో 10 మంది పర్వతారోహకులు మరణించారని అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారన్నారు. ప్రమాదంలో పర్వతారోహకులు చెల్లాచెదురైనట్లు వివరించారు. పర్వతారోహకుల ట్వీట్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని వచ్చిన అనేకమంది పర్వతారోహకులు భూకంపం ధాటికి బేస్ క్యాంపుల్లో చిక్కుకున్నారు. ఈ దుర్ఘటన నుంచి తేరుకున్న కొందరు తమ ఆత్మీయులకు క్షేమ సమాచారాన్ని ట్వీటర్లో అందించారు. ఇంగ్లండ్‌కు చెందిన డేనియల్ మజుర్ అనే పర్వతారోహకుడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ‘తీవ్ర భూకంపం ఇప్పుడే ఎవరెస్టును తాకింది. బేస్‌క్యాంపు పూర్తిగా ధ్వంసమయింది. మా బృందంలోని సభ్యులంతా బేస్‌క్యాంపు 1లో చిక్కుకున్నాం. దయచేసి మా క్షేమం కోసం ప్రార్ధించండి’ అని ట్వీట్ చేశారు. మరి కొద్ది నిమిషాల తరువాత ‘షాక్‌నుంచి తేరుకొని చూస్తే బృందంలోని సభ్యులంతా బేస్‌క్యాంప్‌లో వేలాడుతున్నాం. మంచు చరియలు మార్గాన్ని ధ్వంసం చేశాయి’ అని ట్వీట్ చేశారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మజర్ మరోమారు ట్వీట్ చేస్తూ ‘ బేస్ క్యాంపు 1 పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మా బృందం మొత్తం ఈ దుర్ఘటనలో చిక్కుకుంది’ అన్నారు. ఈ ట్వీట్‌కు సమాధానమిస్తూ అతని స్నేహితుడు మజుర్ ‘సురక్షిత స్థానానికి చేరుకో డేనియల్.. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం.. నువ్వు సరక్షితంగా ఇంటికి చేరుకుంటావు’ అని ట్వీట్ చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమెరికాకు చెందిన అడ్రియాన్ బల్లింజర్ ‘ భూకంపం ఇప్పుడే ఎవరెస్ట్ బేస్‌క్యాంపును తాకింది. పెద్ద మొత్తంలో రాళ్లు, మంచు పెళ్లలు విరిగి పడుతున్నాయి. మేమంతా సురక్షితంగా ఉన్నాము. దక్షిణ భాగంలో ఉన్నవారు కూడా సురక్షితంగానే ఉంటారని భావిస్తున్నాం.. బలమైన ప్రకంపనలు ఉత్తర భాగంలో కొనసాగుతూనే ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. -
ఎవరెస్టుపై మంచు కొండలు విరిగిపడి 18 మంది మృతి
ఖాట్మండు : నేపాల్ లో సంభవించిన పెను భూకంపం అనంతరం ప్రపంచంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్టుపై మంచు కొండలు విరిగి పడటంతో 18 మంది మృతిచెందారు. శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే వీరు యాత్రికులా? పర్వతారోహకులా ? ఎవరన్నది పూర్తి వివరాలు తెలియరాలేదు. నేపాల్ లో సంభవించిన భూకంపంలో 700మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. -
ఎవరెస్ట్‌పై చిక్కుకున్న పర్వతారోహకులు
భూకంపం కారణంగా ఎవరెస్ట్ పర్వతంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో 1, 2 బేస్ క్యాంపులు కొట్టుకుపోయాయి. పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ పర్వతం మీద చిక్కుకుపోయారు. నేపాల్, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశంలో వచ్చిన భూకంపం కారణంగా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు కొన్నాళ్ల ముందుగానే బయల్దేరిన పర్వతారోహకులు ఇప్పుడు అక్కడ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. -
ఎవరెస్టు సాహసయాత్రకు కర్నూలు వాసి
ఎవరెస్టు శిఖరంపై విజయబావుటా ఎగరేసేందుకు ఓ తెలుగు యువకుడు నడుం కట్టాడు. కర్నూలులోని వెంకటరమణ కాలనీకి చెందిన తిమ్మినేని భరత్.. కోచ్ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఈ నెల 9నుంచి సాహసయాత్ర చేపట్టనున్నాడు. బుధవారం స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన యాత్ర వివరాల్ని తెలిపాడు. ఇప్పటికే ఎన్నో పర్వతాల్ని ఎక్కిన తనకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు చైనా ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమతులు లభించాయని, యాత్రకు అయ్యే రూ.25 లక్షలను అభయ ఫౌండేషన్, మైత్రీ మూవీ మేకర్స్, సోదరి బిందు తమ్మినేని భరిస్తున్నరని చెప్పారు. ఈనెల 6న కర్నూలులో బయల్దేరి, 9న చైనా నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఇందుకుగాను 50 నుంచి 55 రోజులు పడుతుంది. భరత్ తోపాటు కొందరు అమెరికన్లు కూడా ఎవరెస్టు అధిరోహణకు బయలుదేరనున్నారు. -
పూర్ణ, ఆనంద్ లకు వైఎస్ భారతి సన్మానం
-
పూర్ణ, ఆనంద్ లకు వైఎస్ భారతి సన్మానం
హైదరాబాద్: అతి పిన్నవయస్సులో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిన మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌లను సాక్షి మీడియా గ్రూప్ చైర్ పర్సన్ వైఎస్ భారతి సన్మానించారు. ఈ సందర్భంగా సాహసయాత్ర వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. అత్యంత ప్రతికూల వాతావరణాన్ని ఎదిరించి ఎవరెస్టు శిఖరంపై భారతపతాకాన్ని ఎగురువేసి యువతీయువకుల్లో అంతులేని విశ్వాసం నింపారని ప్రశంసించారు. మీ విజయం మరెందరికో స్ఫూర్తినిస్తుందని అన్నారు. పూర్ణ, ఆనంద్ లకు ఉజ్వల భవిష్యత్ సొంతం కావాలని వైఎస్ భారతి ఆకాంక్షించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఈ ఇద్దరు ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన తెలుగు తేజాలుగా నిలిచారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా 14 ఏళ్ల మాలావత్ పూర్ణ రికార్డు సృష్టించింది. -
మట్టిలో మాణిక్యం పూర్ణ
