ఎవరెస్ట్ శిఖరంపై నవరత్నాలు జెండా ఎగురవేసిన భూపతిరాజు అన్మిష్
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై ‘నవరత్నాలు’ పతాకం రెపరెపలాడింది. పేదల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న నవరత్న పథకాల జెండాతో విశాఖపట్నంలోని పోతిన మల్లయ్యపాలెం కార్ షెడ్ ప్రాంతానికి చెందిన భూపతిరాజు అన్మిష్ (28) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. జూన్ 1వ తేదీన పర్వతారోహణలో విజయాన్ని నమోదు చేసుకుని ఇటీవల నగరానికి తిరిగి వచ్చాడు. విద్యార్థి దశలోనే మార్షల్ ఆర్ట్స్‌లో సత్తా చాటిన అన్మిష్ పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యంతో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ సహకారంతో శిక్షణ పొంది తన కల నెరవేర్చుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ప్రజాసంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న నవరత్నాలు కాన్సెప్ట్‌ను ప్రపంచ శిఖరంపై ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సైతం నెరవేర్చాడు.
కిలిమంజారోపై..
అన్విష్ ఇప్పటికే కిలిమంజారో, అకంకాగోవా పర్వతాలను అధిరోహించాడు. ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతంపై ‘నో బ్యాగ్స్ డే’, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని కోరుతూ జెండాను ఎగుర వేశాడు.
మరిన్ని పర్వతాలు అధిరోహిస్తా..
నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. మొక్కలు నాటి భూమిని కాపాడుకుందాం. ఈ దిశగా ప్రజలంతా కృషి చేయాలనేది నా ఆకాంక్ష. భవిష్యత్‌లో ప్రపంచంలో ఎత్తైన మరిన్ని పర్వతాలను అధిరోహించేందుకు ప్రయత్నిస్తాను.
– భూపతిరాజు అన్మిష్
Comments
Please login to add a commentAdd a comment