అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు | - | Sakshi
Sakshi News home page

అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు

Published Thu, Apr 24 2025 1:27 AM | Last Updated on Thu, Apr 24 2025 1:27 AM

అనుభవ

అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు

కంచికచర్ల: పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులు రాతి క్వారీల్లో పనిచేసుకుంటూ బతుకుబండి లాగుతున్నారు. కొండలను పిండి చేస్తూ అరకొర వేతనాలతోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే క్వారీల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు తీవ్రగాయాల పాలవుతున్నారు. క్వారీల్లో పేలుళ్లకు నిబంధనలకు విరుద్ధంగా జిలెటెన్‌ స్టిక్స్‌ (పేలుడు పదార్థాలు) ఉపయోగించడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదాల సమాచారం అధికారులు, మీడియాకు తెలియడంతో బహిర్గతం అవుతున్నాయి. మరికొన్ని ప్రమాదాలు మూడో కంటికి తెలియడంలేదు. ప్రమాదాలు జరిగిన సమయంలో బాధిత కుటుంబాలకు క్వారీ యజమానులు ఎంతో కొంత పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.

ఏడాదిలో 10 మంది వరకు మృతి

ఏడాది కాలంలో దొనబండ రాతి క్వారీల్లో పది మంది వరకు మృత్యువాతపడ్డారు. వారిలో ఒడిశా, బిహార్‌ రాష్ట్రాల వారు ఉన్నారు. వర్షంలో బ్లాస్టింగ్‌ చేసిన బండరాళ్లను తొలగించే క్రమంలో బండలన్నీ కార్మికులపై పడిపోవటంతో ఒకేసారి ముగ్గురు మృతిచెందారు. క్వారీ గుంత వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఓ క్రషర్‌లో రివర్సు చేస్తున్న డోజర్‌ తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. కంకరలోడుతో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన పల్టీకొట్ట డంతో ఓ డ్రైవర్‌ మృతిచెందాడు. బ్లాస్టింగ్‌ సమయంలో రాళ్లు వచ్చి క్వారీల్లో పనిచేసే కార్మికులకు తగలడంతో తీవ్రగాయాల పాలయిన వారు మరో 20 మంది వరకు ఉన్నారు.

కనిపించని భద్రతా చర్యలు

క్వారీల్లో కార్మికుల రక్షణ కోసం నిర్వాహకులు ఎటువంటి భద్రతా చర్యలూ చేపట్టడంలేదు. పేలుళ్ల సమయంలో కొండ పైకి బెంచీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కార్మికులు పనిచేసే సమయంలో కాళ్లకు బూట్లు, బెల్టు, టోపీ, చేతులకు బ్లౌజులు సరఫరా చేయాలి. కార్మికులు కొండపైన డ్రిల్లింగ్‌ చేసే సమయంలో నాణ్యమైన తాళ్లు ఇవ్వాల్సి ఉంది. నాసిరకం తాళ్లు ఇవ్వటంతో అవి తెగి కార్మికులు కొండపై నుంచి కొందకు పడిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.

రక్షణ చర్యలు చేపట్టాలి

క్వారీల్లో బ్లాస్టింగ్‌ చేస్తున్న సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రిగ్‌ బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. దీంతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. క్వారీలో పనిచేసే కార్మికుల రక్షణకు నిర్వాహకులు చర్యలు చేపట్టాలి. నిబంధనలు పాటించని క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి.

– కోట కల్యాణ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విజయవాడ

అధిక మోతాదులో పేలుడు పదార్థాలు

అనుభవం లేని వ్యక్తులతో బ్లాస్టింగ్‌ చేయటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్లాసింగ్‌ సమమంలో అధిక మోతాదులో పేలుడు పదార్థాలను వాడుతున్నారు. ఫలితంగా క్వారీల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు మృత్యువాతపడుతున్నారు. ఒడిశా, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల కార్మికులు, మైనర్లతో పనులు చేయిస్తున్నారు.

– జి.హరికృష్ణారెడ్డి, భవన నిర్మాణ రంగ కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు

నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లోని కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల్లో సుమారు 160 వరకు రాతి క్వారీలు, 80 వరకు క్రషర్లు ఉన్నాయి. కొన్ని క్వారీలు మూత పడ్డాయి. కొన్ని క్వారీలు అధికారికంగా, మరికొన్ని అనధికారికంగా నడుస్తున్నాయి. బ్లాస్టింగ్‌ చేసే సమయంలో ఎనిమిది అడుగుల లోతులో మాత్రమే డ్రిల్లింగ్‌ చేయాల్సి ఉంది. అయితే ఒకేసారి 100 లారీలకు సరిపడా ముడి సరుకు వచ్చేలా నిబంధనలకు విరు ద్ధంగా వంద అడుగుల వరకు డ్రిల్లింగ్‌ చేస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లు ఒకే సారి పగిలిపోతున్నాయి. ఈ పేలుళ్ల ధాటికి కొన్నిసార్లు కార్మికులు మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలవుతు న్నారు. కంచికచర్ల మండలంలోని దొన బండ రాతి క్వారీలో ఒడిశా, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల కార్మికులు, ఇబ్రహీపట్నం మండలం మూలపాడు, జూపూడి క్వారీల్లో ఒడిశా, తమిళనాడు కార్మికులు పనిచేస్తున్నారు.

నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో 160కి పైగా క్వారీలు క్వారీల్లో పనికోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులు కార్మికుల భద్రతకు చర్యలు చేపట్టని క్వారీల నిర్వాహకులు బ్లాస్టింగ్‌కు అధిక మోతాదులో పేలుడు పదార్థాల వినియోగం పేలుళ్ల ధాటికి క్వారీల్లోనే తనువు చాలిస్తున్న పేద బతుకులు

రాతి క్వారీల్లో బండలను పేల్చే పనులను అనుభవం లేని కార్మికులతో చేయిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిగ్‌ బ్లాస్టింగ్‌ చేయకూడదు. 100 లారీలకు ముడి సరుకు ఒకేసారి దిగుమతి కావాలన్న ఆశతో ఘాతాలు తవ్వి, వాటిలో మోతాదకు మించి జిలెటిన్స్‌ స్టిక్స్‌ వాడి బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. పేలుడు ధాటికి పెద్ద పెద్ద బండరాళ్లు ఎగిరిపడి కార్మికులు మృతి చెందుతున్నారు. కొన్నిసార్లు క్వారీలకు మూడు కిలోమీటర్ల సమీపంలోని ఇళ్లు పేలుడు ధాటికి పగుళ్లు ఇస్తున్నాయి. మరికొన్ని చోట్ల ప్రహరీలు పడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. క్వారీలో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌ జరుగుతున్నా మైనింగ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏవైనా ప్రమాదాలు జరిగి, అవి బయటకు తెలిస్తేనే అధికారులు మొక్కుబడిగా క్వారీల వద్దకు వస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు1
1/5

అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు

అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు2
2/5

అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు

అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు3
3/5

అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు

అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు4
4/5

అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు

అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు5
5/5

అనుభవంలేని కార్మికులతో బ్లాస్టింగ్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement