Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Supreme Court Fires On Telangana Govt About Kancha Gachibowli Lands1
‘కంచ’లోనే లోపలేస్తాం!

సాక్షి, న్యూఢిల్లీ: ‘అభివృద్ధి పేరుతో మూడు రోజుల్లోనే వందల బుల్డోజర్లను ఉపయోగించి 100 ఎకరాల్లో చెట్లను తొలగించారు. చెట్ల నరికివేతను ఏ రకంగానూ సమర్ధించుకోవాలని చూడొద్దు. చెట్ల నరికివేతకు అసలు అనుమతులు తీసుకున్నారా లేదా? ఈ ప్రశ్నకు మాకు సూటిగా సమాధానం చెప్పండి. ఒకవేళ అనుమతులు తీసుకోకపోయి ఉంటే మాత్రం అందుకు బాధ్యులైన అధికారులందరినీ జైలుకు పంపుతాం. వారి కోసం అదే ప్రాంతంలో తాత్కాలిక జైలు నిర్మించి మరీ ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ కంచ గచ్చిబౌలి భూముల కేసులో రాష్ట్ర ప్రభుత్వంపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ జార్జ్‌ అగస్టీన్‌ మసీలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో 1996లో తామిచ్చిన తీర్పునకు విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులే బాధ్యులవుతారనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించింది. వంద ఎకరాల్లో అటవీ సంరక్షణ కోసం చట్టప్రకారం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ఆదేశించింది. తాము చేపట్టబోయే తీవ్ర చర్యల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఇతర కార్యదర్శులను కాపాడాలనుకుంటే 100 ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని తేల్చిచెప్పింది. పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికతోనే మా ముందుకు రావాలని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సుమారు అరగంటపాటు సాగిన వాదనల అనంతరం కేసు విచారణను మే 15కు వాయిదా వేసింది. అప్పటివరకు స్టేటస్‌ కో కొనసాగుతుందని తెలిపింది. చెట్ల తొలగింపుపై తమ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించిన సెంట్రల్‌ ఎంపవర్డ్‌ కమిటీ (సీఈసీ) సమర్పించిన నివేదికపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసేందుకు 4 వారాల గడువు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి, ‘బీ ద ఛేంజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ’పిటిషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు, మరో పిటిషన్‌ తరఫున ఎస్‌.నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. అభివృద్ధి చేసేందుకే.. అంతకుముందు అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు ప్రారంభిస్తూ అన్ని అనుమతులతోనే ఆ భూముల్లో చెట్లను (పొదలు) తొలగించామన్నారు. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అని ఈ సందర్భంగా ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. తెలంగాణలో వాటర్‌ అండ్‌ ట్రీ (వాల్టా) యాక్ట్‌ ఉందంటూ అమికస్‌ క్యూరీ పరమేశ్వర్‌ జోక్యం చేసుకొని ధర్మాసనానికి వివరించగా ఈ చట్టం కింద అనుమతులు తీసుకోకుంటే అందరిపై చర్యలు తీసుకుంటామని ధర్మాసనం బదులిచ్చింది. ఆ భూములను రూ. 10 వేల కోట్లకు తనఖాపెట్టి ప్రభుత్వం అప్పు తెచ్చుకుందని అమికస్‌ క్యూరీ పేర్కొనగా ఆయన వ్యాఖ్యలను ధర్మాసనం తోసిపుచ్చింది. ‘ఆ భూములను మార్టిగేజ్‌ చేశారా లేదా అమ్ముకున్నారా అనేది మాకు అనవసరం. అక్కడ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? లేదా అనేది మాత్రమే మాకు సూటిగా జవాబు చెప్పండి’అంటూ సింఘ్వీని ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో కొన్ని షెడ్యూల్డ్‌ జంతువులు ఉన్నాయని.. అక్కడ పనులు జరిగేటప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని ‘బీ ద ఛేంజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ’తరుఫు సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు, మోహిత్‌రావులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో జేసీబీలు ఉన్నాయని చెప్పారు. హెచ్‌సీయూకు 25 వేల ఎకరాల భూమి ఉందని.. అందులో 400 ఎకరాల భూవివాదం 2004 నుంచి కొనసాగుతోందని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. దీనికి సంబంధించి కోర్టు తీర్పులు, 20 ఏళ్లలో ఆ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. ఈ స్థలంలో ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మందికి జీవనోపాధి, ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు చెప్పారు. సీఎస్‌ ఒక మహిళ అని, ఆమె నెల రోజుల్లో రిటైరవనున్నారని సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? ఈ సందర్భంగా ధర్మాసనం మళ్లీ స్పందిస్తూ ‘మేం పదేపదే చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అని అడుగుతున్నాం. ఈ ప్రశ్నకు మాకు సూటిగా మీ సమాధానం కావాలి’అంటూ వ్యాఖ్యానించింది. ‘సీఎస్‌ నెల రోజుల్లో రిటైరవుతున్నారంటే ఎలా సింఘ్వీజీ? ఆ ప్రాంతంలో జేసీబీలు వచ్చిన విషయం సీఎస్‌కు తెలియదా? రాష్ట్రంలో జరుగుతున్న విషయాలకు సీఎస్‌ బాధ్యత వహించాలి కదా?’అంటూ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రశ్నించారు. ‘అడవి అనే పదానికి నిర్వచనం ఇస్తూ 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా చెట్ల నరికివేత జరిగి ఉంటే మాత్రం మేం ఊపేక్షించం. చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకోవాలనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అంటూ ధర్మాసనం నిలదీసింది. మహానగరాల్లో అటవీభూముల్లో కాపాడుకోకపోతే ఎలా? ‘చార్‌ధామ్‌ యాత్ర కోసం రోడ్డు నిర్మాణానికి చెట్లు తొలగిస్తామంటేనే మేం అనుమతించలేదు. మహారాష్ట్రలో సచివాలయ నిర్మాణం కోసం పర్యావరణానికి నష్టం కలిగించిన కేసు రెండు దశబ్దాలుగా సుప్రీంకోర్టులోనే పెండింగ్‌లో ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ముంబై, చెన్నై, హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లోని అటవీ భూముల్ని కూడా కాపాడుకోలేకపోతే ఎలా? అంటూ ప్రశ్నలు సంధించింది. మంత్రులు ఏది చెబితే అధికారులు అది చేసేస్తున్నారంటూ అమికస్‌ క్యూరీ పరమేశ్వర్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా ‘పర్యావరణానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను జైళ్లకు పంపించాల్సి వస్తుంది జాగ్రత్త. చెట్లను కొట్టేసిన దగ్గరే తాత్కాలిక జైలు నిర్మిస్తాం. సంబంధిత అధికారులను అదే జైలులో 6 నెలలపాటు ఊచలు లెక్కబెట్టిస్తాం’అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వంద ఎకరాలను ఎలా పునరుద్ధరిస్తారు? చెట్లు కొట్టేసిన ప్రాంతంలో పర్యావరణ పునరుద్ధరణ కోసం తీసుకున్న చర్యలేంటి? ఆ భూముల్లో వన్యప్రాణుల్ని ఎలా రక్షిస్తారు? అక్కడి నష్టాన్ని ఎలా పూడుస్తారు?’అంటూ సింఘ్వీపై ధర్మాసనం ప్రశ్నలవర్షం కురిపించింది. విధ్వంసం చేస్తే ప్రేక్షక పాత్ర పోషించాలా? ఆ ప్రాంతంలో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు సిద్ధపడిందని.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నందునే ఆ ప్రాంతమంతా దట్టమైన పొదలతో అడవిలా తయారైందని సింఘ్వీ వాదించారు. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసి ఎందరో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని ధర్మాసనానికి చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘అభివృద్ధి, ఉద్యోగాల కల్పన పేరుతో మీరు పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే మేం ప్రేక్షకపాత్ర పోషించాలా?. మీకు మీరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమిటి? మూడు రోజుల్లో 100 ఎకరాలు ధ్వంసం చేశారంటే ఎన్ని బుల్డోజర్లు అక్కడ ఉన్నట్లు? మీరు సృష్టించిన రణరంగానికి అక్కడి జంతువులు ప్రాణభయంతో పరుగులు తీయగా వాటిని కుక్కలు కరిచాయి. ఆ వీడియోలను చూసి చలించిపోయాం’అని పేర్కొంది. అయితే ఆ భూముల్లో జంతువులు లేవని.. కావాలనే కొందరు నకిలీ వీడియోలు సర్క్యులేట్‌ చేశారని సింఘ్వీ బుదులివ్వగా ధర్మాసనం ఆక్షేపించింది. అక్కడ జంతువులు పరుగులు తీసిన వీడియోలను తాము చూసి చలించిపోయమని తెలిపింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని సింఘ్వీ ధర్మాసనానికి బదులిచ్చారు. దీనిపై తదుపరి విచారణను ధర్మాసనం మే 15కు వాయిదా వేసింది.

DC win first Super Over of IPL 2025 to leave RR heartbroken2
IPL 2025: ఉత్కంఠ పోరు.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ 'సూప‌ర్' విక్టరీ

ఐపీఎల్‌-2025లో వ‌రుస‌గా రెండో మ్యాచ్ అభిమానుల‌ను ఆఖ‌రి వ‌ర‌కు మునివేళ్ల‌పై నిల‌బెట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌లో ఫ‌లితం తేలింది. ఈ ఉత్కంఠ‌పోరులో ఢిల్లీ విజ‌యం సాధించింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వికెట్ న‌ష్టానికి 11 ప‌రుగులు చేసింది.మిచిల్ స్టార్క్ బౌలింగ్ చేసిన‌ సూప‌ర్ ఓవ‌ర్‌లో హెట్‌మైర్‌(5), రియాన్ పరాగ్‌(4) రాణించారు. అనంత‌రం 12 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఢిల్లీ కేవ‌లం మూడు బంతుల్లోనే చేధించి విజ‌యాన్ని అందుకుంది. రాజ‌స్తాన్ త‌ర‌పున సూపర్ ఓవ‌ర్ వేసిన సందీప్ శ‌ర్మ బౌలింగ్‌లోకేఎల్‌ రాహుల్ 7 ప‌రుగులు చేయ‌గా.. స్ట‌బ్స్ సిక్స‌ర్ కొట్టి త‌న జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. ల్లీ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ పోరెల్(49) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. రాహుల్(38), స్ట‌బ్స్‌(34), అక్ష‌ర్ ప‌టేల్‌(34) రాణించారు. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో రాజ‌స్తాన్ కూడా 4 వికెట్లు కోల్పోయి స‌రిగ్గా 188 ప‌రుగులు చేసింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్ విజ‌యానికి 9 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. మిచిల్ స్టార్క్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 8 ప‌రుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్ర‌మంలో మ్యాచ్ ఫ‌లితాన్ని తేల్చడానికి అంపైర్‌లు సూప‌ర్ ఓవ‌ర్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ సూప‌ర్ ఓవ‌ర్‌లో ఢిల్లీనే పై చేయి సాధించింది.

Sakshi Guest Column On Chhattisgarh Maoists and mines3
గనులకై యుద్ధం

మధ్యభారత అరణ్యాలలో ఆదివాసుల మీద, ఆదివాసుల జల్, జంగల్, జమీన్, ఇజ్జత్‌ పోరాటానికి మద్దతు ఇస్తున్న మావోయిస్టుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి గట్టడం, ఆ ప్రాంతంలోని అపారమైన, సంపన్నమైన ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే వ్యూహంలో భాగమే అని దాదాపు ఇరవై సంవత్సరాలుగా పరిశీలకులు, విమర్శకులు ఎందరో రాస్తున్నారు. సల్వా జుడుం పేరుతో 2005లో పాలకులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిన ఆదివాసుల మధ్య అంతర్యుద్ధం నుంచి, ఇప్పుడు 2026 మార్చ్‌ 31 నాటికి మావోయిస్టు రహిత ఛత్తీస్‌గఢ్‌ తయారు చేస్తామని ముహూర్తం నిర్ణయించి మరీ సాగిస్తున్న ఆపరేషన్‌ కగార్‌ దాకా మధ్య భారత అరణ్యాలలో చాలా నెత్తురు ప్రవహించింది. చివరి యుద్ధం అని చెప్పుకొంటున్న ప్రస్తుత దశ మొదలైన 2024 జనవరి 1 నుంచి గడచిన పద హారు నెలల్లో 400 మందికి పైగా ఆదివాసులను, మావోయిస్టులను భద్రతా బలగాలు చంపివేశాయి.ఖనిజ వనరుల కోసమే!ఈ మారణకాండ అంతా ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేసి, స్వస్థలాల నుంచి వారిని నిర్వాసితులను చేసి, వారి కాళ్లకింది నేలలో నిక్షిప్తమైన సంపన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడానికే అని విమర్శకులు చేస్తున్న అభియోగం నిజమేనని చూపే పరిణామాలు జరుగు తున్నాయి. కార్పొరేట్‌ సంస్థల రక్షణ కోసం లెక్కలేనన్ని భద్రతా బలగాల క్యాంపులు నిర్మాణమవుతున్నాయి. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర్‌ సీమా బల్, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ వంటి సరిహద్దులను రక్షించవలసిన బలగాలు ఇప్పుడు మధ్య భారతంలో ఉన్నాయి. ఆ బలగాలను తీసుకుపోవడానికీ, తవ్విన ఖనిజాన్ని బైటికి తీసుకురావడానికీ నాలుగు లైన్ల, ఆరు లైన్ల రహదారుల నిర్మాణం బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో వేగంగా జరిగిపోతున్నది. ఈ ‘అభివృద్ధి’ కార్యక్ర మానికి అడ్డు వస్తారనే అనుమానం ఉన్నవాళ్ల మీదికి డ్రోన్లతో నిఘా, వైమానిక బాంబు దాడులు, వేలాది కాల్బలాలతో జల్లెడ పట్టి, చుట్టుముట్టి, ఎటువంటి ప్రతిఘటన లేకపోయినా కాల్చి చంపి ఎదురుకాల్పుల కథనాలు విడుదల చేయడం జరుగు తున్నది.ఆ వరుసలోనే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అత్యుత్తమ స్థాయి ఇనుప ఖనిజం (హెమటైట్‌) గనులను వేలం వేయడానికి శరవేగంతో ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖనిజ వనరుల శాఖ 2025 జనవరి 15న సరిగ్గా ఈ హత్యాకాండల వార్తలు వస్తున్న దంతెవాడ, కాంకేర్‌ జిల్లాలలోని ఇనుప ఖనిజం గనుల బ్లాకులు నాలుగింటిని వేలం వేసే ప్రక్రియ ప్రారంభించింది. వీటిలో బైలదిల్లా గనులుగా ప్రఖ్యాతమైన ఖనిజ వనరుల కొండలు దంతెవాడ జిల్లా కిరండుల్‌ నుంచి బీజాపూర్‌ జిల్లా గంగలూరు దాకా వ్యాపించి ఉన్నాయి. బైలదిల్లా డిపాజిట్‌ 1ఎ, 1బి, 1సి, కాంకేర్‌ జిల్లాలోని హాహాలొద్ది అనే ఈ నాలుగు బ్లాకుల వేలం ప్రక్రియ ఫిబ్రవరి 28 దాకా సాగి, 58 ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడ్డాయి. చివరికి మూడు గనులను ఆర్సెలార్‌ మిత్తల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా, ఒక గనిని రూంగ్టా స్టీల్‌ దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా ప్రభుత్వ వేలంపాటలో ప్రతిపాదించిన కనీస ధర కన్నా 154 శాతం, 160 శాతం ఎక్కువకు పాడు కున్నాయంటే, అక్కడ వారికి ఎంత లాభం చేకూరే అవకాశం ఉందో ఊహించవచ్చు. ఈ గనుల లీజు యాభై సంవత్సరాల పాటు ఉంటుంది గనుక ఇది రేపో మాపో వట్టిపోయే ఆవు కూడా కాదు, కామధేనువు! ఇప్పటివరకూ బైలదిల్లా గనుల్లోకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) తప్ప ప్రైవేటు కంపెనీలు ప్రవేశించలేదు. ఇప్పటివరకూ ఆర్సెలార్‌ మిత్తల్‌ తనకు అవసరమైన ఖనిజాన్ని ఎన్‌ఎండీసీ నుంచి తీసుకుని పైప్‌ లైన్‌ ద్వారా విశాఖపట్నం పంపుతుండేది. ఇప్పుడీ వేలంతో ఆ కంపెనీకి సొంత గనులు వచ్చాయి. వీటిలో బైలదిల్లా 1ఎ, 1బి ఒక్కొక్కటీ 2,100 ఎకరాలు, 1సి 1,976 ఎకరాలు, హాహాలొద్ది 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ నాలుగు బ్లాకులతోనే దట్టమైన దండకారణ్యంలో దాదాపు ఏడు వేల ఎకరాల అడవి నేలమట్టమైపోయి ‘అభివృద్ధి’ జరగబోతున్నది. ఈ నాలుగు బ్లాకులూ కలిసి దాదాపు ముపై్ఫ కోట్ల టన్నుల ఉత్తమశ్రేణి ఖనిజం తవ్వబోతున్నారు. ఇటువంటి లెక్కలలో తాము కాగితాల మీద పొందినదానికన్న ఎక్కువ విస్తీర్ణపు గనులు తవ్వి, మరింత ఎక్కువ ఖనిజాన్ని దోచుకుపోవడం అందరికీ తెలిసిందే. వేలం ప్రక్రియలో చెప్పిన మేరకే తవ్వుతారని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే ఈ నాలుగు గనుల ఖనిజం విలువ ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు. కాగా, ప్రభుత్వానికి దక్కే ఆదాయం ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే! ఈ రాష్ట్రంలో ఇంతకుముందే ఎన్‌ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ ఛత్తీస్‌గఢ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (సీఎండీసీ)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పరచి, గనులకు పర్యావరణ అనుమతులు సంపాదించి, ఆ గనులను తవ్వకం, ఖనిజాభివృద్ధి కార్యకలాపాలకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు ఇచ్చింది. ఖనిజ సంపన్నమైన ఈ రాష్ట్రంలో ఇప్పటికే అంబుజా, బిర్లా, ఎస్సార్, జిందాల్, జె కె లక్ష్మి, లఫార్జ్, ఎల్‌ అండ్‌ టి, వేదాంత వంటి కార్పొరేట్‌ దిగ్గజాలన్నీ ఉన్నాయి. ఇది పలు రకాల సమస్యఇది ఆదివాసులకో, మావోయిస్టులకో సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది ముహూర్తాలు నిర్ణయించి మనుషులను చంపవచ్చునా అనే మానవతా సమస్య, నాగరికతా సమస్య. పర్యావరణ సమస్య, దేశ సంపద ఎవరికి చెందాలనే సమస్య, అటవీ హక్కుల చట్టం, పంచాయత్‌ రాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ చట్టం వంటి చట్టాల ఉల్లంఘన సమస్య. రాజ్యాంగ ఆదర్శాలు, ప్రజల హక్కులు అమలవుతున్నాయా అనే సమస్య. మనందరి సమస్య!ఎన్‌. వేణుగోపాల్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Sakshi Editorial On Harvard University4
హార్వర్డ్‌ ప్రతిఘటనా స్వరం!

అంతటా ఒక అనిశ్చితి, దాన్ని మించిన సందిగ్ధత అలముకున్నవేళ నిశ్చయంగా, నిర్భయంగా వినబడిన గొంతు ఇప్పుడు అమెరికాలో సర్వత్రా ప్రతిధ్వనిస్తోంది. ఆ గొంతు ప్రపంచంలోనే అత్యుత్తమశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటైన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానిది. ఆ విశ్వవిద్యాలయం ఇంతవరకూ లక్షలాది విద్యార్థులకు పాఠం చెప్పివుండొచ్చు. కానీ తనతో ఏకీభవించనివారిని ససేమిరా సహించని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వంటి నేతకు పాఠం నేర్పాలని చూస్తే భారీ మూల్యం చెల్లించాల్సివుంటుంది. అది తెలిసి కూడా హార్వర్డ్‌ దృఢంగా నిలబడటం ఈ కాలంలో అతి పెద్ద వార్త. పాలస్తీనా అనుకూల ఉద్యమకారుల్ని పట్టించి ఇవ్వాలనీ... వైవిధ్యత, సమానత, సమ్మిళిత (డీఈఐ) విధానాల ద్వారా ‘అందరికీ అవకాశాలిచ్చే’ పేరిట ప్రతిభపై వివక్ష ప్రదర్శిస్తున్న వైఖరి విడనాడాలనీ ట్రంప్‌ కొంతకాలంగా హెచ్చరిస్తున్నారు. ఒప్పుకోకుంటే నిధులు ఆపేస్తామని హుకుం జారీచేశారు. దేశంలోని 60 ప్రధాన విశ్వవిద్యాలయాల్లో చాలా భాగం ఆయన ఆదేశాలకు తలొంచాయి. కానీ హార్వర్డ్‌ నిర్భయంగా నిలబడింది. ‘మా వ్యవహారాల్లో మీకేం పన’ని ఎదురు ప్రశ్నించింది. వర్త మాన పరిస్థితుల్లో ఈ చర్య చిన్నదేం కాదు. మొన్న జనవరిలో అధికార పగ్గాలు చేపట్టింది మొదలు ట్రంప్‌ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కోర్టులనే ధిక్కరిస్తున్నారు. అక్రమ వలసదారుగా పొర బడి, ఒక పౌరుడిని ఎల్‌సాల్వెడార్‌ జైలుకు పంపిన వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. పొరబడ్డా మని ఒప్పుకుంటూనే అతన్ని వెనక్కితేలేమని కోర్టులో ప్రభుత్వం మొండికేసింది. ఆరు నూరైనా తేవాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించగా మౌనమే జవాబైంది. మర్నాడు అమెరికా సందర్శించిన ఎల్‌సాల్వెడార్‌ అధ్యక్షుడు ‘అతన్ని అప్పగించేది లేద’ంటూ సాక్షాత్తూ వైట్‌హౌస్‌లో ప్రకటించారు.విశ్వవిద్యాలయాలు కళాశాలల కన్నా భిన్నమైనవి. అవి ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తాయి. కొత్త ఆలోచనల్ని స్వాగతిస్తాయి. భిన్న ధోరణులపై పరిశోధనకు అవకాశమిస్తాయి. అందుకే అవి జ్ఞానకేంద్రాలు. ఎంతమందికి పట్టాలు పంపిణీ చేశామన్నది కాక, ఎటువంటి విశిష్ట వ్యక్తులను సమాజానికి అందించగలిగామన్నది లెక్కేస్తాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా సర్కారు విశ్వ విద్యాలయ పరిశోధనలకూ, సృజనాత్మక ఆవిష్కరణలకూ భారీయెత్తున ఖర్చుచేసింది. ఫలితంగా అపారసంఖ్యలో ఆవిష్కరణలు సాధ్యమయ్యాయి. అనేక కొత్త ఉపకరణాలు అందుబాటులో కొచ్చాయి. చికిత్సకు లొంగని ఎన్నో వ్యాధులు చిత్తగించాయి. ఆయుఃప్రమాణం పెరిగింది. కంప్యూ టర్లు మొదలుకొని రోబోటిక్స్, కృత్రిమ మేధ వరకూ అన్నిటికన్నీ కేవలం ఈ పరిశోధనల పర్యవసానమే. లైబ్రరీలు, లేబొరేటరీలు దాటుకుని పరిశ్రమల్లో పురుడు పోసుకున్న ఉత్పత్తులు ఎన్నెన్నో! వాటివల్ల అసంఖ్యాకంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. పర్యవసానంగా ఇదంతా సమాజ ఆధునికతకు తోడ్పడింది. గత నెలలో విడుదలైన ఒక నివేదిక ప్రకారం జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌ఐహెచ్‌) నిరుడు పరిశోధనలకు వ్యయం చేసిన 3,690 కోట్ల డాలర్ల సొమ్ము 9,450 కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడింది. సరుకుల తయారీ, పంపిణీ, వినియోగం, ఇతర అనుబంధ సర్వీసులు ఈ కార్యకలాపాల్లో భాగం. 4,08,000 ఉద్యోగాల కల్పన సాధ్యమైంది.కానీ ట్రంప్‌ సర్కారు దీన్ని అంగీకరించటం లేదు. అవి ఏం చేయాలో, చేయకూడదో నిర్దేశిస్తున్నారు. సాష్టాంగపడమంటున్నారు. అందుకు సిద్ధపడినా కనికరించటంలేదు. పేరుప్రఖ్యాతులున్న కొలంబియా విశ్వవిద్యాలయ దుఃస్థితే అందుకు ఉదాహరణ. ఆ క్యాంపస్‌లో కొంతకాలం క్రితం జరిగిన పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి, వారి అరెస్టుకు సహకరించాలనటంతో మొదలుపెట్టి ప్రభుత్వం అనేక డిమాండ్లు పెట్టింది. మూడు డజన్లమంది ‘ప్రత్యేక అధికారుల’ను తక్షణం నియమించడం అందులో ఒకటి. ఆ ప్రత్యేకాధికారులకు పాలస్తీనా అను కూల విద్యార్థులను గుర్తించి అవసరమైనప్పుడు అరెస్టుచేసే అధికారాలున్నాయి. విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ అధ్యయనాల విభాగాన్ని పర్యవేక్షించే అధిపతిని నియమించాలన్న ప్రభుత్వ తాఖీ దును సైతం ఆమోదించింది. ఆ విభాగం సిలబస్‌ను నిశితంగా పరిశీలించి మార్పులు చేర్పులూ సూచిస్తుంది. ఇన్ని చేసినా ఆ విశ్వవిద్యాలయానికి విడుదల చేయాల్సిన 40 కోట్ల డాలర్ల నిధులనూ నిలిపివేసింది. విశ్వవిద్యాలయ తాత్కాలిక అధ్యక్షురాలు కత్రినా ఆర్మ్‌స్ట్రాంగ్‌ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాను తీసుకుంటున్న చర్యలను నిరసించిన విశ్వ విద్యాలయ ఆచార్యులకు ఇవి చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రమేనని కత్రినా వివరించారు. అయినా నిధుల విడుదల జాడ లేకపోవటంతో కొలంబియా యాజమాన్యం ఆమెకు ఉద్వాసన పలికింది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం సంగతికే వస్తే, తిరుగుబాటుకు తక్షణ మూల్యం 220 కోట్ల డాలర్ల గ్రాంటు, 6 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు నిలిచిపోవటం. ఇవిగాక పన్ను మినహాయింపులు కూడా ఆపేస్తామని సర్కారు బెదిరిస్తోంది. నిజానికి మొదటే ప్రధాన యూనివర్సిటీలన్నీ ప్రభుత్వ బెదిరింపులను ముక్తకంఠంతో నిరసించాల్సింది. కానీ ఇప్పటికి కూడా ఎవరికి వారు ట్రంప్‌ కంట్లో పడకుంటే చాలన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ చాలా సంస్థలు గోడమీది పిల్లివాటంగా ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాలపై సర్కారువారి సంపూర్ణ పెత్తనాన్ని అంగీకరించాలన్నది ట్రంప్‌ ఆంతర్యం. యూదు వ్యతిరేకత, వివక్ష విధానాల అమలు వంటి ఆరోపణలన్నీ పైకి చెబుతున్న కారణాలు. దీన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అమెరికా విశ్వవిద్యాలయాలకు అంత మంచిది. ఇన్నాళ్లూ తాము బోధించిన విలువల కోసం నిలబడితేనే వాటి గౌరవమర్యాదలు కాస్తయినా నిలబడతాయి.

Ponguleti Srinivas Reddy in a special interview with Sakshi5
కూల్చే కుట్ర కేసీఆర్‌దే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌దేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నోటి వెంట వచ్చినవి కేసీఆర్‌ మనసులోని మాటలేనని ఆరోపించారు. రూ.5–6 వేల కోట్లు ఖర్చు చేసైనా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఆ చట్టం తీరుతెన్నులు, రెవెన్యూ శాఖలో చేపడుతున్న సంస్కరణలు, రాష్ట్ర రాజకీయాలపై బుధవారం ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భూభారతి చట్టంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు వారికి ఉరితాడు అయింది ధరణినే. అది గ్రహించకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. వారికి గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు కూడా ఈసారి రావు. 15 నెలలకే ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరి ఆత్మలు మాట్లాడుతున్నాయి. కేసీఆర్‌ మనసులోని మాటలనే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. రూ.5–6 వేల కోట్లు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్యేలను కొనాలని అనుకుంటున్నారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నన్ని రోజులు తనకు కావాల్సిన బిల్డర్లకు వేలాది ఎకరాలు కట్టబెట్టారు. ఇప్పుడు వారంతా భయభ్రాంతులకు గురై, ఫామ్‌హౌస్‌కు వెళ్లి మాజీ సీఎంకు మొరపెట్టుకున్న మాటలను ప్రభాకర్‌రెడ్డితో చెప్పించారు. ప్రభుత్వ భూములను చెరపట్టిన వారు ఏడేడు లోకాల ఆవల ఉన్నా వదిలిపెట్టం. ప్రతి ఇంచు భూమిని బరాబర్‌ తీసుకుని పేదలకిస్తాం. మాజీ సీఎం, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు వేసే స్కెచ్‌లు, కుట్రలకు ఎలా చెక్‌పెట్టాలో కాంగ్రెస్‌ పార్టీ పులులకు తెలుసు. సమయం వచ్చినప్పుడు ఆ పులులు స్పందిస్తాయి’ అని స్పష్టంచేశారు.కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు. ‘పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు వేస్తారు. మేం మంచిగా పనిచేస్తున్నందుకే కంచ గచ్చిబౌలిపై మోదీ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. నేటి నుంచే భూ సమస్యల పరిష్కారంరాష్ట్ర ప్రజల కోరిక మేరకే ధరణిని బంగాళాఖాతంలో కలిపేశా మని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. జూన్‌ 2వ తేదీ నాటికి వ్యవసాయ భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో వీలైనన్ని పరిష్కరిస్తా మని వెల్లడించారు. భూభారతి చట్టం ద్వారా వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించే పనిని గురువారం నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ‘పైలెట్‌ ప్రాజెక్టుగా లింగంపేట, నేలకొండపల్లి, మద్దూరు, వెంకటాపూర్‌ మండలాలను ఎంచుకున్నాం. ఈ మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తాం. ఈ సదస్సుల్లో రైతుల నుంచి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ దరఖాస్తు ఫార్మాట్‌ను ఇప్పటికే క్షేత్రస్థాయికి పంపాం. ప్రతి గ్రామంలో తహసీల్దార్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం పర్యటించి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సదస్సులు నిర్వహిస్తుంది. స్వీకరించిన దరఖాస్తులను వెంటనే కంప్యూటరైజ్‌ చేస్తాం. ఈ నెలాఖరుకల్లా ఆ 4 మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు పూర్తవుతాయి. ఆ 4 మండలాలతోపాటు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు రైతులతో సదస్సులు నిర్వహిస్తారు. అక్కడ కూడా దరఖాస్తులు తీసుకుంటాం. మే మొదటివారంలో 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని మోడల్‌గా తీసుకుని, ఆయా మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహించి, రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. జూన్‌ 2వ తేదీకల్లా అన్ని జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. ఈ సదస్సుల ద్వారా పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కూడా జరుగుతుంది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన పేదలను గుర్తించి వారికి పట్టాలిస్తాం. జూన్‌ 2న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఈ పట్టాల పంపిణీ జరుగుతుంది. జూన్‌ 2 తర్వాత రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది’ అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.జీపీఓలు వచ్చాకే సర్వేమ్యాప్‌లురాష్ట్రంలో గ్రామ పాలనాధికారులను నియమించిన తర్వాతే సర్వే మ్యాప్‌లను అమల్లోకి తెస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ఆ భూమి హద్దులతో కూడిన సర్వేమ్యాప్‌ కూడా అందించాలన్న నిబంధనను ఇప్పటికిప్పుడు అమల్లోకి తెచ్చే ఉద్దేశం లేదు. రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలనాధికారులు (జీపీఓ) వస్తారు. 6 వేల మంది లైసెన్సుడ్‌ సర్వేయర్లు కూడా వస్తారు. ఆ తర్వాత సర్వే మ్యాప్‌ నిబంధన ప్రారంభమవుతుంది. ఈలోపు రైతులు ఎవరైనా స్వచ్ఛందంగా కోరుకుంటే వారి పాస్‌పుస్తకంలో సర్వే మ్యాప్‌ ముద్రిస్తాం. కర్ణాటకలో 9 ఏళ్లుగా ఈ సర్వే మ్యాప్‌ నిబంధన అమలవుతోంది. ఇప్పటివరకు 75 శాతం భూములకు మ్యాప్‌ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలో అంతకంటే తక్కువ సమయంలో ఎక్కువ భూములకు సర్వే మ్యాప్‌లు వస్తాయి. జీపీఓల నియామకం విషయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. ఏం చేసినా ప్రజల సౌలభ్యం కోసమే. వ్యవస్థ కోసం అందరూ సహకరించాలి. పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలు గూగుల్‌ ఫామ్‌ ద్వారా ఆప్షన్లు ఇచ్చే గడువును పొడిగిస్తున్నాం’ అని ప్రకటించారు.కొత్త పోర్టల్‌ తెస్తాంఇప్పుడు తెచ్చిన భూభారతి పోర్టల్‌ తాత్కాలికమేనని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘భూ సమస్యల శాశ్వత పరిష్కారం ఈ పోర్టల్‌తో కాదు. అందుకే శాశ్వత పోర్టల్‌ను తీసుకురాబోతున్నాం. మరో వందేళ్ల పాటు భూభారతి పోర్టల్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. కొత్త పోర్టల్‌ తయారీకి 7–9 నెలలు పడుతుంది. ఈ ఏడాది చివరికి లేదంటే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పోర్టల్‌ అందుబాటులోకి వస్తుంది’ అని తెలిపారు.

TDP high Command seriously warns MLA Ganta Srinivasa rao6
గంటాతో కూటమికి తలనొప్పులు.. పిలిచి మరీ క్లాస్ పీకిన అధిష్టానం

రాష్ట్రంలో తెలుగుదేశం..కాంగ్రెస్.. ఎవరు అధికారంలో ఉన్నా మంత్రిగా హోదా నిలబెట్టుకునే స్థాయి నాయకుడైన గంటా శ్రీనివాస్‌కు ఇప్పుడు వట్టి ఎమ్మెల్యేగా ఉండడం ఇబ్బందికరంగా మారింది. గతంలో మంత్రి హోదాలో కలెక్టర్లు.పెద్ద పెద్ద అధికారులతో హడావుడి చేసే గంటా ఇప్పుడు భీమిలి వరకే పరిమితం అవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడూ అత్యుత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ ఓవర్ యాక్షన్ని ప్రభుత్వం..పెద్దలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన చర్యలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో చీవాట్లు పెడుతూ.. కాస్త హద్దుల్లో ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు.విజయవాడలో మంగళవారం జరిగిన ఓ ముఖ్య సమావేశానికి విశాఖ నుంచి బయల్దేరిన గంటా నేరుగా విజయవాడ వెళ్లాల్సి ఉండగా సదరు విమానం ఆయన్ను ముందుగా హైదరాబాద్ తీసుకెళ్లి..అక్కణ్ణుంచి విజయవాడ డ్రాప్ చేసింది.. ఎందుకూ అంటే విశాఖ నుంచి బెజవాడకు డైరెక్ట్ విమాన సర్వీస్ లేదు.. రద్దు చేశారని తెలిసింది. దీంతో ఉదయం వెళ్లాల్సిన గంటా మధ్యాహ్నానికి విజయవాడ చేరుకున్నారు.దీంతో ఆయన ‘ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టు మీద టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని లేనిపక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మన వారే కదా ఆయనకు చెబితే సరిపోయేది కానీ ఇలా ట్విటర్లోకి ఎక్కి రచ్చ చేయాలా అని చీవాట్లు పెట్టింది. సీనియర్ ఎమ్మెల్యే అయినా ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలా అని అడిగింది.ఇదిలా ఉండగా.. వతిలో 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తామని గంటా వియ్యంకుడు, పురపాలక మంత్రి నారాయణ ప్రకటన చేసిన తరుణంలోనే రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం నుంచి విజయవాడకు విమానమే లేదంటూ గంటా శ్రీనివాసరావు ట్విట్టర్లో సెటైర్ వేశారు. అధికార పార్టీ నాయకుడివైన నువ్వు ప్రభుత్వం పరువు తీయడం ఏమిటని అధిష్టానం ప్రశ్నించింది.వాస్తవానికి గంటా శ్రీనివాస్ గతంలో కూడా ప్రభుత్వానికి ఋషికొండ భవనాల తలుపులు తెరిచి హడావుడి చేశారు. ఫోటోలు విడుదల చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయనకు పార్టీ నుంచి అక్షింతలు పడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్.. ప్రభుత్వంలో నంబర్ టూ అయిన లోకేష్..ఇంకా మంత్రులు ఉండగా కేవలం ఒక ఎమ్మెల్యే అయిన మీరు రుషికొండ భవనాలను చూడడానికి ఎందుకు వెళ్ళారు..మీకు అంత అత్యుత్సాహం ఎందుకు అని అప్పట్లోనే టిడిపి పెద్దలు ప్రశ్నించారు. ఇక ఇప్పుడు కూడా ఈ ట్వీట్ దెబ్బతో చీవాట్లు పడ్డాయి. మొత్తానికి గంటాకు ఈ టర్మ్ బాలేనట్లుంది.::సిమ్మాదిరప్పన్న

UP Minister Shocking Order Transfer The Doctor To Some Jungle7
మంత్రి గారి ‘ఇగో’ హర్టయ్యింది.. అడవికి డాక్టర్ ట్రాన్స్‌ఫర్?!

లక్నో: ఆయనో రాష్ట్ర మంత్రి. స్థానిక ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ సమయంలో సదరు ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఓ దివ్యాంగ వైద్యాదికారి తనకి సరిగ్గా రాచమర్యాదలు చేయలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలాంటి వాళ్లని ఈ ఆస్పత్రిలో ఎందుకు బాధ్యతలు అప్పగించారో. నియోజకవర్గంలో కాకుండా అడవుల్లో పోస్టింగ్‌ ఇవ్వండి అంటూ హుకుం జారీ చేశారు. మంత్రి, డాక్టర్‌ మధ్య జరిగిన ఘటనపై దుమారం చెలరేగింది.ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చి తనకు స్వాగతం పలకలేదని ఆగ్రహించిన ఆ రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి సంజీవ్ గోండ్.. శారీరక వైకల్యం ఉన్న వైద్యాధికారి డాక్టర్ రవి సింగ్‌ను తక్షణమే తన నియోజకవర్గం నుండి బదిలీ చేయాలని ఆదేశించారు.‘ఇతనిని అడవికి పంపించండి.. ఇలాంటి వారిని ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు?’ అంటూ వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫోన్‌ చేశారు. ప్రస్తుతం,ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన సోనభద్ర జిల్లా ఒబ్రా నియోజకవర్గంలోని దిబుల్‌గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగింది. మంత్రి అక్కడ సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చారు. మంత్రి వచ్చే సమయంలో వైద్యాధికారి డాక్టర్ రవి సింగ్ ఓ రోగికి చికిత్స చేస్తున్నారు. మంత్రికి స్వాగతం పలికేందుకు వెళ్లలేకపోయారు. దీనిపై మంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనను బదిలీ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఫోన్‌లో ఆదేశించారు.ఆ వీడియోలో ‘ఇతనికి ప్రవర్తించటం రాదు. రోగుల పట్ల కూడా ఇదే విధంగా ఉంటారేమో. ఇతనిని అడవికి పంపించండి’ అంటూ ఫోన్‌ సంభాషించడం మనం గమనించవచ్చు. డాక్టర్ సింగ్ మాత్రం ‘నేను మీ వద్దకు వచ్చాను సార్. రోగికి చికిత్స చేసి వచ్చే సరికి ఆలస్యమైంది అని బదులిచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడంతో మంత్రి సంజీవ్‌ గోండ్‌ వెనక్కి తగ్గారు. తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. వైద్యుడు నన్ను ఆహ్వానించేందుకు రాలేదంటే బహుశా ఆయనకు నేను వస్తున్నాను అన్న విషయం తెలియకపోయి ఉండొచ్చు. అయితే,ఆసుపత్రిలో సదుపాయాలు బాగుండాలి. వైద్యం కోసం వచ్చే పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదంటూ ఆదేశించారు. వారికి ఏదైనా కష్టం కలగిందంటే నేను ఉపేక్షించను అని వ్యాఖ్యానించారు. मंत्री जी की ये कैसी हेकड़ी! डॉक्टर ने नहीं किया 'स्वागत' तो भड़क गए राज्यमंत्री संजीव गोंड, CMO में फोन लगाकर की डॉक्टर की शिकायत, कहा- इनको जंगल में भेजिए #UttarPradesh | #ViralVideo | #Hospital pic.twitter.com/HJzftzlbxB— NDTV India (@ndtvindia) April 16, 2025

Aarthi Subramanian Becomes TCS First Female COO8
Aarthi Subramanian: ఐటీలో ఆమెకు అగ్రపీఠం

ఐ.టి. దిగ్గజ సంస్థ టి.సి.ఎస్‌. మే 1 నుంచి ఆర్తి సుబ్రహ్మణ్యానికి సి.ఓ.ఓ. బాధ్యతలు అప్పజెప్పింది. బహుశా దేశంలో ఐ.టి. రంగంలో సి.ఓ.ఓగా నియమితురాలైన మొదటి మహిళ ఆర్తినే కావొచ్చు. ఆమె పరిచయం.చిన్న చిన్న ఉద్యోగాలు, వర్తకాలు చేసే వారు కూడా ‘వాకింగ్‌కి టైమ్‌ దొరకలేదు’ అంటుంటారు. కాని టాటా సంస్థల్లో కీలకమైన బాధ్యతల్లో ఉంటూ వచ్చిన ఆర్తి సుబ్రహ్మణ్యం ఏ రోజూ వాకింగ్‌ మానేయరు. వాన వచ్చినా వరద ముంచెత్తినా వాకింగ్‌ చేయాల్సిందే. ‘రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్లు నడవాలని నా ప్రయత్నం. కనీసం ఆరు నుంచి ఎనిమిదైనా నడుస్తుంటాను. నడక ఆలోచనకు చోటు ఇస్తుంది. ఆరోగ్యకరమైన శరీరం, ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి దోహదం చేస్తాయి’ అంటారామె. 58 ఏళ్ల ఆర్తి సుబ్రహ్మణ్యం 30 బిలియన్‌ డాలర్ల లావాదేవీలు ఉన్న దిగ్గజ ఐ.టి. సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌’ (టి.సి.ఎస్‌.)కు మే 1 నుంచి సి.ఓ.ఓ. (చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. సాధారణంగా మగవారే పై స్థానాల్లో ఉండే ఐ.టి. రంగంలో సి.ఓ.ఓ.గా మహిళ కనిపించడం అరుదు. టాటా సంస్థల్లో గాని, ఇతర ఐ.టి. దిగ్గజ సంస్థల్లోగాని ఇలా సి.ఓ.ఓ.స్థాయికి చేరిన స్త్రీలు బహు తక్కువ. అందుకే అందరూ అబ్బురంగా ఆర్తి వైపు చూస్తున్నారు.ట్రయినీగా చేరి.. అంచెలంచెలుగా ఎదిగి...ఆర్తి సుబ్రహ్మణ్యం మన వరంగల్‌ విద్యార్థి. వరంగల్‌ ఎన్‌.ఐ.ఐ.టి.లో బి.టెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాన్సాస్‌లో ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేశారు. 1989లో తన కెరీర్‌ని గ్రాడ్యుయేట్‌ ట్రయినీగా టాటాలో మొదలుపెట్టి్ట అంచెలంచెలుగా ఎదిగారు. దాదాపు టాటాలోని అన్ని కీలక సంస్థల్లో ముఖ్యహోదాల్లో పని చేశారు. మన దేశంలో పాస్‌పోర్ట్‌ డిజిటలైజేషన్‌ కోసం టాటా నిర్వహించిన ప్రాజెక్ట్‌లో చురుగ్గా పని చేశారు. టాటా ఏ.ఐ.జి.లో, అలాగే హెచ్‌.ఆర్‌లో చేస్తూ టాటా సన్స్‌లో ఎనిమిదేళ్లుగా గ్రూప్‌ చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచే టి.సి.ఎస్‌.కు సి.ఓ.ఓ.గా వస్తున్నారు.మిసెస్‌ ఫిక్సిట్‌ఆర్తి సుబ్రహ్మణ్యానికి సాటి ఉద్యోగులు ‘మిసెస్‌ ఫిక్సిట్‌’ అని సరదాగా పిలుచుకుంటారు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా దానికి ఆమె దగ్గర సమాధానం ఉంటుంది. సవాళ్లను స్వీకరించే ఆమె తత్త్వమే ఆమెను ఈ స్థాయికి చేర్చింది. అయితే ఆమెకు ఉద్యోగమే జీవితం కాదు. వారాంతం వచ్చిందంటే కచ్చితంగా బాలీవుడ్‌ సినిమా చూడాల్సిందే. అమితాబ్‌ బచ్చన్‌కు పెద్ద ఫ్యాన్‌. అలాగే పాటలు వింటారు. మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన పుస్తకాలు చదువుతారు. ‘ఒక వ్యక్తి రాబోయే కాలంలో ఎక్కడ ఎలా ఉండాలో నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని చేరొచ్చు. అయితే టీమ్‌ మీతో ఉండి మీకు సహకరించాలి. మీరు టీమ్‌కి సహకరించాలి. అది జరిగిన పక్షంలో ఉద్యోగంలో ఒక్క క్షణం కూడా మీకు బోరు కొట్టదు’ అంటారామె. టి.సి.ఎస్‌.కు ఐదేళ్ల పాటు సి.ఓ.ఓ.గా పని చేయనున్నారు ఆర్తి సుబ్రహ్మణ్యం. ఈ సమయంలో ఈ వార్త ఆ సంస్థ ఉద్యోగులకే కాదు ఐ.టి. రంగంలో పని చేస్తున్న స్త్రీలందరికీ స్ఫూర్తిదాయకమే.

Tollywood Hero Raj Tarun and Lavanya Issue In Tollywood9
రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్యపై దాడి.. ఎవరు చేశారంటే?

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది మొదలైన ఈ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలోనే వీరిద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే రాజ్‌ తరుణ్‌పై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. కానీ అంతలోనే రాజ్ తరుణ్- లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేసినట్లు తెలుస్తోంది. కోకాపేటలోని లావణ్య నివాసానికి వెళ్లి రాజ్ తరుణ్ పేరేంట్స్‌ ఆమెపై కొందరితో దాడి చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లావణ్య పైన దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కేసులు వెనక్కి తీసుకున్న లావణ్య..రాజ్ తరుణ్ మీద కేసులు వెనక్కి తీసుకుంటానని.. రాజ్, తాను విడిపోవడానికి మస్తాన్ సాయే కారణమని లావణ్య తెలిపారు. ‘నేను మస్తాన్ సాయి ఇంటికి పార్టీ కోసం వెళ్లాను. నాకు తెలియకుండానే నేను బట్టలు మారుస్తున్నపుడు వీడియో తీసుకున్నాడు. అవి పెట్టుకుని నన్ను బెదిరించాడు. నేను నా వీడియోలు డిలీట్ చేయటానికి ప్రయత్నించాను. ఆ టైం లో నన్ను చంపటానికి మస్తాన్ సాయి ప్రయత్నించాడు. మస్తాన్ సాయి డ్రగ్ పార్టీలు ఇచ్చి యువతులను వశపర్చుకుంటున్నాడు. మస్తాన్ సాయి ఆగడాలు పోలీసులు బయటపెట్టాలని లావణ్య కోరారు.

Ysrcp Wins No Confidence Motion Against Adoni Municipal Chairperson10
ఆదోని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన వైఎస్సార్‌సీపీ

సాక్షి, కర్నూలు జిల్లా: ఆదోని మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ నెగించుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంత వంటెద్దు పోకడలకు వ్యతిరేకిస్తూ, వార్డుల అభివృద్ధిలో సహకరించడం లేదంటూ చైర్మన్‌పై వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు.కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్‌ భరద్వాజ్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంతకు వ్యతిరేకంగా 35 కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36 మంది ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీ నెగ్గించుకుంది. కాగా, ‘‘వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తామని ఆశ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినా రూ.10 పని కూడా చేయలేదన్నారు. వార్డుల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీలో చేరడం వల్ల చీవాట్లు తప్ప ఏమీ ఒరగలేదు.’’ అని 11, 12 వార్డుల కౌన్సిలర్‌ వాసీం అన్నారు. నిన్న ఆయన మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్‌ సమక్షంలో తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే.ఆయన నిన్న(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ ఇకపై ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానన్నారు. సాయిప్రసాద్‌రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. వార్డులో పెద్దల మాటలను గౌరవించి, జరిగిన పొరపాటు తెలుసుకొని తిరిగి సాయన్న సమక్షంలో పార్టీలోకి వచ్చానన్నారు. 2029లో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement