సవాళ్లకు సిద్ధం అంటున్న యువత..
నగరంలో వేగంగా విస్తరిస్తున్న క్లైంబింగ్ ట్రెండ్
అధిరోహణ.. ఆరోగ్యాన్నిచ్చే అభిరుచిగా..
వారాంతాల్లో రాక్ ఈవెంట్స్ షురూ
సాక్షి, సిటీబ్యూరో: చెట్టులెక్కగలరా ఓ నరహరి పుట్టలెక్కగలరా.. చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలరా.. ఓ నరహరి చిగురు కోయగలరా.. చెట్టులెక్కగలమే ఓ చెంచిత పుట్టలెక్కగలమే.. చెట్టులెక్కి ఆ చిటారుకొమ్మన చిగురు కోయగలమే. ఓ చెంచిత బ్రమలు తీయగలమే.. అని అలనాటి చిత్ర కథానాయకుడు ఏఎన్‌ఆర్ పాడిన పాట ఎంతో పాపులర్.. ఆ మాదిరిగానే.. నేడు నగరంలో చెట్లు పుట్టలు ఎక్కడం సర్వసాధారణ ట్రెండ్‌గా మారుతోంది.. అయితే గుట్టలు, పుట్టలు, చెట్లు ఎక్కడం పల్లెల్లో సర్వసాధారణం..కానీ నగరంలో నాల్గు మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడడం ఇక్కడి ప్రజల నైజం. అయితే కొందరు నగరవాసులు మాత్రం గోడలు, గుట్టలు కూడా చకచకా ఎక్కేస్తున్నారు. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే సరదా క్రీడగా క్లైంబింగ్ హాబీ దినదిన ప్రవర్ధమానమవుతోంది.
సూచనలు..
– క్లైంబింగ్ చేయడానికి తగినంత శారీరక సామర్థ్యం ఉండాలి.
– స్పోర్ట్స్ డ్రెస్సింగ్ కావాలి. అలాగే ప్రత్యేకమైన షూస్ తప్పనిసరి.
– ఇందులో ఒకరికొకరు మంచి సపోరి్టంగ్‌గా ఉండాలి. ఎక్కే సమయంలో పడిపోవడం వంటివి ఉంటాయి.
– అలాంటి సందర్భాల్లో ఒకరికొకరు సాయం చేసుకోవాలి.
– అవుట్‌డోర్‌లో ప్రాథమిక దశలో చేసినప్పటికీ... రెగ్యులర్ క్లైంబర్‌గా మారాలంటే ఇన్‌డోర్ ట్రైనింగ్ తీసుకోవడం అవసరం.
క్లైంబింగ్ అనేది ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రాచుర్యంలో ఉన్న క్రీడ. అయితే ఇటీవలి కాలంలో నగరంలో దీన్ని ఒక మంచి ఎనర్జిటిక్ ఎంజాయ్‌మెంట్‌గా గుర్తిస్తున్నారు. ఇలా ఫన్‌గానూ ఫిట్‌నెస్ సాధనంగా క్లైంబింగ్‌ను అనుసరించేవారి కోసం పలు చోట్ల వాల్స్ అందుబాటులోకి వచ్చాయి. షాపింగ్ మాల్స్, అడ్వెంచర్ జోన్స్‌లో అన్నింటితో పాటు క్లైంబింగ్ ప్రదేశాలు కూడా ఉండగా, కేవలం క్లైంబింగ్ కోసమే కొన్ని ప్రత్యేకమైన సెంటర్లు, హాబీగా చేసే క్లబ్స్ కూడా వచ్చేశాయి. ఈ అభిరుచి వాల్స్ నుంచి రాక్స్ దాకా విస్తరించి సిటీయూత్‌కి చక్కని వ్యాపకంగా మారిపోయింది.
క్లైంబింగ్ కథా కమామీషు ఇలా..