గ్రామీణ గిరిజన కుటుంబంలో పుట్టి.. గురుకుల పాఠశాలలో చదివి.. ఎవరికీ అందనంత ఎత్తున్న ఎవరెస్టును ఎక్కింది. జిల్లా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. అసాధ్యాన్ని సైతం.. నిండైన ఆత్మవిశ్వాసంతో సుసాధ్యం చేసింది మన ఇందూరు బిడ్డ మాలావత్ పూర్ణ. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారి వచ్చిన పూర్ణకు జిల్లా ఘనస్వాగతం పలికింది. పాకాల(సిరికొండ): ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ మట్టిలో మాణిక్యమని తెలంగాణ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ రిక్క లింబాద్రి అన్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన అనంతరం పూర్ణ తొలిసారిగా స్వగ్రామమైన పాకాలకు ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో లింబాద్రి మాట్లాడారు. ఒక సాధారణ గిరిజన బాలిక ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆణిముత్యం గా నిలిచిందన్నారు. పూర్ణ, ఆనంద్‌లను ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపిక చేసి పంపిస్తున్నప్పు డు ఎంతోమంది ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఏవేవో అన్నారని, వారికేమైనా జరిగితే పంజాగుట్ట చౌరస్తాలో నన్ను ఉరి తీస్తారని మాట్లాడారని ప్రవీణ్‌కుమార్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేశారు. అనంతరం సన్మాన గ్రహీత పూర్ణ మాట్లాడుతూ ఎవరెస్ట్ అధిరోహణ కోసం ప్రయాణం ప్రారంభించిన రోజు మా శిక్ష కులు ఎవరెస్ట్ అధిరోహణ ఎంత కఠినతరమైందో మా తల్లిదండ్రులకు వివరించారన్నారు. అప్పుడు మా నాన్న కష్టపడితేనే కదా సార్ ఫలితం వచ్చేది అని చెప్పగానే నాకెంతో ఆనందం వేసిందని పూర్ణ గుర్తు చేశారు. డెత్ జోన్లో రాత్రి తొమ్మిదిన్నర సమయంలో ఎక్కుతున్నప్పుడు ఆకాశంలో కనిపించే నక్షత్రాల వెలుగును ఎంతో ఆస్వాదించానన్నారు. మా గ్రామం పాకాల పేరును ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని పూర్ణ తెలిపారు. ఐపీఎస్ ఆర్.ప్రవీణ్‌కుమార్, శిక్షకులు శేఖర్‌బాబు, పరమేష్‌కుమార్, వేణుగోపాలచారికి ఈసందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, పూర్ణ తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సన్మానం పూర్ణను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా స న్మానించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎ. సాయిలు పూర్ణకు శాలువా కప్పి పూలమాలలు వేశారు. అనంతరం పూర్ణతోపాటు ఆమె తల్లిదండ్రులకు సన్మానం చేసి నూతన వస్త్రాలను బహుకరించారు. కార్యక్రమంలో యూని యన్ నాయకులు గంగాదాసు, పాకాల నర్సిం లు, జిల్లా బంజారా సేవా సంఘం మాజీ అధ్యక్షుడు శశాంక్ తదితరులు ఉన్నారు. అధికారికంగా పూర్ణకు సత్కారం నిజామాబాద్ ఎంపీ కె. కవిత కలెక్టరేట్: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి దేశ ఖ్యాతిని మరింత పెంచిన మాలావత్ పూర్ణను త్వరలో అధికారికంగా సన్మానించనున్నట్లు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె తన స్వగృహంలో మాట్లాడారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అతిచిన్న వయస్సులో ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా అధిరోహించిన పూర్ణను అభినందిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. పూర్ణను త్వరలో జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున సన్మానిస్తామని వివరించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సిరికొండ మండలం పాకాల గ్రామంలో భార త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూర్ణ ఆవిష్కరించారు. జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నారాయణ విగ్రహాన్ని వితరణగా అందించారు. గ్రామాని కి చెందిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులు గద్దె నిర్మించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలయ్య, సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సోసైటీ చైర్మన్ నర్సయ్య, పాల్గొన్నారు. భీమ్‌గల్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలోకెక్కిన జిల్లా వాసి మాలావత్ పూర్ణను ఆదివారం భీమ్‌గల్ జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీ శర్మన్ ఆధ్వర్యంలో సన్మానించారు. పూర్ణ స్వగ్రామమైన పాకాలకు వచ్చిన పూర్ణకు శాలువా పూల మాలలు వేసి మెమెంటోతో సన్మానించారు. ఆమె వెంట టీఆర్ఎస్ నాయకులు శర్మన్ నాయక్, రాజేశ్వర్, లింబాద్రి తదితరులున్నారు. -
ఐపీఎస్ అధికారి కావడమే లక్ష్యం
హైదరాబాద్: ఐపీఎస్ అధికారి కావడమే తన లక్ష్యమని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగుతేజం ఆనంద్ కుమార్ చెప్పాడు. చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు సృష్టించిన తెలుగుతేజాలు పూర్ణ, ఆనంద్ కుమార్ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగివచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరికి ఘనస్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టు నుంచి గుర్రపు బగ్గీలో ర్యాలీగా నగరానికి తీసుకువచ్చారు. తాము ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమారే స్ఫూర్తి అని పూర్ణ, ఆనంద్ చెప్పారు. తమకు సాయం చేసిన గురువులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భారతీయులైనందుకు గర్వపడుతున్నామని చెప్పారు. -
అమ్మే గుర్తొచ్చింది...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం ఆషామాషీ కాదు. ఇది సాధించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మొదట్లో చిన్న బండను చూసే భయపడ్డాను. కానీ పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధ్యమేననే ఆలోచనతో ముందుకెళ్లా. ఎవరెస్టు శిఖరం పైకి వెళుతున్నప్పుడు అమ్మే గుర్తొచ్చింది. అమ్మను తలుచుకుంటూనే ఉన్నా. మా ఊరు కూడా గుర్తొచ్చింది. నేను చదువుకున్న పాఠశాల కళ్ల ముందు కదలాడింది. మొదట్లో చెప్పిన విధంగానే ఖమ్మం జిల్లాకు పేరు తేవాలని ముందుకెళ్లా. ఎవరెస్టు శిఖరంపై జాతీయ పతాకంతో పాటు తెలంగాణ జెండాను కూడా ఉంచి వచ్చా. ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే అసాధ్యమంటూ ఏదీ లేదు’ అని అంటున్నాడు మన జిల్లా ముద్దుబిడ్డ, ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కి ఘనతసాధించిన సాధనపల్లి ఆనంద్‌కుమార్. చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన ఆనంద్ గత నెల 25న ఉదయం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. అనంతరం అతను భారత భూభాగంలోకి ప్రవేశించి ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీలో ఉన్నాడు. శుక్రవారం ప్రధానమంత్రి, ఇతర జాతీయ ప్రముఖులను కలిసి అభినందనలు అందుకోనున్న ఆనంద్ గురువారం ‘సాక్షి’ ప్రతినిధికి ఢిల్లీ నుంచి ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు... ఆ ఇంటర్వ్యూ విశేషాలు అతని మాటల్లోనే.... ఖమ్మం పేరు నిలబెట్టా ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి వెళ్లే ముందు హైదరాబాద్‌లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లోనే గట్టిగా చెప్పా. ఖమ్మం జిల్లా తరఫున సాధించి వస్తానని. అదే స్ఫూర్తితో నా టార్గెట్‌ను పూర్తి చేశా...ఖమ్మం జిల్లా పేరు నిలబెట్టా. నేను పుట్టి పెరిగిన కలివేరు గ్రామానికి, నా తల్లిదండ్రులకు, నేను చదువుకున్న చంద్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లె గురుకుల పాఠశాలకు మంచిపేరు తేవాలన్నదే నా కోరిక. నా ఈ విజయంలో నా తల్లిదండ్రులు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, నా పాఠశాల సిబ్బంది, నా ఉపాధ్యాయులు, నా ప్రాణమిత్రులు, సహచరులందరూ భాగస్వాములే. వారి ఆశీస్సులు, స్ఫూర్తి, సహచర్యం నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లాయి. నేను పుట్టిన గడ్డకు రుణపడి ఉంటా. నా గ్రామానికి ఏదైనా చేయాలన్నది నా కోరిక. ఖమ్మం ఎప్పుడెప్పుడు రావాలా అనిపిస్తోంది. త్వరలోనే వచ్చి నా మాతృభూమి ఆశీర్వాదం తీసుకుంటా. కాళ్ల కింద భూకంపం పుట్టేది ఎవరెస్టు ఎక్కేందుకు వెళుతున్నప్పుడు భయమనిపించింది కానీ లక్ష్యం ముందు ఆ భయం చిన్నపోయింది. శవాలు కనిపించినప్పుడు చాలా ఇబ్బంది అనిపించేది. అందరూ గుర్తొచ్చేవారు. లోతైన లోయల్లో నడుస్తున్నప్పుడు కాళ్ల కింద భూకంపం పుట్టేది. 20 కిలోల బరువు మోసుకుంటూ మంచు గడ్డలను ఛిద్రం చేసుకుంటూ వెళ్లే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాస అందేది కాదు. అన్ని అవయవాలను సమన్వయం చేసుకోవాల్సి వచ్చేది. చాలా క్రమశిక్షణతో ముందుకెళ్లాల్సి వచ్చేది. అన్ని పరిస్థితులను అధిగమించడం ముందే అలవాటు చేసుకున్నాం. అయినా కష్టంగానే వెళ్లాం. రాత్రిళ్లు నడవాల్సి వచ్చినప్పుడు, బేస్‌క్యాంపులు దగ్గర్లోకి వచ్చినప్పుడు కొంత ఉత్కంఠకు లోనయ్యాను. ఏదిఏమైనా ఖచ్చితంగా ఎవరెస్టు శిఖరాన్ని తాకి రావాలన్న లక్ష్యంతోనే ముందుకెళ్లి విజయం సాధించా. చాలా సంతోషంగా ఉంది. అమ్మ కదా... అంతే అంటుంది.... అమ్మా, నాన్నా నన్ను చాలా ప్రోత్సహించారు. వాళ్లు కనిపించిన వెంటనే కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటా. వారి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. చాలా చిన్న స్థాయి కుటుంబమైనా కష్టపడి నన్ను చదివిస్తున్నారు. అయినా అమ్మకు కొంచెం భయం. నేను ఎవరెస్టు ఎక్కేందుకు వెళుతున్నప్పుడు కూడా భయపడ్డారు. అమ్మ అంతే అంటుందిలే.. నాకు లక్ష్యం నెరవేరుస్తానన్న ధైర్యం ఉంది కదా అని వాళ్లకు కూడా ధైర్యం చెప్పి వెళ్లాను. ఐపీఎస్ కావాలన్నది నా కోరిక. ఇక, దాని కోసం శ్రమిస్తా. -
మా సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నదైంది
మీడియాతో తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్ సాక్షి, న్యూఢిల్లీ: చిన్న వయసు.. పెద్ద లక్ష్యం.. ముందున్నది ప్రపంచంలోనే ఎత్తై ఎవరె స్ట్ శిఖరం.. అధిరోహించాలంటే కొండంత ధైర్యం, అంతే ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం.. మైనస్ నలభై డిగ్రీల చలి, కాలుతీసి కాలు వేయలేనంత మంచు.. కాలి బూట్లే 10 కిలోలు, భుజాన మరో 20 కేజీల బ్యాగ్.. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపెద్దవారికే సాధ్యంకాని ఎవరెస్ట్ అధిరోహణ.. వీరికెలా సాధ్యమంటూ అంతా ఆశ్చర్యంగా చూసినా, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌లు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. వీరికి ఇక్కడి ఏపీభవన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మిగతా ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఈ ఇద్దరు మే 25న ఎవరెస్ట్ శిఖరాగ్రంపై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల అత్యంత పిన్న వయస్సులో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి పూర్ణ రికార్డు సృష్టించగా, 17 ఏళ్ల ఆనంద్ సైతం అరగంట తేడాతో ఈ శిఖారాన్ని చేరుకొని తెలుగు వారి సత్తా చాటిన విషయమూ విదితమే. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ అందించిన సహకారం.. శిక్షకులు శేఖర్, పరమేష్ల సారథ్యంలో సాగిన ఎవరెస్ట్ అధిరోహణ అనుభవాలను వారిద్దరూ మీడియాతో పంచుకున్నారు. అవకాశం దొరికితే మరోమారు అధిరోహిస్తా: పూర్ణ ‘‘నేను ఎవరెస్ట్ ఎక్కడానికి వెళుతున్నా అని చెప్పగా నా తల్లిదండ్రులు ముందు కంగారుపడ్డా, తర్వాత అంగీకరించారు. నువ్వు సాధిస్తావ్ అని ప్రోత్సహించారు. వారి ఆశీర్వాదం, స్వేరోస్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ప్రోత్సాహం, శేఖర్, పరమేష్‌లు ఇచ్చిన శిక్షణతో ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధమయ్యాం. భువనగిరి రాక్లైప్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే అంత పెద్ద బండను చూసి భయపడిపోయా. ఇంత పెద్ద బండను ఎలా ఎక్కుతామని అనుకున్నా. కానీ శేఖర్, పరమేష్ల ప్రోత్సాహంతో రోజూ ఆ బండను ఎక్కుతుంటే భయం పోయింది. ఆ ఉత్సాహంతోనే డార్జిలింగ్‌లోని పినాక్ పర్వతాన్ని ఎక్కాం. తర్వాత లఢఖ్‌లో చలిని తట్టుకుని, జారుడు రాళ్లపై నడవడం నేర్చుకున్నాక మాలో పట్టుదల పెరిగింది. ఆ ఉత్సాహంతోనే ఎవరెస్ట్ ఎక్కేందుకు సిద్ధమయ్యాం. చాలా క్లిష్ట వాతావరణంలో, అంతకన్నా ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణం సాగింది. మైనస్ 40 డిగ్రీల చలిలో, జారుడు మంచును దాటుకుంటూ వెళ్లేందుకు చాలా కష్టపడ్డా. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లాం. కొద్దిదూరం వెళ్లాకఆరు శవాలు కనిపించాయి. వాటిని చూడగానే భయంతో వణికిపోయాం. అయితే, దేనికీ వెరవకుండా, వె నక్కి చూడకుంగా ముందుకు సాగడమే సాహసం, అదే జీవితం అన్న మా గురువు ప్రవీణ్‌కుమార్ మాటలు గుర్తొచ్చి మరింత దృఢ విశ్వాసంతో ముందుకు సాగాం. మా దృఢ సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నగా అయిపోయింది. అన్నీ దాటుకుంటూ చివరికి ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని చేరుకున్నాం. నేను ఈ రోజు అందరికన్నా ఎత్తై ప్రదేశంలో ఉన్నాను అనే భావన కలిగి చాలా గర్వంగా ఫీలయ్యా. నా తల్లిదండ్రులు, ప్రవీణ్‌కుమార్ సార్ గుర్తొచ్చి ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. అక్కడే జాతీయ జెండా, తెలంగాణ జెండాను ఎగురవేసి.. బీఆర్ అంబేద్కర్, సాంఘిక సంక్షేమ శాఖకు వన్నెతెచ్చిన ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్‌ల ఫోటోలను అక్కడ ఉంచాం. బాలికలు ఏదైనా చేయగలరు. బాలుర కంటే ఎక్కువ చేయగలరు. నాకు మళ్లీ అవకాశం ఇస్తే మరోమారు ఎవరెస్ట్ ఎక్కడానికి సిధ్దంగా ఉన్నా. ఈ విజయాన్ని మా స్వేరోస్ టీమ్ మొత్తానికి అంకితమిస్తున్నా. ఇక మీదట చదువుపై దృష్టిపెడతా. ముందు పదో తరగతి పాసవ్వాలి. ఐపీఎస్ అయి, పేదలకు సేవ చేయాలన్నదే నా సంకల్పం’’. ఓ సవాల్‌గా తీసుకుని ముందుకెళ్లా: ఆనంద్ ‘‘ముందుగా భవనగిరి రాక్‌లైన్ స్కైల్లో పెద్ద రాయిని ఎక్కడానికే ఎంతో భయమేసింది. అయితే మా ట్రైనర్స్ ఇచ్చిన ధైర్యంతో దాన్ని ఎక్కగలిగా. తర్వాత పీనాక్ శిఖరాన్ని ఎక్కడంతోపాటు లడఖ్‌లో కఠిన శిక్షణ తీసుకున్నాం. మొదట్లో చాలా కష్టంగా అనిపించినా అన్నీ తట్టుకోగలిగాం. ఇక 20 కేజీల బరువును భుజాన వేసుకొని, మంచు రాళ్ల మధ్య ముందుకు సాగడం అంటే ఆషామాషీ కాదు. ప్రతి అడుగూ భయానకమే. వాతావరణం ఏమాత్రం సహకరించదు. ఆ సమయంలో.. ‘నేను ఎంత కష్టమొచ్చినా వెనక్కి వెళ్లను’, ‘దేనికీ భయపడను’, ‘నీవు ఎవరికీ తక్కువ కాదు’, ‘ముందుకు సాగడమే జీవితం’ అని మాకు శిక్షణలో నేర్పిన సూత్రాలు గుర్తొచ్చాయి. అవి నాపై బాగా ప్రభావం చూపించాయి. దీంతో ఎవరెస్ట్ అధిరోహణను ఓ సవాల్‌గా తీసుకున్నా. 7,400 మీటర్ల ఎత్తు చేరాక ఊపిరి సరిగా అందేది కాదు. అక్కడికి వచ్చేసరికే ప్రాణం పోయినంత పనైంది. చివరి క్యాంపు చేరాలంటే రాత్రిపూట లోయల మధ్య నుంచి ప్రయాణం చేయాలి. కొద్దిగా అదుపు తప్పినా కనీసం శవం కూడా దొరకదు. ఓ సమయంలో కిందపడ్డా. చాలా భయమేసింది. అయినా ధైర్యం తెచ్చుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాం. ఎవరెస్ట్ చేరాక జాతీయజెండా, తెలంగాణ జెండా ఎగురవేశాం. ఎంతో గర్వంగా అనిపించింది. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఉంటే పేదవారు దేనికీ తక్కువ కారని నిరూపించామనిపించింది. తిరిగి వస్తున్న సమయంలో రెండుమార్లు కిందపడ్డా. తల్లిదండ్రులు, గురువులు, దేవుడి ఆశీర్వాదాలతో క్షేమంగా వచ్చా. ఇక ఇంటర్మీడియట్ పూర్తి చేయాల్సి ఉంది. ఐపీఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్తులో అవకాశాలు వస్తే మరిన్ని శిఖరాలు ఎక్కుందుకు నేను రెడీ’’. -
కష్టమనిపించినా.. ఇష్టపడి చేశాం
మరికొందరిని ఎవరెస్ట్ ఎక్కిస్తాం ఎత్తయిన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన పూర్ణ, ఆనంద్ ‘నెవర్ గివప్’.. ఇచ్చిన స్ఫూర్తే విజయానికి తోడ్పడింది ఐపీఎస్లమవుతాం..మరికొందరికి తోడ్పాటు ఇస్తామని వ్యాఖ్య తెలుగుతేజాలకు తృటిలో తప్పిన ప్రమాదం తిరుగు పయనమైన గురుకుల విద్యార్థులు ఐదు రోజుల తర్వాతే భారత భూభాగంలోకి ప్రవేశం హైదరాబాద్: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ఎంత కష్టమైనా.. ఇష్టపడి చేసి విజయం సాధించామని గురుకుల విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఎస్.ఆనంద్‌కుమార్ చెప్పారు. తాము ఐపీఎస్ అధికారులం అయి మరికొందరు విద్యార్థులకు తామే శిక్షణ ఇచ్చి ఎవరెస్ట్ ఎక్కిస్తామని పేర్కొన్నారు. కలలో కూడా ఊహించని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని సాధించామని.. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, కాలు కదపడం కష్టమనిపించినా ముందుకే వెళ్లామని చెప్పారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన అనంతరం తిరుగుప్రయాణంలో ఉన్న పూర్ణ, ఆనంద్, వారి శిక్షకుడు శేఖర్‌బాబు.. బుధవారం బేస్‌క్యాంపు నుంచి బయలుదేరిన అనంతరం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. తొలుత మాలావత్ పూర్ణ మాట్లాడుతూ... ‘‘ఎవరెస్ట్ ఎక్కడం చాలా కష్టంగా అనిపించినా.. ఇష్టంగా చేశా. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, కాలు కదపడం కష్టమనిపించినా ముందుకే వెళ్లాలనిపించింది. పైకి వెళ్లేటపుడు క్యాంప్‌లో తీవ్ర అస్వస్థతకు గురయ్యా. అయినా మా కోసం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసి, దాని కోసం ఎంతో కష్టపడిన ప్రవీణ్‌కుమార్ సార్ గుర్తుకువచ్చారు. కలలో కూడా ఊహించని అవకాశమిచ్చిన ఆయన లక్ష్యం కోసం ఏదైనా చేయాలని అనిపించి ముందుకే వెళ్లా. 8,500 మీటర్ల ఎత్తు దాటిన తరువాత కొన్ని శవాలు కనిపించాయి. అక్కడ కాస్త భయం అనిపించినా.. లక్ష్యం అధిగమించింది’’ అని పేర్కొన్నారు. ‘‘స్వేరోస్‌లో చదివే వారికి కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద టెన్ కమాండ్మెంట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థీ ఉదయం కచ్చితంగా వీటిని చదువుతారు. అందులో ఆఖరుది ‘నెవర్ గివప్’. ఇది ఇచ్చిన స్ఫూర్తే కష్టమైనా వెనుతిరగక లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. అలసటగా అనిపించినప్పుడల్లా గ్లూకోజ్ తాగడం, చాకోలెట్ తినడం వంటివి చేస్తూ ముందుకెళ్లాం. ‘8,848’ పాయింట్ దగ్గర నిలుచున్నప్పుడు మా ప్రవీణ్ సారే కళ్లముందు కదలాడారు. ఆయన నమ్మకం నెరవేర్చినందుకు ఆనందంగా అనిపించింది’’ అని ఆనంద్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా శేఖర్‌బాబు మాట్లాడుతూ... ప్రతి కూల పరిస్థితుల్లోనూ పూర్ణ, ఆనంద్ చూపిన చొరవ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ‘‘ప్రతీ సూచనను, సలహాలను పక్కాగా ఆచరిస్తూ ముందుకు సాగారు. పొడి మంచు, మంచు చరియలు కూలడం వంటి ఘటనలు ఎదురైనా, కొన్ని గంటలపాటు సంప్రదింపులు సాధ్యం కాకపోయినా వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. బేస్ క్యాంప్‌కు చేరుకున్నాక మీ లక్ష్యాలు ఏమిటని అడిగితే.. ‘ఐపీఎస్ అధికారులం అవుతాం, మరికొందరు స్వేరోస్ విద్యార్థులకు స్వయంగా శిక్షణ ఇచ్చి ఎవరెస్ట్ ఎక్కిస్తాం..’ అన్నారు..’’ అని ఆయన పేర్కొన్నారు. తప్పిన ప్రమాదం..: భూమిమీదే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడమే కాదు.. తిరిగి కిందికి దిగడమూ అత్యంత ప్రమాదకరమే. అప్రమత్తంగా వ్యవహరించడంతో తిరుగు ప్రయాణంలో ఉన్న పూర్ణ, ఆనంద్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. పూర్ణ, ఆనంద్ 52 రోజుల సాహసయాత్రతో ఆదివారం ఉదయం 6-7 గంటల మధ్య ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అనంతరం అలసటను లెక్కచేయకుండా తిరుగు ప్రయాణం ప్రారంభించి, బేస్‌క్యాంపునకు చేరుకున్నారు. అయితే వీరి తర్వాత ఎవరెస్ట్ శిఖరంపైకి ఆలస్యంగా చేరుకున్న ఒక పర్వతారోహకుడు ఆలస్యంగా దిగడం మొదలుపెట్టారు. కానీ, చీకటి, పొడి మంచు కారణంగా మంగళవారం రాత్రి ఎల్లో బ్యాండ్ క్యాంప్‌లో ఆగిపోవాల్సి వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి హఠాత్తుగా ముంచుకు వచ్చిన మంచు చరియలు.. ఈ క్యాంప్‌తో పాటు దిగువన ఉన్న మరో మూడు క్యాంపులనూ తుడిచిపెట్టేయడంతో ఆయన మరణించారు. కాగా తిరుగుప్రయాణంలో ఉన్న పూర్ణ, ఆనంద్, శేఖర్‌బాబు ప్రస్తుతం చైనా-నేపాల్ సరిహద్దుల్లో ఉన్నారు. వారు భారత భూభాగంలోకి అడుగుపెట్టడానికి మరో ఐదు రోజులు పట్టే అవకాశముంది. -
మన్యం పుత్రుడి ఘనత
ఖమ్మం జిల్లా కలివేరులో ఆనందోత్సాహాలు చర్ల, న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని చర్ల మండలంలో ఎక్కడో అడవిలో విసిరిపారేసినట్టున్న ఓ గిరిజన గ్రామం పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఆ గ్రామానికి చెందిన దళిత యువకుడు అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే కారణం. చర్ల మండలం కలివేరుకు చెందిన ఆనంద్‌కుమార్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సందర్భంగా ‘న్యూస్‌లైన్’ ఆయన స్వగ్రామాన్ని సందర్శిం చింది. ఆనంద్ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందంలో మునిగిపోయారు. తమ కుమారుడు సాధించిన ఘనత కు తల్లిదండ్రులు కొండలరావు, లక్ష్మి మురిసిపోతున్నారు. స్కూలుకు వెళ్లనన్నాడు: మొదట ఏడో తరగతి వరకు చదువుకున్న ఆనంద్.. కుటుంబ ఆర్థిక పరిస్థితి, స్నేహాల కారణంగా చదువు వద్దనుకున్నాడు. బడికి వెళ్లనంటూ మారాం చేసి మరీ కూలీ పనులకు వెళ్లాడు. ఏడాది పాటు అలాగే గడిచింది. అయితే బడికి వెళ్లకపోతే చనిపోతానని తల్లి బెదిరించడంతో ఆనంద్ మళ్లీ బడి బాట పట్టాడు. సైకిల్ మెకానిక్‌గా పని చేస్తున్న తండ్రి కొండలరావు అతడ్ని చండ్రుగొండ మండలం అన్నపురెడ్డిపల్లిలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించాడు. క్రీడలంటే ప్రాణం...: మొదటి నుంచి ఆట లంటే ఇష్టపడే ఆనంద్ వాలీబాల్, హ్యాండ్‌బా ల్, అథ్లెటిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభను కనబరి చాడు. టెన్తలో ప్రథమ శ్రేణిలో పాసై అక్కడే ఏపీఆర్జేసీలో ఇంటర్ బైపీసీలో చేరాడు. ఫస్టియర్ చదువుతున్న సమయంలో సాహసయాత్రలకు దరఖాస్తు చేసుకున్నా డు. నల్లగొండ జిల్లా భువనగిరిలో శిక్షణ పొంది.. పలు శిఖరాలను అధిరోహించాడు. ఇదే క్రమంలో కఠిన పరి స్థితులను తట్టుకునే సామర్థ్యం కనబరిచిన ఆనంద్‌ను ఎవరెస్ట్ యాత్రకు ఎంపిక చేశారు. ఎవరెస్ట్‌ను ఎక్కిన ఆనంద్‌కు ఐపీఎస్ అవ్వాలన్న ఆశయం ఉందని, అది కూడా కచ్చితంగా నెర వేరుతుందని అతని తల్లిదండ్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ఇందూరు బిడ్డకు జేజేలు
సాహసమే పూర్ణ ఊపిరి సిరికొండ/తాడ్వాయి, న్యూస్‌లైన్: సాహసమే ఆమె ఊపిరి. మనోధైర్యమే ఆమె బలం. అందుకే ఎవరెస్ట్ సైతం ఆమెకు తలవంచింది. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి అత్యంత చిన్న వయసులోనే ప్రపంచంలో ఎత్తయిన శిఖరాన్ని అధిరోహిం చింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి చెందిన గిరిజన బాలిక మాలావత్ పూర్ణ ఈ అరుదైన ఘనత సాధించింది. మాలావత్ దేవీదాస్-లక్ష్మి దంపతుల కూతురు పూర్ణ.. తాడ్వాయిలోని సాంఘిక సంక్షేమ గురుకు ల పాఠశాలలో ఇటీవ లే తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుంది. ఐదో తరగతి వరకు పాకాలలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివిన పూర్ణ చిన్నప్పటి నుంచే క్రీడల్లో ముందుండేది. గురుకుల పాఠశాలలో చేరిన తర్వాత ఉపాధ్యాయుల ప్రో త్సాహంతో పర్వతారోహణపై దృష్టి సారిం చింది. కఠోరమైన పరిస్థితులు : యాత్రలో భాగంగా 52 రోజుల పాటు సాహసమే ఊపిరిగా ముందుకు సా గిన పూర్ణ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. హిమాలయ పర్వతాన్ని అధిరోహించే సమయంలో 20 కిలోల బరువున్న దుస్తులను ధరించింది. తీవ్రమై న మంచు, చలి, తక్కువ ఆక్సిజన్, ప్రాణాంతక డెత్జోన్ను దాటడం వంటి ఎన్నో కఠోరమైన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంది. తమ ఊరి బిడ్డ ఉన్నత శిఖరాన్ని అధిరోహించిందని తెలియగానే పాకాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఎంతో గర్వంగా ఉంది నా కూతురు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం ఎంతో గర్వంగా ఉంది. మా పాప అంత పెద్ద గుట్టను, అంత చలిలో ఎక్కాల్సి ఉంటుందని సార్లు మొదట చెప్పగానే చాలా భయమేసింది. పంపించొద్దనుకున్నా. కాని పూర్ణనే నాకు ధైర్యం చెప్పింది. ఏం కాదు నాన్న నేను శిఖరాన్ని సులువుగా ఎక్కుతానని చెప్పి శిక్షణకు వెళ్లింది. చిన్నప్పుడు పూర్ణ ఎంతో స్పీడ్‌గా సైకిల్ తొక్కేది. చాలా వేగంగా కబడ్డీ ఆడేది. ఇలాంటి ఆటల వల్లనేనేమో అంత పెద్ద శిఖరాన్ని నా బిడ్డ ఎక్కగలిగింది. - మాలావత్ దేవీదాస్, పూర్ణ తండ్రి వద్దని ఏడ్చేశాను నా బిడ్డను అంత చలిలో అంత పెద్ద మంచు కొండను ఎక్కేందుకు తీసుకెళ్తామంటే వద్దని బాగా ఏడ్చేశాను. ఆ కొండ ఎక్కేటప్పుడు ఇబ్బందిగా ఉంటే ఇంటికి తిరిగి రావొచ్చు. లేదంటే ఇంకా ఏమైనా జరగొచ్చు అని సార్లు చెప్పిండ్రు. అక్కడికి పోవద్దని ఎంత చెప్పినా మా పూర్ణ అస్సలు వినలేదు. నాకైతే బాగానే భయమేసింది. నా బిడ్డ అంత పెద్ద కొండ ఎక్కిందని టీవీల్లో చూపిస్తుంటే ఎంతో ఆనందపడ్డాను. - మాలావత్ లక్ష్మి, పూర్ణ తల్లి -
ఎవరెస్టంత సంబురం
ఖమ్మం, న్యూస్‌లైన్: ఎవరెస్టు శిఖరాన్ని సాహసోపేతంగా అధిరోహించిన మన్యం బిడ్డ సాధనపల్లి ఆనంద్‌కుమార్‌ను జిల్లా ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఆనంద్ సాధించిన ఘన కీర్తి స్ఫూర్తిదాయమని అంటున్నారు. అతడు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. గొప్ప విజయం సాధించాడు ఆనంద్ గొప్ప విజయాన్ని సాధించాడు. ఎంతో శ్రమతో కూడుకున్న సాహసమే చేశాడు. అతడి పట్టుదలకు జిల్లా అధికార యంత్రాంగం తరఫున అభినందనలు. ఇలాంటివి సాధించడం చాలా అరుదు. ఇతని స్ఫూర్తి విద్యార్థులందరికీ అవసరం. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు ఆనంద్, ఆయన సహచరి పూర్ణను అభినందించారు. కంగ్రాట్స్... ఆనంద్ కీపిట్అప్.. - శ్రీనివాస శ్రీనరేష్, కలెక్టర్ సంకల్పబలం ఉండాలి ఆనంద్ సాధించిన విజయం గర్వకారణం. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడం కష్టమైన పని. ఎంతో సంకల్పబలం ఉంటేనే గానీ సాధ్యం కాదు. ఎత్తయిన కొండల మధ్య చిన్న వయసులో అత్యంత సాహసోపేత యాత్ర చేశాడు. విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆనంద్‌కు అభినందనలు. అతడిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులందరూ విజయాలు సాధించాలి. -సురేంద్రమోహన్, జాయింట్ కలెక్టర్ ఎవరెస్టుపై జిల్లా కీర్తి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని జిల్లాకు చెందిన విద్యార్థి సాధనపల్లి ఆనంద్‌కుమార్ అధిరోహించి జిల్లా కీర్తిని చాటాడు. ఆయన విజయం జిల్లాకే గర్వకారణం. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి అతిచిన్న వయసులోనే గొప్పసాహస కృత్యం చేయడం అభినందనీయం. ప్రమాదకరమని తెలిసినా పట్టువదలకండా ఈఘనతను సాధిం చడం గొప్ప విషయం. ఆనంద్ కుటుంబ సభ్యులతో పాటు అతడిని ప్రోత్సహించిన అధ్యాపకులు, స్నేహితులు, శిక్షకులకు అభినందనలు. ఆనంద్‌కు నా ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది. - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ స్ఫూర్తిగా తీసుకోవాలి మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థుకు సరైన శిక్షణ ఇస్తే ఉన్నతులుగా ఎదుగుతారని ఆనంద్ రుజువ చేశాడు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన ఆనంద్ జిల్లా విద్యార్థి కావడం జిల్లాకే గర్వకారణం. ఏపీఎస్డబ్ల్యూర్ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ విద్యార్థుల ప్రతిభను గుర్తించి, యాత్రకు అన్ని ఏర్పాటు చేయడంతోనే పేద విద్యార్థి పెద్ద రికార్డును సాధించాడు. ఇతర విద్యార్థులు ఆనంద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. -రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి అరుదైన రికార్డు సాధించాడు అరుదైన రికార్డును జిల్లా విద్యార్థి సొంత చేసుకున్న విషయం తెలియగానే ఉబ్బితబ్బుబ్బిపోయాను. గిరిజన ప్రాంతానికి చెందిన విద్యార్థి ఈ విజయం సాధించడం చరిత్రపుఠల్లో లిఖించదగిన విషయం. సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం చేయూత నిస్తుందనడానికి ఆనంద్ సాహస యాత్రే నిదర్శనం. ఆనంద్ మరెన్ని విజయాలు, రికార్డులు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. -వెంకటనర్సయ్య, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి దేశానికే గర్వకారణం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి ఎవరెస్టు శిఖరం అధిరోహించడం యావత్ భారతావనికే గర్వకారణం. జాతీయ జెండాను ఎవరెస్టు శిఖరంపై పాతిన జిల్లా విద్యార్థి ఆనంద్‌కు అభినందనలు. ప్రతిభావంతులను గుర్తించి వారి ప్రతిభకు మెరుగు పెడితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆనంద్ రుజువు చేశాడు. -పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎమ్మెల్యే తెలంగాణ బిడ్డ కీర్తి చాటాడు.. కనీస సౌకర్యాలకు కూడా నోచుకొని గిరిజన ప్రాంతం చర్ల మండలానికి చెందిన ఆనందర్ ఎవరెస్టు శిఖరం అధిరోహించడం దేశానికే గర్వకారణం. ప్రత్యేక రాష్ట్రం కల సాకారమవుతున్న తరుణంలో మనందరికీ ఆనందదాయక విషయం. అరుదైన సాహస యాత్ర చేసి విజయం సాధించి తెలంగాణ తేజాన్ని ప్రపంచం కీర్తిస్తోంది. పేద విద్యార్థిని ప్రొత్సహించిన ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్‌కు, సాహస యాత్రకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృ జ్ఞతలు. - ఆర్జేసీ కృష్ణ, విద్యావేత్త తెలుగు జాతి గర్వించ దగిన రోజు ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరం అధిరోహించడం తెలుగుజాతి గర్వించ దగిన విషయం. తెలుగుతేజాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిని జిల్లా విద్యార్థి ఆనంద్‌కు అభినందనలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన శుభ సందర్భంలో ఇలాంటి రికార్డులు జిల్లా విద్యార్థి సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. - కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాహస వీరుడికి సలాం.. ఎవరెస్టు శిఖరం అధిరోహించిన ప్రముఖుల జాబితాలో జిల్లా విద్యార్థి చేయడం సంతోషకరం. ఎంతో సాహసం, ఓర్పు, పట్టుదల ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఎత్తయిన శిఖరంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన ఆనంద్‌కు అభినందనలు. పట్టుదల ఉంటే పేదరికం అడ్డురాదని రుజువు చేసిన సాహస వీరునికి, మట్టిలో మాణిక్యాన్ని గుర్తించి ప్రోత్సహించిన ఐఏఎస్ అధికారికి సలాం. - శ్రీనివాస్, ఖమ్మం కమీషనర్ -
సాహస యాత్ర సం'పూర్ణం'
ఎవరెస్ట్‌ను అధిరోహించిన తెలుగు తేజాలు...14 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాలావత్ పూర్ణ * అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు * విజయ పతాకం ఎగరేసిన ఆనంద్ కుమార్ * 52 రోజుల పాటు 30 మంది బృందంతో సాగిన ట్రెక్కింగ్ * ఆదివారం ఉదయం 6 గంటలకు అపూర్వ ఘట్టం * సత్తా చాటిన గురుకుల విద్యార్థులు * కాబోయే ప్రధాని మోడీ అభినందనలు సాక్షి, హైదరాబాద్: ఆకాశాన్నంటే ఎవరెస్ట్ శిఖరంపై తెలుగు తేజాలు వెలుగులీనాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఇద్దరు పేద విద్యార్థులు ఆదివారం సూర్యోదయ వేళ ఎవరెస్ట్ శిఖరాగ్రంపై అడుగుపెట్టారు. దీంతో సరికొత్త రికార్డు కూడా నమోదైంది. ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా 14 ఏళ్ల మాలావత్ పూర్ణ రికార్డు సృష్టించింది. మొత్తం 30 మంది పర్వతారోహకుల బృందంలో ఉదయం ఆరు గంటలకు మొట్టమొదటగా అక్కడకు చేరుకున్న పూర్ణ ఈ అరుదైన ఘనత సాధించింది. మరో విద్యార్థి 16 ఏళ్ల సాధ నపల్లి ఆనంద్‌కుమార్ అరగంట తేడాతో శిఖరం పైకి చేరుకున్నాడు. మిగిలిన 28 మంది పర్వతారోహకులు మరో రెండు గంటల తర్వాతే యాత్ర పూర్తి చేయగలిగారు. సముద్రమట్టానికి 8848 మీటర్ల ఎత్తుకు వెళ్లిన ఈ బృందం అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తిరుగు ప్రయాణమైంది. అత్యంత ప్రమాదకరమైన డెత్జోన్ నుంచి బేస్ క్యాంప్ వైపు ఈ బృందం వెనక్కు వస్తోంది. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంయుక్త ఆధ్వర్యంలో 52 రోజుల క్రితం ఈ యాత్ర ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాకాల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు లక్ష్మీ, దేవదాస్‌ల కుమార్తె మాలావత్ పూర్ణ స్వేరోస్ (14) ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇక ఖమ్మం జిల్లా చార్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన కొండలరావు ఓ సైకిల్ షాపులో దినసరి కూలీ. ఇతడి కుమారుడు ఆనంద్‌కుమార్ (17) అన్నపురెడ్డిపల్లిలో ఉన్న గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరి శిక్షకుడు శేఖర్‌బాబు నేతృత్వంలో ఈ సాహస యాత్ర జరిగింది. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసే యత్నాల్లో భాగంగా ఈ సాహస యాత్ర కోసం తొలుత 150 మందిని ఎంపిక చేశారు. వీరిలో 20 మందికి డార్జిలింగ్‌లోని ప్రఖ్యాత సంస్థలో ట్రెక్కింగ్‌పై శిక్షణనిచ్చారు. తర్వాత వీరిలో నుంచి 9 మంది గతంలో ఇండో-చైనా సరిహద్దుల్లో నిర్వహించిన సాహసయాత్రలో పాల్గొన్నారు. అత్యంత కఠిన పరిస్థితులను సైతం ఎదుర్కునే సామర్థ్యం కనబరిచిన పూర్ణ, ఆనంద్ కుమార్ ఎవరెస్ట్ యాత్రకు ఎంపికయ్యారు. గర్వపడేలా చేశారు: మోడీ అతి చిన్న వయస్సులోనే ఎవరెస్ట్‌ను అధిరోహించిన మాలవత్ పూర్ణతో పాటు ఆనంద్‌కుమార్‌కు కాబోయే ప్రధాని, బీజేపీ అగ్రనేత నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘ఈ విషయం చదివినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందనలు. వారు మనం గర్వపడేలా చేశారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వార్తకు సంబంధించిన కథనాన్ని కూడా ఆన్లైన్లో పోస్ట్ చేశారు. దేశం గర్వించేలా నిలిచారు: వైఎస్ జగన్ చిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. చిన్నతనంలోనే గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశం యావత్తూ గర్వపడేలా అద్భుతం సాధించారని కొనియాడారు. పూర్ణ, ఆనంద్‌లు మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిదాతలుగా నిలిచారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వారిని తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు, గురువులకూ ఆయన అభినందనలు తెలియజేశారు. టీపీసీసీ తరఫున రూ.5 లక్షలు: పొన్నాల అవకాశాలను అందిపుచ్చుకుని పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన సాహస బాలురకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నజరానా ప్రకటించింది. ఈ ఘనత సాధించిన రాష్ర్ట విద్యార్థులు మాలావత్ పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు రూ. 5 లక్షల చొప్పున నగదు పురస్కారంతో పాటు, వారిని ఘనంగా సన్మానించనున్నట్లు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. ఇక పూర్ణ, ఆనంద్‌లను టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కూడా అభినందించారు. ఎవరెస్ట్ అధిరోహణతో తెలంగాణ గౌరవాన్ని హిమాలయాలంత ఎత్తుకు పెంచారని శ్లాఘించారు. -
‘మిస్టర్ ఎడ్’
సంక్షిప్తంగా... ఎడ్మండ్ హిల్లరీ కొండల్ని ఎక్కడం శ్రమతో పని. డబ్బుతో పని. ఎడ్మండ్ శ్రమించగలడు. కానీ డబ్బుకోసం ఎలా శ్రమించాలో అతడికి తెలీదు. లక్ష్యమే అన్నీ నేర్పుతుంది. అందుకే జీవితానికొక లక్ష్యం ఉండాలంటారు. ఎడ్మండ్ లక్ష్యం... పెద్ద పెద్ద పర్వతాలన్నిటినీ ఎక్కేయడం. అప్పటికింకా ఎవరెస్టు మీద ఎడ్మండ్ దృష్టి పడలేదు. అందుకు రెండు కారణాలు. ఒకటి : ఎడ్మండ్ ఉద్యోగ ప్రయత్నంలో ఉండడం. ఇంకోటి : ఎవరెస్ట్ వేల కిలో మీటర్ల దూరంలో ఉండడం. తేనెటీగల పెంపకం అతడి పార్ట్ టైమ్ ఉపాధి. 1943లో రాయల్ న్యూజిలాండ్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎడ్మండ్‌కు నేవిగేటర్‌గా ఉద్యోగం వచ్చింది. మూడేళ్ల విరామం తర్వాత ఎడ్మండ్ మనసు మళ్లీ కొండగాలి మీదికి మళ్లింది. హ్యారీ ఏరెస్, మిక్ సల్లివాన్, రూత్ ఆడమ్స్‌తో కలిసి అతడు 1948 జనవరి 30న న్యూజీలాండ్‌లోని ఎత్తై శిఖరం మౌంట్ కుక్‌ను ఎక్కాడు. ఆ తర్వాత ఐదేళ్లకు 1953లో ఎడ్మండ్కి, అతడి మిత్రుడు జార్జి లోవేకి ఒక వెచ్చని మధ్యాహ్నం ‘జాయింట్ హిమాలయన్ కమిటీ’ నుంచి ఒక లేఖ అందింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వచ్చిన ఆహ్వానం అది!! 400 మంది పర్వతారోహకులు ఉన్న ఈ బృందానికి బాస్.. కల్నల్ జాన్ హంట్.‘‘మిస్టర్ ఎడ్మండ్... మీరు, టెన్జింగ్ నార్గే కలిసి బృందంలోని ఒక జట్టును లీడ్ చేయబోతున్నారు’’ అన్నారు కల్నల్. బహుశా అప్పుడతడికి తెలియకపోవచ్చు తమ జట్టే ఎవరెస్టును జయించబోతోందని! ‘ఇంత పెద్ద శిఖరాన్నా మనం ఎక్కబోతున్నాం’ అని ఎక్స్‌పెడిషన్‌లో ఏ ఒక్కరూ అనుకోలేదు. ‘ఇంత అందమైన శిఖరాన్నా చేరుకోబోతున్నాం’ అని పులకరించిపోయారు. పన్నెండు వేల అడుగుల పైకి వచ్చేశారు. ‘‘అసలు ప్రయాణం ఇక్కడి నుంచే మొదలౌతుంది’’ అన్నారు షెర్పాలు. ఎక్స్‌పెడిషన్‌లో భాగం ఉన్న గైడ్లు వీరు. ఏప్రిల్ 12 నాటికి జట్లు 17, 900 అడుగుల ఎత్తుకు చేరుకున్నాయి. మే 26 న టామ్ బోర్డిల్లన్, చార్లెస్ ఇవాన్స్ మరింత ముందుకు బయల్దేరారు. ఇక నిలువుగా 300 అడుగులు ఎక్కితే శిఖరాగ్రమే. కానీ హిమాలయాలు వారికి అనుకూలించలేదు. మరో రెండు రోజులు గడిచాయి. ఎక్కడివారు అక్కడే ఉండిపోతున్నారు. కొందరైతే బేస్‌క్యాంప్‌కు పరిమితమైపోయారు. ఎడ్మండ్ జట్టులోని ఐదుగురు సభ్యులు అతికష్టం మీద ఐదో బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. మెల్లిగా అక్కడికి చేరుకున్నారు ఎడ్మండ్, నార్గే. మే 29 రాత్రి. నిద్రముంచుకొస్తోంది కానీ కనురెప్పలు పడడం లేదు. ఆక్సిజన్ పీలుస్తున్నారు కానీ శ్వాస అందట్లేదు. కొయ్య మధ్య చీలికలో ఇరుక్కుపోయిన మేకుల్లా ఇద్దరూ బేస్‌క్యాంప్ గుడారంలో చిక్కుకుపోయారు. గుడారం నుంచి మెల్లిగా పాక్కుంటూ బయటికి వచ్చారు ఎడ్మండ్, నార్గే. ఒకసారి చచ్చిబతికాక ఇక చావుకు భయమేమిటి? మంచుతో డీకొట్టడానికి సిద్ధమయ్యారు. మొదట ఎడ్మండ్ హిల్లరీ ఆ ఏకశిల అంచులను పట్టుకుని పైకి లేచాడు. వెనకే టెన్జింగ్ నార్గే ఎక్కాడు. ఎడ్మండ్ గంభీరమైన మనిషి. అంత పెద్ద విజయం సాధించి కూడా అయన పెద్దగా అరవలేదు. తన కోటు లోపలి నుంచి కలర్‌ఫిల్మ్ లోడ్ చేసి ఉన్న కెమెరాను బయటికి తీశాడు. ‘‘మిస్టర్ ఎడ్’’ అని పిలిపించుకోవడం ఎడ్మండ్ హిల్లరీకి ఇష్టం. ఎంత ఎత్తుకు చేరినా మనిషి మనిషిగా ఉండడమే నిజానికి శిఖరాగ్రాన్ని చేరడం అంటారు ఎడ్మండ్. ఎనభై ఎనిమిదేళ్ల వయసులో 2008లో ఆయన చనిపోయారు. ఎడ్మండ్ ‘శిఖరైక్యం’ పొందారని అనడానికి కూడా లేకుండా ఆయన తన మరణాన్ని సైతం నిరాడంబరీకరించుకున్నారు! 8848 మీటర్ల తర్వాత ఎవరెస్టు శిఖరం అంతమౌతుంది. 58వ యేట అమరుడైన ఎడ్మండ్ అంతకన్నా ఎత్తయిన శిఖరంలా నిలిచిపోయారు. -
‘ఎవరెస్ట్’పై విరిగిపడ్డ మంచుచరియలు
12 మంది నేపాలీ షెర్పాల మృతి కఠ్మాండు: ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తై పర్వత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్‌పై శుక్రవారం భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. విదేశీ పర్వతారోహకులకు పోర్టర్లు, గైడ్లుగా వ్యవహరించే స్థానిక షెర్పాలు ఎవరెస్ట్ బేస్ క్యాంపు నుంచి మొదటి క్యాంపు వరకూ అధిరోహణ చేపడుతుండగా సుమారు 5,800 మీటర్ల (సుమారు 19 వేల అడుగులు) ఎత్తులో ఉదయం 6.45 గంటలకు ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 12 మంది షెర్పాలు మృతిచెందగా మరో 10 మంది గాయపడ్డారు. మరో నలుగురు గల్లంతయ్యారు. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రభుత్వం సుమారు రూ. 25 వేల చొప్పున తక్షణ సాయాన్ని ప్రకటించింది.