ఆ ఫీల్‌తోపాటు.. ఫైర్‌ కూడా నీలిమలో ఉంది! | Neelima Pudota, the first woman from Hyderabad to climb Mount Everest | Sakshi
Sakshi News home page

రెక్కల పూదోట

Published Thu, Sep 27 2018 12:03 AM | Last Updated on Thu, Sep 27 2018 11:50 AM

Neelima Pudota, the first woman from Hyderabad to climb Mount Everest  - Sakshi

నాలుగు అడుగులు వేయాలంటే  ఓపికుండాలి. పది అడుగులు వేయాలంటే ఏదైనా పనిపడాలి. ఊరు దాటాలంటే పెద్ద ప్రయాణమే చేయాలి. రాష్ట్రాలు, దేశాలు దాటాలంటే..  సముద్రాలపై సాగిపోవాలంటే..శిఖరాలపై విహరించి రావాలంటే... ‘నింగీ నాదే.. నేలా నాదే’ అనే ఫీల్‌ ఉండాలి. ఆ ఫీల్‌ నీలిమ పూదోటలో ఉంది.  ఫీల్‌తో పాటు.. నిలువనివ్వని ఫైర్‌ కూడా ఆమెలో ఉంది!

గుజరాత్, మహారాష్ట్రలను చుట్టి... కోటల బురుజులనెక్కి చరిత్ర ఆనవాళ్లను వీక్షించింది. సహ్యాద్రి శ్రేణుల ఆరాలు తీసింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పశ్చిమ కనుమల పాయలను శోధించింది. తమిళనాడు నుంచి హంపి వరకు గొప్ప నిర్మాణాలను దుర్భిణీ వేసి వెతికింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకృతి పులకింతలను చూసి మైమరిచిపోయింది. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, మోనాస్ట్రీలు, మ్యూజియాలనూ చూసింది. మంచుపర్వతాల ముందు మోకరిల్లి... స్టాక్‌ కాంగ్రీ, మెరా, ఎవరెస్టు శిఖరాలనధిరోహించింది. ఖండం దాటి అమెరికాలో స్మోకీ మౌంటెయిన్‌ పీక్‌లను తాకింది. ఆఫ్రికాకెళ్లి కిలిమంజరో పర్వతశ్రేణుల్లో మారే రంగుల్ని ఆస్వాదించింది. అండమాన్‌ దీవులను చూసి సముద్రగర్భంలోనూ ప్రకృతి సౌందర్యం తక్కువేం కాదనుకుంది. ప్రపంచంలోని వైవిధ్యతతో అవగాహన స్థాయుల్ని విస్తరింపజేసుకున్నాను... అంటోంది నీలిమ పూదోట!

శిఖరాన్ని తాకాలనుకుంది!
నీలిమ హైదరాబాద్‌ అమ్మాయి. ఆమె తల్లి కొండవీటి పాప రూరల్‌ డెవలప్‌మెంట్‌లో ఉన్నతోద్యోగి. తండ్రి శౌరయ్య ఆర్మీలో పనిచేశారు. తల్లిదండ్రులతో నీలిమ చిన్నప్పటి నుంచి పర్యటిస్తూనే ఉంది. ఏడేళ్ల వయసులో తమిళనాడుతో మొదలైన నీలిమ పర్యాటక ప్రస్థానం ఖండాంతరాలకు విస్తరించింది. చిన్నప్పుడు అందమైన ప్రదేశాలను చూడడంలో సంతోషం ఉండేది. తండ్రితోపాటు ట్రెక్కింగ్‌ చేసేది. సిక్కింలో కాంచన్‌జంగను చూసి, శిఖరాన్ని తాకాలని ముచ్చటపడింది. ‘ఇది పర్వత శిఖరం. దీన్ని అధిరోహించడం అంటే మామూలు ట్రెక్కింగ్‌ చేసినట్లు కాదు’ అన్నారు వాళ్ల నాన్న. పర్వతారోహణ చేయాలనే కోరిక అప్పుడు పుట్టిందంటోంది నీలిమ. సోలో ట్రావెలింగ్‌తో సమాజాన్ని అర్థం చేసుకునే కోణం విస్తరించిందంటోందామె.

ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకమే
‘‘ప్రతి ప్రదేశం, ప్రతి దేశం వాటికవే గొప్పవి. దేనినీ మరో దానితో పోల్చడానికి వీల్లేదు. ప్రతి ఒక్క ప్రాంతానికీ ఆ ప్రాంతానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. అక్కడి భౌగోళికత, నాగరకత, ఆహారం, జీవనశైలి అన్నింటిలోనూ భిన్నత్వం కనిపిస్తుంది. ఆ వైవిధ్యతను ఆస్వాదించడం పర్యటనలతో సాధ్యమవుతుంది. ఒక కొత్త ప్రదేశానికి వెళ్లి వచ్చాక ఆ వివరాలను ఇంట్లో వాళ్లతో కానీ, స్నేహితులతో కానీ చెప్పేటప్పుడు ‘అక్కడ మనలాగ కాదు, కాఫీలో పాలే ఉండవు, బ్లాక్‌ కాఫీ తాగుతారు, లేదా కొద్దిపాలతో నీళ్లలా తాగుతారు...’ అని మొదలుపెడుతుంటారు.  ప్రతి ఒక్కరి జీవనశైలిని యథాతథంగా స్వీకరించాలి తప్ప మన జీవనశైలితో అన్వయించి లోపాలు పట్టకూడదు. మన కల్చర్‌ గ్రేటే, అయితే మన కల్చరే గ్రేట్‌... అని తీర్పు ఇచ్చేయకూడదు. అలాగే నమ్మకాలు, విశ్వాసాలు కూడా. సిల్లీగా అనిపించినా సరే... ఎదుటి వారి విశ్వాసాన్ని గౌరవించగలగాలి. 

పట్టపగలు చుక్కల కోసం
గత ఏడాది ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడడానికే అమెరికాకు వెళ్లాను. 99 ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం అది. అప్పట్లో ఐన్‌స్టీన్‌ థీరీ ఆఫ్‌ రిలేటివిటీని నిర్ధారించుకోవడానికి చేసిన ప్రయత్నాలు గుర్తొచ్చి అలాంటి సూర్యగ్రహణం మళ్లీ వస్తుంటే వెళ్లాను. టెనాన్సీలో రెండు నిమిషాల నలభై సెకన్ల పాటు పూర్తి సూర్యగ్రహణం ఉండింది. పట్టపగలే చిమ్మచీకట్లు ముసురుకున్నాయి, ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. ఒక ప్రదేశానికి వెళ్లే ముందు దాని గురించి తెలుసుకుంటే చూడడంలో థ్రిల్‌ ఉంటుంది.  

నక్షత్రాల కోసం తలదించాలి
భూమి అంచులను చూడడం అంటే కవితాత్మకమైన వ్యక్తీకరణగానే చూస్తాం. కానీ ఎవరెస్టును అధిరోహించేటప్పుడు భూమి వంపు కనిపిస్తుంది. మరో విచిత్రం ఏమిటంటే... నక్షత్రాల కోసం తల పైకెత్తి చూడడమే మనకు అలవాటు. అదే అలవాటుతో ఎవరెస్టు ఆరోహణలో ఉన్నప్పుడు తల పైకెత్తి చూస్తే ఒక దశలో పైన ఏమీ కనిపించదు. మనం దిగ్ఞ్మండలం కంటే ఎత్తులో ఉంటాం. మన ఎదురుగా, కిందగా కనిపిస్తాయి నక్షత్రాలు. ఎవరెస్టును అధిరోహించడం వల్ల జీవితం విలువ తెలిసింది. మొదటి సారి 2015లో నేపాల్‌ వైపు నుంచి మొదలుపెట్టాను. బేస్‌ క్యాంపు చేరే సరికే భూకంపం ఎవరెస్ట్‌ను కుదిపేసింది. ఆ తర్వాత ఏడాది చైనా నుంచి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నాను. 

రోజూ అమ్మకు ఉత్తరం
ఫొటో వాస్తవాలకు దర్పణమే, కానీ ఎమోషన్స్‌ను వ్యక్తం చేసేది అక్షరమే. ఎన్ని ఫొటోలు తీసుకున్నా సరే, అప్పటి నా అనుభూతిని రాయకుంటే తృప్తి ఉండదు. ఎవరెస్టు ఎక్కినన్ని రోజులూ ప్రతిరోజూ ఆ రోజు అనుభవాలను, అనుభూతులను స్క్రాప్‌ బుక్‌లో అమ్మకు ఉత్తరాలుగా రాసేదాన్ని. ఎవరెస్టు పర్వతారోహణలో నాకేదైనా జరిగితే ఈ బుక్‌ని తప్పకుండా అమ్మకు చేర్చాలని మా షెర్పాలకు చెప్పేదాన్ని. ఆ అనుభవాలనే ‘ఫ్రమ్‌ ఎవరెస్ట్‌ విత్‌ లవ్‌’ పేరుతో పుస్తకంగా తెచ్చాను.

ఎత్తులో ఉన్న పోస్టాఫీస్‌ నుంచి
ప్రతి పర్యటననూ ఒక తీపి గుర్తుగా మలుచుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. వెళ్లిన చోటు నుంచి ఉత్తరం రాస్తాను. ఆ ఊరి పోస్టల్‌ స్టాంప్‌తో అది ఆ పర్యటనకు గుర్తుగా ఉండిపోతుంది. సబర్మతి ఆశ్రమానికి పోస్టల్‌ చార్జెస్‌ మినహాయింపు ఉంది. అక్కడ ఉత్తరాన్ని పోస్ట్‌ చేస్తే చరఖా గుర్తు స్టాంపు వేస్తారు. నేపాల్‌లోని నామ్‌ చే బజార్‌ నుంచి కూడా ఉత్తరం రాశాను. ఎల్తైన హిమాలయాలకు అది గేట్‌ వే. నామ్‌ చే బజార్‌ పోస్టాఫీస్‌ పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఉత్తరాలు రాసే అలవాటుతోనే నా పుస్తకంలో కూడా ఒక పోస్ట్‌ కార్డు జత చేశాను. నా అడ్రస్‌తోపాటు మా షెర్పా క్యాంప్‌ అడ్రస్‌ కూడా ఉంటుంది. పుస్తకం చదివిన తర్వాత పాఠకులు తమ అనుభవాలను రాసి పోస్ట్‌ చేయాలనేది నా కోరిక. 

దొరికింది తినాలి
నేను శాకాహారినే కానీ, మౌంటనియరింగ్‌ ఫిట్‌నెస్‌ కోసం వెళ్లినప్పుడు నేను అవి తినను, ఇవి తినను అంటే ఆ క్షణంలోనే వెనక్కి పంపేస్తారు. ట్రిప్‌లో ఉన్నప్పుడు రెడ్‌మీట్‌ తినాలి, హిమాలయాల్లో ఉండే యాక్‌ (జడల బర్రె) మాంసం కూడా తిన్నాను. ఎవరెస్టును అధిరోహించాలనే పిచ్చికోరిక ఇతర అడ్డంకులన్నింటినీ అధిగమించేలా చేసింది. మెకట్రానిక్స్‌లో ఇంజనీరింగ్‌ చేసి... విప్రో, కాగ్నిజెంట్‌లలో ఉద్యోగం చేసిన నేను మౌంటనియరింగ్‌ కోసమే ఉద్యోగం మానేశాను. కాశ్మీర్‌లోని స్టాక్‌కాంగ్రీ, నేపాల్‌లోని మెరా శిఖరాలను అధిరోహించడం కూడా నన్ను నేను ఎవరెస్టు అధిరోహణకు సిద్ధం చేసుకోవడానికే. ఎవరెస్టు స్వచ్ఛదనం ఒకరకమైన ఆనందాన్నిస్తే... గంటగంటకీ రంగులు మార్చుకునే కిలిమంజరో పర్వతం వైవిధ్యమైన అనుభూతిని మిగిల్చింది’’. 
ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
ఫొటోలు : శివ మల్లాల

చెట్టుకి మొక్కిన తర్వాతే
‘‘కిలిమంజరో పర్వతారోహణ కోసం ఆఫ్రికాలోని టాంజానియాకు వెళ్లాను.  అక్కడి మహిళల్లో ఆత్మవిశ్వాసం చాలా మెండు. మనకు అందం విషయంలో కొన్ని అభిప్రాయాలు స్థిరపడిపోయాయి. ఆఫ్రికాదేశాల్లో మహిళలు వాళ్ల దేహాకృతి పట్ల కానీ మేనిఛాయ గురించి కానీ ఏ మాత్రం బిడియపడరు. రంగు, ఫిజిక్‌ని బట్టి దుస్తుల ఎంపిక ఉండాలనే నియమాలు పాటించడం వంటి పరిధులు విధించుకోకుండా తమకు ఇష్టమైన రంగులను ధరిస్తారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు కూడా. వాళ్ల జుత్తు సాఫీగా ఉండదు. సాఫీగా లేదని బెంగపడుతూ, సాఫీగా మారడానికి ప్రయత్నాలేవీ చేయరు. బిరుసుగా ఉన్న జుట్టునే రకరకాలుగా దువ్వి చాలా క్రియేటివ్‌గా జడలు వేస్తారు. వాటిని కార్న్‌ బ్రైడ్స్‌ అంటారు. ఒకరు వేసిన స్టైల్‌ని మరొకరు అనుసరించరు. ఆ జడల మీద ఒక అధ్యయనమే చేయవచ్చు. వాళ్లు నేచర్‌ను గౌరవిస్తారు. నేచర్‌తో కలిసి జీవిస్తారు. సంగీతం వాళ్ల జీవితంలో ఒక భాగం. రోజూ సాయంత్రానికి వీధి మలుపులో ఒక సంగీత కచేరీ ఉంటుంది. కచేరీ అంటే అక్కడ శాస్త్రబద్ధంగా ఇలాగే ఉండాలనే నియమాలుండవు. ఎన్ని జాతులున్నాయో అన్ని రకాల సంగీత బాణీలుంటాయి. సంగీత సాధనాల తయారీకి కలప కోసం చెట్టును నరికే ముందు ప్రార్థిస్తారు. ‘సంగీత సాధనాల పేర్లు చెప్పి, వాటి కోసమే నిన్ను బాధపెడుతున్నాం. అనుమతించు’ అని చెట్టును ప్రార్థిస్తారు. ప్రకృతికి హాని కలిగించరు. వాళ్లకు సారవంతమైన నేలలున్నాయి. బయటి ప్రపంచంతో ఎక్స్‌పోజర్‌ తక్కువ, కానీ హాయిగా జీవించడం ఎలాగో వాళ్ల దగ్గర నేర్చుకోవచ్చు’’.

ఉదయం ఐదింటికి నిద్రలేస్తాను, కొంతసేపు మెడిటేషన్, పుస్తకాలు చదువుతాను. కేబీఆర్‌ పార్కులో ఒకటిన్నర – రెండు గంటల సేపు ఫిట్‌నెస్‌ వర్కవుట్స్‌ చేస్తాను. ఆ తర్వాత పది గంటల వరకు యోగా క్లాస్‌లు తీసుకుంటాను. అప్పుడు కొంత రెస్ట్‌. సాయంత్రం నాలుగున్నర నుంచి మళ్లీ యోగా క్లాస్‌లుంటాయి. భగవద్గీత, శంకరాచార్య బోధనలు, యోగా పుస్తకాలు ఎక్కువగా చదువుతాను.పర్వతారోహకులకు గైడెన్స్‌ ఇవ్వడంతోపాటు అడ్వెంచరస్‌ టూర్లను ఇష్టపడే వాళ్ల కోసం టూర్లు నిర్వహిస్తున్నాను. ఇటీవల రష్యాలోని ఎల్‌బ్రస్‌ పర్వతారోహణను సమన్వయం చేశాను. రెండునెలలకొక ట్రిప్‌ ఉంటుంది. రాబోయే చెర్రీ బ్లోసమ్‌ ఫెస్టివల్‌ కోసం నవంబర్‌లో షిల్లాంగ్‌కి వెళ్తున్నాను.  
– నీలిమ పూదోట, మౌంటనీయర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement