
జాతర ఘర్షణ కేసులో 8 మంది అరెస్ట్
సంగెం: ఉగాది రోజు సంగెం మండలం గవిచర్లలోని గుండ బ్రహ్మయ్య జాతరలో జరిగిన ఘర్షణ కేసులో 8 మంది గుండేటి సునీల్, గుండేటి మహేందర్, కొమ్మాలు, రాజు, మెట్టుపల్లి భరత్, గుండేటి రాజ్‌కుమార్, మెట్టుపల్లి చిన్న భరత్, వెల్పుల సిద్ధును అరెస్ట్ చేసినట్లు మామునూరు ఏసీపీ బి. తిరుపతి తెలిపారు. మైనర్ నిందితుడు కార్తీక్ పరారీలో ఉన్నాడని ఏసీపీ చెప్పారు. బుధవారం రాత్రి సంగెం పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల అరెస్ట్ చూపించి బన్ని మృతి కేసు వివరాలు వెల్లడించారు. గుండబ్రహ్మయ్య జాతరకు మండలంలోని కుంటపల్లికి చెందిన చిర్ర బన్ని(21) వెళ్లాడు. దేవాలయానికి కొద్ది దూరంలో బన్ని సిగరెట్ తాగుతుండగా గవిచర్లకు చెందిన వెల్పుల సిద్ధు కాస్త దూరంగా వెళ్లమనగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సిద్ధు.. సంగెం గ్రామానికి చెందిన తన మేనమామ గుండేటి సునీల్‌కు ఫోన్‌లో జరిగిన విషయం చెప్పాడు. దీంతో సునీల్‌తో పాటు మహేందర్, కొమ్మాలు, కార్తీక్, రాజు, భరత్, రాజ్‌కుమార్, చిన్న భరత్ హుటాహుటిన జాతర ప్రాంతానికి చేరుకున్నారు. సిద్ధుతో ఎందుకు గొడవ పడ్డావని బన్నిని విచక్షణారహితంగా కొట్టడంతో ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు ధని ఫిర్యాదు మేరకు పర్వతగిరి సీఐ రాజగోపాల్ 9 మందిపై కేసు నమోదు చేశారు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ వద్ద గల మామిడి తోటలో 8 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి ఆటో, రెండు బైక్‌లు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని గురువారం రిమాండ్‌కు తరలిస్తామని ఏసీపీ తిరుపతి తెలిపారు.
ఆటో, రెండు బైక్‌లు, 5 సెల్‌ఫోన్లు సీజ్
వివరాలు వెల్లడించిన మామునూరు ఏసీపీ