
‘మిస్టర్ ఎడ్’
కొండల్ని ఎక్కడం శ్రమతో పని. డబ్బుతో పని. ఎడ్మండ్ శ్రమించగలడు. కానీ డబ్బుకోసం ఎలా శ్రమించాలో అతడికి తెలీదు. లక్ష్యమే అన్నీ నేర్పుతుంది.
సంక్షిప్తంగా... ఎడ్మండ్ హిల్లరీ
కొండల్ని ఎక్కడం శ్రమతో పని. డబ్బుతో పని. ఎడ్మండ్ శ్రమించగలడు. కానీ డబ్బుకోసం ఎలా శ్రమించాలో అతడికి తెలీదు. లక్ష్యమే అన్నీ నేర్పుతుంది. అందుకే జీవితానికొక లక్ష్యం ఉండాలంటారు. ఎడ్మండ్ లక్ష్యం... పెద్ద పెద్ద పర్వతాలన్నిటినీ ఎక్కేయడం.
అప్పటికింకా ఎవరెస్టు మీద ఎడ్మండ్ దృష్టి పడలేదు. అందుకు రెండు కారణాలు. ఒకటి : ఎడ్మండ్ ఉద్యోగ ప్రయత్నంలో ఉండడం. ఇంకోటి : ఎవరెస్ట్ వేల కిలో మీటర్ల దూరంలో ఉండడం. తేనెటీగల పెంపకం అతడి పార్ట్ టైమ్ ఉపాధి. 1943లో రాయల్ న్యూజిలాండ్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎడ్మండ్‌కు నేవిగేటర్‌గా ఉద్యోగం వచ్చింది.
మూడేళ్ల విరామం తర్వాత ఎడ్మండ్ మనసు మళ్లీ కొండగాలి మీదికి మళ్లింది. హ్యారీ ఏరెస్, మిక్ సల్లివాన్, రూత్ ఆడమ్స్‌తో కలిసి అతడు 1948 జనవరి 30న న్యూజీలాండ్‌లోని ఎత్తై శిఖరం మౌంట్ కుక్‌ను ఎక్కాడు. ఆ తర్వాత ఐదేళ్లకు 1953లో ఎడ్మండ్‌కి, అతడి మిత్రుడు జార్జి లోవేకి ఒక వెచ్చని మధ్యాహ్నం ‘జాయింట్ హిమాలయన్ కమిటీ’ నుంచి ఒక లేఖ అందింది.
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు వచ్చిన ఆహ్వానం అది!! 400 మంది పర్వతారోహకులు ఉన్న ఈ బృందానికి బాస్.. కల్నల్ జాన్ హంట్.‘‘మిస్టర్ ఎడ్మండ్... మీరు, టెన్జింగ్ నార్గే కలిసి బృందంలోని ఒక జట్టును లీడ్ చేయబోతున్నారు’’ అన్నారు కల్నల్. బహుశా అప్పుడతడికి తెలియకపోవచ్చు తమ జట్టే ఎవరెస్టును జయించబోతోందని!
‘ఇంత పెద్ద శిఖరాన్నా మనం ఎక్కబోతున్నాం’ అని ఎక్స్‌పెడిషన్‌లో ఏ ఒక్కరూ అనుకోలేదు. ‘ఇంత అందమైన శిఖరాన్నా చేరుకోబోతున్నాం’ అని పులకరించిపోయారు. పన్నెండు వేల అడుగుల పైకి వచ్చేశారు. ‘‘అసలు ప్రయాణం ఇక్కడి నుంచే మొదలౌతుంది’’ అన్నారు షెర్పాలు. ఎక్స్‌పెడిషన్‌లో భాగం ఉన్న గైడ్‌లు వీరు. ఏప్రిల్ 12 నాటికి జట్లు 17, 900 అడుగుల ఎత్తుకు చేరుకున్నాయి.
మే 26 న టామ్ బోర్డిల్లన్, చార్లెస్ ఇవాన్స్ మరింత ముందుకు బయల్దేరారు. ఇక నిలువుగా 300 అడుగులు ఎక్కితే శిఖరాగ్రమే. కానీ హిమాలయాలు వారికి అనుకూలించలేదు. మరో రెండు రోజులు గడిచాయి. ఎక్కడివారు అక్కడే ఉండిపోతున్నారు. కొందరైతే బేస్‌క్యాంప్‌కు పరిమితమైపోయారు. ఎడ్మండ్ జట్టులోని ఐదుగురు సభ్యులు అతికష్టం మీద ఐదో బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. మెల్లిగా అక్కడికి చేరుకున్నారు ఎడ్మండ్, నార్గే.
మే 29 రాత్రి. నిద్రముంచుకొస్తోంది కానీ కనురెప్పలు పడడం లేదు. ఆక్సిజన్ పీలుస్తున్నారు కానీ శ్వాస అందట్లేదు. కొయ్య మధ్య చీలికలో ఇరుక్కుపోయిన మేకుల్లా ఇద్దరూ బేస్‌క్యాంప్ గుడారంలో చిక్కుకుపోయారు. గుడారం నుంచి మెల్లిగా పాక్కుంటూ బయటికి వచ్చారు ఎడ్మండ్, నార్గే. ఒకసారి చచ్చిబతికాక ఇక చావుకు భయమేమిటి? మంచుతో డీకొట్టడానికి సిద్ధమయ్యారు. మొదట ఎడ్మండ్ హిల్లరీ ఆ ఏకశిల అంచులను పట్టుకుని పైకి లేచాడు. వెనకే టెన్జింగ్ నార్గే ఎక్కాడు. ఎడ్మండ్ గంభీరమైన మనిషి. అంత పెద్ద విజయం సాధించి కూడా అయన పెద్దగా అరవలేదు. తన కోటు లోపలి నుంచి కలర్‌ఫిల్మ్ లోడ్ చేసి ఉన్న కెమెరాను బయటికి తీశాడు.
‘‘మిస్టర్ ఎడ్’’ అని పిలిపించుకోవడం ఎడ్మండ్ హిల్లరీకి ఇష్టం. ఎంత ఎత్తుకు చేరినా మనిషి మనిషిగా ఉండడమే నిజానికి శిఖరాగ్రాన్ని చేరడం అంటారు ఎడ్మండ్. ఎనభై ఎనిమిదేళ్ల వయసులో 2008లో ఆయన చనిపోయారు. ఎడ్మండ్ ‘శిఖరైక్యం’ పొందారని అనడానికి కూడా లేకుండా ఆయన తన మరణాన్ని సైతం నిరాడంబరీకరించుకున్నారు! 8848 మీటర్ల తర్వాత ఎవరెస్టు శిఖరం అంతమౌతుంది. 58వ యేట అమరుడైన ఎడ్మండ్ అంతకన్నా ఎత్తయిన శిఖరంలా నిలిచిపోయారు.