
పిల్లలను కొన్నారు కాబట్టి సానుభూతి చూపిస్తాం
2 రోజుల పసికందులను కొన్నారు.. ఇదెక్కడి మానవత్వం?
న్యాయపరంగా అయితేమేం అంగీకరించలేం
హైదరాబాద్‌లో పిల్లలను దత్తత తీసుకున్న కేసులో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీరు పిల్లలను కొన్నారు.. వారు మీ పిల్లలే అనే ఆలోచనతో మీకు ఆ బాధ ఉంటుంది. అందుకే మీపై మేము కేవలం సానుభూతి చూపించగలం. అంతకుమించి మీకు న్యాయమైతే చేయలేం కదా?’అంటూ.. 2024లో హైదరాబాద్‌లో పసికందులను దత్తతకు తీసుకున్న తల్లిదండ్రులను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. మీరు చెప్పినదానిని బట్టి చూస్తే మీదేనా కడుపు కోతా? మీది కడుపుకోత అయినప్పుడు అసలైన తల్లిదండ్రులది ఏమనాలి? అంటూ ప్రశ్నలు సంధించింది.
ఢిల్లీ, పుణే నగరాల్లోని ఆసుపత్రుల్లో ఒకరోజు, రెండు రోజుల పసికందులను దొంగలించి హైదరాబాద్‌కు తీసుకొచి్చ.. పిల్లలు లేని వారికి దత్తత పేరుతో అమ్మకాలు చేపట్టారు. మే 22న ఫీర్జాదిగూడలో ఓ పసికందును విక్రయిస్తుండగా మేడిపల్లి పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కుని కేసు నమోదు చేయడంతో.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా.. కొనుగోలు చేసిన వారికి అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిoది.
శిశు సంక్షేమ కమిటీ ఈ తీర్పును ద్విసభ్య ధర్మాసనం వద్ద సవాల్ చేయగా.. ప్రభుత్వానికి సానుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ గత ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ కె వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిల్లలు లేరు అందుకే దత్తత తీసుకున్నాం
పిల్లలు లేని కారణంగానే.. ఆ పసికందులను దత్తత తీసుకున్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రీనివాస్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ పిల్లలతో తమకెంతో భావోద్వేగం ఉన్నట్లు తెలిపారు. తమ నుంచి పిల్లలను స్వాధీనం చేసుకున్న నాటి నుంచి తాము విలవిలలాడుతున్నామని, వారిని తిరిగి తమకు అప్పగించాలని కోరారు.
చట్టపరమని మేము ఎలా చెబుతాం?
‘మీరు తీసుకున్నదే ఇల్లీగల్ (చట్టవిరుద్ధం)గా.. మమ్మల్ని న్యాయం చేయమంటే మేం లీగల్ (చట్టపరం) అని ఎలా చెబుతాం? కొనుగోలు చేసిన వారిలో రెండు రోజుల పసికందులున్న విషయం గమనించారా? కన్న ఆ తల్లి క్షోభ మీకు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? మీరు చేస్తున్నదితప్పు అని మీ మనస్సాక్షికి అనిపించలేదా’అంటూ నిలదీసింది. ఈ విషయంలో మేం కేవలం మీపై సానుభూతి మాత్రమే చూపించగలం. కన్న తల్లిదండ్రుల నుంచి చిన్నారులను దత్తత తీసుకున్న వాళ్లు కాదు మీరు, పర్చేజ్ చేసిన వాళ్లు అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది.