కొండంత కష్టం..!
- ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు సిద్ధమైన అంగోతు తుకారాం
- 29 నుంచి షెడ్యూల్–సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీబ్లాక్ వద్ద పడిగాపులు
సాక్షి, హైదరాబాద్: ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడాన్ని ఏమంత కష్టంగా భావించని ఆ యువకునికి సచివాలయంలో తనకు సంబంధించిన ఫైలు ఎక్కడుందో తెలుసుకోవడం అత్యంత క్లిష్టతరమైన సమస్యగా మారింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆమోదించిన ఫైలు కదా.. చకచ కా పరిగెడుతుందిలే అనుకుంటే, తీరా గడువు సమీపించే సమయానికి తన ఫైలు ఎక్కడుందో అధికారులకూ అంతుబట్టడం లేదంటూ సచివాలయంలోని సి–బ్లాక్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కెళ్లపల్లి తండాకు చెందిన గిరిజన పుత్రుడు ఆంగోతు తుకారాం పర్వతారోహకుడు.
నేషనల్ క్యాడెట్ కోర్సులో ప్రతిభ కనబరిచిన తుకారాం జమ్మూ కశ్మీర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ మౌంటెనీరింగ్ సంస్థలో మౌంటెనీరింగ్, ఎడ్వంచర్ కోర్సులను విజయవంతంగా పూర్తి చేశాడు. 2015 జూన్ 2న రాష్ట్రా వతరణ దినోత్సవం నాడు ఉత్తమ స్పోర్ట్స్‌మెన్‌షిప్ అవార్డు అందుకున్నాడు. జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లలో బంగారు, రజత పత కాలను సాధించాడు. నాలుగేళ్లుగా మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోíహించాలని కలలుకంటున్న తుకారాంకు నాలుగు నెలల కిత్రం ఆ అవకాశం వచ్చింది. నేపాల్ లోని ఉన్నతాధికారుల నుంచి అందిన సమాచారం తో, పర్వతా రోహణ నిమిత్తం తనకు రూ.28 లక్షలు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు.
పలువురు ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు తుకారాం దరఖాస్తును క్రీడాశాఖ మంత్రి పద్మారావు సీఎంఆర్‌ఎఫ్ విభాగానికి పంపారు. ఈనెల 20న సీఎం కార్యాలయం నుంచి తుకారాంకు ఫోన్ చేసిన అధికారులు మీ దరఖాస్తుకు సీఎం ఆమోదం తెలిపారని, రూ.25 లక్షలు ఇచ్చేందు కు అంగీకారం తెలిపారని చెప్పారు. ఈనెల 29నే పర్వతారోహణ షెడ్యూల్ ఉన్నందున ఈలోగానే చెక్కు వస్తుందని తుకారాం ఆశించాడు. అయితే వారం రోజులు గడచినా చెక్కు అందకపోయే సరికి ఆందోళనతో మంగళవారం సచివాలయానికి వచ్చా డు. సీఎం పేషీలో విచారిస్తే, స్పోర్ట్స్ విభాగానికి వెళ్లమన్నారు. అక్కడకు వెళితే రెవెన్యూ విభాగానికి, అక్కడ్నుంచి ముఖ్యమంత్రి పేషీకే పంపామని జవాబు వచ్చింది. సదరు ఫైలు తమవద్ద లేదంటూ ముఖ్యమంత్రి పేషీ అధికారులు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక, అక్కడే ఉన్న విలేకరులతో తనగోడు వెల్లబోసుకున్నాడు.
ఎవరెస్ట్‌పై బతుకమ్మను ప్రతిష్టిద్దామనుకున్నా
ఎవరెస్ట్ పర్వతంపై తెలంగాణ ప్రతీక అయిన బతుకమ్మను ప్రతిష్టిద్దా మని అనుకున్నా. ఈ నెల 29న నేపాల్ రాజధాని ఖాట్మండూ నుంచి షెడ్యూల్ ఖరారైంది. పర్వతారోహణ నిమిత్తం సీఎం రూ.25లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు ఫోన్ చేసి చెప్పారు. నాలుగు రోజులుగా తిరుగుతున్నా. తీరా విచారిస్తే తన ఫైలు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదంటున్నారు. ‘దేవుడు వరమిచ్చినా పూజారులు కనికరించలేదు’ అన్నట్లుగా తయారైంది నా పరిస్థితి.
– అంగోతు తుకారాం