
రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్
రైతుకు నష్టం కలిగిస్తే
సహించేది లేదు
విజయవాడరూరల్: రైతుకు నష్టం, నష్టం కలిగితే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను డీ ట్యాగ్ చేస్తామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్ల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌తో కలిసి గొల్లపూడి మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రాయనపాడు, పైడూరుపాడులో పర్యటించి, రైతుల ధాన్యపు రాశులను పరిశీలించి మాట్లాడారు.
ప్రత్యేక వెసులుబాటు..
ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన రైతులకు దాళ్వా పంట ఆలస్యమైనందున ఈ పంటలో నమోదైన ఖరీఫ్‌ని రబీలోకి వచ్చేలా వెసులుబాటు కల్పించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర మేరకు మిల్లర్లు ధాన్యం సేకరించడం లేదని, అదే విధంగా తరుగు పేరిట అధిక కోతలు విధిస్తున్నట్లు కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లఘించే మిల్లర్లపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో లక్ష టన్నులు అయినా సేకరిస్తామని, రైతులు ఆందోళనతో తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చౌతన్య, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.