సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించను
హిందువులు కనీసం కోపం తెచ్చుకోకపోతే ఏం చేయగలం?
సెక్యులరిజం వన్‌వే కాదు టూ వే
అల్లా, జీసస్‌ను ఎవరైనా.. ఏమైనా అనగలరా?
సున్నితాంశాలపై ప్రకాశ్‌రాజ్ తెలుసుకొని మాట్లాడాలి
ఉప ముఖ్యమంత్రి పవన్ వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): సనాతన ధర్మానికి భంగం వాటిల్లితే హిందువులంతా ఏకమై.. కలసికట్టుగా మాట్లాడాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందువులు మౌనం వహిస్తే, ఆ మౌనం భవిష్యత్తు తరాలను నాశనం చేస్తుందన్నారు. ధర్మాన్ని పరిరక్షించడం గుడికి వెళ్లే ప్రతి హిందూ బాధ్యత కాదా, నా ఒక్కడి బాధ్యతేనా అంటూ ప్రశ్నించారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా మంగళవారం విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కనక దుర్గమ్మవారి దర్శనం అనంతరం ఇంద్రకీలాద్రిపై ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సనాతన ధర్మానికి సంబంధించి పోరాటం చేయాలనుకుంటే తనను ఆపేవారు ఎవరూ లేరన్నారు. ధర్మం కోసం పోరాటం చేస్తే చనిపోవడానికి సిద్ధమని, కానీ, అక్కడిదాకా తీసుకెళ్లనని చెప్పారు. సున్నితాంశాలపై నటుడు ప్రకాశ్‌రాజ్ విషయం తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. సనాతన ధర్మానికి, పవిత్రతకు భంగం కలిగినప్పుడు మాట్లాడడం కూడా తప్పే అన్నట్లు చెబితే ఎలా..? మాట్లాడేవారు ఒకటికి వందసార్లు ఆలోచించి మాట్లాడండి అని చెప్పారు.
సెక్యులరిజం అనేది వన్ వే కాదని అది టూ వే అని చెప్పారు. హిందువులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. మసీదులో చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతారా అని అన్నారు. హిందూ దేవుళ్లపైన మాట్లాడేవారు అల్లాహ్ పైన, మహ్మద్ ప్రవక్తపైన, జీసస్‌పైన మాట్లాడగలరా అంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఇస్లాంపైన మాట్లాడితే ఆ మతం వారు పెద్దఎత్తును బయటకు వస్తారు అంటూ చెప్పారు. హిందువులను రోడ్లపైకి రమ్మని చెప్పడం లేదన్నారు. కనీసం హిందువులకు కోపం రాకపోతే ఏం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీ వారికి కూడా విజ్ఞప్తి చేశారు. సనాతన ధర్మంపై ఇష్టానుసారం జోకులు వేయడం, మీమ్స్ చేయడం సరికాదన్నారు. ఓ సినిమా ఫంక్షన్‌లో జోకులు వేస్తున్నారని, ఎంతోమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. దేశమంతటికి కలిపి ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ తప్పనిసరి అని చెప్పారు. అంతకుముందు పవన్ కళ్యాణ్‌కు ఆలయ అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. ఆలయం మెట్లను కడిగి, పసుపు రాశారు.
మహిళలను అడ్డుకున్న సిబ్బంది
ఆలయంలో మెట్లను పవన్‌కళ్యాణ్ శుభ్రం చేసే కార్యక్రమానికి అర్ధగంట ముందు, ఆ తర్వాత కూడా మహిళా భక్తులు మెట్ల పూజ చేసుకోకుండా ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు.
మెట్ల పూజ చేసుకుంటూ వస్తున్న మహిళా భక్తులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని క్యూలైన్‌లోకి పంపేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి, మహిళా భక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. మెట్ల పూజ మొక్కు పూర్తి చేసుకోకుండా దర్శనానికి వెళ్లమని చెప్పడం ఎంత వరకు సబబని మహిళలు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment