
నియోజకవర్గ పర్యటనలో సహనం కోల్పోయిన టీడీపీ ఎమ్మెల్యే గంటా
తమ ప్రాంతానికి మౌలిక సదుపాయాల్లేవంటూ మహిళల నిలదీత
చేసేది లేక శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై చిందులు
కొమ్మాది (విశాఖ): శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై టీడీపీ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిందులు తొక్కారు. పళ్లు రాలుతాయ్ రాస్కెల్.. గాడిదలు కాస్తున్నారా అంటూ విరుచుకుపడ్డారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 8వ వార్డు అయిన ఎండాడలో గురువారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటించారు. ముందుగా రాజీవ్‌నగర్‌కు చేరుకున్నారు. స్థానిక మహిళలు కుళాయిలు రావట్లేదని, డ్రైనేజీలు శుభ్రం చేయడంలేదని, వీధి దీపాలు వెలగడంలేదంటూ సమస్యల్ని ఏకరువు పెట్టారు. దీంతో సహనం కోల్పోయిన గంటా అధికారులపై తన నోటికి పనిచెప్పారు.
శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవిని పారిశుధ్య నిర్వహణ లోపం ఎందుకు వచ్చిందని, మరోసారి పునరావృతమైతే క్షమించేది లేదని.. ఉద్యోగం చేస్తున్నారా, గాడిదలు కాస్తున్నారా, పళ్లు రాల్తాయ్.. రాస్కెల్ అంటూ నోరుపారేసుకున్నారు. ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలుచేయకపోవడంతో..ఎక్కడికెళ్లినా స్థానికులు ప్రశ్నిస్తుండటంతో గంటా సహనాన్ని కోల్పోతున్నారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇక గంటా తీరుతో శానిటరీ ఇన్‌స్పెక్టర్ మనస్తాపం చెంది కన్నీటి పర్యంతమయ్యారు.