
పదోన్నతి ప్రశ్నార్థకం
● ఇంకా విడుదలకాని 2023–24 పీఆర్పీ బకాయిలు ● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ● ఆందోళనకు సిద్ధమైన సింగరేణి కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్
గోదావరిఖని: సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, ఆర్థికపరమైన ప్రయోజనాల కోసం సింగరేణి కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉద్యమించేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా పెర్ఫార్మెన్ రిలేటెడ్ పే(పీఆర్పీ) చెల్లించాలని పట్టుపడుతోంది. గతఆర్థిక సంవత్సరంతోపాటు పదేళ్ల క్రితం నాటి బకాయిలూ చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం దశలవారీ ఆందోళనలు చేపట్టి సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
అధికారుల్లో నిరాశ, నిస్పృహ..
సింగరేణిలోని చాలామంది అధికారులు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ప్రధానంగా అంతర్గత పదోన్నతులకు నిబంధనలు అడ్డంకిగా మారడం, అధికారుల సంఘంలోని గత నాయకులు సమస్యలపై స్పందించకపోవడంతో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఇటీవల నిర్వహించిన అధికారుల సంఘం ఎన్నికల్లో సీఎంవోఏఐ అధ్యక్షుడిగా లక్ష్మీపతిగౌడ్‌తోపాటు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఈ నేపథ్యంలో అధికారుల సమస్యలు పరిష్కరించాలని సీఎంవోఏఐ యాజమాన్యం దృష్టికి తీసుకొస్తూనే ఉంది.
2007 – 2014 మధ్య అందని పీఆర్పీ బకాయిలు
పీఆర్పీ బకాయిల కోసం రిటైర్డ్ అధికారులు ఎదురుచూస్తూనే ఉన్నారు. బకాయిలు రాకుండానే ఇ ప్ప టికే చాలామంది అధికారులు ఉద్యోగ విరమణ చే శారు. వీరిలో కొందరు కోర్టుకు వెళ్తే అనుకూల తీ ర్పు వచ్చినట్లు సంఘం నాయకులు చెబుతున్నారు. అయినా బకాయిల చెల్లింపులో కదలిక లేదు.
ఆందోళనలకు సమాయత్తం..
అధికారుల సమస్యల పరిష్కారం కోసం ఏరియాల వారీగా నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలుత నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టనున్నారు. ఆ తర్వాత సీఎండీ, విద్యుత్ శాఖ మంత్రి, చివరకు సీఎంకు వినతిపత్రాలు అందజేసి ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు.
అంతర్గత పదోన్నతుల్లో అన్యాయం
అంతర్గత పదోన్నతుల్లో సింగరేణి అధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అంటున్నారు. ఎక్స్‌టర్నల్ అధికారులకు పదోన్నతి కల్పిస్తున్నా.. అంతర్గతంగా పదోన్నతుల్లో అన్యాయమమే జరుగుతోందని వారు పేర్కొంటున్నారు. ఏడేళ్లుగా ఈ విషయంలో తీవ్రఅసంతృప్తికి లోనవుతున్నారు. ఫస్ట్‌క్లాస్ పాసైన అభ్యర్థుల విషయంలో కూడా అన్యాయమే జరుగుతోంది. గత స్ట్రక్చరల్ సమావేశంలో ఆమోదించినా.. ఇప్పటికీ చలనం లేకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతోంది.
అధికారుల ప్రధాన డిమాండ్లు..
పెండింగ్ ఉన్నవాటటితోపాటు 2023 – 2024 పీఆర్పీ వెంటనే చెల్లించాలి
2007 – 2014 వరకు ఉన్న బకాయిలు కూడా ఇవ్వాలి
న్యాయబద్ధమైన పదోన్నతి పాలసీ అమలు చేయాలి
కోలిండియాలోని పదోన్నతి పాలసీని సింగరేణిలోనూ అమలు చేయాలి
ఫస్ట్‌క్లాస్ మేనేజర్ల విషయంలో ఇటీవల జారీచేసిన సర్క్యులర్‌లో మార్పులు చేయాలి
విచారణ సమయంలో రావాల్సిన బెనిఫిట్స్ ఆపవద్దు
కోలిండియా ప్రకారం డిజిగ్నేషన్స్ కేటాయించాలి
క్షేత్రస్థాయి అధికారుల సౌకర్యాలు ఆధునికీకరించాలి
ఆస్పత్రి సౌకర్యాలు ఆధునికీకరించి, రిటైర్డ్ అధికారులకు మెడికల్ కార్డు అందించాలి
ఉచిత విద్యుత్, ఐఐటీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పించాలి.

పదోన్నతి ప్రశ్నార్థకం

పదోన్నతి ప్రశ్నార్థకం