
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సీపీఎం పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ తాత్కాలిక సమన్వయకర్త ప్రకాశ్ కారత్ తోసిపుచ్చారు. ఆయన పార్టీ వీడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదన్నారు. కేవలం కేరళలో స్టార్టప్‌లు సాధిస్తున్న గణనీయమైన ప్రగతి గురించి మాత్రమే మాట్లాడారని చెప్పుకొచ్చారు. శశిథరూర్ సాధారణ వ్యక్తి కాదని ప్రశంసించిన కారత్.. ఆయన నిక్కచ్చి అభిప్రాయాలు కొన్నిసార్లు కాంగ్రెస్‌కు అసౌకర్యాన్ని కలిగిస్తాయన్నారు.
కేరళలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం సాధిస్తున్న పారిశ్రామికాభివృద్ధిని ప్రశంసిస్తూ థరూర్ గత నెలలో ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు. ఇది రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ దానిపై ప్రశ్నల వర్షం కురిపించగా.. సీపీఎం వ్యాసాన్ని స్వాగతించింది. అయితే తాను ప్రభుత్వాన్ని ప్రశంసించలేదని, కేవలం స్టార్టప్ రంగంలో రాష్ట్ర ప్రగతిని ఎత్తి చూపానని థరూర్ స్పష్టం చేశారు. ఆ తరువాత మలయాళంలో ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేరళలో పార్టీ నాయకత్వ బాధ్యతలకు తాను అర్హుడినని ప్రకటించారు. సంసిద్ధతను సైతం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన కాంగ్రెస్‌లో ఒక వర్గాన్ని కలవరపరిచింది. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ థరూర్ మీడియాపై మండిపడ్డారు.