
పెద్దపల్లి: పేద కుటుంబం నుంచి వచ్చిన తాను పేదల కష్టాలు తీర్చుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి తనపై కుట్ర చేస్తోందని, అయినా ప్రజల్లో తనపై విశ్వాసం ఉందని మంథని బీఆర్‌ఎస్ అభ్యర్థి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. ఆయన బుధవారం మంథనికి రాగా.. కమాన్‌పూర్ మండలం గొల్లపల్లి నుంచి మంథని వరకు మంగళహారతులు, బైక్‌ర్యాలీతో స్వాగతం పలికారు.
మంథని వద్ద భారీ గజమాలతో సన్మానించారు. అంబేద్కర్ కూడలిలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ పార్టీలోని కొందరు అసమ్మతివాదులతో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు కసాయి కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతారని తెలిపారు. ఆత్మగౌరవం, పేదల ఆకలితీర్చేందుకు అనేకమంది అడవిబాట పడితే ఈ ప్రాంత నాయకత్వం కారణంగా వందలాది మంది నేలకొరిగారని గుర్తు చేశారు.
గతంలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానని, 2014 కంటే రెట్టింపు ఉత్సాహం కార్యకర్తలో కనిపిస్తోందని, వంద రోజులు తన కోసం కష్టపడితే ఐదేళ్లు కడుపులో పెట్టుకొని చూసుకుంటానని మధు తెలిపారు. జయశశంకర్‌భూపాలపల్లి జెడ్పీ చైర్మన్ జక్కుశ్రీహర్షిణి, మున్సిపల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజ, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.