
మహనీయులను స్మరించుకుందాం
నల్లగొండ టూటౌన్ : మహనీయుల త్యాగాలను స్మరించుకుని వారు ప్రజలకు చేసిన సేవలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న మహానీయుల జయంతి ఉత్సవాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో పూలే విగ్రహానికి విద్యార్థులతో కలిసి పూల మాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం సమ్మిళిత సమాజం పేరుతో విద్యార్థులు గడియారం సెంటర్ నుంచి మర్రిగూడ బైపాస్ రోడ్డు వరకు 5కే రన్ నిర్వహించారు. అనంతరం యూనివర్సిటీలో నిర్వహించిన మహనీయుల ఉత్సవాలకు తెలంగాణ బీసీ కమీషన్ సభ్యురాలు ఆర్. బాలలక్ష్మి హాజరై మాట్లాడారు. మార్పునకు పూలే దంపతులు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అల్వాల రవి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, షీటీమ్స్ ఇన్‌స్పెక్టర్ కోట కరుణాకర్, ఉత్సవాల చైర్మన్ ప్రొఫెసర్ అంజిరెడ్డి, కన్వీనర్ శ్రీదేవిరెడ్డి, డాక్టర్ మద్దిలేటి, ప్రిన్సిపాల్ ప్రేమ్‌సాగర్, అరుణప్రియ, సుధారాణి, వసంత, సరిత, శ్రీలక్ష్మి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.