
ఎవరెస్ట్ ఎక్కాలని వెళ్లి.. ప్రాణాలు కోల్పోయాడు!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని జయించాలని బయల్దేరిన మరో భారతీయుడు.. ఆ కొండల్లోనే తుది శ్వాస విడిచాడు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని జయించాలని బయల్దేరిన మరో భారతీయుడు.. ఆ కొండల్లోనే తుది శ్వాస విడిచాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రవికుమార్ మృతదేహాన్ని షేర్పాలు గుర్తించారు. కానీ, మృతదేహాన్ని వెలికితీయడం అసాధ్యంగా ఉందని తుప్‌డెన్ షేర్పా చెప్పారు. మామూలుగా వెళ్లే మార్గం కంటే దాదాపు 650 అడుగుల లోతుకు మృతదేహం పడిపోయి కనిపించిందన్నారు. గడిచిన వారం రోజుల్లో అమెరికా, స్లొవేకియా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పర్వతారోహకులు కూడా ఎవరెస్ట్ మీద మరణించారు. శనివారం నాడు ఎవరెస్ట్ ఎక్కుతుండగా కుమార్ అనారోగ్యం పాలయ్యారు. దాంతో సమీపంలో ఉన్న క్యాంపు వరకు కూడా చేరుకోలేకపోయారు. అయితే అతడితో పాటు ఉన్న నేపాలీ షేర్పా గైడ్ మాత్రం క్యాంపు వరకు వెళ్లారు. గైడ్‌కు కూడా అనారోగ్యంగానే ఉన్నా, ఎలాగోఆలా 8వేల మీటర్ల ఎత్తున ఉన్న సౌత్‌కోల్ వద్ద క్యాంపు వరకు వెళ్లగలిగాడు.
శనివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రవికుమార్, ఆయన గైడ్ కలిసి దాదాపు 8850 మీటర్ల ఎత్తు వరకు వెళ్లారు. అప్పటికే చాలా ఆలస్యం అయినట్లు లెక్క. వాళ్లు తిరిగి వచ్చేటపుడు వాళ్లతో ఎక్కువమంది పర్వతారోహకులు లేరు. రవికుమార్‌తో పాటు అమెరికాకు చెందిన పర్వతారోహకుడు రోలండ్ ఇయర్‌వుడ్ (50) కూడా మరణించినట్లు పర్యాటక శాఖ అధికారి కమల్ ప్రసాద్ అధికారి నిర్ధారించారు. అయితే, వాళ్ల మృతదేహాలను కిందకు తీసుకురాగలమా లేదా అన్న విషయాన్ని మాత్రం ఇంకా చెప్పలేకపోతున్నారు. స్లొవేకియాకు చంఎదిన వ్లాదిమిర్ స్ట్రాబా (50) కూడా ఆదివారం మరణించారు. ఆయన మృతదేహాన్ని మాత్రం సౌత్ కోల్ క్యాంపు వద్దకు తీసుకురాగలిగారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రాన్సెకో ఎన్రికో మార్చెటి (54) చైనా వైపు ఉన్న ఎవరెస్ట్‌పై మరణించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎవరెస్ట్ మీద మరణించినవారి సంఖ్య ఆరుకు చేరింది.