
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన టారిఫ్‌లను తట్టుకోవడానికి చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతుంటే, వారెన్ బఫెట్ మాత్రం అమెరికా స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగిస్తున్నారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటి వారు వందల బిలియన్ డాలర్లు నష్టపోయారు. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లలో ట్రిలియన్ డాలర్లు ఆవిరైనా బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ మాత్రం తన కంపెనీలో పెట్టుబడులతో బఫెట్ లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు.
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇప్పటివరకు 184 దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా వాల్ స్ట్రీట్ విలువ దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2020 మార్చిలో కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఇదే అత్యంత భారీ పతనం. అయితే ఈ ట్రెండ్ బఫెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ ఏడాది ఆయన తన సంపదకు 12.7 బిలియన్ డాలర్లు జోడించారు. ప్రస్తుతం బఫెట్ సంపద 155 బిలియన్ డాలర్లుగా ఉంది.
ముందస్తు ఆలోచనలతోనే..
బఫెట్ పతనం కాకుండా ఉండటానికి కొన్ని గణనాత్మక చర్యలు తీసుకున్నారు. బహుశా మార్కెట్ తిరోగమనం సంభవిస్తుందనే అంచనాతో ఆయన భారీ కొనుగోళ్లలో నగదును మదుపు చేయడం మానేశారు. 2024లో బుల్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్న సమయంలో బఫెట్ కంపెనీ ఈక్విటీల్లో 134 బిలియన్ డాలర్లను విక్రయించి 334 బిలియన్ డాలర్ల నగదుతో ఏడాదిని ముగించింది.
తన తోటి ఇన్వెస్టర్లు ఎదురుగాలులతో ఇబ్బందులు పడుతున్నప్పుడే బఫెట్ మెల్లగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి యూఎస్ టెక్ స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించడం ద్వారా సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. మరోవైపు జపాన్ ట్రేడింగ్ దిగ్గజాలపై మాత్రం ఆయన పెట్టుబడులు రెట్టింపు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో బఫెట్ జపాన్‌లోని ఐదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన మిట్సుయి, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మరుబెనిలలో తన వాటాను పెంచుకున్నారు.
రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, బెర్క్‌షైర్ ఇప్పుడు మిత్సుయి అండ్ కోలో 9.82 శాతం, మిత్సుబిషి కార్ప్‌లో 9.67 శాతం, సుమిటోమో కార్ప్‌లో 9.29 శాతం, ఇటోచు కార్ప్‌లో 8.53 శాతం, మరుబెని కార్ప్‌లో 9.30 శాతం వాటాలను కలిగి ఉంది. ఈ పెట్టుబడులు బెర్క్ షైర్ హాత్వే మార్కెట్ క్యాప్ ను 1.14 ట్రిలియన్ డాలర్లకు మించి, టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలను అధిగమించేలా చేశాయి.