
ఎల్‌ఆర్‌ఎస్.. 22శాతమే
సాక్షి, మహబూబాబాద్: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీ గడువు మార్చి 31తో ముగిసింది. అయితే ఈ వెసులుబాటుతో పెద్ద మొత్తంలో ఇంటి స్థలాల యజమానులు తరలివస్తారని, వారు చెల్లించే ఫీజులతో ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని భావించినా.. లక్ష్యం మాత్రం నెరవేరలేదు. మొత్తం 22 శాతం మందే తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఫీజులు చెల్లించారు. మిగిలిన వారిలో కొందరు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో మరోసారి అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నారు.
22శాతం చెల్లింపు
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25శాతం రాయితీ కల్పించి నెలరోజుల గడువు ఇచ్చారు. కాగా 2020 డిసెంబర్ 31 వరకు రూ.1,000 చెల్లించి రశీదు తీసుకున్న వారికే ఈ అవకాశం ఉంది. అయితే ఇందులో మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల పరిధిలో 26,001 మంది రూ.1,000 చెల్లించి రశీదు తీసుకున్నారు. కాగా ఇందులో ప్రభుత్వ నిబంధనల మేరకు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 17,550 దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించుకునేందుకు అర్హత ఉందని అధికారులు చెప్పారు. దీంతో పై నాలుగు మున్సిపాలిటీలతోపాటు కొత్తగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీలోని 942 దరఖాస్తులు కలుపుకొని మొత్తం 18,492 మంది భూ యజమానులకు ఆయా మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు ఫోన్ల ద్వారా, ఫ్లెక్సీలు పెట్టి అవగాహన కల్పించారు. దీంతో ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 4,085 ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించారు. అంటే మొత్తం దరఖాస్తుల్లో 22.09శాతం మంది ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీని సద్వినియోగం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. కాగా అధిక సంఖ్యలో ఆసక్తి చూపలేదని దీనిని బట్టి తెలుస్తోంది.
ఐదు మున్సిపాలిటీల్లోని ఎల్‌ఆర్‌ఎస్ వివరాలు
ముగిసిన రాయితీ గడువు
మళ్లీ అవకాశం వస్తుందనే నమ్మకం
ప్రభుత్వ నిర్ణయమే తరువాయి
మళ్లీ అవకాశం కోసం ఎదురుచూపు..
గతంలో రూ.1,000 చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్ కోసందరఖాస్తు చేసిన వారితోపాటు.. కొత్తగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం ఇస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం బఫర్ జోన్, చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ స్థలాలు, హోల్డ్‌లో పెట్టినవి, కోర్టుకేసులో ఉన్న ప్లాట్లతో పాటు కొన్ని సజావుగా ఉన్న వాటికి కూడా అన్‌లైన్‌లో చూపించకపోవడం, ఫీజులు తీసుకోకపోవడం, అన్ని చేసినా.. ప్రొసీడింగ్ రాక ఇబ్బందిపడి చివరకు వెనుతిరిగి వెళ్లినవారు కూడా ఉన్నారు. కాగా గడువు ముగియడంతో మరోసారి అవకాశం ఇవ్వాలని, ఎల్‌ఆర్‌ఎస్ కొత్త దరఖాస్తులు తీసుకునే వెసులుబాటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని.. తమ చేతుల్లో ఏమీ లేదని అధికారులు అంటున్నారు.
మున్సిపాలిటీ అర్హత పొందిన ఫీజు మిగిలినవి
దరఖాస్తులు చెల్లించినవి
మహబూబాబాద్ 9,268 2, 533 6,735
తొర్రూరు 6,181 967 5,214
మరిపెడ 1,228 333 895
డోర్నకల్ 873 185 688
కేసముద్రం 942 67 875
మొత్తం 18,492 4,085 14,407