అందరి చూపు... టాలీవుడ్‌ వైపు... | Tollywood will see more and more other language heroes | Sakshi
Sakshi News home page

అందరి చూపు... టాలీవుడ్‌ వైపు...

Published Sun, Apr 6 2025 1:50 AM | Last Updated on Sun, Apr 6 2025 8:37 AM

Tollywood will see more and more other language heroes

తెలుగు సినిమాల్లో హీరోలుగా పరభాషల నటులు 

టాలీవుడ్‌పై దృష్టి సారిస్తున్న ఇతర ఇండస్ట్రీ టాప్‌ హీరోలు

తెలుగు సినిమాల సౌండ్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారు మోగుతోంది. ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప’ వంటి సినిమాల కారణంగా అంతర్జాతీయంగా కూడా తెలుగు సినిమాకు ఆదరణ లభిస్తోంది. దీంతో దేశంలోని అన్ని ఇండస్ట్రీల చూపు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమవైపే. అందుకే తెలుగు పరిశ్రమ నుంచి అవకాశం వస్తే చాలు, సినిమాకు సై అంటున్నారు కొందరు పరభాషల హీరోలు. ఇటు తెలుగు నిర్మాతలు కూడా పరభాషల హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా తెలుగు దర్శక–నిర్మాతలతో  సినిమాలు చేస్తున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.

ముందుగా కోలీవుడ్‌లోకి తొంగి చూస్తే...
గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ
కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ లేటెస్ట్‌ మూవీ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మాస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌కు ‘మార్క్‌ ఆంటోని’ ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించారు.

త్రిష హీరోయిన్‌గా, సునీల్, ప్రసన్న, ప్రభు, యోగిబాబు, జాకీ ష్రాఫ్‌... ఇలా మరికొందరు ప్రముఖ ఆర్టిస్టులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఈ నెల 10న విడుదల కానుంది. అజిత్‌ సినిమాలను తెలుగు ఆడియన్స్‌ చాలా దగ్గరగా ఫాలో అవుతుంటారు. ఇటీవల వచ్చిన అజిత్‌ మూవీ ‘విడాముయర్చి’ (‘పట్టుదల’) ఆడియన్స్‌ను నిరాశపరిచింది. దీంతో అజిత్‌ నుంచి రానున్న తాజా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఎలా ఉంటుందనే విషయంపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొని ఉంది.

డబుల్‌ ధమాకా 
సూర్య అంటే చాలు... మన తెలుగు హీరోయే అన్నట్లుగా ఉంటుంది. అందుకేనేమో... ఈసారి రెండు స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు చేయాలని సూర్య నిర్ణయించుకున్నట్లున్నారు. సూర్య స్ట్రయిట్‌ తెలుగు మూవీ చేసి కూడా చాలా కాలం అయ్యింది. దీంతో సూర్య తెలుగులో చేసే డైరెక్ట్‌ మూవీపై ఆడియన్స్‌లో ఆసక్తి ఉండటం సహజం. కాగా ‘సార్, లక్కీ భాస్కర్‌’ వంటి వరుస బ్లాక్‌ బస్టర్స్‌ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవల సూర్యకు ఓ కథను వినిపించగా, ఈ హీరో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట.

ఈ మూవీలోని హీరోయిన్‌ పాత్రకు భాగ్యశ్రీ భోర్సే, మమితా బైజు వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుందని, ఇదొక పీరియాడికల్‌ డ్రామా అని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లోని ‘సార్, లక్కీ భాస్కర్‌’ సినిమాలను నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థయే (నాగవంశీ, సాయి సౌజన్య), సూర్య–వెంకీ అట్లూరి కాంబినేషన్‌లోని సినిమానూ నిర్మించనుందని తెలిసింది.

ఇంకా ‘కార్తికేయ, కార్తికేయ 2’, ఇటీవల ‘తండేల్‌’తో సూపర్‌ సక్సెస్‌ అందుకున్న దర్శకుడు చందు మొండేటి ఆ మధ్య సూర్యకు ఓ కథ వినిపించారు. ఈ కథ సూర్యకు నచ్చిందని, భవిష్యత్‌లో సూర్యతో తాను సినిమా చేస్తానని ‘తండేల్‌’ సినిమా ప్రమోషన్స్‌లో చందు మొండేటి వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే చందు మొండేటి ప్రస్తుతం నిఖిల్‌తో చేయాల్సిన ‘కార్తికేయ 3’ స్క్రిప్ట్‌ వర్క్స్‌పై బిజీగా ఉన్నారట. సో... సూర్య తెలుగు మూవీ ముందుగా వెంకీ అట్లూరితోనే మొదలు కానుందని తెలిసింది. ఈ మూవీ ఈ ఏడాదేప్రా రంభం అవుతుంది. ఇలా సూర్య తెలుగు ఆడియన్స్‌కు డబుల్‌ ధమాకా ఇవ్వనున్నారు.

కుబేర 
కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చేసిన సినిమా ‘సార్‌’ (తమిళంలో ‘వాత్తి’). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది. ఆ తర్వాత వెంటనే తెలుగు దర్శకుడు శేఖర్‌ కమ్ములతో మూవీ చేసేందుకు ధనుష్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ‘కుబేర’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీలో నాగార్జున మరో లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా చేస్తున్నారు.

ఆల్మోస్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ బాహు భాషా చిత్రం జూన్‌ 20న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్‌ క్రియేషన్స్‌ పతాకాలపై పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, సునీల్‌ నారంగ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కుబేర’ తర్వాత మరో తెలుగు సినిమా చేసేందుకు కూడా తెలుగు దర్శక–నిర్మాతల నుంచి ధనుష్‌కు ఫోన్‌ కాల్స్‌ వెళ్తున్నాయని సమాచారం.

కార్తీ హిట్‌ 4 
తెలుగు ఆడియన్స్‌లో కార్తీకి మంచి క్రేజ్‌ ఉంది. కార్తీ తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై, తెలుగు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు కలెక్ట్‌ చేస్తుంటాయి. కాగా 2016లో నాగార్జునతో కలిసి కార్తీ ‘ఊపిరి’ అనే ద్విభాషా (తెలుగు, తమిళం) సినిమా చేశారు. ఆ తర్వాత ఎందుకో కానీ స్ట్రయిట్‌ తెలుగు మూవీ మళ్లీ చేయలేదు. రెండు మూడేళ్ల క్రితం కార్తీకి ఓ కథ వినిపించారట తెలుగు దర్శకుడు పరశురామ్‌. ఈ సినిమాకు ‘రెంచ్‌ రాజు’ అనే టైటిల్‌ కూడా అనుకున్నారనే ప్రచారం సాగింది. ఎందుకో కానీ ఈ మూవీ సెట్స్‌కు వెళ్లలేదు. కానీ ఇప్పుడు కార్తీ తెలుగు స్ట్రయిట్‌ మూవీకి సమయం వచ్చింది.

 తెలుగు హిట్‌ ఫ్రాంచైజీ ‘హిట్‌’ సిరీస్‌లో భాగం కానున్నారు కార్తీ. శైలేష్‌ కొలను దర్శకత్వంలో కార్తీ హీరోగా ‘హిట్‌ 4’ రూపొందనుందని, ఈ మూవీని నాని నిర్మిస్తారని సమాచారం. ఇక నాని హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలోని ‘హిట్‌ 3’ మే 1న విడుదల కానుంది. ఈ ‘హిట్‌ 3’ క్లైమాక్స్‌లో ‘హిట్‌ 4’ సినిమాలో కార్తీ నటించనున్నారన్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట మేకర్స్‌. ఇంకా ఓ తెలుగు హారర్‌ ఫ్రాంచైజీ మూవీలోని కీలక పాత్రకు కార్తీని సంప్రదించగా, ఆయన అంగీకారం తెలిపారని తెలిసింది.

హ్యాట్రిక్‌ హిట్‌ 
తమిళ యువ నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ నటించిన ‘డ్రాగన్‌’ మూవీ ఇటీవల విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు ముందు ప్రదీప్‌ చేసిన మూవీ ‘లవ్‌ టుడే’. ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్‌. ‘లవ్‌ టుడే’, ‘డ్రాగన్‌’ (తెలుగులో ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’)... ఈ రెండు చిత్రాలూ తెలుగులో అనువాదమై, ఇక్కడి యూత్‌ ఆడియన్స్‌ను అలరించాయి. ఇప్పుడు తెలుగు ఆడియన్స్‌ ముందుకు డైరెక్ట్‌ తెలుగు మూవీతో వస్తున్నారు ప్రదీప్‌.

‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ సినిమాను తెలుగులో విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘ప్రేమలు’ ఫేమ్‌ మమిత బైజు హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత్రంతో కీర్తీశ్వరన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ న్యూజ్‌ స్టోరీ ఈ ఏడాదే స్క్రీన్‌పైకి రానుంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే, ప్రదీప్‌ నటుడిగా హాట్రిక్‌ హిట్‌ సాధించినట్లే... ఇలా తెలుగు దర్శక–నిర్మాతలో సినిమాలు చేయడానికి సిద్ధమైన, ప్రయత్నాలు చేస్తున్న కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు మరి కొంతమంది ఉన్నారు.

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ రికార్డ్స్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ టెన్‌ మూవీస్‌లో ‘బాహుబలి, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి సినిమాలు ఉండటమే ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీంతో బాలీవుడ్‌ దృష్టి కూడా టాలీవుడ్‌పై ఉంది. బాలీవుడ్‌ హీరోలు తెలుగు దర్శక–నిర్మాతల అవకాశాలకు నో చెప్పలేకపోతున్నారు.

 ‘గద్దర్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ తర్వాత సన్నీ డియోల్‌ తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లోని ‘జాట్‌’ సినిమాలో హీరోగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇంకా ప్రభాస్‌ హీరోగా చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌ ఓ లీడ్‌ రోల్‌ చేసిన విషయం తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లోని ఈ మూవీని సి. అశ్వనీదత్‌ నిర్మించారు.

కాగా ‘కల్కి 2’ కూడా ఉందని ఇటీవల స్పష్టం చేశారు నాగ్‌ అశ్విన్‌. సో... ‘కల్కి 2’లోనూ అమితాబ్‌ బచ్చన్‌ రోల్‌ మంచి ప్రియారిటీతో కొనసాగవచ్చని ఊహించవచ్చు. ఇంకా సల్మాన్‌ ఖాన్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో ఓ మూవీ రానుందనే టాక్‌ ఇటీవల వినిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానూ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అలాగే తెలుగులో సినిమా చేసేందుకు ఆమిర్‌ ఖాన్‌ సైతం ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. 

ఆమిర్‌ ఖాన్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో ఓ మూవీ రానుందని, మైత్రీ మేకర్స్‌ నిర్మించనుందని గతంలో వార్తలొచ్చాయి. ఇంకా దర్శకుడు వంశీ పైడిపల్లి కథతో అమిర్‌ ఖాన్‌తో ఓ మూవీ చేసేందుకు ‘దిల్‌’ రాజు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్‌. అంతేనా... ‘గజినీ’కి సీక్వెల్‌గా ‘గజినీ 2’ను ఆమిర్‌ ఖాన్‌తో తీసే ఆలోచనలో అల్లు అరవింద్‌ ఉన్నారన్న ప్రచారం ఇటీవల తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం రావాలి. ఇలా హిందీలో హీరోగా చేస్తూ, తెలుగు సినిమాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్న హిందీ నటుల సంఖ్య ఈ ఏడాది ఎక్కువగానే ఉంది.

⇒  ‘కాంతార’ సినిమాతో ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు రిషబ్‌ శెట్టి. ప్రస్తుతం ‘కాంతార’ ప్రీక్వెల్‌ పనులతో బిజీగా ఉన్నారు రిషబ్‌ శెట్టి. అలాగే ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘హను–మాన్‌’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ‘జై హనుమాన్‌’ మూవీకి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, రిషబ్‌ శెట్టి మెయిన్‌ లీడ్‌ రోల్‌ అయిన హనుమాన్‌గా చేస్తున్నారు.

భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. 2027 సంక్రాంతికి ‘జై హనుమాన్‌’ మూవీ రిలీజ్‌ ఉండొచ్చు. అలాగే కన్నడ స్టార్‌ హీరో గణేశ్‌ తెలుగులో ‘పినాక’ అనే హారర్‌ ఫిల్మ్‌ చేస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొరియోగ్రాఫర్‌ బి. ధనంజయ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

అలాగే కన్నడ యువ నటుడు శ్రీమురళి హీరోగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమాను నిర్మించనుంది. గత ఏడాది శ్రీమురళి బర్త్‌ డే (డిసెంబరు 17) సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. కన్నడ హీరో ధనంజయ ‘పుష్ప’లో ఓ లీడ్‌ రోల్‌ చేశారు. అలాగే ఇతను హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ‘జీబ్రా’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా కన్నడ స్టార్‌ హీరో శివ రాజ్‌కుమార్‌ ‘పెద్ది’ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా చేస్తున్న ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా తెలుగులో సినిమాలు చేస్తున్న కన్నడ నటుల జాబితా ఇంకా ఉంది.

⇒  ‘మహానటి (కీర్తీ సురేష్‌ మెయిన్‌ లీడ్‌ రోల్‌), సీతారామం’  ఇటీవల ‘లక్కీ భాస్కర్‌’... ఇలా వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు దుల్కర్‌ సల్మాన్‌. ఈ సినిమాల వరుస విజయాలు చాలు... దుల్కర్‌ను తెలుగు ఆడియన్స్‌ ఎంత ఓన్‌ చేసుకున్నారో చెప్పడానికి. ఇప్పుడు దుల్కర్‌ రెండు తెలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ‘ఆకాశంలో ఒక తార’. పవన్‌ సాధినేని దర్శకత్వంలోని ఈ మూవీని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్‌బాక్స్‌ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. దుల్కర్‌ సల్మాన్‌ రైతుగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం గోదావరి జిల్లాల పరిసరప్రాంతాల్లో జరుగుతోంది.

అలాగే దుల్కర్‌ హీరోగా నటించిన మరో మూవీ ‘కాంత’. 1950 టైమ్‌లో మద్రాస్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీకి సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించారు. రానా ఈ సినిమాకు ఓ నిర్మాతగా ఉన్నారు. భాగ్యశ్రీ బోర్సే ఓ కథనాయికగా నటించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌ ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. ఇక అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమాతో తెలుగుకి  వచ్చారు ఫాహద్‌ ఫాజిల్‌. మలయాళంలో హీరోగా చేస్తున్న ఫాహద్‌ తెలుగులోనూ ‘ఆక్సిజన్, డోన్ట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. ‘ఆక్సిజన్‌’ సినిమాకు ఎన్‌. సిద్ధార్థ్‌ దర్శకత్వం వహిస్తుండగా, ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కి శశాంక్‌ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాను ఆర్కా మీడియాపై రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇంకా మలయాళ ప్రముఖ దర్శక–నిర్మాత–నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్లోని మూవీలో ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. అలాగే మలయాళ యంగ్‌ హీరో టొవినో థామస్‌ కూడా ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లోని ‘డ్రాగన్‌’ మూవీలో ఓ రోల్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న ఈ మూవీలో టొవినో విలన్‌గా నటిస్తారని తెలిసింది. ఈ విధంగా మలయాళంలో హీరోగా చేస్తూ, తెలుగులోనూ హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్న మలయాళ హీరోల లిస్ట్‌ ఇంకా ఉంది.
-ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement