
ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా పేరొందిన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది. మహా కుంభమేళా చివరి అమృత స్నానంలో కోటి మందికి పైగా భక్తులు పాల్గొంటారని స్థానిక అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసింది.
జనవరి 13న మహా కుంభమేళా(Maha Kumbh) ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకు దాదాపు 64 కోట్ల మంది భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. రైళ్లు, విమానాలు, రోడ్డు మార్గాలలో కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. శివరాత్రి( Mahashivratri) సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు నగరంలోనికి ఎటువంటి వాహనాలను అనుమతించరు. అయితే వాటి పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు.
ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే అన్ని ప్రధాన రహదారులలో మోటార్‌బైక్‌లపై 40 పోలీసు బృందాలను మోహరించారు. కుంభమేళా చివరి రోజు మహాశివరాత్రి ఒకరోజు అయినందున ప్రయాగ్‌రాజ్‌లోని శివాలయాలను సందర్శించేందుకు భక్తులకు అనుమతినివ్వనున్నారు. ఆయా శివాలయాలలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇప్పుటికే అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు.
కాగా మహా కుంభమేళా ప్రారంభంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP Chief Minister Yogi Adityanath) ఈ కార్యక్రమానికి 45 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. ఈ సంఖ్య ఫిబ్రవరి 11 నాటికే నమోదయ్యింది. తరువాతి మూడు రోజుల్లో ఆ సంఖ్య 50 కోట్లు దాటింది. తాజాగా.. 60 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని ప్రభుత్వం ప్రకటించింది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం వలన జీవన్మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’