
మంగళవారం ము్రద్రా లబ్ధిదారులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
పీఎం–ముద్రా యోజనకు దశాబ్దం పూర్తి
పథకం లబ్ధిదారులతో ప్రధాని మోదీ సమావేశం
ఏపీ మహిళ విజయగాథను తెలుగులోనే విన్న ప్రధాని
అందరికీ అభినందనలు అంటూ తెలుగులో పోస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదు ప్రారంభమైన ప్రధానమంత్రి–ముద్ర యోజన (పీఎం–ఎంవై) మంగళవారంతో పదేళ్లు పూర్తి చేసుకుంది. 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైన నాటి నుంచి ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 52 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు రూ.33.65 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ముద్ర యోజన లబ్ధిదారులతో ముచ్చటించారు. వారి విజయగాధలు అడిగి తెలుసుకున్నారు. నైపుణ్యాలు కలిగిన యువత ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈ పథకం తోడ్పడుతోందని అన్నారు. ఉద్యోగాలు కోరుకొనేవారుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారగలమన్న నమ్మకం వారిలో పెరుగుతోందని తెలిపారు. పథకంతో లబ్ధిపొందినవారు మరో 10 మందిలో ప్రేరణ కలిగించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ తన సక్సెస్ స్టోరీని ప్రధానమంత్రితో పంచుకున్నారు. నరేంద్ర మోదీ, లబ్ధిదారు మధ్య జరిగిన సంభాషణ.
లబ్ధిదారు: సార్.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నాకు హిందీ రాదు. తెలుగులోనే మాట్లాడుతా..
మోదీ: ఏం ఫర్వాలేదు.. మీరు తెలుగులోనే మాట్లాడండి.
లబ్ధిదారు: నాకు 2009లో వివాహం జరిగింది. 2019 వరకు గృహిణిగా ఉన్నాను. జ్యూట్ బ్యాగ్‌ల తయారీలో కెనరాబ్యాంక్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్‌లో 13 రోజులపాటు ట్రైనింగ్ తీసుకున్నాను. బ్యాంక్‌కు చెప్పి నాకు లోన్ ఇప్చించారు. ష్యూరిటీ ఏమీలేదు. ఎవరూ నాకు సపోర్ట్ లేరు. కెనరా బ్యాంక్ వారు నన్ను నమ్మి లోన్ ఇచ్చారు. రూ.2 లక్షలు ముద్ర లోన్ తీసుకుని 2019లో వ్యాపారం ప్రారంభించా. నా రీపేమెంట్స్ చూసి 2022లో రూ.9.5 లక్షలు రుణం మంజూరు చేశారు. వ్యాపారాన్ని మరింత విస్తరించా. ఇప్పుడు నా దగ్గర 15 మంది పనిచేస్తున్నారు.
మోదీ: అంటే.. రూ.2 లక్షలతో ప్రారంభించారు. రూ.9.5 లక్షలకు చేరుకున్నారు. మీతో ఎంతమంది పనిచేస్తున్నారు?
లబ్ధిదారు: 15 మంది సార్. అందరూ గృహిణిలు, గ్రామీణ ప్రజలే సార్. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.
మోదీ: కృతజ్ఞతలు.. మీకు ధన్యవాదాలు
వారి ప్రయాణం స్ఫూర్తిదాయకం: మోదీ
పీఎం–ముద్రా యోజన పథకంతో జీవితాలు మారిపోయిన వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ దశాబ్ద కాలంలో ముద్ర యోజన అనేక కలలను సాకారం చేసింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించి వారిని శక్తివంతంగా మార్చింది. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. పథకం లబ్ధిదారుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలే కావడం చాలా సంతోషకరం. ముద్రా యోజనతో సామాజిక, ఆర్థిక స్వేచ్ఛ లభిస్తోంది. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది’’ అని మోదీ ‘ఎక్స్’లో తెలుగులో పోస్టు చేశారు.