
ఒక సినిమా షూటింగ్ ఆరంభించే ముందు... లేదా సినిమా పూర్తయ్యాక ఆధ్యాత్మిక యాత్ర చేస్తుంటారు రజనీకాంత్. ఆయన ఎక్కువగా హిమాలయాలకు వెళ్లే విషయం తెలిసిందే. అక్కడి మహావతార్ బాబాజీ గుహలో రజనీ ధ్యానం చేస్తుంటారట. తాజాగా రజనీకాంత్ మరోసారి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. దాదాపు పది రోజులు హిమాలయాల్లో గడిపి, తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. చెన్నై చేరుకున్న వెంటనే తన తాజా చిత్రం ‘కూలీ’ చిత్రీకరణలో పాల్గొంటారు రజనీకాంత్.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. మరోవైపు రజనీకాంత్ నటించిన చిత్రం ‘వేట్టయాన్’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘వేట్టయాన్’లో రజనీకాంత్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ ఏడాది అక్టోబరులో ఈ చిత్రం విడుదల కానుంది.