Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Former Home Secretary On Tahawwur Rana Role In Mumbai Attacks1
రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై

న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు తహవూర్‌ రాణా(Tahawwur Rana) భారత్‌కు వస్తున్న వేళ.. హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల్లో రాణా పాత్ర నిమిత్త మాత్రమేనన్న ఆయన.. అసలు కుట్రదారుడ్ని అప్పగించకుండా అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.తహవూర్‌ రాణా ఓ పిల్లకాకి. 26/11దాడుల్లో అతని జోక్యం చాలా తక్కువే. అసలు కుట్రదారు డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ(David Coleman Headley). అతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అమెరికాకూ తెలుసు. అయినా అతని తరలింపును ఆపేసి దుర్మార్గంగా వ్యవహరించింది అని జీకే పిళ్లై(GK Pillai) అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఐఎస్ఐకి డబుల్ ఏజెంట్‌గా వ్యవహరించిన హెడ్లీ.. 26/11 సంఘటన తర్వాత కూడా దాడుల కోసం భారత్‌పై నిఘా కొనసాగించాడు. 2009 అక్టోబర్‌లో చికాగో ఎయిర్‌పోర్టులో అతన్ని అరెస్ట్‌ చేశారు. ఆపై ఉగ్ర దాడుల అభియోగాలు రుజువు కావడంతో అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే.. దర్యాప్తునకు సహకరించి లష్కరే తాయిబా గురించి కీలక సమాచారం అందించేందుకు అతను అంగీకరించాడు. ఈ ఒప్పందం కారణంగా.. అతనితో బేరసారాలు కుదుర్చుకున్న అమెరికా భారత్‌కు అప్పగించకుండా ఉండిపోయింది. దావూద్‌ సయ్యద్‌ గిలానీ(డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ) 1960లో వాషింగ్టన్‌లో జన్మించాడు. అతని తండ్రి సయ్యద్‌ సలీం గిలానీ పాక్‌ దౌత్య వేత్త. తల్లి అలైస్‌ సెర్రిల్‌ హెడ్లీ వాషింగ్టన్‌లోని పాక్‌ రాయబార కార్యాలయంలో అమెరికా కార్యదర్శిగా పని చేశారు. పాక్‌లో ఎక్కువ రోజులు గడిపిన హెడ్లీ.. క్రమంగా లష్కరే తాయిబాకు దగ్గరై ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన 64 ఏళ్ల కెనెడియన్ అయిన రాణా ఇప్పటివరకు లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాడు. 2008 నవంబర్‌ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొలుత రైల్వే స్టేషన్‌లో బీభత్సం సృష్టించిన ముష్కరులు ఆ తర్వాత రెండు లగ్జరీ హోటళ్లపై దాడి చేశారు. ప్రాణాలతో దొరికిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను నవంబర్ 2012లో పూణెలోని యరవాడ జైలులో ఉరి తీశారు. ఈ దాడులకు మాస్టర్‌మైండ్‌ డేవిడ్‌ హెడ్లీనే అని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భావిస్తోంది. అయితే ఇదే కేసులో కీలక నిందితుడిగా లష్కర్‌ ఉగ్రవాది తహవూర్‌ రాణా ఉన్నాడు. హెడ్లీకి అత్యంత సన్నిహితుడైన రాణా.. దాడులకు ముందు ఎనిమిదిసార్లు భారత్‌కు వచ్చాడు. రెక్కీ నిర్వహించాక ఏకంగా 231 సార్లు ఫోన్‌లో మాట్లాడాడు. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్‌ తయారీ చేసింది కూడా రాణానే. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన వెంటనే రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉంది. తద్వారా హెడ్లీ మీద దృష్టిసారించే అవకాశం లేకపోలేదు.

Michelle Obama Finally Open Up On Divorce Rumours2
Michelle Obama: ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా(barack obama) సతీమణి మిషెల్లీ విడాకుల ప్రచారంపై ఎట్టకేలకు పెదవి విప్పారు. గత కొంతకాలంగా దేశ మాజీ ప్రథమ పౌరురాలి హోదాలో ఆమె పలు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని బహిరంగంగా బరాక్‌ ఖండించినప్పటికీ.. మిషెల్లీ మాత్రం ఎక్కడా స్పందించకపోవడంతో ఆ అనుమానాలు కొనసాగుతూ వచ్చాయి.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన టైంలో, అంతకు ముందు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిషెల్లీ ఒబామా(michelle obama) గైర్హాజరు అయ్యారు. మాజీ అధ్యక్షులు అయినప్పటికీ సతీసమేతంగా(ఫస్ట్‌ లేడీ కాబట్టి) హాజరు కావడం అక్కడి ఆనవాయితీ. అయితే బరాక్‌ ఒబామా ఒంటరిగా ఆ కార్యక్రమాలకు హాజరు కావడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారాన్ని ఒబామా గత నాలుగు నెలల కాలంలో విడాకుల రూమర్లను(Divorce Rumours) రెండుసార్లు ఖండించారు. ఇప్పుడు మిషెల్లీ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందించారు.నటి సోఫియా బుష్‌ నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో మిషెల్లీ మాట్లాడుతూ.. విడాకుల ప్రచారాన్ని తోసిపుచ్చారు. తన గురించి ఆలోచించే సమయం తనకు ఇప్పటికి దొరికిందని.. అందుకే అధికారిక కార్యక్రమాలకు, రాజకీయపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారామె. ‘‘గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. నాకు ఏది మంచో అదే చేయాలనుకుంటున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది చేయడం కాదు’’ అని అన్నారామె.ఇక్కడ.. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించలేకపోయారు. మహిళలుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవే. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజలు గ్రహించలేకపోయారు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకున్నారు అని మిషెల్లీ అన్నారు.ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ 3వ తేదీన హమిల్టన్‌ కాలేజీలో ఓ ఈవెంట్‌కు హాజరైన బరాక్‌ ఒబామా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షునిగా పదవిలో కొనసాగిన కాలంలో పని ఒత్తిడి కారణంగా భార్యతో సఖ్యత చెడిందని బరాక్‌ ఒబామా ఒప్పుకున్నారు. నాటి మనస్పర్ధలను తొలగించుకుంటూ నేడు ఆనందంగా జీవిస్తున్నామన్నారు.

KSR Comments Over Yellow Media And Red Book3
కూటమిపై తిరుగుబాటు మొదలైంది!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వ అరాచకాలు, రెడ్‌బుక్‌ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు సృష్టిస్తున్న విధ్వంసంపై ప్రజలు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డి పల్లిలో హత్యకు గురైన కురబ లింగమమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెళ్లిన సందర్భంగా ప్రజల ఆదరణ చూస్తే కూటమిపై వారి వ్యతిరేకత ఏమిటి? ఎంతస్థాయిలో ఉన్నదీ స్పష్టమవుతుంది.వైఎస్‌ జగన్‌ పర్యటనలో ప్రజలు పాల్గొనకుండా చేసేందుకు ప్రభుత్వం పన్నిన అన్ని కుట్రలూ ఇక్కడ విఫలమయయ్యాయి. పోలీసులు సృష్టించిన అడ్డంకులన్నింటినీ తొలగించుకుని మరీ జనసందోహం ఒక సునామీలా జగన్‌కు తన మద్దతు తెలిపింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలతో జగన్‌ పర్యటన విజయవంతమైంది. ప్రజాగ్రహంపై ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా జారీ అయ్యింది!.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా ఎన్నికల హామీలు ఇప్పటివరకూ నెరవేర్చకపోవడం.. వీటి గురించి ప్రశ్నించిన వారిని రెడ్‌బుక్‌ పేరుతో అణచివేతకు గురి చేస్తూండటం కూడా ప్రజల ఆగ్రహానికి కారణం. రాష్ట్రస్థాయి నాయకులు ఒక చిన్న గ్రామానికి వెళితే ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల వారు వెళ్లడం పరిపాటి. కానీ, జగన్‌ పాపిరెడ్డి పల్లి పర్యటనలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉండటం గమనార్హం. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, కూటమి చేతిలో మోసపోయిన ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారంటే ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం తీవ్రత ఏమిటో తేటతెల్లమవుతుంది. జగన్ కార్యక్రమానికి తరలివస్తున్న ప్రజల దృశ్యాలు చూస్తుంటే తెలుగుదేశం వారి గుండెలలో రైళ్లు పరుగెత్తి ఉండాలి. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. వందల మంది పొలాలకు అడ్డం పడి మరీ పరుగులు తీసుకుంటూ రావడం కనిపిస్తుంది. ప్రత్యేకంగా సభ ఏమీ లేకపోయినా, ఈ స్థాయిలో జగన్ అభిమానులు వచ్చారంటే దానికి కారణం చంద్రబాబు, లోకేశ్‌ల ప్రభుత్వ అరాచకపు పాలనపై నిరసనను చెప్పడానికే అన్నది స్పష్టం.వైఎస్‌ జగన్‌ మాజీ సీఎం అయినప్పటికీ ఆయనకు తూతూ మంత్రంగా కల్పించిన భద్రత కూడా ఈ పర్యటన సందర్భంగా ప్రభుత్వం తీరుపై పలు విమర్శలకు కారణమైంది. జగన్ వచ్చిన హెలికాఫ్టర్ వద్దకు జనం చొచ్చుకుపోయారంటే పోలీసుల సమర్థత ఏమిటన్నది స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ అంత ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం, వాటిని ఎల్లో మీడియా మొదటి పేజీలో ప్రచురించడాన్ని బట్టి ఏపీలో ఉన్నది పోలీసు రాజ్యం అని, కింది స్థాయి పోలీసులపై అధికారులకు కంట్రోల్ లేదని స్పష్టమవుతుంది. ఇది ఆ ఎస్‌ఐ క్రమశిక్షణ రాహిత్యమైనప్పటికీ రెడ్‌బుక్‌ పాలనలో అలాంటివారికి ప్రోత్సాహం లభిస్తుండటం దురదృష్టకరం. ఆ ఎస్‌ఐ గత ఎన్నికలలో టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించి, లోకేశ్‌తో సహా పలువురు టీడీపీ నేతలను కలిశారని స్పష్టమైనప్పటికీ అధికారులు ఎలాంటి చర్య తీసుకోకపోగా, టీడీపీ ఎమ్మెల్యే కోరినట్లు పోస్టింగ్ ఇస్తే, అతను ఆ పార్టీ ఏజెంట్‌గా కాకుండా, ప్రజల కోసం పనిచేసే పోలీసుగా ఎందుకు వ్యవహరిస్తారు? ఇలాంటి వారు టీడీపీకి అనుకూలంగా పనిచేయరన్న గ్యారెంటీ ఏముంటుంది?.పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించారు. ఏపీలో బీహారును మించిన భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిజానికి బీహారులో ఇలా రెడ్ బుక్ అంటూ రాజకీయ ప్రత్యర్థులపై హింసకు దిగడం లేదు. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ మాదిరి మారవద్దని బీహారులో అక్కడి రాజకీయ పార్టీలు చెప్పుకోవాలి. తప్పుడు కేసులు ఎలా పెట్టాలి? ప్రతిపక్ష నేతలను, పార్టీ కార్యకర్తలను, సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని ఎలా వేధించాలి? సినీ నటులను సైతం వదలకుండా ఒకటికి ఇరవై కేసులు పెట్టి, వందల కిలోమీటర్ల దూరం ఎలా నిత్యం తిప్పాలి? ఎప్పుడో ఏదో జరిగిందని, ఏళ్ల తర్వాత మనోభావాలు గాయపడ్డాయంటూ చిత్రమైన కేసులు ఎలా పెట్టాలి? అన్న వాటిలో ఏపీ పోలీసులు ఆరితేరుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి పిచ్చి పాలన ఏపీలో మాత్రమే ఉంటుందేమో!.వైఎస్‌ జగన్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా రెడ్‌బుక్ పాలన సాగుతోందని అంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హత్యలకు గురైన తీరు, వారి వివరాలు, తప్పుడు కేసులలో రోజుల తరబడి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను జైళ్లలో నిర్భంధిస్తున్న విధానం, స్థానిక ఉప ఎన్నికలలో టీడీపీ దౌర్జన్యకాండ, బలం లేకపోయినా పోలీసుల సాయంతో గెలవాలన్న దుర్నీతి, మొదలైన వాటిని సోదాహరణంగా వివరించారు. వాటిలో ఒక్కదానికైనా ప్రభుత్వపరంగా మంత్రులు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కానీ, గత జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి మాత్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇతర అంశాలను పక్కనబెట్టి, పోలీసులపై జగన్ చేసిన విమర్శలకు ప్రాధాన్యం ఇస్తూ టూర్‌ను వక్రీకరిస్తూ ఎల్లో మీడియా ఒకటే ఏడుపుతో కధనాలు ఇచ్చిందని చెప్పాలి.పచ్చ చొక్కాలతో పనిచేసే పోలీసుల బట్టలూడదీస్తామని, అధికారంలోకి వచ్చాక చట్టం ముందు నిలబెడతామన్నది జగన్ భావన అయితే ఏదో రకంగా పోలీసులలో తప్పుడు అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వార్తలు ఇచ్చాయి. తమ ఏడుపుగొట్టు వార్తల ద్వారా జగన్ టూర్‌కు జనం అశేష సంఖ్యలో వచ్చారని ఎల్లో మీడియా పరోక్షంగా అయినా ఒప్పుకోక తప్పలేదు. గతంలో చంద్రబాబు, లోకేశ్‌లు, అచ్చెన్నాయుడు తదితరులు విపక్షంలో ఉన్నప్పుడు పోలీసులను ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు, దూషణలు చేసింది అందరికీ తెలుసు. లోకేశ్‌ అయితే రెడ్ బుక్ పేరుతో జిల్లా ఎస్పీలనే బెదిరిస్తూ చేసిన ప్రకటన సంగతేమిటి?.పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలోనే పోలీసుల వ్యాన్‌ పైనే రాళ్లదాడి చేసినప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్నుపోతే కనీసం సానుభూతి అయినా చూపిందా?. అచ్చెన్నాయుడు కుప్పంలో పోలీసులను బూతులతోనే దూషించారే. ఈ ఎల్లోమీడియా అసలు ఆ ఘటనలపై వార్తలనైనా ఇచ్చిందా?. ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అన్నట్లు అధికార టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తుంటే, వారికి ఎల్లో మీడియా భజన చేస్తోంది. ఏది ఏమైనా జగన్ టూర్ ద్వారా ఒక విషయం బోధపడుతుంది. రెడ్ బుక్ అన్న దానిని ఒక పిచ్చికుక్క మాదిరి ఎంత ఎక్కువగా ప్రయోగిస్తే ప్రజలలో అంత నిరసన వస్తుందని, అంత స్థాయిలో తిరుగుబాటు వస్తుందని తేలింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

IPL 2025 RCB VS DC: Virat Kohli One Short To Complete The Century Of Half Centuries In T20s4
RCB VS DC: మరో సెంచరీకి అడుగు దూరంలో ఉన్న విరాట్‌

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 10) ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయ జట్టుగా కొనసాగుతుండగా.. ఆర్సీబీ నాలుగింట మూడు గెలిచి, ఓ మ్యాచ్‌లో ఓడింది.నేటి మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ హాఫ్‌ సెంచరీ చేస్తే టీ20ల్లో 100 హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకుంటాడు. తద్వారా పొట్టి క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో ఇప్పటివరకు డేవిడ్‌ వార్నర్‌ ఒక్కడే 100 హాఫ్‌ సెంచరీలు (108) పూర్తి చేశాడు. గత మ్యాచ్‌లోనే టీ20ల్లో 13000 పరుగుల మార్కును తాకిన విరాట్‌ నేటి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధిస్తే మరోసారి రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో విరాట్‌ 386 ఇన్నింగ్స్‌లు ఆడి 9 సెంచరీలు, 99 హాఫ్‌ సెంచరీల సాయంతో 13050 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ ఐదో స్థానంలో ఉన్నాడు.నేటి మ్యాచ్‌ విషయానికొస్తే.. గత రికార్డుల ప్రకారం​ ఢిల్లీపై ఆర్సీబీదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 31 సార్లు తలపడగా ఆర్సీబీ 19, ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. అయితే ప్రస్తుత సీజన్‌లో పరిస్థితి చూస్తే మాత్రం ఢిల్లీకే అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఢిల్లీ ఈ సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. కొత్త కెప్టెన్‌ అక్షర్‌ నేతృత్వంలో ఓటమెరుగని జట్టుగా దూసుకుపోతుంది. ఢిల్లీ ఈ సీజన్‌లో అన్ని విభాగాల్లో సత్తా చాటుతూ లక్నో, సన్‌రైజర్స్‌, సీఎస్‌కేలపై అద్భుత విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 200కు పైగా లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఏకైక జట్టు ఢిల్లీ మాత్రమే. ఢిల్లీ జట్టులో డుప్లెసిస్‌, కేఎల్‌ రాహుల్‌, అశుతోష్‌ శర్మ, విప్రాజ్‌ నిగమ్‌, అభిషేక్‌ పోరెల్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, మిచెల్‌ స్టార్క్‌, కుల్దీప్‌ యాదవ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఓపెనర్‌ జేక్‌ ఫ్రేజర్‌ వరుస వైఫల్యాలే జట్టును కలవరపెడుతున్నాయి.మరోవైపు ఆర్సీబీ కూడా ఈ సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనట్లుగా ఆది నుంచే అదరగొడుతుంది. తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌, రెండో మ్యాచ్‌లో సీఎస్‌కేలకు షాకిచ్చిన ఈ జట్టు మూడో మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలో ఓడి ఆతర్వాతి మ్యాచ్‌లోనే మళ్లీ గెలుపు బాట (ముంబైపై విజయంతో) పట్టింది. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ ఆటగాళ్లు కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌లో విరాట్‌, రజత్‌ పాటిదార్‌, టిమ్‌ డేవిడ్‌, లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ.. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌, కృనాల్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ, ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. తుది జట్లు (అంచనా)..ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, రసిఖ్ సలామ్/సుయాష్ శర్మఢిల్లీ క్యాపిటల్స్‌: ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్‌ రాహుల్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/T నటరాజన్, ముఖేష్ కుమార్

Janasena Jogineni Mani Over Action AT YSR District5
జనసేన జోగినేని మణి అరాచకం.. మహిళతో అనుచిత ప్రవర్తన

సాక్షి, వైఎస్సార్‌: ఏపీలో జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున ఓ మహిళను కాళ్లతో తన్ని.. తనకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, సదరు బాధితురాలు.. మణి వల్ల తమకు ప్రాణహని ఉందని పోలీసులను ఆశ్రయించారు.వివరాల ప్రకారం.. పోసాని కృష్ణమురళిపై ఓబులవారిపల్లి పీఎస్‌లో కేసు పెట్టిన జనసేన నాయకుడు జోగినేని మణి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శ్రీరామనవమి రోజున మణి.. అదే మండలం చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మహిళ రాజేశ్వరిని కాళ్లతో తన్ని దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం, పత్తి రాజేశ్వరిపై దాడి చేశాడు. ఈ సందర్భంగా మణి.. తనకు పవన్‌ కల్యాణ్‌, హోం మంత్రి అందరూ తెలుసు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ చులకన చేసి మాట్లాడాడు. దీంతో, మణి వల్ల తనకు ప్రాణహాని ఉంది బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇక​, జనసేన రాయలసీమ జోన్‌ కన్వీనర్‌గా జోగినేని మణి కొనసాగుతున్నాడు. అంతకుముందు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను విమర్శించాడంటూ పోసాని కృష్ణమురళిపై మణి కేసు పెట్టిన విషయం తెలిసిందే. అతని ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆఘమేఘాలపై పోసానిని అరెస్టు చేశారు పోలీసులు. తాజగా మణి అరాచకాలను బాధితురాలు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Chhaava Movie OTT Streaming Details Now6
ఓటీటీలో 'ఛావా' సినిమా.. సడెన్‌ సర్‌ప్రైజ్‌

బాలీవుడ్‌ హిట్‌ సినిమా 'ఛావా' ఓటీటీ ప్రకటన సడెన్‌గా వచ్చేసింది. విక్కీ కౌశల్‌,రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’(Chhaava Movie) ఫిబ్రవరి 14న హిందీలో రిలీజై భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. అయితే, సినిమాకు మంచి ఆదరణ రావడంతో మూడు వారాల తర్వాత నిన్న (మార్చి 7) ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తెలుగులో విడుదల చేసింది. సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదలపై మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'ఛావా' చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) 'ఏప్రిల్‌ 11'న విడుదల కానుందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, హిందీ, తెలుగు రెండు భాషలలో విడుదల చేస్తారా లేదా కేవలం హిందీలో మాత్రమే రిలీజ్‌ చేస్తారా..? అనే అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, రెండు భాషలలో ఒకేసారి స్ట్రీమింగ్‌ కావచ్చని సమాచారం. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ.750 కోట్లు రాబట్టి అనేక రికార్డ్స్‌ను క్రియేట్‌ చేసిన ఛావా కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచింది.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొగల్‌ చక్రవర్తి ఔరంగాజేబు(అక్షయ్‌ ఖన్నా). అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు శంభాజీ మహారాజ్‌ (విక్కీ కౌశల్‌). మొగల్‌ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగాజేబు వరకు చేరుతుంది. దీంతో శంభాజీని అంతం చేసేందుకు తానే రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్‌ ప్రాంతానికి బయలుదేరుతాడు. కేవలం పాతిక వేల మంది సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ..ఔరంగాజేబును ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధంలో అతనికి తోడుగా నిలిచిందెవరు? వెన్నుపటు పొడిచిందెవరు? స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ. Aale Raje aale 👑 Witness a tale of courage and glory etched in time 🔥⚔️Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd— Netflix India (@NetflixIndia) April 10, 2025

Keeping Indias Interests At Forefront Says Piyush Goyal On US Tariffs7
తొందరపాటు లేదు.. అమెరికాతో ఒప్పందంపై పీయూష్‌ గోయల్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతులు 820 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగినట్లు తెలిపింది. 2023 - 24లో ఎగుమతులు 778 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం.. 2024–25 ఏప్రిల్‌ - ఫిబ్రవరి మధ్య కాలంలో ఉత్పత్తుల ఎగుమతులు 395.38 బిలియన్‌ డాలర్ల నుంచి 395.63 బిలియన్‌ డాలర్లుకు చేరాయి. అలాగే సర్వీసుల ఎగుమతులు 311.05 బిలియన్‌ డాలర్ల నుంచి 354.90 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎగుమతులు, దిగుమతుల పూర్తి వివరాలను వాణిజ్య శాఖ ఏప్రిల్‌ 15న విడుదల చేయనుంది.పరిశ్రమకు మంత్రి గోయల్‌ భరోసా..అమెరికా టారిఫ్‌ల విధింపు నేపథ్యంలో ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమ వర్గాలతో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితుల్లో ఇటీవల తలెత్తిన సవాళ్లను అధిగమించడంలో ఎగుమతి సంస్థలకు తోడ్పాటు అందించేందుకు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి భరోసా ఇచ్చినట్లు వాణిజ్య శాఖ తెలిపింది.ఎర్ర సముద్రం సంక్షోభం, ఇజ్రాయెల్‌-హమాస్‌ ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, కొన్ని సంపన్న ఎకానమీల్లో వృద్ధి నెమ్మదించడం తదితర సవాళ్లు నెలకొన్నప్పటికీ ఎగుమతులు వృద్ధి చెందడం సానుకూలాంశమని ఎగుమతిదారులు, పరిశ్రమను మంత్రి అభినందించారు. వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహించే ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలు, అంచనాలను తెలిపాయి. కష్టకాలంలో ఎగుమతి సంస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వం క్రియాశీలక చర్యలు తీసుకోవాలని కోరాయి.అమెరికాతో ఒప్పందంపై కసరత్తు..అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం విషయంలో సమతుల్యత సాధించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. దేశానికి ప్రయోజనం కలిగే విధంగా సరైన ఫలితాలను రాబట్టేందుకు ప్రభుత్వం ’వేగంగా’ పనిచేస్తోందని, ’అనవసర తొందరపాటు’ చర్యలు తీసుకోవడం లేదని మంత్రి పేర్కొన్నారు. టారిఫ్‌లపై ఇతర దేశాలు వివిధ రకాలుగా స్పందిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘విశ్వసనీయమైన భాగస్వామిగా భారత్‌ ఎదిగింది.ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో భారత్‌ పెద్ద సంస్థలను ఆకర్షించే స్థితిలో ఉంది. కాబట్టి తయారీని పెంచుకునేందుకు, మరిన్ని ఉద్యోగాలను కల్పించేందుకు మనకు అవకాశాలు ఉన్నాయి‘ అని మంత్రి వివరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని భారత్, అమెరికా నిర్దేశించుకున్నాయి. ఆ దిశగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి. చర్చల తొలి దశ ఈ ఏడాది సెప్టెంబర్‌ - అక్టోబర్‌లో ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 191 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

Kutami Prabhutvam Non Stop Revenge on Posani Krishna Murali8
కక్ష సాధింపే ధ్యేయంగా.. పోసానిపై మళ్లీ కేసులు

తిరుపతి, సాక్షి: ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(APFDC) మాజీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఆపడం లేదు. తాజాగా.. టీటీడీ చైర్మన్‌పై సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారంటూ కేసులు నమోదు చేసి వేధించాలని చూస్తోంది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు ఎంపికను పోసాని ఖండించారని, ఆయన్ని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో కేసులు ఇంతకు ముందే నమోదు అయ్యాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్‌ 15వ తేదీన విచారణకు రావాలంటూ పోసానికి సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ నోటీసులు జారీ చేశారు. ఈ ఫిర్యాదు ఎవరు చేశారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారని.. టీడీపీ, జనసేన నేతల ఫిర్యాదు మేరకు ఇంతకు ముందు ఆయన్ని అరెస్ట్‌ చేసి రాష్ట్రంలోని పలు పోలీస్‌ స్టేషన్లు, కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీన హైదారాబాద్‌లో రాయచోటి(అన్నమయ్య జిల్లా) పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేసి ఓబులవారీపల్లి పీఎస్‌కు తరలించారు. మార్చి 22వ తేదీన గుంటూరు జైలు నుంచి ఆయన బెయిల్‌ మీద బయటకు వచ్చారు. మొత్తంగా ఆయనపై అప్పటికే ఏపీలో వ్యాప్తంగా 19 కేసులు నమోదుకాగా.. కోర్టు ఆయనకు ఊరట ఇచ్చింది.

Worlds Most Expensive Bottled Waters: Why Celebrities Drink This9
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర రూ. 65 లక్షలా..!

ప్రతి మనిషికీ ప్రాణవాయువు తరువాత అత్యంత ప్రామాణికమైనది నీరు. మనిషి దేహంలో సుమారు 60 నుంచి 70 శాతం నీరు ఉంటుంది. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకగలమేమో కానీ, నీరు అందకుంటే మాత్రం ప్రాణాపాయమే. అయితే ఇంతటి ప్రామాణికమైన నీరు ప్రస్తుతం వ్యాపారంగా మారిన విషయం విదితమే. నీటిని కూడా లీటర్ల చొప్పున అమ్మడం, మనం కొనడం సాధరణమైపోయింది. అయితే ఇటీవల నగరంలో జరిగిన సినిమా వేడుకలో ప్రముఖ టాలీవుడ్‌ సినీ హీరో ఓ వాటర్‌ బాటిల్‌తో నీరు తాగడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే సుమారు 330 మిల్లీలీటర్లు ఉండే ఈ వాటర్‌ బాటిల్‌ ధర అక్షరాలా 130 నుంచి 160 రూపాయలట. అంటే ఆ బ్రాండ్‌ ఒక లీటర్‌ నీరు సుమారు రూ.500. నిజంగా హైదరాబాద్‌లో వందలు, వేలు ఖర్చు చేసి ఒక లీటర్‌ నీటిని కొంటున్నారా.. అంటే? ఔననే సమాధానం వస్తుంది. వందలు వేలు కాదు.. కొందరు ప్రముఖులు ఏకంగా లక్షల రూపాయలు విలువైన వాటర్‌ బాటిళ్లు కొని మరీ తాగుతున్నారు. సాధారణంగా హైదరాబాద్‌ నగరంలో ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.20లు. ఫ్లేవర్డ్‌ వాటర్‌ బాటిల్‌ లేదా స్పార్లి్కంగ్‌ మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.30 నుంచి 50 వరకూ ఉంటుంది. ప్రీమియం నేచురల్‌ మినరల్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.40 నుంచి 100 వరకూ ఉంటుంది. వాటర్‌ బాటిళ్ల అమ్మకం ఐఎస్‌ఐ మార్క్, బ్రాండింగ్, ప్రభుత్వ నిబంధనలు తదితర అంశాల పై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి సహజ వనరైన నీటిని ఇంత ధరల్లో అమ్మడం కూడా అనైతికమని పలు సంస్థలు, సామాజిక వేత్తలు నినదిస్తున్నారు. కానీ హైదరాబాద్‌ వంటి మహానగరంలో నీటిని వేలకు వేలు పెట్టి మరీ తాగున్నారనే విషయం ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వస్తోంది. సాధారణంగా కొన్ని రెస్టారెంట్లకు వెళితే బయట 20 రూపాయలకు లభించే లీటర్‌ వాటర్‌బాటిల్‌ ధర 40 నుంచి 80 ఉంటుంది. దీనికి సొంత బ్రాండింగ్, నీటి స్వచ్ఛత, మినరల్స్‌ మిక్సింగ్‌ వంటి అంశాలను వెల్లడిస్తారు. దీనికి మించి నగరంలోని కొన్ని స్టార్‌ హోటళ్లలో 250 నుంచి 300 మి.లీ వాటర్‌బాటిల్‌ ధర సుమారు 200 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. నేచురల్‌ మినరల్‌ వాటర్‌ అని, నేచురల్లీ ఆల్కలైన్‌ వాటర్‌ అనీ విభిన్న పద్ధతుల్లో ఈ నీటిని అందిస్తున్నారు. ఎన్విరాన్‌మెంటల్లీ సర్టిఫైడ్‌ బ్రాండ్స్‌ అంటూ లీటర్‌కు సుమారు వెయ్యిరూపాయల వరకూ ధర నిర్ణయిస్తున్నారు. నగరంలోని 3 స్టార్, 5 స్టార్‌ హోటళ్లలో జరిగే బిజినెస్‌ మీటింగ్స్, ఫంక్షన్స్‌లో ఈ తరహా వాటర్‌ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అంతే కాదు.. సాధారణంగా లంచ్‌ లేదా డిన్నర్‌ కోసం వెళ్లిన నగరవాసులు సైతం ఈ నీటిని సేవిస్తుండటం విశేషం. నార్వేలోని భూగర్భ జలాల నుండి సేకరించిన వోస్‌ ఆర్టేసియన్‌ వాటర్‌ (12 బాటిళ్ల ప్యాక్‌ సుమారుగా 6,600), ఆరావల్లి పర్వత శ్రేణి నుంచి సేకరించిన ఆవా సహజ అల్కలైన్‌ వాటర్, క్రికెటర్‌ కోహ్లీ తాగే ఎమియన్‌ వంటి ఖరీదైన బ్రాండ్స్‌ నగరంలో లభిస్తుండటం విశేషం. వజ్రాల బాటిల్స్‌లో తాగే నీరు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీరుగా బెవర్లీ హిల్స్‌ 90 ఏ20 డైమండ్‌ ఎడిషన్‌ గుర్తింపు పొందింది. ఈ బ్రాండ్‌ లగ్జరీ కలెక్షన్‌ డైమండ్‌ ఎడిషన్‌ బాటిల్‌ ధర రూ.65 లక్షల వరకూ ఉంది. ఈ బాటిల్‌లో 600 జీ/వీఎస్‌ తెల్ల వజ్రాలు, 250కు పైగా నల్ల వజ్రాలతో అలంకరించిన బంగారు టోపీ సెట్‌ ఉంటుంది. ఆక్వా డీ క్రిస్టల్లో ట్రిబ్యూటో మోడిగ్లియాని అనే బ్రాండ్‌ వాటర్‌ బాటిల్‌ ధర రూ.44 లక్షలకు పైమాటే. ఈ బాటిల్‌ 2010లో అత్యంత ఖరీదైన వాటర్‌ బాటిల్‌గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును దక్కించుకుంది. ఫిజియన్, ఫ్రెంచ్‌ స్ప్రింగ్స్‌–ఐస్లాండ్‌ హిమ నదీ నుంచి సేకరించిన ఈ నీటిని 750 మి.లీ పరిమాణంలో 24–క్యారెట్ల బంగారు బాటిల్‌లో అందిస్తారు. దక్షిణ కాలిఫోరి్నయాలోని పలోమర్‌ పర్వతం నుంచి సేకరించే బ్లింగ్‌ హెచ్‌20 ధర 2 లక్షల వరకూ ఉంది. నెవాస్‌ గ్లో–ఇన్‌–ది–డార్క్‌ బాటిల్‌ వాటర్‌ మాగ్నమ్‌ ధర దాదాపు రూ.1.32 లక్షలు. వంద శాతం సహజమట..! వందలు వేలు కాదు.. ప్రపంచవ్యాప్తంగా తాగే నీటిని లక్షల విలువ చేసే బాటిళ్లలో అమ్మడం కూడా మొదలైంది. ఇంతటి ఖరీదైన వాటర్‌ బాటిళ్లు మన దేశంలో కూడా కొని తాగుతున్నారు కొందరు ధనవంతులు, సెలబ్రిటీలు. ప్రముఖ భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకునే ఏవియన్‌ నేచురల్‌ స్ప్రింగ్‌ వాటర్‌ మాత్రమే తాగుతాడు. ఈ నీరు వంద శాతం సహజ నీరు, ఫ్రాన్స్‌లోని ఏవియన్‌–లెస్‌–బెయిన్స్‌ సమీపంలోని సహజ వనరుల నుంచి సేకరించినవి. ఈ స్వచ్ఛమైన నీటిలో సహజ ఖనిజాలంటాయని, అంతేకాకుండా ఎలాంటి రసాయనాలతో కలుషితం కాదని నిర్థారించినవి. విరాట్‌ కోహ్లీ ప్రతి యేటా సుమారు రూ.4.3 లక్షల వరకూ ఈ నీటి కోసం వెచ్చిస్తాడని సమాచారం. (చదవండి: 'అపూర్వ బంధం'.. తోబుట్టువుల ప్రేమ..అనుబంధాలకు ప్రతీక..!)

USA To Deny Visas And Green Cards Over Social Media Posts10
అమెరికా వీసా, గ్రీన్‌కార్డులపై మరో మెలిక.. బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన ట్రంప్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. రోజుకో ట్విస్ట్‌ ఇస్తున్నారు. వీలైనంత మంది విదేశీయులను అమెరికా నుంచి పంపించి వేయడమే లక్ష్యంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వీసా, పర్మినెంట్ రెసిడెన్సీ(గ్రీన్ కార్డు)లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇక, తాజాగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అధికారికంగా సంచలన ప్రకటన చేసింది. సోషల్ మీడియా వేదికగా యూదులకు వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్స్‌ చేసినా, పోస్టులు పెట్టినా వారికి వీసా లేదా గ్రీన్ కార్డును తిరస్కరించవచ్చని లేదా ఇప్పటికే జారీ చేసిన వీసాను రద్దు చేయవచ్చని బాంబు పేల్చింది.అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన కొన్ని గ్రూపులకు మద్దతు ఇస్తున్న వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ క్రమంలో సదరు గ్రూపులకు ఎవరైనా మద్దతు తెలిపినా, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా.. వీసా లేదా గ్రీన్ కార్డును తిరస్కరించవచ్చని తెలిపింది. కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లు తేలితే సోషల్ మీడియా కంటెంట్‌ను ప్రతికూలంగా పరిగణిస్తామని హచ్చరికలు జారీ చేసింది. అలాగే, హమాస్, హిజ్బుల్లా, హౌతీ తిరుగుబాటు సానుభూతిపరులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ సంస్థలను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. ఇదే సమయంలో ఒక విదేశీయుడు ఉగ్రవాదం, ఉగ్రవాద సంస్థలు, ఇతర వ్యతిరేకవీసా, గ్రీన్ కార్డ్ రద్దు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద మద్దతుదారులకు అమెరికాలో చోటు లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లౌగ్లిన్ తెలిపారు. వారు తమ దేశంలోకి రానివ్వాల్సిన, ఇక్కడ ఉండాల్సిన బాధ్యత లేదని స్పష్టం చేశారు. స్టూడెంట్ వీసాలు, గ్రీన్ కార్డులపై ఈ ప్రభావం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. స్టూడెంట్ వీసాలు (ఎఫ్ -1, జే-1 మొదలైనవి), గ్రీన్ కార్డు దరఖాస్తులు, వర్క్ పర్మిట్లు, వీసా పొడిగింపులతో సహా అన్ని కేసులపై ఇది ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో 300 మందికి పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్వయంగా గత కొన్ని వారాల్లో అంగీకరించిన తర్వాత ఈ విధానం వచ్చింది.#NEW: U.S. Citizenship and Immigration Services (USCIS) will now start screening social media of any migrants for anti-semitism land any antisemitic activity the physical harassment of Jewish individuals will now be grounds for denying immigration benefit requests. This will…— Brooke Taylor (@Brooketaylortv) April 9, 2025ఇదిలా ఉండగా.. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల ఆశలను ట్రంప్‌ సర్కారు చిదిమేస్తోంది. ఏడాది, రెండేళ్ల కిందటి చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపిస్తూ వీసాలు రద్దు చేస్తోంది. తక్షణం దేశం విడిచి వెళ్లాలంటోంది. స్వచ్ఛందంగా వెళ్లకపోతే బలవంతంగా పంపించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.వీసా రద్దయితే అక్రమంగా ఉంటున్నట్లే..అధిక వేగంతో వాహనాలు నడిపిన పలువురు విద్యార్థులకు వీసా రద్దు చేస్తూ ఇటీవల నోటీసులు అందాయి. సాధారణంగా ఈ తరహా నేరాలపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. అధికశాతం కేసులు కొట్టేస్తారు. అయితే కోర్టులో కేసులు నడుస్తున్న వారికి కూడా వీసా రద్దు చేస్తూ నోటీసులు ఇచ్చారు. వీసా రద్దయితే వీరు అక్రమంగా అమెరికాలో ఉంటున్నారనే లెక్కలోకి వస్తుంది. అమెరికాలోకి అడుగుపెట్టే సమయంలోనే ప్రతి ఒక్కరి వేలిముద్రలు తీసుకుంటారు. ఏదైనా కేసులో అరెస్టు అయితే ఆ సమయంలోనూ వేలిముద్రలు తీసుకుంటారు. వాటి ఆధారంగానే వీసా రద్దు చేస్తూ వెంటనే దేశం వీడాలని తాఖీదులు జారీ చేశారు. దీనికి ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.గతంలో ఇలాంటి చిన్న చిన్న నేరాల్లో ప్రమేయం ఉంటే ఇంతటి తీవ్ర చర్యలు ఉండేవి కావు. చదువుకోవడానికి, ఓపీటీపై పనిచేయడానికి, హెచ్‌1బీపై ఉద్యోగం చేయడానికి.. అంటే గడువు వరకు అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. ఇప్పుడు అమెరికాలో ఉండేందుకు వీలు లేకుండా ఏకంగా స్టేటస్‌ రద్దు చేసి బయటకు వెళ్లిపోవాలంటూ మెయిల్స్‌ పంపిస్తున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement