అనితకు చోటివ్వడంపై సీనియర్ల గుర్రు | - | Sakshi
Sakshi News home page

అనితకు చోటివ్వడంపై సీనియర్ల గుర్రు

Published Thu, Jun 13 2024 12:06 AM | Last Updated on Thu, Jun 13 2024 8:03 AM

-

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒకరికే బెర్త్‌

మంత్రి పదవి ఆశించి భంగపడ్డ అయ్యన్న, గంటా, పల్లా

బండారు, వెలగపూడికీ రిక్తహస్తాలు

జనసేన కోటాలో కొణతాల ఆశలూ గల్లంతు

అనితకు చోటివ్వడంపై సీనియర్ల గుర్రు

కొలువు తీరిన కొత్త ప్రభుత్వం సీనియర్లకు షాక్‌ ఇచ్చింది. పార్టీకి సుదీర్ఘ సేవలందించిన నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మొండిచెయ్యి చూపించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి వర్గంలో ఒక్కరికే స్థానం కల్పించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పలుదఫాలుగా మంత్రులు పనిచేసిన గంటా, అయ్యన్నతో పాటు మూడో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారి ఆశలపైనా నీళ్లు చల్లారు. మరోవైపు జనసేన నాయకులకూ ఇదే పరాభవం ఎదురైంది. గ్లాస్‌ కోటాలో మంత్రి పదవి ఆశించిన సీనియర్‌ నాయకుడు కొణతాల ఆశలూ గల్లంతయ్యాయి.

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రిగా చంద్రబాబు సహా 24 మంది మంత్రులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒకే ఒక్కరికి మాత్రమే చోటు లభించడంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్‌ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుండగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనితకు ప్రాధాన్యమివ్వడంపై టీడీపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.

అయ్యన్న, గంటాకు చెక్‌ !
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ ఒకసారి ఎంపీగా, ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చింతకాయల అయ్యన్నపాత్రుడు మూడుసార్లు మంత్రిగా వ్యవహరించారు. ఈసారీ మంత్రి పదవి వస్తుందని ధీమాగా ఉన్న అయ్యన్నకు బాబు తనదైన శైలిలో షాక్‌ ఇచ్చారు. మంత్రి వర్గంలో చోటు ఇవ్వకపోవడంపై అయ్యన్న కినుక వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఒకసారి ఎంపీగా, ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావుకు రిక్తహస్తాలే ఎదురయ్యాయి. రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటాకు చంద్రబాబు చెక్‌ పెట్టారు. అదేవిధంగా.. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి ఆశించిన వెలగపూడి రామకృష్ణబాబుకు పరాభవం ఎదురైంది.

 పలుమార్లు పార్టీ కోసం త్యాగాలు చేసి.. రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావుకి కూడా మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజికవర్గం కోటాలో పల్లాకు రావాల్సిన మంత్రి పదవి కొలుసు పార్థసారధికి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అయ్యన్నకు ఇవ్వాలా.. అచ్చెన్నకు ఇవ్వాలా అనే లెక్కల్లో చంద్రబాబు అచ్చెన్న వైపే మొగ్గు చూపడంతో అయ్యన్నపాత్రుడి వర్గం అధిష్టానం వ్యవహారశైలిపై గుర్రుగా ఉంది. మరోవైపు.. ఒకసారి మంత్రిగానూ, ఐదోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండారు సత్యనారాయణమూర్తిని కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. మూడోసారి గెలిచిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజుకు మొండిచెయ్యి చూపించారు. పార్టీ కోసం విధేయంగా ఉన్న వారితోపాటు సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై విశాఖ టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

గాజు గ్లాసులోనూ అసంతృప్తి జ్వాల
జనసేనలోనూ అదే అసంతృప్తి కనిపిస్తోంది. సీనియర్లుగా ఉన్నవారికి కాకుండా కొత్తగా ఎంపికై న వారికి ప్రాధాన్యమివ్వడంపై నాయకులు పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. నలుగురిలో ఒక్కరికై నా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. ఒక్కరికి ఇచ్చినా మిగిలిన ముగ్గురు మద్దతునివ్వాలని భావించారు. కానీ.. నలుగురికీ చంద్రబాబు, పవన్‌ ద్వయం మొండి చెయ్యి చూపించింది. సీనియర్‌ నాయకులు, మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణకు, పంచకర్ల రమేష్‌బాబులో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వరిస్తుందని భావించారు. కానీ.. వారిద్దరికీ అవకాశం కల్పించలేదు.

అదేవిధంగా ఆరేళ్లు ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉన్నా రాజీనామాతో త్యాగం చేసి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీకృష్ణకూ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో నిరాశలో ఉన్నారు. మొత్తంగా సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టిన మంత్రివర్గ కూర్పుపై టీడీపీ, జనసేన నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే విశాఖ జిల్లాను విస్మరించడంపై ప్రజలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్లకు షాక్‌!1
1/1

సీనియర్లకు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement