
అమెరికాలోని టంపాలో జూలై 4.5,6 తేదీల్లో జరిగే 8 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో ఈసారి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు ఉంటాయని ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విజేత చంద్రబోస్ తెలిపారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో తెలుగు భాష కోసం నాట్స్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. అమెరికా తెలుగు సంబరాల్లో తనతో పాటు వచ్చే తెలుగు రచయితలతో కలిసి సరికొత్త సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
హైదరాబాద్‌లో నాట్స్ సంబరాలకు విచ్చేసే అతిధుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబోస్ మాట్లాడారు. సంబరాల్లో సాహిత్య పరిమళాలు వెదజల్లడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాట్స్‌తో తనకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని.. గతంలో కూడా నాట్స్ సంబరాలకు వెళ్లానని ప్రముఖ సినీ సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అన్నారు. సంబరాల సాహితీ కార్యక్రమాల్లో కచ్చితంగా పాలుపంచుకుంటానని తెలిపారు.. నాట్స్ సంబరాలకు తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందని ప్రముఖ గేయ రచయిత త్రిపురనేని కల్యాణ్ చక్రవర్తి అన్నారు. సంబరాల్లో తెలుగు సాహిత్య సదస్సుల్లో పాల్గొనే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ 8 వ అమెరికా తెలుగు సంబరాలకు అందరూ కుటుంబసమేతంగా రావాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి పిలుపునిచ్చారు.
మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు 300 మంది సంబరాల కార్యవర్గ కమిటీ సభ్యులు ఇప్పటినుంచే ముమ్మరంగా కృషి చేస్తున్నారు. సంబరాల్లో తెలుగు భాష ప్రేమికులను ఆకట్టుకునే విధంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నామని నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు.