
పవన్ గెలవక ముందు ‘‘జనసేనాని’’.. గెలిచిన తరువాత ‘‘భజన సేనాని" అంతేనా? అంటూ ప్రశ్నించారాయన.
సాక్షి, అమరావతి: త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, నిన్న(శుక్రవారం) రాత్రి జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, పవన్ గెలవక ముందు ‘‘జనసేనాని’’.. గెలిచిన తరువాత ‘‘భజన సేనాని" అంతేనా? అంటూ సెటైర్లు వేశారాయన. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా పవన్ గతంలో చేసిన పోస్టులను ట్వీట్‌కి ప్రకాశ్‌రాజ్ జత చేశారు.
‘‘హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదంటూ అంతకుముందు మరో ట్వీట్ కూడా చేశారు ప్రకాష్‌రాజ్. ‘‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారాయన.
కాగా, పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే కూడా స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
“ గెలవక ముందు “జనసేనాని”, గెలిచిన తరువాత “భజన సేనాని” … అంతేనా #justasking pic.twitter.com/EqjtqK6qFA
— Prakash Raj (@prakashraaj) March 15, 2025
‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్‌ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు.