గత కొన్నేళ్లుగా బుల్‌డోజర్లతో చెలరేగుతున్న రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టడం ఆçహ్వానించదగ్గ పరిణామం. ఈ చీడను వదల్చడానికి ఏం చేయాలో ప్రతిపాదనలివ్వాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించటంతోపాటు వాటి ఆధారంగా దేశవ్యాప్తంగా అమల య్యేలా ప్రామాణిక మార్గదర్శకాలను రూపొందిస్తామని కూడా తెలిపింది. ఎక్కడైనా అడ్డదారులు పనికిరావు. పైగా చట్టబద్ధ పాలనకు ఆ ధోరణులు చేటు తెస్తాయి. కంచే చేను మేసినట్టు పాలకులే తోడేళ్లయితే ఇక సాధారణ పౌరులకు రక్షణ ఎక్కడుంటుంది?
దేశంలో ఈ విష సంస్కృతికి బీజం వేసినవారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయన్ను చూసి మొదట మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ఆనక రాజస్థాన్‌లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఆనాటి శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీల కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం చెలరేగి అనుమానితులుగా నిందితులుగా ఉన్నవారి ఇళ్లు, దుకాణాలు నేలమట్టం చేశాయి. హైదరాబాద్‌లో నీటి వనరులకు సమీపంలో, డ్రెయినేజిలకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను కూల్చేయటానికి ‘హైడ్రా’ ఏర్పాటైంది. తెలంగాణలోని ఒకటి రెండు జిల్లాల్లో కూడా అధికారులు కూల్చివేతలు సాగించారు.తమకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేశారన్న ఫిర్యాదులొచ్చాయి.
ఈవీఎం సర్కారుగా అందరితో ఛీకొట్టించు కుంటున్న ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే ప్రభుత్వం అధికారం వచ్చిరాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చేయాలని చూసింది. హత్యలు, హత్యాయత్నాలు సరేసరి. తమకు ఓటేయ లేదన్న కక్షతో పేదజనం ఇళ్లపై బుల్‌డోజర్లు నడిపింది. ఈ దుశ్చర్యలో ఒక మాజీ సైనికుడి ఇల్లు సైతం నేలకూలింది. ఏ చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు ఈ హేయమైన పనులకు పాల్పడు తున్నాయి? హత్యలతోనూ, బుల్‌డోజర్లతోనూ ప్రజానీకంలో భయోత్పాతం సృష్టించి ఎల్లకాలమూ అధికారంలో కొనసాగవచ్చని పాలకులు భావిస్తున్నట్టు కనబడుతోంది.
దీన్ని సాగనీయకూడదు.
బుల్‌డోజర్ మార్క్ అకృత్యాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఎంత ఆగ్రహం వ్యక్తం చేసిందంటే... ‘నిందితులు, అనుమానితులని ముద్రపడిన వారి విషయంలో మాత్రమే కాదు. ఆఖరికి నేరస్తులుగా నిర్ధారణ అయి శిక్షపడినవారి విషయంలో సైతం చట్ట నిబంధనల ప్రకారమే వ్యవహరించి తీరాలి’ అని నిర్దేశించింది. చట్టబద్ధ పాలన ఎంతటి గురుతర బాధ్యతో చెప్పడానికి ఇది చాలదా? గోవధ కేసులో నిందితుడనో, అనుమానితుడనో భావించిన వ్యక్తిపై కక్ష తీర్చుకోవటానికి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటిచోట్ల ఇళ్లు, దుకాణాలూ నేలమట్టం చేసిన సందర్భాలు అనేకానేకం.
ఈ పని చేశాక ఆ ఇల్లు లేదా దుకాణం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిందనో, అక్రమంగా ఆక్రమించుకుని కట్టారనో, ఎప్పుడో నోటీసులు జారీచేశామనో అధికారులు సాకులు చెబుతున్నారు. అధికారుల్లో కొందరు ప్రబుద్ధులు ఏదో ఘనకార్యం చేశామన్నట్టు విందులు కూడా చేసుకుంటు న్నారు. బాధితులు అవతలి మతస్తులైనప్పుడు కొందరు బాగా అయిందనుకుంటున్నారు. ఇది ప్రమాదకరమైన పోకడ. సమాజంలో ప్రతీకారేచ్ఛను పెంచి పోషించే దుశ్చర్య. ఇప్పుడున్న నాగరిక సమాజం ఎన్నో దశలను దాటుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యవస్థను ఏర్పర్చుకుంది.
తప్పుడు వాగ్దానాలతోనో, కండబలంతోనో, ఈవీఎంలను ఏమార్చటం ద్వారానో అధికారాన్ని కైవసం చేసుకుని కేవలం అయిదేళ్లపాటు అధికారంలో ఉండటానికి వచ్చిన రాజకీయపక్షాలు ఎన్నో అగడ్తలను దాటుకుని వచ్చిన ఒక ప్రజాస్వామిక అమరికను ధ్వంసం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనీయ కూడదు. నిజానికి ఈ విషయంలో ఎంతో ఆలస్యం జరిగింది. ఎవరో న్యాయస్థానానికి ఫిర్యాదు చేయాలని, పిటిషన్ దాఖలయ్యాక నోటీసులు జారీచేసి చర్యలకు ఉపక్రమించవచ్చని అనుకోవటంవల్ల ఇలాంటి దుశ్చర్యలూ, వాటి దుష్పరిణామాలు సాగి పోతున్నాయి. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోతున్నాయి.
న్యాయస్థానాలు మీడియా కథనాలనే పిటిషన్‌లుగా స్వీకరించి ప్రభుత్వాలను దారికి తెచ్చినసందర్భాలున్నాయి. ఆ క్రియాశీలత మళ్లీ అమల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటేఅందరూ న్యాయస్థానాలను ఆశ్రయించలేరు. వారికి ఆ స్థోమత ఉండకపోవచ్చు. కనుకనే న్యాయస్థానాలు తమంత తాము పట్టించుకోక తప్పదు. ప్రామాణికమైన మార్గదర్శకాలురూపొందించాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం హర్షించదగ్గదే. కానీ చర్మం మందం ప్రభుత్వాలు వీటికి తలొగ్గుతాయా? ఆమధ్య ఢిల్లీ హైకోర్టు అక్కడి అధికారులకు చేసిన సూచనలు ఈ సందర్భంగా గమనించదగ్గవి.
వేకువజామునగానీ, సాయంసంధ్యా సమయం ముగిశాకగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బుల్‌డోజర్లు ప్రయోగించరాదని తెలిపింది. ముందుగా తగిన నోటీసులిచ్చి ప్రత్యామ్నాయ ఆవాసం చూపించేవరకూ అసలు కూల్చివేతలుండకూడదని చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా అధికారులు దారికొచ్చిన దాఖలాలు లేవు. అందువల్లే మార్గదర్శకాలు రూపొందించేటపుడు కేవలం ఎలాంటి నిబంధనలు పాటించాలో చెప్పడం మాత్రమేకాక అసలు కూల గొట్టాల్సినంత ఆవశ్యకత ఎందుకేర్పడిందో నమోదుచేసే ఏర్పాటుండాలి. అధికారులకు జవాబు దారీతనాన్ని నిర్ణయించాలి.
ప్రక్రియ సరిగా పాటించని సందర్భాల్లో కోర్టు ధిక్కార నేరంకింద కఠిన చర్యలుంటాయని చెప్పాలి. రాజకీయ కక్షతో, దురుద్దేశాలతో విధ్వంసానికి పూనుకున్న ఉదంతాల్లో వెంటవెంటనే చర్యలుండేలా చూడాలి. అన్నిటికన్నా ముఖ్యం– సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, సూచనల స్ఫూర్తి కింది కోర్టులకు సైతం అందాలి. అలా అయినప్పుడే చట్టబద్ధ పాలనకు మార్గం ఏర్పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment