
బెంగళూరు: ఒక మహిళా ఐఏఎస్ ఒక మహిళా ఐపీఎస్ ల మధ్య ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మొదలైన వివాదం నేటికి కొనసాగుతూనే ఉంది. కన్నడ నాట ఐఏఎస్ రోహిణి, ఐపీఎస్ రూపా డి ల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరంభమైన రచ్చ కాస్తా గాలివానలా మారింది. ప్రస్తుతం బెంగళూరులో మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతున్న తరుణంలో వీరి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
ఈ కేసు విచారణలో భాగంగా 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ వీరి మధ్య సంభాషణను భద్ర పరిచాల్సిందిగా మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు భారతి ఎయిర్ టెల్- రిలయన్స్ జియోలకు ఆదేశాలిచ్చింది. తన వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలు పెట్టి పరువు భంగం వాటిల్లేలా చేసిన కారణంగా రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతోంది. అదే సమయంలో తమ ఇద్దరి మధ్య వివాదానికి సంబంధించి కాల్ డేటా రికార్డు(సీడీఆర్)ను ఒక్కసారి పరిశీలించాల్సిందిగా ఐపీఎస్ రూపా డి మెజిస్ట్రేట్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ కేసు విచారణ బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్ కోర్టు.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి కాల్ డేటా రికార్డును భద్రపరిచి ఉంచాల్సిందిగా ఇరు టెలికాం సర్వీసులకు ఆదేశాలిచ్చింది.
ఐపీఎస్ రూపా డి విచారణకు హాజరుకాకుండా జాప‍్యం చేస్తున్న కారణంగా ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియను నిలిపివేయాలంటూ ఐఏఎస్ రోహిణి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో తమ మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని కాల్ డేటా ఆధారంగా పరిశీలించాలని రూపా డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ తమ మధ్య సాగిన సంభాషణను పరిశీలించాలని కోరుతూ, ఆ మేరకు టెలికాం సంస్థలకు ఆదేశాలివ్వాలని రూపా డి పేర్కొంది. దాంతో ఈ నెల ఆరంభంలో విచారణ చేపట్టిన బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు.. తాజాగా వారి మధ్య సాగిన సంభాషణ కాల్ డేటా రికార్డును పొందుపరచాల్సిందిగా సదరు టెలికాం సంస్థలకు ఆదేశాల్లో పేర్కొంది.
రాజీ కుదరలేదు..!
వీరి మధ్య చోటు చేసుకున్న వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి స్టేను కూడా విదించింది సుప్రీంకోర్టు. అయితే వీరి మధ్య పరస్పర అంగీకారం కుదరకపోవడంతో ఆ కేసుపై అప్పటివరకూ కొనసాగిన స్టేను గతేడాది సుప్రీంకోర్టు ఎత్తివేసింది.
కాగా, సుమారు రెండేళ్ల క్రితంఐఏఎస్ రోహిణికి వ్యతిరేకంగా ఐపీఎస్ రూపా ఫేస్‌బుక్‌లో తీవ్ర విమర్శలతో పలు పోస్ట్‌లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇలా కోర్టుల వరకూ వెళ్లిన కేసు నేటికి పరిష్కారం దొరకలేదు. తన పరువుకు భంగం వాటిల్లేలా చేసినందుకు కోటి రూపాయిలు నష్ట పరిహారం ఇవ్వాల్సిందేనని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతుండగా, అసలు వివాదానికి కారణం ఏమిటో ఒక్కసారి కాల్ డేటా రికార్డును పరిశీలిస్తే తెలుస్తుందని రూపా డి అంటున్నారు.