క్లైంబింగ్ వాల్ ఎత్తు 15 అడుగులు అంతకన్నా లోపుంటే బౌల్డరింగ్ సెగ్మెంట్ అంటారు. ఈ సెగ్మెంట్‌లో పాల్గొనేవాళ్ల కోసం కిందపడినా గాయాలు కాకుండా ఫ్లోర్ మీద పరుపులు వేసి ఉంచుతారు. ఇక లీడ్ క్లైంబింగ్‌లో గోడ 30–40 అడుగుల ఎత్తుపైన ఉంటుంది. సరిపడా ఆత్మవిశ్వాసం ఉండి, భయం లేకుండా ఉంటేనే లీడ్ క్లైంబింగ్ చేయగలరు. దీనిలో గోడకు హ్యాంగర్స్ ఉంటాయి. దీనికి తగినంత శారీరక సామర్థ్యం ఉండాలి. ఈ రెండూ కాకుండా వేగం ప్రధానంగా సాగే ఈ స్పీడ్ క్లైంబింగ్ చాలా వరకూ ప్రొఫెషనల్స్ మాత్రమే ఎంచుకుంటారు. దీనిలో క్రీడాకారుడు రోప్ కట్టుకుని వాల్ మీద ఎక్కుతాడు. ఎంత స్పీడ్ ఉంటుందంటే చూడడానికి నేల మీద పరుగులు తీసినట్టు ఉంటుంది.
పర్సనల్‌గా.. ఇంట్లోనే..
వీటిని ఇంట్లో కూడా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆరి్టఫీషియల్ వాల్‌ని ఫైబర్‌తో చేసి సపోర్ట్ స్ట్రక్చర్ సాలిడ్ వుడ్, లేదా స్టీల్ ఉంటుంది. అయితే వుడ్ ఖరీదు ఎక్కువ కాబట్టి.. స్టీల్ బెటర్. క్లైంబింగ్ సర్ఫేస్‌గా ప్లైవుడ్ లేదా ఫైబర్ గ్లాస్ గాని వాడి చేసే 8 విడ్త్ 12 ఫీట్ హైట్ వాల్‌కి రూ.లక్ష ఖర్చులోనే అయిపోతుంది. అదే 24 ఫీట్ వాల్‌కి అయితే రూ.4 లక్షలు వరకూ అవుతుంది.
ఎక్కేయాలంటే.. లుక్కేయాలి..
నగరం ఒకప్పుడు రాక్స్‌కి నిలయం.. అద్భుతమైన రాళ్ల గుట్టలు, కొండ గుట్టలు మన ప్రాంతానికి ప్రత్యేకంగా ఉండేవి. అభివృద్ధి బారిన పడి చాలా వరకూ కనుమరుగయ్యాయి. నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఖాజాగూడ, మహేంద్రా హిల్స్, ఘర్ ఎ మొబారక్, అడ్డకల్, మర్రిగూడెం, పాండవుల గుట్ట, భువనగిరి లతో పాటు కర్నూలు దాకా వెళ్లి ఓర్వకల్ రాక్ గార్డెన్స్‌లో సైతం క్లైంబింగ్ చేస్తున్నారు.
ఫన్ ప్లస్ ఫిట్‌నెస్..
లీడ్, స్పీడ్ క్లైంబింగ్‌లు ఈ క్రీడను సీరియస్ హాబీగా తీసుకున్నవారికి మాత్రమే కావడంతో బౌల్డరింగ్ ఒక ఫన్ యాక్టివిటీగా, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు ఉపకరించేదిగా ఇప్పుడు ఆకర్షిస్తోంది. దీంతో జిమ్స్‌లోనూ ఈ బౌల్డరింగ్ వాల్స్ కొలువుదీరుతున్నాయి. గంట పాటు బౌల్డరింగ్ చేస్తే 900 కేలరీలు బర్న్ అవుతాయని, ఒక గంటలో చేసే పరుగు అరగంట పాటు చేసే క్లైంబింగ్‌తో సమానమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక శరీరంలో టాప్ టూ బాటమ్ అన్ని అవయవాలనూ ఇది బలోపేతం చేస్తుందని అంటున్నారు. వయసుకు అతీతంగా దీన్ని సాధన చేయవచ్చు. హై ఎనర్జీ, హైపర్ యాక్టివిటీ ఉన్న చిన్నారులకు ఇప్పుడు వాల్ క్లైంబింగ్ బాగా నప్పే హాబీగా నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా నలుగురితో కలిసి చేసే గ్రూప్ యాక్టివిటీ కాబట్టి అలసట ఎక్కువగా రాదు. శరీరానికి బ్యాలెన్సింగ్ సామర్థ్యం పెరుగుతుంది. కోర్ మజిల్స్ శక్తివంతంగా మారతాయి. చేతులు, కాళ్ల మజిల్స్ టోనప్ అవుతాయి.
