
లక్నో: నాడు తన భార్య ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించిన భర్త వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది. ఈ క్రమంలో ఆమె అత్త.. కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో, ప్రేమకథ అనూహ్య మలుపు తిరిగింది.
వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా కటార్‌జాట్ గ్రామంలో తన భార్య రాధికకు ఆమె ప్రియుడు వికాస్‌తో ఇటీవలే భర్త బబ్లూ పెళ్లి చేయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఏదైనా ప్రాణహాని తలపెడుతుందనే భయంతో బబ్లూ తన భార్యను ఆమె ప్రియుడికే కట్టబెట్టాడు. అయితే రాధికకు రెండో భర్త వికాస్ తల్లి షాకిచ్చింది. రాధికను తిరిగి అతడి మొదటి భర్త బబ్లూకే అప్పగించింది.
ఈ సందర్భంగా రాధిక అత్త మాట్లాడుతూ..‘రాధిక భర్త, అతడి పిల్లల మానసిక క్షోభ గురించి ఆలోచించి, నేను చలించిపోయాను. అందుకే మొదటి భర్త బబ్లూ దగ్గరికి వెళ్లిపొమ్మని రాధికకు తేల్చి చెప్పాను’ అని వికాస్ తల్లి వెల్లడించింది. ఈ విషయంపై కటార్‌జాట్ గ్రామంలో మళ్లీ పంచాయతీ జరిగింది. బబ్లూ తన భార్య రాధికను చూసుకుంటాడని గ్రామ పెద్దల సమక్షంలో ప్రకటించాడు. వారి ఎదుట ప్రమాణం చేసిన తర్వాత రాధికను బబ్లూ తిరిగి స్వీకరించాడు. భవిష్యత్తులో రాధికకు ఏదైనా ప్రమాదం జరిగితే, దానికి తానే బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వికాస్ తల్లి గొప్ప మనసు గురించి అంతటా చర్చ జరుగుతోంది.
