![Nepali climber Ngimi Tenji Sherpa Dies Sitting Position - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/15/Everest_Sherpas_Passed_Away.jpg.webp?itok=gGGqtApc)
ప్రతీకాత్మక చిత్రం
మంచు పర్వతాల్లో ఎవరెస్ట్ పర్వత శిఖరం అంచున.. విషాద ఘటన చోటుచేసుకుంది. ఎవరెస్ట్‌ను అవలీలగా అధిరోహిస్తూ వచ్చిన ఓ నేపాలీ పర్వతారోహకుడు అనూహ్యరీతిలో గురువారం కన్నుమూశాడు. కూర్చున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. అది చూసి తోటి పర్వతారోహకులు కన్నీటి పర్యంతం అయ్యారు.
ఎంజిమి టెన్జీ షెర్పా(38) జీవితం వేల అడుగుల ఎత్తులో విషాదంగా ముగిసింది. ఎవరెస్ట్ పై కాస్తంత విశాలంగా ఉండే ఓ ప్రదేశాన్ని ఫుట్ బాల్ ఫీల్డ్ అని పిలుస్తారు. ఎవరెస్ట్ మొత్తమ్మీద పర్వాతారోహకులకు సురక్షితమైన ప్రదేశం అదే. అక్కడే అతను కూర్చున్న స్థితిలో విగతజీవుడై కనిపించాడు. ఇది ఇతర పర్వతారోహకుల గుండెల్ని కరిగించి వేసింది.
అతడు ఎలాంటి ప్రమాదానికి గురికాలేదని, ఎత్తయిన ప్రదేశానికి చేరిన సమయంలో తీవ్ర అస్వస్థత కలగడంతోనే ప్రాణాలు విడిచాడని ఇంటర్నేషనల్ మౌంటైన్ గైడ్స్ భాగస్వామ్య సంస్థ బేయుల్ అడ్వెంచర్స్ కు చెందిన త్సెరింగ్ షేర్పా వెల్లడించారు. బహుశా ఎంజిమి షెర్పా ఎవరెస్ట్ పై క్యాంప్-2కు వివిధ రకాల సామగ్రి తీసుకెళుతుండగా, ఈ విషాదం చోటుచేసుకుని ఉంటుందని త్సెరింగ్ అంటున్నారు.
అతడిని తాము చనిపోయిన స్థితిలో ఉండగా గుర్తించామని, ఆ సమయంలో అతడి వీపునకు బ్యాక్ ప్యాక్ అలాగే ఉందని తెలిపారు. నేపాల్‌కు చెందిన షెర్పాలు ఎవరెస్ట్ పర్వతారోహణలో రాటుదేలినవారిగా గుర్తింపు పొందారు. అందుకే, ఇక్కడికి వచ్చే ఇతరదేశాల పర్వతారోహకులు ఎవరెస్ట్ ను అధిరోహించే క్రమంలో ఇక్కడి షెర్పాల సాయం తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో ఇది మూడో మరణంగా అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment