
పెంతలన్ గేమ్‌కు విస్తృత ప్రచారం కల్పించాలి
పటమట(విజయవాడతూర్పు): పెంతలన్ గేమ్‌కు విస్తృత ప్రచారం కల్పించి రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా మోడరన్ పెంతలన్ అసోసియేషన్ కృషి చేస్తోందని ఆ యూనియన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. మోడరన్ పెంతలన్ జాతీయ క్రీడలు వచ్చే ఏడాది జనవరిలో మేఘాలయలో జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనేలా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. మోడరన్ పెంతలన్ అసోసియేషన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 2025 జనరల్ బాడీ అధ్యక్షుడిగా ఉజ్వల ప్రసాద్‌ను, చైర్మన్‌గా తనను, కోశాధికారిగా డింపుల్ కృష్ణ, కార్యదర్శి ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో ఎన్నుకున్నామన్నారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విజయవాడ, కాకినాడ, తిరుపతిలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.