
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహనం కోల్పోయారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవిపై నోటి దురుసు ప్రదర్శించారు. పళ్లు రాలగొడతా రాస్కెల్ అంటూ తిట్లు లంకించుకున్నారు. గాడిదలను కాస్తున్నారా? కళ్లు కనిపించడం లేదా అంటూ తిట్ల దండకం అందుకున్నారు. గురువారం ఆయన ఎండాడలో పర్యటించారు. తాగేందుకు నీరు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవంటూ ఎమ్మెల్యేను నిలదీశారు.
వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక వైపు.. సంక్షేమ పథకాలను అందించడం లేదు. మరో వైపు.. అభివృద్ధి కూడా జరగడం లేదు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక.. ఆ అధికారిపై గంటా నోరు పారేసుకున్నారు. గంటా తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, మంగళవారం.. మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ స్థానికంగా నివాసం ఉంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే గంటాకు ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఎంవీపీ కాలనీ సెక్టార్– 4లోని ఆయన ఇంటికి వెళ్లారు.
ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ వినతిపత్రం స్వీకరించేందుకు బయటకు రాలేదు. గంటన్నర పాటు నిరీక్షించినా.. స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తీవ్రం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం గంటా పీఏలు అక్కడికి వచ్చి వినతిపత్రం తమకు ఇవ్వాలని కోరినా కార్మికులు అంగీకరించలేదు.ఓ ప్రజాప్రతినిధి అయివుండీ కార్మికుల సమస్యలు వినడానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు.