
55 శాతం అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌ల తగ్గింపు
విలువ రూ.1.96 లక్షల కోట్ల పైమాటే..
భారత ప్రభుత్వం యోచన
ట్రంప్ ప్రతీకార సుంకాల భారం తగ్గించడానికే..
న్యూఢిల్లీ: ఇండియాలో సుంకాలు అధికంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా సుంకాలు వసూలు చేస్తున్న దేశాల ఉత్పత్తులపై అదేస్థాయిలో సుంకాలు విధిస్తామని ఆయన ఇప్పటికే హెచ్చరించారు. ఇందులో చైనా, ఇండియా, మెక్సికో వంటి దేశాలు ఉన్నాయి. అమెరికాలో వచ్చే నెల 2వ తేదీ నుంచి ఈ ప్రతీకార టారిఫ్‌లు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అమెరికా నుంచి దిగుమతి అయ్యేవాటిలో 55 శాతం ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని నిర్ణయాని కొచ్చినట్లు ప్రభుత్వ వర్గాల ను ఉటంకిస్తూ ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలియజేసింది. తగ్గించే సుంకాల విలువ 23 బిలియన్ డాలర్లు(రూ.1.96 లక్షల కోట్లు)గా ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. టారిఫ్‌ల తగ్గింపు నిర్ణయం నుంచి మాంసం, మొక్కజొన్న, గోధుమలు, పాడి ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది. వీటిపై టారిఫ్‌లు యథాతథంగా అమలవుతాయని వివరించింది. అల్మాండ్స్, పిస్తా, ఓట్‌మీల్, క్వినోవా వంటి వాటిపై సుంకాలు తగ్గుతాయని తెలిపింది.
అమెరికా–ఇండియా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలోభాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికాలో ప్రతీకార సుంకాల వల్ల భారతదేశ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికే అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌ల భారాన్ని భారత ప్రభుత్వం తగ్గించబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
భారత్‌తో అమెరికాకు వాణిజ్య లోటు
ప్రస్తుతం ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై 5 శాతం నుంచి 30 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. కొన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలను క్రమంగా తగ్గిస్తూ.. పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదన ఇప్పటికైతే చర్చల దశలోనే ఉంది. అమెరికాలో పెంచిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చేలోగానే ఆ దేశంతో స్పష్టమైన ఒప్పందం చేసుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. టారిఫ్‌ల భారం ఇరుదేశాలపై పడకుండా ఈ ఒప్పందం ఉండొచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికా ఉత్పత్తులపై ఇండియాలో సుంకాలు తగ్గిస్తే... ఇండియా ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ ప్రతీకార సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గకపోతే భారత ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉంది. భారత ప్రధాని మోదీ ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. టారిఫ్‌ల వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సాధ్యమైనంత త్వరగా వాణిజ్య చర్చలు ప్రారంభించాలని ఇరువురు నేతలు నిర్ణయానికొచ్చారు. ప్రస్తుతం ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 45.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ లోటును పూర్తిగా పూడ్చుకోవాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది.