పది ఫలితాల్లో 8వ స్థానం | - | Sakshi
Sakshi News home page

పది ఫలితాల్లో 8వ స్థానం

Apr 24 2025 1:27 AM | Updated on Apr 24 2025 1:27 AM

పది ఫ

పది ఫలితాల్లో 8వ స్థానం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్‌ జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మరోసారి సత్తాచాటింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఎన్టీఆర్‌ జిల్లా విద్యార్థులు 85.68 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో సానం కైవసం చేసుకున్నారు. గత ఏడాది జిల్లా 13వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది ఆరు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరింది. గత ఏడాది 88.76 శాతం ఉత్తీర్ణత సాధించిన జిల్లా ఈ ఏడాది 85.68 శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ సారీ బాలికలదే పైచేయి

ఈ ఏడాదీ బాలికలే పైచేయి సాధించారు. 13,938 మంది బాలురు, 13,529 మంది బాలికలు కలిపి 27,467 మంది పరీక్షలు రాశారు. బాలురు 11,662 (83.67 శాతం) మంది, బాలికలు 11,872 (87.75 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో మొత్తం 27,899 మంది పరీక్షలు రాయగా 24,763 మంది (88.76శాతం) ఉత్తీర్ణత సాధించారు.

పటిష్ట ప్రణాళికతో..

పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో నిలవడానికి జిల్లా విద్యాశాఖ ప్రణాళికా బద్ధంగా కృషి చేసింది. జిల్లా విద్యాశాఖాధికారి, ఇతర అధికారులు పాఠశాలల పునఃప్రారంభం నుంచి పదో తరగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విద్యా సంవత్సరంలో జూలై నుంచే ఉదయం, సాయంత్రం పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. హెచ్‌ఎంలు, సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చేలా పర్యవేక్షణ చేశారు. 100 రోజుల ప్రణాళికను అమలు చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చర్యలు చేపట్టారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంల నుంచి ఆర్జేడీ స్థాయి వరకు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. నవంబర్‌ – డిసెంబర్‌లో సిలబస్‌ పూర్తి చేసి, ప్రతి రోజూ రివిజన్‌ చేపట్టారు. జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ (డీసీఈబీ) ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు టెస్టులు తయారు చేసి విద్యార్థులకు తర్ఫీదునిచ్చారు. జెడ్పీ యాజమాన్యం స్టడీ మెటీరియల్‌ సరఫరా చేసింది. ఈ చర్యలు మెరుగైన ఉత్తీర్ణతకు దోహదం చేశాయని పలువురు హెచ్‌ఎంలు పేర్కొన్నారు.

63 పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు

జిల్లాలో 63 పాఠశాలలు పదోతరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో తొమ్మిది పాఠశాలలు, ప్రైవేట్‌ యజమాన్యంలోని 54 విద్యాసంస్థలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి 11,524 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,747 మంది (75.90 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్‌ యాజమాన్యాల నుంచి 15,943 మంది పరీక్షలకు హాజరవగా 14,787 మంది (92.75 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఏపీ మోడల్‌ స్కూల్స్‌ 91.30 శాతం, ఏపీ రెసిడెన్షియల్‌ సొసైటీ స్కూల్స్‌ 80 శాతం, ఏపీసోషల్‌ వెల్ఫేర్‌ 93.82 శాతం, ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ 82.55 శాతం, బీసీ వెల్ఫేర్‌ 97.27 శాతం, కేజీబీవీ 96.43 శాతం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆశ్రమ స్కూల్‌ 70.45 శాతం, జెడ్పీ స్కూల్స్‌ 71.36 శాతం, మునిసిపల్‌ విద్యాసంస్థలు 80.76 శాతం, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ 83.03 శాతం, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ 92.75 శాతం, రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలు 48.94 శాతం చొప్పున ఫలితాలు సాధించాయి. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు.

19,589 మంది ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత

జిల్లా వ్యాపితంగా 23,534 మంది ఉత్తీర్ణత సాధించగా వారిలో 19,589 మంది ప్రథమ శ్రేణిలో నిలి చారు. 2,782 మంది ద్వితీయ, 1,163 తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని అధికారులు ప్రకటించారు. జిల్లాలో ఉన్న 20 మండలాల్లో చందర్లపాడు మండలం 93.25 శాతం ఫలితాలతో మొదటి స్థానంలో నిలవగా గంపలగూడెం 92.63 శాతం, విజయవాడ (తూర్పు) 90.84 శాతంతో ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి.

ఎన్టీఆర్‌ జిల్లాలో 85.68 శాతం ఉత్తీర్ణత గత ఏడాది 13వ స్థానంలో నిలిచిన జిల్లా సత్తాచాటిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు

ఫలితాలు సంతృప్తికరం

టెన్త్‌ ఫలితాల్లో రాష్ట్రంలో ఎన్టీఆర్‌ జిల్లా 8వ స్థానంలో నిలిచింది. గతేడాది 13వ స్థానంలో ఉండగా అది ఆరు స్థానాలు పైకి చేరి ఎనిమిదో స్థానాన్ని సాధించాం. ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయి. సంతోషంగా ఉంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రత్యేక తరగ తులు, నిత్యం పరీక్షల నిర్వహణతోనే ఈ ఫలితాలు సాధించాం. ఈ విజయంలో భాగస్వాములైన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అభినందనలు. – యు.వి.సుబ్బారావు,

ఎన్టీఆర్‌ జిల్లా విద్యాశాఖాధికారి

పది ఫలితాల్లో 8వ స్థానం1
1/4

పది ఫలితాల్లో 8వ స్థానం

పది ఫలితాల్లో 8వ స్థానం2
2/4

పది ఫలితాల్లో 8వ స్థానం

పది ఫలితాల్లో 8వ స్థానం3
3/4

పది ఫలితాల్లో 8వ స్థానం

పది ఫలితాల్లో 8వ స్థానం4
4/4

పది ఫలితాల్లో 8వ స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement