ఎవరెస్ట్‌పై మంచు బీభత్సం..
కఠ్మాండు: భూకంపం తీవ్రతకు ఎవరెస్ట్ పర్వతంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై మంచు కొండలు విరిగిపడడంతో 10 మంది పర్వతారోహకులు మరణించారని అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారన్నారు. ప్రమాదంలో పర్వతారోహకులు చెల్లాచెదురైనట్లు వివరించారు.
పర్వతారోహకుల ట్వీట్‌లు
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని వచ్చిన అనేకమంది పర్వతారోహకులు భూకంపం ధాటికి బేస్ క్యాంపుల్లో చిక్కుకున్నారు. ఈ దుర్ఘటన నుంచి తేరుకున్న కొందరు తమ ఆత్మీయులకు క్షేమ సమాచారాన్ని ట్వీటర్‌లో అందించారు. ఇంగ్లండ్‌కు చెందిన డేనియల్ మజుర్ అనే పర్వతారోహకుడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ‘తీవ్ర భూకంపం ఇప్పుడే ఎవరెస్టును తాకింది. బేస్‌క్యాంపు పూర్తిగా ధ్వంసమయింది. మా బృందంలోని సభ్యులంతా బేస్‌క్యాంపు 1లో చిక్కుకున్నాం. దయచేసి మా క్షేమం కోసం ప్రార్ధించండి’ అని ట్వీట్ చేశారు. మరి కొద్ది నిమిషాల తరువాత ‘షాక్‌నుంచి తేరుకొని చూస్తే బృందంలోని సభ్యులంతా బేస్‌క్యాంప్‌లో వేలాడుతున్నాం. మంచు చరియలు మార్గాన్ని ధ్వంసం చేశాయి’ అని ట్వీట్ చేశారు.
మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మజర్ మరోమారు ట్వీట్ చేస్తూ ‘ బేస్ క్యాంపు 1 పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మా బృందం మొత్తం ఈ దుర్ఘటనలో చిక్కుకుంది’ అన్నారు. ఈ ట్వీట్‌కు సమాధానమిస్తూ అతని స్నేహితుడు మజుర్ ‘సురక్షిత స్థానానికి చేరుకో డేనియల్.. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం.. నువ్వు సరక్షితంగా ఇంటికి చేరుకుంటావు’ అని ట్వీట్ చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమెరికాకు చెందిన అడ్రియాన్ బల్లింజర్ ‘ భూకంపం ఇప్పుడే ఎవరెస్ట్ బేస్‌క్యాంపును తాకింది. పెద్ద మొత్తంలో రాళ్లు, మంచు పెళ్లలు విరిగి పడుతున్నాయి. మేమంతా సురక్షితంగా ఉన్నాము. దక్షిణ భాగంలో ఉన్నవారు కూడా సురక్షితంగానే ఉంటారని భావిస్తున్నాం.. బలమైన ప్రకంపనలు ఉత్తర భాగంలో కొనసాగుతూనే ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు.