
సాధారణంగా తాము తీసిన చిత్రాల్లోని తప్పొప్పుల గురించి నిజాయితీగా సమీక్షించుకునే దర్శకులను మనం చూడలేం. ఇక సినిమా రూపొందించే సమయంలో తమపై ఉన్న సామాజిక బాధ్యతను కూడా గుర్తించుకోవడం అంటే అలాంటి దర్శకుల్ని భూతద్ధం పెట్టి వెదకాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ డైరెక్టర్ తాను తీసిన సినిమాలోని సన్నివేశాల గురించి తానే చెప్పి...అవి అలా తీసి ఉండకూడదని, సమాజంపై వ్యతిరేక ప్రభావం చూపే అలాంటి సీన్స్ తీసి, రాసినందుకు పశ్చాత్తాప పడుతున్నానని చెప్పడం ఓ విశేషం. అంతేకాదు...ఈ చిత్రం అతనికి గణనీయమైన ప్రశంసలు విజయాన్ని అందుకున్నది కావడం మరింత విశేషం.
దర్శకుడు అరుణ్ కుమార్ ఇటీవల తెరకెక్కించిన 'వీర ధీర శూరన్' ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడు అంతకు ముందు దర్శకత్వం వహించిన సేతుపతి (2016) గురించి ప్రస్తావించాడు. విజయ్ సేతుపతి రమ్య నంబీస్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ తమిళ యాక్షన్ డ్రామా హిట్ అయినందుకు ఆయన గర్వపడలేదు. పైగా ఆ సినిమాలో ఆక్షేపణీయ అంశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే అవి ఆ సమయంలో గుర్తించేందుకు తనకు అవసరమైన అనుభవం లేదని అన్నాడు. తాను తీసిన ఆ సన్నివేశాన్ని యువతులు సోషల్ మీడియాలో పంచుకోవడం గమనించాక మాత్రమే ఒక సినిమా ప్రభావం ఎంత ఉంటుంది? అనేది తనకు స్పష్టమైందని కూడా అతను చెప్పాడు.

సేతుపతిలో ఉన్న ఆ సన్నివేశం ఏమిటంటే...
‘నన్ను కొట్టినా.. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి ప్రేమగా నన్ను అక్కున చేర్చుకుంటాడు. అందుకే అతనంటే ఇష్టం’ అని రమ్య నంబీస్సన్ అంటుంది. అంటే మగవాళ్లు ఆడవాళ్లపై శారీరక హింసను ప్రేరేపించేదిగా ఆ సంభాషణ ఉండడం గమనార్హం. ఆ సన్నివేశం తీయడంతో పాటు ఆ సినిమాకు రచయిత కూడా అయిన అరుణ్‌కుమార్ ఇప్పుడు దాని గురించి బాధపడ్డారు. ‘‘అది తప్పు. అప్పట్లో నేను ఏం చేశానో..నాకు అనుభవం లేదు’’ అంటూ ఆయన వెల్లడించాడు. కోట్ల మంది సినిమా చూస్తారని, అది అలా అలా విస్త్రుతం అవుతూనే ఉంటుందని కాబట్టి, మన సినిమాల్లో మనం ఒక చిన్న తప్పు చేస్తే, అది ఎప్పటికీ చేసినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అమ్మాయిలు ఆ సన్నివేశాన్ని వారి వాట్సాప్ స్టేటస్‌గా పోస్ట్ చేయడం చూసి తాను బాధపడడం మాత్రమే కాదు నిజంగా భయపడుతున్నా కూడా అంటూ తానీ సన్నివేశం తీసినందుకు ఇప్పుడు క్షమాపణలు అన్నాడాయన. .
అదే విధంగా. ‘‘సేతుపతిలో, ఓ పిల్లవాడు తుపాకీని పట్టుకోవడం రమ్య పాత్ర అకస్మాత్తుగా దాన్ని లాక్కునే మరో సన్నివేశం ఉంది. పిల్లవాడికి ఆయుధం ఇవ్వకూడదని తెలిసినా అలా చేయడం తప్పే’’అన్నారాయన. విజయ్ సేతుపతి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన పన్నైయరుమ్ పద్మినియుమ్ (2014)తో చిత్ర రంగ ప్రవేశం చేసిన తర్వాత, అరుణ్ కుమార్ మరో నాలుగు చిత్రాలకు నాయకత్వం వహించాడు, వీటిలో ఎక్కువ విమర్శకుల ప్రశంసలు అందుకున్నవే. ఏదేమైనా విజయవంతమైన తన చిత్రంలోని లోపాల్ని తానే చెబుతూ వాటిని పునరావృతం కానివ్వనని అంటున్న తమిళ దర్శకుడు అరుణ్ కుమార్ వైఖరి నిజంగా మెచ్చదగింది.
ఒక హిట్ చిత్రాల దర్శకుడు సినిమా విజయవంతం అయిందని సరిపెట్టుకోకుండా తన సినిమా గురించి తాను నిజాయితీగా సమీక్షించుకోవడం సామాజిక బాధ్యత పట్ల తన వంతు పాత్ర పోషిస్తూ క్షమాపణలు అడగడం.. హింస, సెక్స్, వయోలెన్స్‌చుట్టూనే పరిభ్రమిస్తూన్న సినిమాల్ని చూసి విరక్తికి గురవుతున్నవారికి ఊరట అనే చెప్పాలి... చుట్టూ కమ్ముకున్న చీకటిలో కానవస్తున్న వెలుగురేఖ లాంటిదే అని చెప్పాలి.