
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బుధవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడకు చెందిన ఎల్.నారాయణ కుటుంబం ఆలయ అధికారులను కలిసి రూ.1,01,116 విరాళం అందజేసింది. ఒంగోలుకు చెందిన డి.శివకృష్ణ ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
మహిళలకు ‘శక్తి’ యాప్‌తో రక్షణ
విజయవాడస్పోర్ట్స్: ఆపద సమయంలో మహిళలకు ‘శక్తి’ యాప్ రక్షణగా నిలుస్తుందని మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ లతాకుమారి సూచించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శక్తి యాప్ ఆవశ్యకతపై విద్యార్థినులు, గృహిణులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జి.కొండూరు గ్రామం, విజయవాడ నగరంలోని డెంటల్ కాలేజీ, సెంట్రల్ ఎకై ్సజ్ కాలనీలో మహిళా హాస్టల్, పలు ప్రధాన కూడళ్ల వద్ద విద్యార్ధినులు, గృహిణులకు మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది బుధవారం ఈ యాప్‌పై అవగాహన కల్పించారు. ఏసీపీ లతాకుమారి మాట్లాడుతూ.. మహిళలు, బాలికల రక్షణకు ఎన్నో చట్టా లున్నాయన్నారు. ఆపద సమయంలో మహిళలకు రక్షణగా నిలిచేందుకు శక్తి యాప్‌ను రూపొందించామన్నారు. ఈ యాప్‌ను ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఆపద సమయంలో సాయం పొందాలని సూచించారు. బాధితులు యాప్‌లో సమాచారం అందించిన పది నిమిషాల్లో పోలీస్ సాయం అందుతుందన్నారు.
నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్‌పై వర్క్‌షాప్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘స్వర్ణాంధ్ర 2047’ సాధనలో భాగంగా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు రెండు రోజులు జరిగే వర్క్‌షాప్ బుధవారం ప్రారంభమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సిబ్బందికి వర్క్‌షాప్ చేపట్టారు. ఏపీ సెక్రటేరియట్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్లు రావి రాంబాబు, జె.విజయలక్ష్మి, సీనియర్ సల హాదారు డి.వి.వి.సీతాపతిరావు పాల్గొని సిబ్బందికి శిక్షణనిచ్చారు. విజన్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు నియోజకవర్గాల పరిధిలోని అవకాశాలు, బలాలు, అనుకూల, ప్రతికూల అంశాలను గుర్తించడంపై అవగాహన కల్పించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, వారి టీం సభ్యుల నుంచి సలహాలు, అభిప్రాయాలు సేకరించారు. వర్క్‌షాప్‌లో రెండు జిల్లాల నుంచి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ మండల పరిషత్ అధికారులు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్లు, ప్రణాళిక శాఖ సిబ్బంది, జీఎస్‌డబ్ల్యూఎస్ నుంచి ప్రణాళికా శాఖకు ఆన్‌డ్యూటీపై తీసుకున్న సిబ్బంది పాల్గొన్నారు. వర్క్‌షాప్ గురువారం కూడా కొనసాగుతుందని అర్థగణాంకాధికారి ఎం.లలితాదేవి తెలిపారు.

నిత్యాన్నదానానికి విరాళాలు

నిత్యాన్నదానానికి విరాళాలు