
ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
స్టేషన్‌ఘన్‌పూర్: పండుగపూట విషాదం నెలకొంది. ట్రాక్టర్ కొనివ్వలేదనే కారణంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మండలంలోని సముద్రాల గ్రామంలో జరిగింది. సీఐ జి.వేణు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోదాసి బోసుకుమార్, లక్ష్మి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దంపతుల పెద్ద కుమారుడు సంతోశ్(21) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ కొనిస్తే నడుపుకుంటూ బతుకుతానని తల్లిదండ్రులను అడిగాడు. అందుకు తల్లిదండ్రులు స్పందిస్తూ ప్రస్తుతం డబ్బులు లేవని, కొన్ని రోజుల తర్వాత చూద్దామని చెప్పడంతో వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రెకుడైన సంతోశ్ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోకి వెళ్లిన కొడుకు ఎంతకూ తలుపులు తీయకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే పక్కింటి వారి సహకారంతో తలుపులు తొలగించి లోపలికి వెళ్లి చూడగా సంతోశ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బోసుకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వేణు తెలిపారు.
సముద్రాలలో ఘటన
పండుగపూట విషాదం