
వాళ్లు అనర్హులే!
● కోర్టు సబార్డినేట్ పోస్టుల్లో ఓవర్ క్వాలిఫై అభ్యర్థులు ● మొత్తం 25 మంది అనర్హులుగా గుర్తింపు ● వెలువరించిన కోర్టు.. స్వాగతిస్తున్న నిరుద్యోగులు ● ఫలించిన ‘సాక్షి’ వరుస కథనాల పోరాటం
సాక్షిప్రతినిధి,కరీంనగర్: గతంలో జరిగిన కోర్టు సబార్డినేట్ పోస్టుల విషయంలో ‘సాక్షి’ వరుస కథనాలు నిజమయ్యాయి. అటెండర్ స్థాయి పోస్టులకు అధిక విద్యార్హత (ఓవర్‌క్వాలిఫైడ్) ఉన్న వ్యక్తులు అక్రమంగా పరీక్షలు రాసి ఎంపికయ్యారంటూ రెండేళ్ల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన మాట విధితమే. తమకు అన్యాయం జరిగిందని, అనర్హులు ఉద్యోగాలకు ఎంపికవడాన్ని సవాలు చేస్తూ పలువురు ఈ కథనాల ఆధారంగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. పోలీసు యంత్రాంగం విచారణ జరిపింది. పలువురు తాము అధిక విద్యార్హతలు కలిగి ఉన్నామని అంగీకరించి, స్వచ్ఛందంగా తప్పుకుని, ఉద్యోగానికి రాబోమని రాసి ఇచ్చారు. మరికొందరు తమకు ఏమవుతుందిలే అన్న ధీమాతో కొలువుల్లో చేరారన్న ఆరోపణలు ఉన్నాయి. తరువాత కాలంలోనూ అవి వెలుగుచూడటంతో వారిని కూడా తొలగించారు.
‘సాక్షి’ కథనాలతో..
2019లో నిర్వహించిన కోర్టు సబార్డినేట్ పరీక్షకు అర్హత పదో తరగతి ఫెయిల్ ఉండాలని నిబంధన ఉంచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 96 పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు. తొలుత 1:3 రేషియోలో మొత్తం 318 మందిని పిలిచిన అధికారులు.. 93 మందితో తుదిజాబితా ప్రకటించారు. ఈ అభ్యర్థుల్లో పలువురు ఓవర్ క్వాలిఫైడ్ అని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చాలామంది తమ అర్హతలను తగ్గించి చూపించారు. తాము 10వ తరగతి ఫెయిల్ అని కొందరు, అసలు తాము 9వ తరగతితోనే చదువు ఆపేశామని చెప్పుకుని మరికొందరు పరీక్ష రాశారు. అధికారులను నమ్మించేందుకు అప్పటికే మూతబడి ఉన్న చాలా స్కూళ్ల నుంచి బోనఫైడ్ సర్టిపికెట్లను దొడ్డిదారిలో తెచ్చుకుని మరీ సమర్పించారు. దీంతో అవే స్కూళ్లలో చదివి.. ఉద్యోగం రాని వారు.. తమతోపాటు వారు చదవలేదని ఆందోళనలకు దిగారు. ఈ విషయాన్ని పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాల ద్వారా ఎత్తిచూపింది. అనంతర కాలంలో ఓ మహిళా ఉద్యోగి గ్రాడ్యుయేట్ అన్న విషయాన్ని గుర్తించిన అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుని, ఉద్యోగం నుంచి తప్పించడం గమనార్హం.
రెండేళ్ల తరువాత విడుదలైన జాబితా..
వీరందరి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ 2022లో మొదలైన దరిమిలా.. ఈ దుమారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అనర్హులు (ఓవర్ క్వాలీఫైడ్) తమ పొట్ట కొడుతున్నారని ఉద్యోగాలు రాని, పది ఫెయిలై పరీక్ష రాసిన వారంతా ఆందోళనలకు దిగారు. తాము ఆందోళనలు చేసిన ఇన్నేళ్ల తరువాత 25 మందితో కరీంనగర్ కోర్టు నుంచి అనర్హుల జాబితా విడుదల కావడంపై 2019లో పరీక్ష రాసిన అభ్యర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 25 మందిలోనూ ముగ్గురు రిక్రూట్‌మెంట్‌కు గైర్హాజరయ్యారని, ఒకరు ఫామ్‌నింపలేదని, ఒకరు ఉద్యోగంలో చేరి రాజీనామా చేశారని, మరో ముగ్గురు పోస్టులో చేరడానికి ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. మి గిలిన 17 మంది మాత్రం అధిక విద్యార్హతలు కలి గి ఉన్నారని విడుదల చేసిన జాబితాలో స్పష్టంచేశారు. దీంతో ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందని న్యాయాధికారుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ జాబితాకు సంబంధించిన కాపీ ప్రస్తుతం కరీంనగర్ కోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
మాకు అవకాశం కల్పించాలి
కరీంనగర్ కోర్టు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మేం తొలి నుంచి చెప్తున్న విషయం రెండేళ్ల తరువాత నిజమవడం సంతోషం. ఉద్యోగాల్లో చేరని, ఓవర్ క్వాలిఫైడ్ అభ్యర్థుల స్థానంలో తరువాత మెరిట్‌లో నిలిచిన నిజమైన అభ్యర్థులకు స్థానం కల్పించాలని ప్రార్థిస్తున్నాం.
– రమేశ్, నిరుద్యోగి, హుజూరాబాద్

వాళ్లు అనర్హులే!