
న్యూఢిల్లీ: బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ కార్యకర్తలకు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో వరుసగా పోస్టులు చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని స్పష్టంచేశారు. వారంతా క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేస్తున్నారని, సుపరిపాలన ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తు న్నారని పేర్కొన్నారు. అవిశ్రాంతంగా శ్రమిస్తున్న కార్యకర్తలను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు.
పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని గుర్తుచేశారు. కార్యకర్తల శక్తి, ఉత్సాహం తనకు ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాయని వివరించారు. దేశ ప్రజలు బీజేపీలో సుపరిపాలన ఎజెండాను దర్శిస్తున్నారని, ఎన్నికల్లో పార్టీకి లభిస్తున్న చరిత్రాత్మక విజయాలే ఇందుకు తార్కాణమని ఉద్ఘాటించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అన్ని రకాల ఎన్నికల్లో బీజేపీ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు.
సమాజ సేవకు, దేశ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని వెల్లడించారు. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని బలోపేయడానికి కంకణబద్ధులై పనిచేస్తున్న కార్యకర్తల సేవలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇదేనని పేర్కొన్నారు. దేశ ప్రగతి కోసం మనమంతా పూర్తి అంకితభావంతో పనిచేయాలని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించుకోవాలని మోదీ పిలుపు నిచ్చారు.