
న్యూఢిల్లీ: భారత నావికాదళ అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రం వచ్చి చేరబోతోంది. సముద్రజలాల్లో శత్రు దేశాల యుద్ధనౌకలపై ఓ కన్నేసి, నిఘాను అత్యంత సమర్థవంతంగా నిర్వహించే అధునాతన‘వాటర్ డ్రోన్’ను రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. అన్ని దశల పరీక్షలను పూర్తిచేసుకున్నాక ఇది భారత నౌకాదళాల చేతికి రానుంది. దీంతో సముద్రజలాలపై ఉపరితల నిఘా కార్యకలాపాల్లో భారత్ సామర్థ్యం ద్విగుణీకృతం కానుంది.
నీటిలో కాస్తంత మునిగి కనిపించకుండా దూసుకెళ్లే హై ఎండ్యూరన్స్ అటానమస్ అండర్‌వాటర్ వెహికల్ (హెచ్‌ఈ ఏయూవీ)ను విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్‌డీవో సోమవారం ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యం ‘ఎక్స్’లోని తన ఖాతాలో ఒక ప్రకటన విడుదలచేసింది. జలాంతర్గామిలా కనిపించే అత్యంత చిన్న స్వయంచాలిత వాహనాన్ని వాటర్ డ్రోన్‌గా పిలుస్తారు.
సరస్సులో వాటర్ డ్రోన్‌ను పరీక్షిస్తున్న వీడియోను డీఆర్‌డీఓ తన ‘ఎక్స్’ సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్ట్‌చేసింది. ఉపరితలంలో, కాస్తంత మునిగి ప్రయాణిస్తూ ఈ అటానమస్ వెహికల్ నిర్దేశిత పరామితులను అందుకుందని సంస్థ పేర్కొంది. సోనార్, కమ్యూనికేషన్ సామర్థ్యాలను అత్యంత కచ్చితత్వంతో ప్రదర్శించిందని ప్రకటించింది. నావల్ సైన్స్ అండ్ టెక్నాలాజికల్ లేబొరేటరీ ఈ వాటర్ డ్రోన్‌ను అభివృద్ధిచేసింది.
దాదాపు 6 టన్నులు బరువు ఉండే ఈ డ్రోన్ పొడవు 9.75 మీటర్లు. శత్రువుల యుద్ధనౌకల సిబ్బంది కంట్లోపడకుండా నీటి ఉపరితలంపై పెద్దగా అలల అలజడి సృష్టించకుండా నిశ్శబ్దంగా, మెల్లగా ముందుకెళ్తుంది. అత్యవసర సందర్భాల్లో గంటకు గరిష్టంగా 14 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. దాక్కోవాల్సిన పరిస్థితుల్లో సముద్రజలాల్లో ఏకంగా 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. సమీపంలో సంచరించే భారత జలాంతర్గాముల రక్షణ, అన్వేషణ సామర్థ్యాలను సైతం ఈ వాటర్‌డ్రోన్ మెరుగుపరుస్తుందని డీఆర్‌డీవో పేర్కొంది.