
స్వీయ నియంత్రణ పాటించలేరా?
గతంలో హెచ్చరించినా మార్పు రాలేదు
సీఎం రేవంత్‌రెడ్డిపై మరోసారి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు 10వ షెడ్యూల్‌ను ఎగతాళి చేసినట్లే ఉన్నాయని వ్యాఖ్య
ఆయన మాటలు కోర్టు ధిక్కారం కిందే తీసుకోవాల్సి ఉంటుందన్న జస్టిస్ గవాయి
వ్యాఖ్యల టేపులు అందజేయాలని స్పీకర్ తరఫు న్యాయవాదికి ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ‘ముఖ్యమంత్రికి సంయమనం పాటించడం తెలియదా? ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఎగతాళి చేసినట్లే ఉన్నాయి..గతంలో హెచ్చరించినా ఆయనలో మార్పు రాలేదు..’అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీతో కూడిన ధర్మాసనం వరుసగా రెండోరోజు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఆయనపై తాము గతంలో చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించింది.
గురువారం సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా.. ‘ఉప ఎన్నికలు రావు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అంటూ సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యను బీఆర్‌ఎస్ తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం గురువారం మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన పత్రికా కథనాలను న్యాయమూర్తులకు చూపించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందించింది.
గతంలో చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా?
‘గతంలో ఇలాంటి అనుభవం ఉన్నందున కొంత సంయమనం పాటించాలనే విషయం ముఖ్యమంత్రికి తెలియదా? 2024 ఆగస్టులో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కవితకు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. వాటిపై అప్పుడు క్షమాపణలు చెప్పారు. కానీ ఆ సమయంలో మేము సీఎంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకుండా తప్పు చేశామా? అని ఇప్పుడు అనిపిస్తోంది. సీఎం కనీస స్వీయ నియంత్రణ పాటించలేరా?..’అని ధర్మాసనం ప్రశ్నించింది.
‘గతంలో ఇలాంటి ఘటనను ఎదుర్కొన్న వ్యక్తి ఆ తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా? సీఎం మాటలు కోర్టు ధిక్కారం కింద తీసుకోవాల్సి ఉంటుంది..’అని జస్టిస్ గవా యి హెచ్చరించారు. ‘సీఎం అటువంటి వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అడ్డుకున్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం, పైగా స్పీకర్ సమక్షంలో ఇలా వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదు అని వారించినా ముఖ్యమంత్రి పట్టించుకోకుండా మాట్లాడారు..’అని ఆర్యమా సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

ఆ రెండు వ్యవస్థలు సంయమనం పాటించాలి
‘న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య పరస్పర సంయమనం అవసరం. దేశ సర్వోన్నత న్యాయస్థానం అన్ని విషయాల్లో సంయమనం పాటిస్తుంది. అదే సంయమనాన్ని శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల నుంచి మేం ఆశిస్తున్నాం..’అని ధర్మాసనం పేర్కొంది. అసెంబ్లీలో విపక్షం నుంచి అంతకంటే ఎక్కువగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని స్పీకర్ తరఫు న్యాయవాది అభిõÙక్ మనుసింఘ్వీ చెప్పారు. అయితే అవన్నీ ఇప్పుడు అప్రస్తుతమని జస్టిస్ గవాయి బదులిచ్చారు. శాసనసభలో ముఖ్యమంత్రి ఫిరాయింపులకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను (ట్రాన్స్‌క్రిప్‌్ట, టేప్స్) యథాతథంగా తమకు అందజేయాలని సింఘ్వీని జస్టిస్ గవాయి ఆదేశించారు.