శిఖరాలపై శిఖామణి | A retired police officer climbed Everest at age of sixty three | Sakshi
Sakshi News home page

శిఖరాలపై శిఖామణి

Published Thu, Dec 9 2021 4:52 AM | Last Updated on Thu, Dec 9 2021 4:52 AM

A retired police officer climbed Everest at age of sixty three - Sakshi

సాక్షి, అమరావతి: గట్టి సంకల్పం ఉంటే వయసు అడ్డంకి కాదు.. దానికి శరీర దారుఢ్యం తోడైతే.. రాజా శిఖామణి అవుతారు. ఆరు పదుల వయసు దాటినా పర్వతాలను అవలీలగా ఎక్కేస్తారు. 63 ఏళ్ల వయసున్న ఈ పెద్దాయన అందరికీ ఆశ్చర్యం కలిగించే పనులు చేస్తుంటారు. 58 ఏళ్ల వయసులో విజయనగరం నుంచి విశాఖపట్నం వరకూ 50 కిలోమీటర్లు అలవోకగా పరిగెత్తారు. తాజాగా 63 ఏళ్ల వయసులో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి శభాష్‌ అనిపించుకున్నారు రాజా శిఖామణి. విశ్రాంత పోలీస్‌ అధికారి అయిన ఆయన ఎవరెస్ట్‌ ప్రయాణం విజయవంతంగా ముగించుకుని విజయవాడ వచ్చారు. యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న రాజా శిఖామణి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన జీవన ప్రస్థానం, ఎన్నో ఆపదలతో నిండిన పర్వతారోహణ విశేషాలు ఆయన మాటల్లోనే..

గుంటూరు నుంచి కాలిఫోర్నియా వరకు..
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం లేమళ్లపాడు మా స్వగ్రామం. నాన్న రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. ఒంగోలులో స్థిరపడ్డారు. అమెరికన్‌ బాప్టిస్ట్‌ మిషనరీ (ఏబీఎం) హైస్కూల్‌లో చదువుకున్నాను. డిగ్రీ వరకూ ఫుట్‌బాల్, ఆ తర్వాత అథ్లెటిక్స్‌ వైపు వెళ్లాను. తొలి ప్రయత్నంలోనే 1977లో ఇంటర్‌ కాలేజియేట్‌ స్పోర్ట్స్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించి యూనివర్సిటీ చాంపియన్‌గా నిలిచాను. తర్వాత ఎస్‌ఐగా ఎంపికయ్యాను. అనంతపురంలో పోలీస్‌ శిక్షణ పూర్తిచేసి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా తొలిపోస్టింగ్‌ తీసుకున్నా. ఇంటెలిజెన్స్, సివిల్‌ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేసి 2016లో విజయనగరం పోలీస్‌ శిక్షణ కేంద్రానికి ప్రిన్సిపాల్‌ అయ్యాను. తరువాత ఆరు నెలలు అనంతపురం పీటీసీలో ప్రత్యేకాధికారిగా సేవలందించాను. 5 వేల మంది ఎస్‌ఐలు, 150 మంది డీఎస్పీలు, 55 మంది ఐపీఎస్‌లకు శిక్షణనిచ్చాను. ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌తో పాటు అనేక అవార్డులు లభించాయి. కాలిఫోర్నియాలోని రెక్లెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది.

ఎవరెస్ట్‌ శిఖరంపై జాతీయ పతాకం, రాష్ట్ర పోలీస్‌ చిహ్నంతో శిఖామణి 

మావోయిస్టులకు రెవెన్యూ అధికారినని చెప్పా
స్టాండర్డ్‌ ట్రైనింగ్‌ కోసం నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) కమాండో శిక్షణ తీసుకోవడంతో అప్పటి ముఖ్యమంత్రులు ఎన్‌టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి, హోం మంత్రి మైసూరారెడ్డిలకు భద్రతాధికారిగా పని చేశాను. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఎప్పుడు మన రాష్ట్రానికి వచ్చినా ఆయన రక్షణ బాధ్యత నాకే అప్పగించేవారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో సహా ఏడుగురు ఐఏఎస్‌లను దారగడ్డలో మావోయిస్టులు కిడ్నాప్‌ చేసినప్పుడు రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకుని వారితో చర్చలు జరిపాను. 

మూడు దేశాలు..మూడు పర్వతాలు
పర్వాతారోహణం నా జీవితంలో భాగంగా మారిపోయింది. హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ నేతృత్వంలో నాతో కలిపి ఆరుగురు సభ్యుల బృందం గత నెల విజయవాడ నుంచి బయలుదేరి వివిధ మార్గాల ద్వారా లుక్లాకు చేరుకున్నాం. అక్కడి నుంచి అందరిలా హెలికాప్టర్‌లో వెళ్లకుండా 70 కిలోమీటర్లు అదనంగా నడిచి మొత్తం 6 వేల మీటర్ల ఎవరెస్ట్‌ పర్వతాన్ని (బేస్‌ క్యాంప్‌ వరకూ) ఏడు రోజుల్లో అధిరోహించాను. నా వయసున్న భారతీయులెవరూ పర్వతారోహణ చేయలేదు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన, ప్రమాదకరమైన టాంజానియా దేశంలోని కిలిమంజారోను ఎక్కినపుడు నా వయసు 62 ఏళ్లు. దీనికి ఏడాది ముందు యూరప్‌లోనే ఎత్తయిన రష్యాలోని మౌంట్‌ ఎల్బ్రోస్‌ పర్వతాన్ని అధిరోహించాను. 

దృఢ సంకల్పం వస్తుంది
అత్యంత కష్టమైన పర్వతారోహణను అలవోకగా చేయడానికి కారణం చిన్నప్పటి నుంచీ శరీర దృఢత్వంపై పెట్టిన శ్రద్ధ, కఠోర శ్రమ, ఆహార అలవాట్లు. మానసికంగానూ బలంగా ఉండాలి. పర్వతారోహణలో ఎక్కడా సరైన ఆహారం దొరకదు. పైకెళుతున్నకొద్దీ ఒంట్లో శక్తి క్షీణిస్తుంది. మైనస్‌ 27 డిగ్రీల వద్ద అడుగు ముందుకు పడదు. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఏమాత్రం పట్టు జారినా లోయల్లో పడిపోతాం. శవం కూడా దొరకదు. చాలా మంది యువకులే మధ్యలో వెనక్కి వచ్చేస్తుంటారు. ముందుకెళ్లడమే తప్ప వెనక్కి వెళ్లాలన్న ఆలోచనే నాకు రాదు. పర్వతారోహణ వల్ల విశాల దృక్పథం పెరుగుతుంది. ఓర్పు, సహనం వంటి లక్షణాలు అలవడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో జీవితంలో ఏదైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement