టారిఫ్‌లకు వేళాయె | Tariffs announced on April 2 to be effective immediately | Sakshi
Sakshi News home page

టారిఫ్‌లకు వేళాయె

Published Wed, Apr 2 2025 4:05 AM | Last Updated on Wed, Apr 2 2025 4:05 AM

Tariffs announced on April 2 to be effective immediately

అమెరికా ‘విముక్తి దినం’ వచ్చేసింది 

దేశాలపై సుంకాల బాదుడు నేటినుంచే 

టారిఫ్‌లను ట్రంపే ప్రకటిస్తారు: వైట్‌హౌస్‌ 

భారత్‌పైనా ప్రతీకార సుంకాలని వెల్లడి 

గట్టిగా బదులిచ్చి తీరతాం: యూరప్‌

న్యూయార్క్‌/వాషింగ్టన్‌/రోమ్‌/టోక్యో: ప్రపంచ వాణిజ్య యుద్ధానికి వేళైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గొప్పగా ప్రకటించుకుంటూ వస్తున్న ‘విముక్తి దినం’ రానే వచ్చింది. ప్రపంచ దేశాలపై అగ్ర రాజ్యం ప్రతీకార సుంకాల బాదుడు బుధవారం నుంచే మొదలవనుంది. ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతోంది. అమెరికాతో పాటు చాలా దేశాల్లో స్టాక్‌మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. భారత్‌కు కూడా భారీ వడ్డింపులు తప్పవని వైట్‌హౌస్‌ తాజాగా స్పష్టం చేసింది. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లెవిట్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు.

‘‘అమెరికా వ్యవసాయోత్పత్తులు తదితరాలపై భారత్‌ 100 శాతం సుంకాలు విధిస్తోంది. మా పాడి ఉత్పత్తులపై యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు 50 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయి. జపాన్‌ అయితే మా బియ్యంపై ఏకంగా 700 శాతం టారిఫ్‌లు విధించింది. మా బటర్, చీజ్‌ తదితరాలపై కెనడా 300 శాతం టారిఫ్‌లు వడ్డిస్తోంది. ఈ దేశాలన్నీ నడ్డి విరిచే టారిఫ్‌లతో అమెరికాను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆయా దేశాలకు మా ఎగుమతులను అసాధ్యంగా మార్చేశాయి’’ అంటూ ఆక్షేపించారు. ‘‘ఇక ప్రతీకారానికి వేళైంది. వాళ్లకు అంతకు అంతా వడ్డించబోతున్నాం.

అమెరికా ప్రజల సంక్షేమం దిశగా అధ్యక్షుడు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి రానుంది’’ అని పునరుద్ఘాటించారు. ఏయే దేశాలపై ఏ రంగంలో ఎంత సుంకాలు విధించబోయేదీ అధ్యక్షుడే స్వయంగా ప్రకటిస్తారని ఆమె తెలిపారు. ఈ టారిఫ్‌లు ఆరంభం మాత్రమేనని, వాటిని త్వరలో భారీగా పెంచుతామని ట్రంప్‌ ఇప్పటికే పేర్కొనడం తెలిసిందే. ‘‘అమెరికాపై టారిఫ్‌లను భారత్‌ భారీగా తగ్గిస్తోంది. చాలా దేశాలు కూడా అదే బాటన నడుస్తున్నాయి’’ అని సోమవారం ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు. 

మా ప్లాన్లు మాకున్నాయి: ఈయూ 
అమెరికా టారిఫ్‌లకు బెదిరేది లేదని యూరోపియన్‌ యూనియన్‌ స్పష్టం చేసింది. వాటిని ఎదుర్కోవడానికి తమ వద్ద గట్టి ప్రణాళికలున్నాయని ఈయూ ప్రెసిడెంట్‌ ఉర్సులా వాండెర్‌ లెయన్‌ చెప్పారు. మంగళవారం ఆమె ఈయూ పార్లమెంటులో మాట్లాడారు. అమెరికావి తప్పుడు చర్యలని ఆక్షేపించారు. ‘‘మేం మొదలు పెట్టిన యుద్ధం కాదిది. అగ్ర రాజ్యానికి దీటుగా బదులిస్తాం. టారిఫ్‌ల బారినుంచి మా ప్రజలను, ఆర్థిక వ్యవస్థలను అన్నివిధాలా కాపాడుకుని తీరతాం’’ అని ప్రకటించారు. ‘‘మేం ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌.

ఎలాంటి బేరసారాలకైనా కావాల్సినన్ని శక్తియుక్తులు మాకున్నాయి’’ అన్నారు. ‘‘కొన్ని అంశాల్లో అమెరికాకు అన్యాయం జరుగుతోందని ట్రంప్‌ భావిస్తుంటే, పలు అంశాల్లో మా విషయంలోనూ అదే జరుగుతోందన్నది మా అభిప్రాయం. వీటిపై చర్చలకు మేం సిద్ధమే. ఎందుకంటే టారిఫ్‌ల రగడ అంతిమంగా ప్రజలపైనే భారం వేస్తుంది. వారి జీవన వ్యయం పెరుగుతుంది’’ అని చెప్పారు. టారిఫ్‌ బాదుడు నుంచి జపాన్‌ను మినహాయించాలని ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబా మరోసారి ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే వాషింగ్టన్‌ వెళ్లి ఆయనతో చర్చించేందుకు కూడా సిద్ధమన్నారు.

దేశీయ మార్కెట్ల పరిరక్షణకే టారిఫ్‌లపై కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ: భారత్‌కు అమెరికాయే అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ నేపథ్యంలో టారిఫ్‌ల పెంపుతో పడే ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య శాఖ నిశితంగా గమనిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. వాణిజ్య నియంత్రణ, దేశీయ మార్కెట్ల పరిరక్షణే లక్ష్యంగా భారత్‌ సుంకాలు విధిస్తుందని స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద మంగళవారం లోక్‌సభలో ఈ మేరకు ప్రకటన చేశారు.

హెచ్చు టారిఫ్‌లు దేశానికి మేలు చేయడం లేదని, ఆర్థిక వృద్ధి కోసం వాటిని తగ్గించడం తప్పనిసరని నీతీ ఆయోగ్‌ ఇటీవల చేసిన ప్రకటనపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. ఆర్థిక వృద్ధికి మరింత ఊతమివ్వడం ద్వారా ప్రపంచ మార్కెట్లో భారత్‌ను ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలన్నది తమ దీర్ఘకాలిక లక్ష్యమని వెల్లడించారు. ‘‘పలు దేశాలతో టారిఫ్‌ల సమతుల్యత సాధించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం పలు దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి’’ అని గుర్తు చేశారు. ప్రస్తుతం 13 దేశాలతో భారత్‌ ఎఫ్‌టీఏలు చేసుకుంది. అమెరికా, ఈయూ, బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్, పెరు వంటి దేశాలతో ఎఫ్‌టీఏపై చర్చలు జరుగుతున్నాయి.

ఇదీ పరిస్థితి!
అమెరికా వస్తువులు, ఉత్పత్తులపై భారత్‌ ప్రస్తుతం సగటున 18 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తోంది. భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా టారిఫ్‌లు సగటున 2.8 శాతం మాత్రమే. భారత వ్యవసాయ ఎగుమతులపై అమెరికా 5.3 శాతం సుంకాలు విధిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయోత్పత్తులపై మాత్రం భారత్‌ 37.7 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇరు దేశాల మధ్య దాదాపు 30 రంగాల్లో వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి రంగంలోనూ భారతే అమెరికాపై హెచ్చు సుంకాలు విధిస్తోంది.

దాంతో ఇరు దేశాల మధ్య టారిఫ్‌ల అంతరం ఆటోమొబైల్స్‌ రంగంలో 23.1 శాతం, వజ్రాలు, బంగారం, ఆభరణాల్లో 13.3, కెమికల్, పార్మా రంగంలో 8.6, ఎలక్ట్రానిక్స్‌పై 7.2, ప్లాస్టిక్స్‌పై 5.6, కంప్యూటర్లు, యంత్రాలపై 5.3, ఇనుము, స్టీల్‌పై 2.5, టెక్స్‌టైల్స్, క్లా్లతింగ్‌లో 1.4 శాతంగా ఉంది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికాదే 18 శాతం వాటా. ఆ దేశం నుంచి మాత్రం దిగుమతులు 6.22 శాతమే. ద్వైపాక్షిక వాణిజ్యంలో ఈ 10.73 శాతం లోటుపైనా అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement