
‘ఎవరెస్టు ఎత్తు తగ్గిందట.. మళ్లీ కొలుస్తాం’
హైదరాబాద్: ఎవరెస్టు ఎత్తు మళ్లీ కొలవబోతున్నారా? ఇటీవల కాలంలో ఏర్పడిన భూకంపాలు, అగ్ని పర్వతాల బద్ధలు కారణంగా ఎవరెస్టు ఎత్తు తగ్గి ఉంటుందనే అనుమానాలను నివృత్తి చేయనున్నారా? అంటే అవునని స్పష్టమైంది. త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక టీంను మౌంట్ ఎవరెస్టు ఎత్తు కొలిచేందుకు పంపిస్తోంది. రెండేళ్ల కిందట నేపాల్‌లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పెద్ద మొత్తంలో మంచుపర్వాతాలు కదిలిపోయాయి.
ఈ నేపథ్యంలో ఎవరెస్టు ఎత్తు తగ్గి ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సర్వే ఆఫ్ ఇండియా మరోసారి ఎవరెస్టు ఎత్తు కొలిచే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించి అందుకు కావాల్సిన అనుమతులు కూడా పొందినట్లు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు చెప్పారు. ఇది పూర్తయితే భవిష్యత్తులో సైంటిఫిక్ స్టడీస్ ఉపయోగపడుతుందని అన్నారు. ‘మౌంట్ ఎవరెస్టు వద్దకు మేం ఓ అన్వేషణ బృందాన్ని పంపిస్తున్నాము.
ఎవరెస్టు ఎత్తును 1855లో ప్రకటించారు. ఎంతోమంది దాన్ని కొలిచారు కూడా. ఇప్పటి వరకు భారత సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారం ఎవరెస్టు సరైన ఎత్తు 29,028 అడుగులు’ అని ఆయన తెలిపారు. భూమిలోపలి భాగంలో పలకల కదలిక, భూకంపాలకారణంగా ఎత్తుతగ్గిందని వచ్చిన అనుమానం, సైంటిఫిక్ స్టడీస్‌కు ఉపయోగపడుతుందనే మూడు కారణాల వల్ల తాము మరోసారి ఎవరెస్టును కొలవబోతున్నామని స్పష్టం చేశారు.