
నలుగురు కార్మికులు మృతి
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ హైవేలో కొంతభాగం కుప్పకూలింది. చియోనన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నలుగురు కార్మికులు చనిపోగా మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ నిర్మాణంపై 10 మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు.
అది కూలడంతో వీరంతా శిథిలాల్లో చిక్కుకున్నట్లు వివరించారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని చెప్పారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. శిథిలాలను తొలగించి, సహాయ కార్యక్రమాలను చేపట్టేందుకు 50 అగ్ని మాపక శకటాలు, మూడు హెలికాప్టర్లు, 150 మంది సిబ్బందిని అక్కడికి తరలించారు.