కొండకు తాడేసి..
వీకెండ్ క్లైంబింగ్ ఈవెంట్స్ జరగడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. నగరంలో హైదరాబాద్ క్లైంబర్స్ పేరుతో ఒక క్లబ్ కూడా ఏర్పాటైంది. ఈ క్లబ్ సభ్యులు ప్రతి వారం ఒక రాక్ ఏరియాను ఎంచుకుని క్లైంబింగ్‌కి సై అంటున్నారు. అయితే ఇక్కడ కూడా నిపుణుల ఆధ్వర్యంలోనే రోప్‌ల బిగింపు తదితర ఏర్పాటు జరగాల్సి ఉంటుంది. చాలా మంది అవుట్‌డోర్ క్లైంబింగ్ తర్వాత అది సీరియస్ హాబీగా మారిన తర్వాత ఇన్‌డోర్ క్లైంబింగ్‌కు మళ్లుతున్నారు. అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు.
మంచి వ్యాయామంగా..
25 నుంచి 40 మధ్య వయస్కులు వస్తున్నారు. ఫిట్‌నెస్‌లో వెరైటీని కోరుకునేవారూ దీన్ని ఎంచుకుంటున్నారు మా దగ్గర 40 వరకూ రూట్స్ ఉన్నాయి. వీటిలో తేలికగా చేసేవి కష్టంగా చేసేవి.. ఇలా ఉంటాయి. చాలా మంది హాబీగా చేస్తుంటే ప్రొఫెషన్‌గా ఎంచుకుంటున్నవారూ పెరుగుతున్నారు. వారానికో రోజు అవుట్‌డోర్‌లో న్యాచురల్ రాక్స్ దగ్గర చేయిస్తున్నాం. – రంగారావు, క్లైంబింగ్ శిక్షకులు
ఈవెంట్స్ నిర్వహిస్తున్నా..
కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ హాబీగా క్లైంబింగ్ ప్రారంభించి ఇప్పుడు దీంతో కనెక్ట్ అయ్యాను. వారాంతాల్లో క్లైంబింగ్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తున్నా. సాహసక్రీడలపైన ఆసక్తి ఉంటేనే దీన్ని ఎంచుకోవాలి. – చాణక్య నాని, క్లైంబర్
‘గ్రీస్’లో రాక్ క్లైంబింగ్‌కు వెళ్తున్నాం..
గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ద్వారా 12 సంవత్సరాల క్రితం క్లైంబింగ్ పరిచయమైంది..ఆ తర్వాత రాక్ క్లైంబింగ్ ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ క్లైంబర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ప్రస్తుతం ఇన్‌స్టాలో మా గ్రూప్‌కి 2500 మంది సభ్యులున్నారు. వీరిలో కనీసం 200 మంది గ్రూప్ యాక్టివిటీలో పాల్గొంటుంటారు. వరంగల్‌లో ఉన్న పాండవుల గుట్ట నగరానికి 2 గంటల ప్రయాణ దూరంలోని అడక్కల్ వంటి ప్రదేశాల్లోనే కాక రాష్ట్రం దాటి మనాలి, కర్ణాటకలోని హంపి, బాదామి వంటి ప్రాంతాలతో పాటుగా ఇతర దేశాలైన వియత్నాం, ఇండోనేషియాలో కూడా క్లైంబింగ్ ఈవెంట్స్ చేశాం. త్వరలోనే మన దేశం నుంచి గతంలో ఎవరూ వెళ్లని స్థాయిలో అతిపెద్ద గ్రూప్‌గా గ్రీస్‌కి ఈ డిసెంబర్‌లో క్లైంబింగ్ యాక్టివిటీ చేపట్టనున్నాం. – రేణుక, హైదరాబాద్ క్లైంబర్స్
Comments
Please login to add a commentAdd a comment