
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టగా.. మరికొందరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు వీరమరణం చెందారు. డీఎస్పీ అధికారి సహా మరో ముగ్గురు సిబ్బందికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.
రాజ్‌బాగ్ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. పాక్ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్ ఆపరేషన్ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. ఇంకా నలుగురు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్ సెక్టార్‌లో జమ్మూకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు.

అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్‌వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు.